ఈ పండ్లు కాలేయాన్ని "డిటాక్స్" చేస్తాయట! - అవేంటో తెలుసా?
-మీ కాలేయం ఆరోగ్యంగా ఉండాలా? - ఈ పండ్లు తినాలంటున్న నిపుణులు!

Published : July 10, 2026 at 3:47 PM IST
Liver Detox : మన శరీరంలో అత్యంత ముఖ్యమైన అవయవాలలో కాలేయం ఒకటి. ఇది రోజంతా పనిచేస్తూనే ఉంటుంది. ఇది ఆహారాన్ని జీర్ణం చేస్తుంది. శక్తిని ఉత్పత్తి చేస్తుంది. పోషకాలను నిల్వ చేస్తుంది. అన్నింటి కంటే ముఖ్యంగా రక్తం నుంచి టాక్సిన్స్‌ను ఫిల్టర్ చేస్తుంది. అయితే, మారిన జీవనశైలి మార్పులు, ఆహారపు అలవాట్లు కాలేయ ఆరోగ్యాన్ని దెబ్బతీస్తున్నాయంటున్నారు నిపుణులు. దీనివల్ల కాలేయంలో వ్యర్థాలు, కొవ్వు క్రమంగా పేరుకుపోతాయని చెబుతున్నారు. ఫలితంగా, కాలేయ పనితీరు బలహీనపడుతుందని, ఇది నేరుగా మన జీర్ణవ్యవస్థపై ప్రభావం చూపుతుందని తెలియజేస్తున్నారు. దీనివల్ల గ్యాస్, ఎసిడిటీ, కడుపు ఉబ్బరం, మలబద్ధకం వంటి సమస్యలు వస్తాయని పేర్కొంటున్నారు. ఈ క్రమంలోనే రోజువారీ ఆహారంలో కొన్ని పండ్లను చేర్చుకోవడం వల్ల, అవి లివర్‌ను డిటాక్స్ చేస్తాయని చెబుతున్నారు. మరి, అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం!
సిట్రస్ పండ్లు : నారింజ, బత్తాయి, నిమ్మ వంటి సిట్రస్ పండ్లు కాలేయ ఆరోగ్యానికి మంచివని నిపుణులు చెబుతున్నారు. వీటిలో విటమిన్ సి, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయంటున్నారు. ఇవి హానికరమైన ఫ్రీ రాడికల్స్ వల్ల కాలేయ కణాలు దెబ్బతినకుండా రక్షిస్తాయని తెలియజేస్తున్నారు. ఈ క్రమంలో విటమిన్ సి అనేది శరీరంలో గ్లుటాథియోన్ అనే సమ్మేళనం ఉత్పత్తిని ప్రోత్సహిస్తుందని వివరిస్తున్నారు. ఈ సమ్మేళం అనేది లివర్‌ను డిటాక్స్ చేయడంలో కీలక పాత్ర పోషిస్తుందని పేర్కొంటున్నారు. సిట్రస్ పండ్లు కాలేయ నష్టాన్ని తగ్గిస్తాయని National Library of Medicine పేర్కొంది.
గృహహింసకు - మెనోపాజ్‌కు సంబంధం ఏంటి? - 20 నెలల ముందే రుతుక్రమం ఎందుకు ఆగిపోతుంది?
యాపిల్ : 'రోజుకో యాపిల్ తింటే డాక్టర్‌తో పని ఉండదు' అనే సామెత కాలేయానికి కూడా సరిపోతుందట. ఇందులో 'పెక్టిన్' అనే కరిగే ఫైబర్ ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. ఈ ఫైబర్ మన జీర్ణవాహినిలోని టాక్సిన్స్, చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించడంలో సహాయపడుతుందని అంటున్నారు. తద్వారా కాలేయంపై పని భారం తగ్గుతుందని తెలియజేస్తున్నారు. యాపిల్ పండ్ల వినియోగం కాలేయంలో యాంటీఆక్సిడెంట్ ఎంజైమ్ కార్యకలాపాన్ని పెంచి, వాపును కలిగించే సైటోకైన్ స్థాయిలను తగ్గిస్తుందని mdpi పేర్కొంది.
బొప్పాయి : ఇందులో 'పాపైన్, కైమోపపైన్' అనే శక్తివంతమైన జీర్ణ ఎంజైములు ఉంటాయని నిపుణులు చెబుతున్నారు. ఇవి ప్రొటీన్లను విచ్ఛిన్నం చేయడానికి, జీర్ణక్రియను మెరుగుపరచడానికి సహాయపడతాయని అంటున్నారు. దీనివల్ల మలబద్ధకం ఏర్పడదని తెలియజేస్తున్నారు. కాలేయంపై టాక్సిన్ భారం తగ్గుతుందని వివరిస్తున్నారు. అంతేకాకుండా, బొప్పాయిలోని యాంటీ ఆక్సిడెంట్లు కాలేయ వాపును తగ్గించడంలో కూడా సహాయపడతాయని సూచిస్తున్నారు. NAFLD నివారణ లేదా చికిత్సలో బొప్పాయి ఒక సమర్థవంతమైన ఔషధ ఫలం అని National Library of Medicine పేర్కొంది.
కివీ పండు : చూడడానికి చిన్నగా కనిపించే కివీ పండు పోషకాల గని. ఇది విటమిన్ సి, విటమిన్ ఇ, యాంటీ ఆక్సిడెంట్లకు అద్భుతమైన మూలమని నిపుణులు చెబుతున్నారు. ఇవి ఆక్సీకరణ ఒత్తిడి నుంచి కాలేయాన్ని రక్షించడంలో సహాయపడతాయంటున్నారు. కివీలోని ఫైబర్ సరైన జీర్ణక్రియను ప్రోత్సహిస్తుందని పేర్కొంటున్నారు. అంతేకాదు, ఆరోగ్యకరమైన కాలేయాన్ని నిర్వహించడంలో కీలక పాత్ర పోషిస్తుందంటున్నారు.
తీసుకోవాల్సిన జాగ్రత్తలు : ఇప్పటికే మీరు కాలేయ సమస్యకు చికిత్స పొందుతుంటే.. మీ ఆహారంలో ఎలాంటి మార్పులు చేసుకోవాలన్నా ముందుగా డాక్టర్లును సంప్రదించడం మంచిదంటున్నారు నిపుణులు. ఈ క్రమంలో కాలేయం ఆరోగ్యంగా ఉండాలంటే.. ఆల్కహాల్, అధిక కొవ్వు ఉన్న ఆహార పదార్థాలకు దూరంగా ఉండాలని సూచిస్తున్నారు. అలాగే, సిట్రస్ పండ్లు ఆరోగ్యానికి మంచివైనా, వాటిని పరిమితంగా మాత్రమే తీసుకోవాలని సలహా ఇస్తున్నారు.
NOTE : ఇక్కడ మీకు అందించిన ఆరోగ్య సమాచారం, సూచనలు అన్నీ మీ అవగాహన కోసం మాత్రమే. శాస్త్ర పరిశోధనలు, అధ్యయనాలు, వైద్య, ఆరోగ్య నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. కానీ, వీటిని పాటించే ముందు కచ్చితంగా మీ వ్యక్తిగత వైద్యుల సలహాలు తీసుకోవడమే మంచిది.
మీరు పీల్చే గాలి సురక్షితమైనా? - ఈ జాగ్రత్తలు పాటించాలంటున్న నిపుణులు!
ఒక్కొక్క అలవాటు ఒక్కో అవయవాన్ని దెబ్బతీస్తోందట! - మరి ఆ హ్యాబిట్స్ ఏంటో తెలుసా?

