ETV Bharat / health

కళ్లు మండుతున్నాయా? - "డ్రై ఐ సిండ్రోమ్" ముప్పు మహిళలకే ఎక్కువ!

కళ్లు పొడిబారడానికి పలు కారణాలు? - మహిళలు జాగ్రత్త పడాల్సిందే!

Dry Eyes
Dry Eyes (Getty Images)
author img

By ETV Bharat Health Team

Published : July 21, 2026 at 5:09 PM IST

|

Updated : July 21, 2026 at 6:38 PM IST

3 Min Read
Choose ETV Bharat

Dry Eyes : ఈ మధ్యకాలంలో కళ్లు పొడిబారడం (డ్రై ఐస్) సమస్య చాలా ఎక్కువగా కనిపిస్తోంది. పేరుకు తగ్గట్టుగానే, ఈ సమస్య ఉన్నప్పుడు కళ్లలోని తేమ తగ్గిపోతుంది. దీనివల్ల కళ్లలో మంట లేదా అసౌకర్యం కలుగుతుంది. పొడి వాతావరణం వల్ల కళ్లు ఆరిపోవడం సహజమే. అయినప్పటికీ, వర్షాకాలంలో గాలిలో తేమ ఎక్కువగా ఉన్నా కూడా ఈ సమస్య ఎక్కువగా ఉంటుంది. ఈ క్రమంలో పురుషుల కంటే మహిళలకే ఈ సమస్య వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉంటుందని పలు అధ్యయనాల్లో వెల్లడైంది.

కళ్లు పొడిబారితే ఏం జరుగుతుంది? : కన్నీళ్ల ఉత్పత్తి తగ్గడం, కన్నీటి పొర స్థిరత్వం దెబ్బతినడం లేదా కంటిలోని కన్నీరు వేగంగా ఆవిరైపోవడం వల్ల డ్రై ఐ సమస్య వస్తుంది. కన్నీటి పొర అనేది కంటి ఉపరితలాన్ని తేమగా, సృష్టంగా, సురక్షితంగా ఉంచే బహుళ పొరల నిర్మాణం. ఇందులో లిపిడ్ పొర, ఆక్వియస్ పొర, మ్యూసిన్ పొర ఉంటాయి. వీటిలో ఏ ఒక్కదానికి ఆటంకం కలిగినా కళ్లు పొడిబారతాయంటున్నారు నిపుణులు. ఈ క్రమంలో కళ్లులో నలక పడినట్లు, అసౌకర్యం, మంట, బరువుగా అనిపించడం, ఎర్రబడటం లేదా ప్రతిచర్యగా కళ్ల వెంట నీరు కారడం వంటివి దీని లక్షణాలుగా ఉండవచ్చని సూచిస్తున్నారు.

డ్రై ఐ సమస్య తాత్కాలికంగా, దీర్ఘకాలం లేదా పదే పదే వచ్చే అవకాశం ఉంది. ఇది చిన్నా, పెద్దా తేడా లేకుండా అన్ని వయసుల వారికి వస్తుంది. అయితే, ఒకే వయస్సు ఉన్న పురుషులతో పోలిస్తే మహిళల్లోనే డ్రై ఐ సమస్య ఎక్కువగా ఉన్నట్లుగా పలు అధ్యయనాల్లో తేలింది. ముఖ్యంగా, వయసు పైబడిన మహిళల్లో ఈ సమస్య మరింత ఎక్కువగా కనిపిస్తుంది.

పోషకాహార లోపం - మహిళలు తెలుసుకోవాల్సిన ఆరోగ్య రహస్యాలు ఇవేనట!

డ్రై ఐ సమస్యకు కారణాలు :

  • ఎక్కువసేపు మొబైల్, కంప్యూటర్, టాబ్లెట్ లేదా టీవి చూడటం, వీడియో గేమ్స్ ఆడటం వల్ల కనురెప్పలు ఆర్పడం తగ్గిపోతుంది. దీనివల్ల కంటి ఉపరితలం ఎక్కువసేపు గాలికి గురై కళ్లు పొడిబారతాయంటున్నారు నిపుణులు.
  • తక్కువ తేమ ఉన్న ప్రాంతాలు, ఏసీ గదులు, వేడి లేదా నేరుగా గాలి తగలడం వల్ల కన్నీళ్లు వేగంగా ఆవిరైపోతాయి.
  • ఎక్కువ కాలం కాంటాక్ట్ లెన్స్​లను ఉపయోగించడం వల్ల డ్రై ఐ సమస్య మరింత తీవ్రమవుతుంది.

మహిళల్లో ఈ సమస్య ఎక్కువ రావడానికి కారణాలు :

హార్మోన్లలో మార్పులు : శరీరంలోని హార్మోన్ల మార్పులకు, కంటి ఆరోగ్యానికి చాలా బలమైన సంబంధం ఉంది. ముఖ్యంగా ఈస్ట్రోజెన్, ప్రొజెస్టెరాన్, ఆండ్రోజెన్ వంటి హార్మోన్లలో వచ్చే మార్పులు కనురెప్పల్లోని లాక్రిమల్ గ్రంథులు (కన్నీటిని ఉత్పత్తి చేసేవి), మీబోమియన్ గ్రంథులు (నూనెను ఉత్పత్తి చేసేవి) పనితీరుపై ప్రభావం చూపుతాయి. ఇది కన్నీళ్ల ఉత్పత్తిని, వాటి స్థిరత్వాన్ని దెబ్బతీస్తుంది.

మెనోపాజ్ : పెరిమెనోపాజ్, మెనోపాజ్ దశల్లో ఉన్న మహిళల్లో ఈస్ట్రోజెన్, ప్రొజెస్టెరాన్ హార్మోన్లు చాలా వరకు తగ్గిపోతాయి. దీనివల్ల వారికి డ్రై ఐ సమస్య వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది.

గర్భధారణ, నెలసరి : గర్భధారణ సమయంలో, ప్రతినెలా వచ్చే పీరియడ్స్​లో కూడా హార్మోన్లలో మార్పులు వస్తుంటాయి. అలాగే, హార్మోన్ రీప్లేస్​మెంట్ థెరపీ తీసుకునేవారు, గర్భనిరోధక మాత్రలు వాడేవారికి కూడా ఈ ప్రమాదం ఎక్కువగా ఉంటుందని నిపుణులు చెబుతున్నారు.

థైరాయిడ్ సమస్యలు : థైరాయిడ్ హార్మోన్ స్థాయిలు అదుపులో లేకపోవడం వల్ల కన్నీటి, నూనె గ్రంథుల పనితీరు దెబ్బతిని కళ్లు పొడిబారతాయంటున్నారు నిపుణులు. పురుషుల కంటే మహిళల్లోనే థైరాయిడ్ హార్మోన్ అసమతుల్యత చాలా ఎక్కువగా ఉంటుందట.

సౌందర్య సాధనాల వాడకం : కళ్లకు మేకప్ వేసుకోవడం వల్ల నూనె గ్రంథులు మూసుకుపోయే అవకాశం ఉంది. కంటి మేకప్​ను పూర్తిగా తొలగించకపోతే ఈ సమస్య మరింత తీవ్రమవుతుంది.

కంటివాపు : స్థనిక లేదా శరీరంలోని ఇతర కారణాల వల్ల కంటి ఉపరితలంపై వాపు రావడం కూడా పొడిబారడాన్ని పెంచుతుంది.

పరిశోధన మూలాలు :

https://pmc.ncbi.nlm.nih.gov/articles/PMC10276676/

https://www.annallergy.org/article/S1081-1206(12)00010-5/fulltext

https://www.nei.nih.gov/eye-health-information/eye-conditions-and-diseases/dry-eye

https://www.mayoclinic.org/diseases-conditions/dry-eyes/symptoms-causes/syc-20371863

NOTE : ఇక్కడ మీకు అందించిన ఆరోగ్య సమాచారం, సూచనలు అన్నీ మీ అవగాహన కోసం మాత్రమే. శాస్త్ర పరిశోధనలు, అధ్యయనాలు, వైద్య, ఆరోగ్య నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. వీటిని పాటించే ముందు కచ్చితంగా మీ వ్యక్తిగత వైద్యుల సలహాలు తీసుకోవడమే మంచిది.

అలా చేస్తే పంచదార నీళ్లైనా ప్రమాదమే! - పసికందు ఆరోగ్యానికి పాటించాల్సిన నియమాలు ఇవి!

ఒత్తిడి వల్ల శరీరం విశ్రాంతి కోల్పోతుందా? - నాడీ వ్యవస్థను ప్రశాంతపరిచే మార్గాలు ఇవేనట!

Last Updated : July 21, 2026 at 6:38 PM IST