"ఎముకలు బలహీనమవుతున్నాయా?" - తినే ఆహారం కూడా ప్రభావితం చేస్తుందని తెలుసా?
మీరు చేసే చిన్న తప్పులే ఎముకలను దెబ్బతీస్తాయట! - అవేంటో తెలుసా?

Published : April 7, 2026 at 4:41 PM IST
Foods that Deplete Calcium from Bones : మన శరీరానికి క్యాల్షియం చాలా కీలకమైన ఖనిజం. ఇది ఎముకలు, దంతాలను బలంగా ఉంచడమే కాకుండా, రక్తపోటును నియంత్రించడంలో, కండరాల పనితీరులో, నాడీ వ్యవస్థ సంకేతాలను పంపడంలో ముఖ్య పాత్ర పోషిస్తుంది. ఈ క్రమంలో శరీరంలో క్యాల్షియం లోపిస్తే ఎముకలు బలహీనపడటంతో పాటు ఇతర ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయి. అయితే, కొన్ని రకాల ఆహార పదార్థాలు శరీరంలోని క్యాల్షియం స్థాయిలను తగ్గించి, ఎముకలను మరింత బలహీనపరుస్తాయని నిపుణులు చెబుతున్నారు. మరి, అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం!
సాఫ్ట్ డ్రింక్స్ : ఈ రోజుల్లో పార్టీలు, పెళ్లి వేడుక ఏదైనా సాఫ్ట్ డ్రింక్స్ సర్వసాధారణం. అయితే, వీటిని అతిగా తీసుకోవడం వల్ల క్యాల్షియం లోపం ఏర్పడుతుందని నిపుణులు చెబుతున్నారు. ఈ డ్రింక్స్‌లో ఉండే ఫాస్పోరిక్ యాసిడ్ శరీరం క్యాల్షియాన్ని గ్రహించకుండా అడ్డుకుంటుందట. దీనివల్ల క్రమంగా ఎముకలలో క్యాల్షియం స్థాయిలు తగ్గిపోతాయి. ఈ క్రమంలో ఎముకల ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి సాఫ్ట్‌డ్రింక్స్ వినియోగాన్ని పరిమితం చేయడం మంచిదట. శీతల పానీయాలను క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల వాటిలో అదనపు చక్కెర అధికంగా ఉంటుంది, క్యాల్షియం అధికంగా ఉండే పానీయాల స్థానంలో వీటిని తీసుకోవడం వలన ఎముకలు విరిగే ప్రమాదం పెరుగుతుందని National Library of Medicine పేర్కొంది.
రెడ్ మీట్, ప్రాసెస్ చేసిన మాంసం : వీటిని అతిగా తీసుకోవడం వల్ల శరీరంలో యూరిక్ యాసిడ్ స్థాయిలు పెరుగుతాయి. ఇది ఎముకల ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావాన్ని చూపుతుందంటున్నారు నిపుణులు. ఈ ఆహార పదార్థాలు క్యాల్షియం గ్రహించుకునే శక్తిని అడ్డుకుని, ఎముకలను బలహీనపరుస్తాయని చెబుతున్నారు. అందువల్ల, ఎముకల ఆరోగ్యం మెరుగుపడాలంటే వీటి వినియోగాన్ని పరిమితం చేసుకోవడం మేలు.
స్వీట్స్, బేక్ చేసిన పదార్థాలు : కేకులు, క్యాండీలు, కుక్కీలు వంటి పదార్థాలలో చక్కెర, రిఫైన్డ్ కార్బో హైడ్రేట్లు ఎక్కువ ఉంటాయి. ఇవి శరీరం క్యాల్షియం గ్రహించకుండా అడ్డుకుంటాయని నిపుణులు చెబుతున్నారు. అంతేకాకుండా, ఇవి శరీరంలో వాపును కలిగించి ఎముకలను మరింత బలహీనపరుస్తాయని హెచ్చరిస్తున్నారు. ఇలాంటి చక్కెర పదార్థాలను క్రమం తప్పకుండా తీసుకోవడం మానేసి, వాటికి బదులుగా ఆరోగ్యకరమైన స్నాక్స్‌ని ఎంచుకోవడం ఉత్తమం.
అరుదైన వ్యాధి "పోర్ఫిరియా" - సూర్యున్ని చూస్తే ఏం జరుగుతుంది? ఎవరికి వస్తుందో తెలుసా?
టీ : టీలో కెఫీన్ ఉంటుంది. ఇది శరీరం క్యాల్షియం గ్రహించే శక్తిని తగ్గిస్తుంది. అతిగా టీ తాగడం ఎముకల ఆరోగ్యానికి హానికరమంటున్నారు నిపుణులు. ముఖ్యంగా, కెఫీన్ ఎక్కువగా ఉండే టీ లేదా కాఫీలు ఎముకల నుంచి క్యాల్షియం బయటకు వచ్చేలా చేస్తాయని నిపుణులు చెబుతున్నారు. ఫలితంగా, ఎముకలు బలహీనపడతాయంటున్నారు. అందువల్ల, టీ వినియోగాన్ని పరిమితం చేసి, దానికి బదులుగా నీరు లేదా క్యాల్షియం ఎక్కువగా ఉండే తాజా పండ్ల రసాలను ఎంచుకోవడం మంచిది.
మద్యం : మద్యాన్ని అధికంగా సేవించడం ఎముకల ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతుంది. మద్యం శరీరంలో క్యాల్షియం గ్రహణ శక్తిని తగ్గించడంతో పాటు ఎముకలను బలహీనపరుస్తుంది. దీనివల్ల ఎముకలు పెళుసుగా మారి విరిగే ప్రమాదం పెరుగుతుందంటున్నారు నిపుణులు. ఎముకలు బలంగా ఉండాలంటే, మద్యంకు దూరంగా ఉండాలని సూచిస్తున్నారు. దీర్ఘకాలికంగా అమితంగా మద్యం సేవించడం వల్ల ఎముకల సాంద్రత తగ్గిపోవచ్చని National Library of Medicine పేర్కొంది. ఇది ఎముకలు సులభంగా విరిగిపోయేలా చేయడమే కాకుండా, అనారోగ్య సమస్యలకు, జీవన ప్రమాణాలు దెబ్బతినడానికి దారితీస్తుందని తెలిపింది.
నూనె పదార్థాలు : సమోసాలు, ఫ్రైడ్ చికెన్, పకోడీల వంటి నూనె ఎక్కువగా ఉండే ఆహారాలు ఎముకలకు హాని కలిగిస్తాయంటున్నారు నిపుణులు. వీటిలో అనారోగ్యకరమైన కొవ్వులు అధికంగా ఉంటాయని చెబుతున్నారు. ఇవి శరీరంలో వాపును కలిగిస్తాయట. అంతేకాదు, ఆయిల్ ఫుడ్స్ క్యాల్షియం గ్రహణ శక్తిని ప్రభావితం చేసి, ఎముకలు బలహీనపడటానికి దారితీస్తుంది. ఇలాంటి ఆహారాలను పరిమితంగా తీసుకోవడం, తేలికపాటి, ఆరోగ్యకరమైన భోజనాన్ని ఎంచుకోవడం ఉత్తమం
ఇలాంటి ఆహార పదార్థాలకు బదులుగా, ఆహారంలో పాలు, పెరుగు, ఆకుకూరలు, తాజా పండ్లు, డ్రై ఫ్రూట్స్, విత్తనాల వంటి క్యాల్షియం అధికంగా ఉండే ఆహారాలను చేర్చుకోమంటున్నారు నిపుణులు. అలాగే, క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం, ఎముకలను బలపరిచే అలవాట్లను పాటించడం కూడా మేలని సూచిస్తున్నారు.
NOTE : ఇక్కడ మీకు అందించిన ఆరోగ్య సమాచారం, సూచనలు అన్నీ మీ అవగాహన కోసం మాత్రమే. శాస్త్ర పరిశోధనలు, అధ్యయనాలు, వైద్య, ఆరోగ్య నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. వీటిని పాటించే ముందు కచ్చితంగా మీ వ్యక్తిగత వైద్యుల సలహాలు తీసుకోవడమే మంచిది.
కిడ్నీ ఫెయిల్యూర్ వార్నింగ్స్ - లక్షణాలు ఎలా ఉంటాయో తెలుసా?
నైట్ షిఫ్ట్‌ల్లో పనిచేస్తున్నారా? - ఈ జాగ్రత్తలు అవసరమంటున్న నిపుణులు!

