మీ గట్ హెల్త్ బాగుండాలా? - ఆహారంలో వీటిని చేర్చుకుంటే మేలంటున్న నిపుణులు!
జీర్ణ సంబంధిత సమస్యలు దూరం చేసుకోవాలా? - ఫైబర్ ఉన్న ఆహారాలు మేలు చేస్తాయట! ఎందుకో వివరిస్తోన్న నిపుణులు!

Published : March 5, 2026 at 4:26 PM IST
Fiber Rich Foods for Healthy Gut: మంచి జీర్ణక్రియ, రోగనిరోధక శక్తి, మానసిక స్థితి, మెటబాలిజం వంటి అంశాలలో గట్ హెల్త్ కీలక పాత్ర పోషిస్తుంది. అది ఆరోగ్యంగా ఉండాలంటే తాజా పండ్లు, కూరగాయలు, ఆకుకూరలు తినాల్సిందే. అయితే వీటితో పాటు కొంచెం పీచు పదార్థాలు తింటే గట్ ఆరోగ్యం మరింత బాగుంటుందంటున్నారు నిపుణులు. ఈ క్రమంలో ఎలాంటి ఆహార పదార్థాలు తీసుకుంటే గట్ హెల్త్‌కు మంచిదో ఇప్పుడు తెలుసుకుందాం!
దోరగా ఉన్న అరటిపండ్లు : అరటిపండ్లు, ముఖ్యంగా కొంచెం పచ్చగా ఉన్నవి, 'రెసిస్టెంట్ స్టార్చ్' అనే పీచు పదార్థాన్ని కలిగి ఉంటాయని నిపుణులు చెబుతున్నారు. ఇది ఒక ప్రీ బయోటిక్ వలె పనిచేస్తుందని తెలియజేస్తున్నారు. అంటే, ఇది జీర్ణవ్యవస్థలోని మంచి బ్యాక్టీరియాకు ఆహారాన్ని అందిస్తుందని పేర్కొంటున్నారు. అలాగే, రక్తంలోని చక్కెర స్థాయిలను స్థిరంగా ఉంచడానికి, కడుపు నిండుగా ఉన్న అనుభూతిని కలిగించడానికి, జీర్ణక్రియ సజావుగా సాగడానికి సహాయపడుతుందని వివరిస్తున్నారు.
ఊరికే 'నీరసంగా' అనిపిస్తోందా? - అయితే మీలో 'ఆ సమస్య' ఉండొచ్చంటున్న నిపుణులు!
చియా గింజలు : చియా గింజలు పరిమాణంలో చిన్నవైనప్పటికీ, పోషకాల పరంగా చాలా శక్తివంతమైనవి. వీటిలో కరిగే పీచు పదార్థం అధికంగా ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. ఇది పేగుల్లో జెల్ వంటి పదార్థాన్ని ఏర్పరుస్తుందంటున్నారు. తద్వారా జీర్ణక్రియను నెమ్మదింపజేయడానికి, రక్తంలోని చక్కెర స్థాయిలను స్థిరంగా ఉంచడానికి సహాయపడుతుందని తెలియజేస్తున్నారు. ఈ క్రమంలో రోజుకు ఒకటి లేదా రెండు టేబుల్ స్పూన్ల చియా గింజలను పెరుగులో కలుపుకొని గానీ, రాత్రంతా నానబెట్టి గానీ లేదా స్మూతీస్‌లో కలిపి గానీ తీసుకోవడం వల్ల జీర్ణక్రియ సామర్థ్యం మెరుగుపడుతుందట.
పప్పుధాన్యాలు, లెగ్యూమ్స్ : మన శరీరానికి కరిగే, కరగని పీచు పదార్థాలతో పాటు మొక్కల నుంచి లభించే ప్రోటీన్‌ను కూడా పప్పు దినుసులు అందిస్తాయంటున్నారు నిపుణులు. పప్పుధాన్యాలు, లెగ్యూమ్స్ విరేచనం సాఫీగా అయ్యేలా నియంత్రించడమే కాకుండా, పేగుల్లోని సూక్ష్మజీవులకు శక్తిని ఇస్తుందని చెబుతున్నారు. ఇవి గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరచడానికి, రక్తంలోని చక్కెర స్థాయిలను అదుపులో ఉంచడానికి కూడా తోడ్పడతాయని వివరిస్తున్నారు. ఈ క్రమంలో రోజువారీ ఆహారంలో అర కప్పు నుంచి ఒక కప్పు వరకు వండిన పప్పుధాన్యాలను చేర్చుకోవడం వల్ల శరీరానికి కావలసిన పీచు పదార్థం అందుతుందని పేర్కొంటున్నారు. లిమా బీన్స్, పచ్చి బఠానీలు, శనగలు, కిడ్నీ బీన్స్‌లో ఫైబర్ ఎక్కువగా ఉంటుందని Harvard Health Publishing అధ్యయనం పేర్కొంది.
బెర్రీలు : బెర్రీలు, ముఖ్యంగా బ్లూ బెర్రీలు, రాస్ప్‌బెర్రీలలో పీచు పదార్థంతో పాటు పాలీఫెనాల్స్ పుష్కలంగా ఉంటాయని నిపుణులు చెబుతున్నారు. ఈ పాలీఫెనాల్స్ పేగుల్లోని సూక్ష్మజీవుల వైవిధ్యాన్ని పెంచడానికి, జీర్ణవ్యవస్థలో వాపును తగ్గించడానికి సహాయపడతాయంటున్నారు. సమతుల్య ఆహారంలో భాగంగా ప్రతిరోజూ అర కప్పు నుంచి ఒక కప్పు వరకు బెర్రీలను తీసుకోవాలని సూచిస్తున్నారు.
నట్స్ : వాల్‌నట్స్, పిస్తా, జీడిపప్పు, బాదం పప్పులోని పీచు పదార్థం కడుపు నిండుగా ఉన్న అనుభూతిని ఇవ్వడమే కాకుండా, మెటబాలిక్ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయంటున్నారు నిపుణులు. ప్రతిరోజూ పావుకప్పు నట్స్ తీసుకోవడం వల్ల పేగుల్లోని సూక్ష్మజీవుల వైవిధ్యం పెరుగుతుందని చెబుతున్నారు. అంతేకాకుండా, వీటిని ఎక్కడికైనా సులభంగా తీసుకెళ్లవచ్చు, రోజువారీ ఆహారంలో చాలా తేలికగా చేర్చుకోవచ్చట. పిస్తా, జీడిపప్పు, బాదం.. మన గట్ మైక్రోబయోమ్‌కు ప్రత్యేకంగా సహాయపడతాయని betterhealth.vic.gov.au అధ్యయనం పేర్కొంది.
పేగు ఆరోగ్యానికి పీచు పదార్థం ఎందుకు అవసరం? : జీర్ణవ్యవస్థలో సమతుల్యతను కాపాడటంలో పీచు పదార్థం కీలక పాత్ర పోషిస్తుంది. ఇది మలబద్ధకాన్ని తగ్గించడానికి, విరేచనం సాఫీగా అయ్యేలా నియంత్రించడానికి, గుండె జబ్బులు, పేగు క్యాన్సర్, టైప్ 2 డయాబెటిస్ వంటి వ్యాధుల ప్రమాదాన్ని తగ్గించడానికి సహాయపడుతుందని నిపుణులు చెబుతున్నారు. గట్ మైక్రోబయోటా వైవిధ్యాన్ని నిర్వహించడానికి ఆహారంలో ఫైబర్ కీలకమైన పోషకమని National Library of Medicine అధ్యయనం పేర్కొంది.
NOTE : ఇక్కడ మీకు అందించిన ఆరోగ్య సమాచారం, సూచనలు అన్నీ మీ అవగాహన కోసం మాత్రమే. శాస్త్ర పరిశోధనలు, అధ్యయనాలు, వైద్య, ఆరోగ్య నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. కానీ, వీటిని పాటించే ముందు కచ్చితంగా మీ వ్యక్తిగత వైద్యుల సలహాలు తీసుకోవడమే మంచిది.
మొండి పుండ్లకు జెల్ చికిత్స! - తాజా అధ్యయనంలో కీలక విషయాలు!
మీలో ఈ లక్షణాలు కనిపిస్తున్నాయా? - అయితే "కడుపు క్యాన్సర్" కావొచ్చట!

