చలికాలంలో ఆరోగ్యంగా ఉండాలా? - ఆహారం విషయంలో ఈ పొరపాట్లు వద్దంటున్న నిపుణులు!
-చలికాలంలో అప్రమత్తంగా ఉండాలంటున్న నిపుణులు - కొన్ని జాగ్రత్తలు పాటిస్తే ఆరోగ్యానికి మంచిదని సూచన!

Published : January 9, 2026 at 11:19 AM IST
Avoid these Winter Food Mistakes for Better Health: శీతాకాలం ఎండ తక్కువగా రావడంతో సరిపడా ‘డి’ విటమిన్ శరీరానికి అందదు. తక్కువ ఉష్ణోగ్రత కారణంగా వ్యాయామం చేయడానికి శరీరమూ సహకరించదు. వీటికి తోడు ఆకలి, దాహం ఉండదు. ఇవన్నీ రోగనిరోధకశక్తిపై ప్రతికూల ప్రభావం చూపుతాయని నిపుణులు అంటున్నారు. ఇవే కాదు, ఈ సీజన్లో తీసుకొనే ఆహారం విషయంలో తెలిసో తెలియకో చేసే కొన్ని పొరపాట్లు కూడా ఆరోగ్యాన్ని దెబ్బతీస్తాయని చెబుతున్నారు. ఇలా జరగకుండా ఉండాలంటే కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలంటున్నారు. ఈ క్రమంలో ఇంతకీ ఏంటా పొరపాట్లు? వాటిని సరిదిద్దుకొనే మార్గాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం!
మిగిలిపోయినవి : చాలా మంది ఆహారాన్ని వృథా చేయడం ఇష్టం లేక ఉదయం మిగిలినవి రాత్రికి, రాత్రి మిగిలినవి మరుసటి రోజు తింటుంటారు. చలికాలంలోనూ ఇలాగే చేస్తుంటారు. కానీ, ఇది ఆరోగ్యానికి మంచిది కాదంటున్నారు నిపుణులు. ఎందుకంటే, ఈ సీజన్లో జీర్ణశక్తి తక్కువగా ఉంటుందని.. ఇలాంటప్పుడు ఒక పూట మిగిలినవి మరో పూట తినడం వల్ల అరుగుదల శక్తి మరింతగా తగ్గిపోతుందని తెలియజేస్తున్నారు. తద్వారా ఆహారం జీర్ణం కాక కడుపుబ్బరం, గ్యాస్ట్రిక్, వికారం, వాంతులు వంటి సమస్యలు తలెత్తే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు. అందుకే, చలికాలంలో ఏ పదార్థం తీసుకున్నా వేడివేడిగా తీసుకోవడమే శ్రేయస్కరం అని సూచిస్తున్నారు.
చలికాలంలో తినే ఆహారపదార్థాల్లో శక్తి ఎక్కువగా ఉండేవి తీసుకోవాలి. విటమిన్ సి ఎక్కువగా ఉండే పండ్లు తినటం వల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుంది. నట్స్, బాదం పప్పు లాంటివి తీసుకోవాలి. నీళ్లు ఎక్కువగా తాగాలి. వేడివేడిగా ఉన్న ఆహారపదార్థాలు తీసుకోవాలి-డా. అంజలీదేవి, పోషకాహార నిపుణురాలు
నెయ్యితో : మాములుగానే ఈ సీజన్లో జీర్ణశక్తి మందగిస్తుంటుంది. ఈ చలికి ఉదయాన్నే నిద్ర లేచి వ్యాయామం కూడా చేయాలనిపించదు. దీంతో బరువు తగ్గే ప్రక్రియకు ఆటంకం కలుగుతుందని నిపుణులు అంటున్నారు. కాబట్టి, ఇలాంటి సమయంలో నెయ్యిని రోజువారీ ఆహారంలో చేర్చుకోవడం వల్ల మరింత బరువు పెరుగుతామని కొంతమంది భావిస్తుంటారు. కానీ, ఇది నిజం కాదంటున్నారు నిపుణులు. ఎందుకంటే, మంచి కొవ్వులు అధికంగా ఉండే నెయ్యి కడుపు నిండిన భావనను కలిగిస్తుందని చెబుతున్నారు. తద్వారా చిరుతిండ్ల పైకి మనసు మళ్లకుండా జాగ్రత్తపడచ్చని సూచిస్తున్నారు. అలాగే, ఇది ఆహారపు కోరికల్ని తగ్గించి శరీరంలో పేరుకుపోయిన కొవ్వుల్ని కరిగించేందుకు సహకరిస్తుందని పేర్కొంటున్నారు. ఈ రెండు ప్రయోజనాలూ బరువు పెరగకుండా నియంత్రణలో ఉంచుకునేందుకు దోహదం చేస్తాయంటున్నారు. అందుకే, ఏ సీజన్ అయినా ఒక స్పూన్ నెయ్యిని తీసుకోవడం ఆరోగ్యకరమని చెబుతున్నారు.
రేగుపండ్లు అంటే ఇష్టమా? - వీటిని తింటే శరీరంలో ఏం జరుగుతుందో తెలుసా?
వాటికి దూరంగా : చలికాలంలో వాతావరణం సహజంగానే పొడిగా ఉంటుంది. దీనికి తోడు దాహం వేయట్లేదని కొందరు నీళ్లూ సరిగ్గా తాగరు. ఫలితంగా, శరీరం డీహైడ్రేట్ అవడం, చర్మం పొడిబారడం వంటి సమస్యలొస్తాయంటున్నారు నిపుణులు. అయితే, ఇలాంటి సమయంలో కొంతమంది అదే పనిగా స్నాక్స్, ప్రిజర్వేటివ్స్ కలిపిన పదార్థాలు వంటివి తీసుకుంటూ ఉంటారని చెబుతున్నారు. వీటిలో కొన్నింటిని నీటి శాతం పూర్తిగా తొలగించి తయారు చేస్తుంటారని తెలియజేస్తున్నారు. ఇలాంటి పొడి పదార్థాలు ఈ కాలంలో తీసుకోవడం వల్ల శరీరం మరింత డీహైడ్రేట్ అవుతుందని పేర్కొంటున్నారు. తద్వారా చర్మం ఎక్కువగా పొడిబారుతుందని హెచ్చరిస్తున్నారు. శీతాకాలంలో తగినంతగా హైడ్రేటెడ్‌గా ఉండటం కూడా ముఖ్యమని American Heart Association అధ్యయనం పేర్కొంది. సాధారణంగా మహిళలు రోజుకు సగటున 9 కప్పులు, పురుషులు సగటున 13 కప్పుల నీటిని తాగాలని NIH అధ్యయనం పేర్కొంది.
టీ, కాఫీ మితంగా : ఈ చల్లటి వాతావరణంలో వేడివేడిగా కాఫీ లేదా టీ తాగితే ఆ హాయే వేరుగా ఉంటుంది కదూ! అయితే, కొందరు వీటిని అమితంగా తీసుకుంటుంటారు. ఫలితంగా, ఇందులోని కెఫీన్ శరీరాన్ని డీహైడ్రేట్ చేసి నిద్ర సమయాలకు అంతరాయం కలిగిస్తుందంటున్నారు నిపుణులు. అలాగే, ఇది శరీరంలో నీటిని నిలుపుకొనే సామర్థ్యాన్ని తగ్గించి మూత్రవిసర్జనను పెంచుతుందని చెబుతున్నారు. దీనివల్ల కూడా శరీరం డీహైడ్రేట్ అయి అలసట దరిచేరుతుందని తెలియజేస్తున్నారు. కాబట్టి ఈ సమస్యలేవీ ఎదురుకాకుండా జాగ్రత్తపడాలని సూచిస్తున్నారు. అందుకే టీ, కాఫీలు మితంగా తీసుకోవడం లేదా మధ్యమధ్యలో తులసి, అల్లం, దాల్చినచెక్కతో తయారుచేసిన పానీయాలు తాగడం మేలంటున్నారు. వీలైనంత వరకు సాయంత్రం, రాత్రి వేళల్లో కాఫీ లాంటి వాటి జోలికి వెళ్లకపోవడమే ఉత్తమని clevelandclinic అధ్యయనంలో తెలిపింది.
స్వీట్లు లాగిస్తున్నారా?: చక్కెరలు అధికంగా ఉండే ఈ పదార్థాలు రోగనిరోధక శక్తిని తగ్గించడంతో పాటు అలసటగా అనిపించేలా చేస్తాయంటున్నారు నిపుణులు. వివిధ వ్యాధులు, ఇన్ఫెక్షన్లతో పోరాడే తెల్లరక్తకణాలను నాశనం చేస్తాయని చెబుతున్నారు. అందుకే చలికాలంలో స్వీట్లు తీసుకునే విషయంలో జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు. అలాగే, ఆయా తీపి పదార్థాల తయారీలో చక్కెరకు బదులుగా బెల్లం, ఖర్జూరాలు, తేనె వంటివి వాడడం మేలని సలహా ఇస్తున్నారు.
అలాగే, ఈ జాగ్రత్తలతో పాటు సులభంగా జీర్ణమయ్యే సూప్స్, శరీరంలో వేడి ఉత్పత్తి చేసే మసాలాలు, రోగనిరోధక శక్తిని పెంచే నట్స్ వంటివి తీసుకోవడం ఆరోగ్యకరమని నిపుణులు చెబుతున్నారు. అంతేకాదు, ఈ కాలంలో ఏవైనా ఆహార పదార్థాలు శరీరానికి సరిపడకపోయినా వాటిని పూర్తిగా పక్కన పెట్టేయడం మంచిదని సూచిస్తున్నారు.
NOTE : ఇక్కడ మీకు అందించిన ఆరోగ్య సమాచారం, సూచనలు అన్నీ మీ అవగాహన కోసం మాత్రమే. శాస్త్ర పరిశోధనలు, అధ్యయనాలు, వైద్య, ఆరోగ్య నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. వీటిని పాటించే ముందు కచ్చితంగా మీ వ్యక్తిగత వైద్యుల సలహాలు తీసుకోవడమే మంచిది.
గుండె ఆరోగ్యం "స్పెషల్ డైట్" - నిపుణులు సూచిస్తున్న డైట్ ప్లాన్లు ఇవే!
పప్పుధాన్యాలతో డయాబెటిస్ నియంత్రణలో ఉంటుందా? - అధ్యయనాలు ఏం చెబుతున్నాయంటే?

