ఈ ఫుడ్ అతిగా తింటున్నారా? - సెకండ్ బ్రెయిన్ దెబ్బతింటుందట!
- తీపి పదార్థాలతో గట్ హెల్త్ నాశనమవుతుందంటున్న నిపుణులు - పొట్ట ఆరోగ్యంగా ఉండాలంటే ఇవి తప్పక చేయాలని సూచన

Published : January 5, 2026 at 3:45 PM IST
Foods to be Avoided for Gut Health : మనసు ఎఫెక్ట్ అయితే స్టమక్ అప్సెట్ అవుతుంది! స్టమక్ ఇబ్బందిగా ఉంటే మనసు అన్ ఈజీగా ఉంటుంది! ఇవి రెండూ ఇంటర్ లింక్డ్. మన మెదడులో ఒక ఆలోచన వస్తే ఫస్ట్ స్పందించేది పొట్ట మాత్రమే. అందుకే ఆందోళన, ఒత్తిడికి లోనైనప్పుడు కడుపు ఇబ్బందిగా మారుతుంది. ఈ కారణంగానే పొట్టను "సెకండ్ బ్రెయిన్"గా వ్యవహరిస్తుంటారు.
అలాంటి పొట్ట విషయంలో చాలా మంది నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుంటారని నిపుణులు చెబుతున్నారు. కేవలం నోటి రుచికోసం ఏదిపడితే అది ఎడాపెడా తినేసి పొట్ట ఆరోగ్యాన్ని దెబ్బతిస్తుంటారని అంటున్నారు. తద్వారా మానసిక ఆరోగ్యాన్ని కూడా ఎఫెక్ట్ చేసుకుంటూ ఉంటారని చెబుతున్నారు. అందుకే మానసిక, శారీరక ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి "సెకండ్ బ్రెయిన్" చక్కగా కాపాడుకోవాలని సూచిస్తున్నారు. ముఖ్యంగా కొన్ని ఆహార పదార్థాలు పొట్ట ఆరోగ్యాన్ని దెబ్బతీస్తాయని, వాటికి దూరంగా ఉండాలని చెబుతున్నారు. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం!
చక్కెర పదార్థాలు : పొట్టలో మంచి బ్యాక్టీరియాతో పాటు చెడు బ్యాక్టీరియా కూడా ఉంటుంది. మనం తీసుకున్న ఆహారాన్ని జీర్ణం చేయడంలో మంచి బ్యాక్టీరియా కీలక పాత్ర పోషిస్తుందంటున్నారు నిపుణులు. అయితే, షుగర్ అధికంగా ఉండే పదార్థాలను తీసుకోవడం వల్ల పొట్టలో ఉండే మంచి బ్యాక్టీరియాకు నష్టం కలిగి, చెడు బ్యాక్టీరియా వృద్ధి చెందుతుందని వివరిస్తున్నారు. దీనివల్ల పలు ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంటుందని హెచ్చరిస్తున్నారు. చెడు బ్యాక్టీరియా వల్ల గ్యాస్, అల్సర్లు వంటి సమస్యలు వస్తుంటాయని చెబుతున్నారు. కాబట్టి, పొట్టలోని బ్యాక్టీరియా సమతుల్యతను దెబ్బ తీసే రిఫైన్డ్ షుగర్, చక్కెర ఎక్కువగా ఉండే ఆహార పదార్థాలకు దూరంగా ఉండటం మంచిదని సలహా ఇస్తున్నారు.
కృత్రిమ చక్కెరలు : చక్కెర అధికంగా ఉండే ఆహార పదార్థాలు ఆరోగ్యానికి మంచిది కాదని, కొంతమంది వాటికి బదులుగా కృత్రిమ చక్కెరలను (Artificial sweeteners) ఆహారంలో చేర్చుకుంటారు. కానీ, ఇవి రోగ నిరోధక శక్తిపై ప్రతికూల ప్రభావం చూపుతాయంటున్నారు నిపుణులు. ఇలా పొట్ట ఆరోగ్యంపై వ్యతిరేక ప్రభావం చూపించడమే కాకుండా పొట్టలోని మంచి బ్యాక్టీరియాను అసమతుల్యం చేస్తాయని చెబుతున్నారు. కాబట్టి, వీటికి కూడా దూరంగా ఉండడం మంచిదని సూచిస్తున్నారు. సింథటిక్ స్వీటెనర్లు, సహజ స్వీటెనర్లు రెండూ పేగుల్లోని మైక్రోబయోటా కూర్పుపై ప్రభావం చూపుతాయని National Library of Medicine అధ్యయనం పేర్కొంది.
"ఫ్యాబ్రిక్ కండిషనర్లు" వాడుతున్నారా? - ప్రమాదం పొంచి ఉందంటున్న నిపుణులు!
ఎక్కువగా ఫ్రై చేస్తే : చాలా మంది ఎక్కువగా ఫ్రై చేసిన ఆహార పదార్థాలను తినడానికి ఆసక్తి చూపిస్తుంటారు. ఇవి జీర్ణమవ్వడానికి అధిక సమయం పడుతుందని నిపుణులు చెబుతున్నారు. దానివల్ల పొట్ట ఆరోగ్యంపై వ్యతిరేక ప్రభావం పడుతుందని అంటున్నారు. కాబట్టి, వేపుడు ఆహారాలకు దూరంగా ఉండాలని సూచిస్తున్నారు.
అల్ట్రా ప్రాసెస్డ్ ఫుడ్ : కొంతమంది ప్యాకేజ్డ్ ఫుడ్ తినడానికి ఇష్టపడుతుంటారు. ఈ క్రమంలో మైదాలు, కృత్రిమ చక్కెరలూ, హానికరమైన కొవ్వులూ ఉండే ఆహారం తింటుంటారు. వీటిని ఎక్కువగా తీసుకోవడం వల్ల పొట్టలోని మంచి బ్యాక్టీరియా తగ్గి, చెడు బ్యాక్టీరియా పెరిగిపోతుందట. దీని వల్ల పేగులపై అదనపు భారం పడుతుందని నిపుణులు చెబుతున్నారు. కాబట్టి వీటికి కూడా దూరంగా ఉండడం మంచిదని సూచిస్తున్నారు. కొన్ని ఎమల్సిఫైయర్లు, స్వీటెనర్లు, రంగులు, మైక్రోపార్టికల్స్, నానోపార్టికల్స్.. గట్ మైక్రోబయోమ్ ను దెబ్బతీసి, పేగు వాపునకు కారణం అవుతాయని National Library of Medicine అధ్యయనం పేర్కొంది.
గట్ హెల్త్ కోసం : పొట్ట ఆరోగ్యంగా ఉండాలంటే పైన చెప్పిన ఆహార పదార్థాలకు దూరంగా ఉండడంతోపాటు రోజూవారీ జీవనశైలిలో కూడా మార్పులు చేసుకోవాలంటున్నారు నిపుణులు.
యోగా : పొట్ట ఆరోగ్యానికి యోగా ఎంతో మేలు చేస్తుంది. ముఖ్యంగా వీరభద్రాసనం, త్రికోణాసనం, శలభాసనం, మలాసనం, ఉష్ట్రాసనం, పవనముక్తాసనం వంటివి ఎంతో ఉపకరిస్తాయంటున్నారు నిపుణులు.
ఒత్తిడి నిర్వహణ : మనసులో ఒత్తిడి పెరిగితే, వెంటనే జీర్ణవ్యవస్థలో అసౌకర్యంగా కనిపిస్తుందని Harvard Health Publishing అధ్యయనం పేర్కొంది. మానసిక ఒత్తిడి వల్ల అడ్రినలిన్, కార్టిసాల్ వంటి హార్మోన్లు పెరుగుతాయని, ఇవి విరేచనాలు, మలబద్ధకం, కడుపు నొప్పి, గుండెల్లో మంట వంటి సమస్యలకు కారణం అవుతాయని తెలిపింది.
మంచి కొవ్వులు : ఎక్స్ట్రా వర్జిన్ ఆలివ్ ఆయిల్, నెయ్యి, కొబ్బరి నూనె, నువ్వుల నూనె మొదలైనవి మంచి కొవ్వుల్ని అందిస్తాయని తెలియజేస్తున్నారు.
ఉపవాసం : వారానికోసారి చేసే పరిపూర్ణ ఉపవాసం కావచ్చు, నిత్య జీవితంలో భాగం చేసుకునే ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ కావచ్చు.. ఇలా ఏదో ఓ రూపంలో పొట్టకు శ్రమ తగ్గించడం మంచిదంటున్నారు.
నడక : నడకకూ, పొట్ట ఆరోగ్యానికి ప్రత్యక్ష సంబంధం ఉందని నిపుణులు చెబుతున్నారు. అందుకే తిన్న వెంటనే కూర్చోవడం లేదా పడుకోవడం లాంటివి చేయకుండా కనీసం 15 నిమిషాలు అటూ ఇటూ తిరగడం మంచిదని సూచిస్తున్నారు.
చిరుధాన్యాలు : చవకైన సూపర్‌ఫుడ్ చిరుధాన్యాలే. సామలు, కొర్రలు, రాగులు మొదలైన వాటిని బ్రేక్‌ఫాస్ట్, లంచ్, స్నాక్స్, డిన్నర్.. ఇలా ఎందులో అయినా ఉపయోగించుకోవచ్చని సలహా ఇస్తున్నారు.
NOTE : ఇక్కడ మీకు అందించిన ఆరోగ్య సమాచారం, సూచనలు అన్నీ మీ అవగాహన కోసం మాత్రమే. శాస్త్ర పరిశోధనలు, అధ్యయనాలు, వైద్య, ఆరోగ్య నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. వీటిని పాటించే ముందు కచ్చితంగా మీ వ్యక్తిగత వైద్యుల సలహాలు తీసుకోవడమే మంచిది.
రోజంతా 'నీరసంగా' అనిపిస్తోందా? - అయితే మీలో 'ఆ సమస్య' ఉండొచ్చంటున్న నిపుణులు!
పప్పుధాన్యాలతో డయాబెటిస్ నియంత్రణలో ఉంటుందా? - అధ్యయనాలు ఏం చెబుతున్నాయంటే?

