కంటి ఆరోగ్య విషయంలో - ఈ జాగ్రత్తలు పాటించాలంటున్న నిపుణులు!
- కంటిచూపుని కాపాడుకోండిలా! - జీవనశైలి చాలా కీలకమంటున్న నిపుణులు

Published : May 18, 2026 at 12:02 PM IST
Eye Care : వాతావరణంలో కాస్త మార్పులు వచ్చినా, ప్రయాణాలు అధికమైనా కళ్లు ఎర్రబారటం, మండటం జరుగుతుంటుంది. ప్రస్తుతం ప్రతి ఒక్కరూ డిజిటల్ ప్రపంచంలో జీవిస్తున్నారు. గంటల తరబడి మొబైల్, లాప్టాప్ చూసి పని చేయాల్సి వస్తోంది. దీంతో కళ్లకు జరిగే హాని అంతా ఇంతా కాదంటున్నారు నిపుణులు. మరి, ఇలాంటి పరిస్థితుల్లో ఈ ఇబ్బందుల నుంచి కళ్లను ఎలా కాపాడుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం!
చాలామంది 'ఇప్పుడు మా ఆరోగ్యం బాగానే ఉంది. ప్రత్యేకంగా జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఏముంది' అని అనుకుంటున్నారు. ఇప్పుడు ఆరోగ్యంగా ఉన్నప్పటికీ.. వయసు పైబడుతున్న కొద్దీ క్రమంగా కంటికి సంబంధించిన సమస్యలు తలెత్తుతాయంటున్నారు నిపుణులు. అందుకే, ముందు నుంచే జాగ్రత్తగా ఉండటం మంచిదని సలహా ఇస్తున్నారు.
పౌష్టికాహారాన్ని తీసుకోండి! : కళ్లు ఆరోగ్యంగా, ప్రకాశవంతంగా ఉండాలంటే.. విటమిన్ ఎ, సి, ఇ, ఒమేగా 3 ఫ్యాటీ ఆమ్లాలు, లుటీన్, జియాక్సంతిన్, జింక్ వంటి పోషకాలు పుషల్కంగా ఉండే ఆహారం తీసుకోవాలంటున్నారు నిపుణులు. ఈ పోషకాలు కంటి చూపును మెరుగుపరచడమే కాకుండా కళ్లు పొడిబారకుండా ఉంటాయని చెబుతున్నారు. అంతేకాదు, వయసుతో పాటు వచ్చే చూపు మందగించడం వంటి సమస్యల నుంచి రక్షిస్తాయని పేర్కొంటున్నారు. కొవ్వు తక్కువగా ఉండి, పండ్లు, కూరగాయలు, తృణధాన్యాలు అధికంగా ఉండే ఆహారం తీసుకోవడం గుండెకే కాకుండా, కళ్లుకు కూడా సహాయపడుతుందని American Academy of Ophthalmology పేర్కొంది.
"నిద్ర లేమి" సమస్య? - ఈ చిన్న అలవాట్లతో తగ్గించుకోవచ్చట!
సరిపడా నిద్రపోవాలి : కంటి ఆరోగ్యానికి నిద్ర చాలా ముఖ్యం. పని ఒత్తిడి, ఇతర కారణాల వల్ల.. రాత్రంతా మేల్కొనడం లేదా రోజుకు కనీసం 7 నుంచి 8 నిద్ర లేకపోవడం వల్ల కళ్లు ఎర్రబడటం, పొడిబారడం, కంటి కింద నల్లటి వలయాలు వస్తాయంటున్నారు నిపుణులు. నిద్ర సమయంలో కళ్లు సహజంగా తమను తాము మరమ్మతు చేసుకుంటాయని చెబుతున్నారు. లేకపోతే చూపు క్రమంగా బలహీనపడుతుందని పేర్కొంటున్నారు. కాబట్టి, ఎంత పని ఉన్నా ప్రశాంతంగా నిద్రపోవాలని సూచిస్తున్నారు. తద్వారా కళ్ల ఆరోగ్యంగా, అందంగా ఉంటాయని సలహా ఇస్తున్నారు.
చేతులతో కళ్లను రుద్దకూడదు : కొంతమంది తరచూ చేతులతో కళ్లను తాకుతూ ఉంటారు. కాస్త దురద, మంటగా అనిపిస్తే చాలు.. చేతులతో రుద్దుతుంటారు. కానీ, అలా చేయడం ఎంతమాత్రం మంచిది కాదంటున్నారు నిపుణులు. చేతుల ద్వారా బ్యాక్టీరియా కళ్లలో చేరుతుందని చెబుతున్నారు. దీంతో జలుబు లాంటి వ్యాధులు త్వరగా అంటుకునే అవకాశం ఉంటుందని పేర్కొంటున్నారు. అందువల్ల చేతులతో కళ్లను రుద్దకూడదని సూచిస్తున్నారు. కళ్లను రుద్దడం వల్ల మురికి, బ్యాక్టీరియా బదిలీ అయి, చికాకు కలిగించవచ్చు లేదా ఇన్ఫెక్షన్‌కు దారితీయవచ్చని medlineplus పేర్కొంది .
శుభ్రం చేసిన తర్వాతే : చాలామంది కళ్లద్దాలను ఎక్కడ పడితే అక్కడ పెడుతుంటారు. కానీ, అలా చేయకూడదని నిపుణులు చెబుతున్నారు. కళ్లద్దాలను వాటి డబ్బాల్లోనే పెట్టాలని వివరిస్తున్నారు. వాటిని వాడే ముందు శానిటైజర్ ఉన్న వస్త్రంతో క్లీన్ చేయాలని తెలియజేస్తున్నారు. ఆ తర్వాతే వినియోగించాలట. అలా చేయకుంటే కళ్లద్దాల ద్వారా దుమ్ము, ధూళి కళ్లలో చేరే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని హెచ్చరిస్తున్నారు. ఈ క్రమంలో కాంటాక్ట్ లెన్స్ ధరించేవారైతే, కంటి ఇన్ఫెక్షన్లను నివారించడానికి క్రమం తప్పకుండా మంచి పరిశుభ్రతను పాటించాలని American Academy of Ophthalmology పేర్కొంది.
కూలింగ్ గ్లాసెస్ : కంటి సమస్యలు రాకుండా ఉండటానికి కూలింగ్ గ్లాసెస్ ధరించడం చాలా ముఖ్యం. ఎందుకంటే, సూర్యుని నుంచి వెలువడే అతినీలలోహిత కిరణాలు కాలక్రమేణా కంటి వెనుక భాగంలోని నిర్మాణాలను దెబ్బతీస్తుందని clevelandclinic పేర్కొంది. ఈ క్రమంలో బయటకు వెళ్లిన ప్రతిసారి కూలింగ్ గ్లాసెస్ ధరించాలంటున్నారు నిపుణులు. దీంతో అతినీలలోహిత కిరణాల నుంచి కళ్లకు రక్షణ లభిస్తుందని చెబుతున్నారు.
ఈ జాగ్రత్తలు తప్పనిసరి :
- ప్రతిరోజూ గాఢంగా 7-8 గంటలు నిద్రపోవాలి.
- మద్యం, పొగాకు, పాన్ మసాలాకు పూర్తిగా దూరంగా ఉండాలి.
- స్క్రీన్ వైపు చూసేటప్పుడు ప్రతి 20 నిమిషాలకు ఒకసారి బ్రేక్ తీసుకోవాలి. ప్రతి 20 నిమిషాలకు, సుమారు 20 అడుగుల ముందున్న వస్తువు వైపు 20 సెకన్ల పాటు చూడాలని cdc పేర్కొంది.
- చల్లటి, పరిశుభ్రమైన నీటితో కళ్లను శుభ్రం చేసుకోవాలి.
- కళ్లు తరచూ మండటం, చూపు అసృష్టంగా అనిపిస్తే ఆలస్యం చేయకుండా డాక్టర్‌ను సంప్రదించాలట.
NOTE : ఇక్కడ మీకు అందించిన ఆరోగ్య సమాచారం, సూచనలు అన్నీ మీ అవగాహన కోసం మాత్రమే. శాస్త్ర పరిశోధనలు, అధ్యయనాలు, వైద్య, ఆరోగ్య నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. వీటిని పాటించే ముందు కచ్చితంగా మీ వ్యక్తిగత వైద్యుల సలహాలు తీసుకోవడమే మంచిది.
నట్స్‌తో ఆరోగ్యం - ఏవి తింటే మంచిదో మీకు తెలుసా?
"బ్యాక్ పెయిన్"కు కారణమేంటో తెలుసా? - నిపుణులు ఏం చెప్తున్నారంటే!

