మీ గుండె ఆరోగ్యంగా ఉండాలా? - వీటి జోలికి పోవద్దట!
- ధమనుల్లో పూడికలు ఏర్పడటానికి పలు ఆహారాలూ కారణమే! - జాగ్రత్తలు తప్పకుండా తీసుకోవాలని సూచన

Published : December 10, 2025 at 4:01 PM IST
Everyday Foods that May Block Arteries and Increase Heart Attack Risk : ప్రస్తుతం చిన్నా పెద్దా తేడా లేకుండా ఎంతో మందిని కబళిస్తున్న అతిపెద్ద సమస్య గుండెపోటు. ఈ ప్రాణాంతక సమస్య నుంచి బయటపడేందుకు అందరూ.. హైబీపీ, డయాబెటిస్, ఒబెసిటీ, అధిక కొలెస్ట్రాల్ చెక్ చేసుకుంటున్నారు. ఇంకా కుటుంబంలో ఎవరికైనా గుండెజబ్బు ఉందా? అనేది చూస్తున్నారు. ఇందులో సమస్య లేకపోతే అంతా బాగుందని, గుండె బలంగానే ఉందని అనుకుంటూ ఉంటారు. కానీ, ఇది నిజం కాదంటున్నారు నిపుణులు. ధమనులలో ఏర్పడే అడ్డంకుల కారణంగా కూడా గుండెపోటు, స్ట్రోక్ వచ్చే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ క్రమంలో ధమనుల్లో ఫలకం ఏర్పడటానికి, గుండెపోటు ప్రమాదాన్ని పెంచడానికి అవకాశం ఉన్న ఆహార పదార్థాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం!
పొగాకు వాడకం, అధిక ఉప్పు, శారీరక శ్రమ లేకపోవడం, ఊబకాయం, మద్యం సేవించడం అన్నింటి కంటే ముఖ్యంగా, అనారోగ్యకరమైన ఆహారం వంటి అంశాలు ధమనులలో ఫలకం(అథెరోస్క్లెరోసిస్) పేరుకుపోవడాన్ని వేగవంతం చేస్తాయని cdc అధ్యయనం పేర్కొంది.
ధమనుల్లో పూడికలు : గుండెకు రక్తాన్ని సరఫరా చేసే ధమనులే కీలకం. ఇవి గుండె కండరానికి రక్తాన్ని చేరవేస్తాయని నిపుణులు చెబుతున్నారు. ఈ ధమనుల్లో పూడికలు ఏర్పడితే రక్తం సరిగా సరఫరా కాదంటున్నారు. సాధారణంగా కొవ్వు, కొలెస్ట్రాల్ పోగుపడి పూడికలుగా మారుతుంటాయని, వీటి మూలంగా రక్తం అందని గుండె భాగం ఆక్సిజన్ కొరవడి, చచ్చుబడటం మొదలవుతుందని పేర్కొంటున్నారు. ఫలితంగా, గుండెపోటు, స్ట్రోక్ లాంటివి వచ్చే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు.

కర్రీ పార్శిల్ తెచ్చుకుంటున్నారా? - అయితే ఈ విషయాలు తప్పక తెలుసుకోవాల్సిందే!
డీప్ ఫ్రై ఫుడ్స్ : పకోడీలు, సమోసాలు, ఫ్రైడ్ చికెన్ వంటివి తినడానికి రుచికరంగా ఉంటాయి. కానీ, ఇవి మరగకాగిన నూనెలో చేయడం వల్ల, నూనె ఆక్సిడైజ్ చెంది ట్రాన్స్‌ఫ్యాట్స్‌ని ఉత్పత్తి చేస్తుందంటున్నారు నిపుణులు. అంతేకాకుండా, శరీరంలో చెడు కొలెస్ట్రాల్‌ను పెంచడంతోపాటు వాపును ప్రేరేపిస్తాయని చెబుతున్నారు. ఈ క్రమంలో తరచూ డీప్ ఫ్రై ఫుడ్స్ ఎక్కువగా తినడం వల్ల ధమనుల్లో ప్లేక్ ఏర్పడుతుందని హెచ్చరిస్తున్నారు.
ప్రాసెస్ చేసిన మాంసం : సాసేజ్లు, బేకన్, సలామీలలో శాచ్యురేటెడ్ ఫ్యాట్, సోడియం, నైట్రేట్లు, ఇతర ప్రిజర్వేటివ్‌లు ఉంటాయంటున్నారు నిపుణులు. ఇవి ధమనుల గోడలపై పేరుకుపోయి అడ్డంకులకు దారితీస్తాయని చెబుతున్నారు. అలాగే, రక్తనాళాల వాపు, పనితీరును ప్రభావితం చేస్తాయని పేర్కొంటున్నారు. ఫలితంగా, గుండెజబ్బు సమస్యలకీ కారణమవుతుందని తెలియజేస్తున్నారు.

శుద్ధి చేసిన కార్బోహైడ్రేట్లు : బ్రెడ్, పేస్ట్రీలు, స్వీట్లు, చక్కెర పానీయాలు రక్తంలో చక్కెర స్థాయిలను త్వరగా పెంచుతాయంటున్నారు నిపుణులు. ఇది ట్రైగ్లిజరైడ్స్‌ను పెంచడంతోపాటు ధమనుల చుట్టూ కొవ్వు పేరుకుపోవడాన్ని ప్రోత్సహిస్తుందని పేర్కొంటున్నారు. దీర్ఘకాలంలో డయాబెటిస్ కారణమవుతుందని తెలియస్తున్నారు. డయాబెటిస్ - ధమని గోడలను దెబ్బతీస్తుందని British Heart Foundation అధ్యయనం పేర్కొంది. ఫలితంగా, గుండె జబ్బుల ప్రమాదం పెంచుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

ప్యాకేజ్ చేసిన స్నాక్స్ : చిప్స్, నమ్కీన్‌లు, బిస్కెట్లు, బేక్ చేసిన జంక్ ఫుడ్‌లలో తరచుగా హైడ్రోజనేటెడ్ నూనెలు ఉంటాయని నిపుణులు చెబుతున్నారు. ట్రాన్స్ ఫ్యాట్స్, చెడు కొలెస్ట్రాల్‌ను పెంచడమే కాకుండా మంచి కొలెస్ట్రాల్‌ను కూడా తగ్గిస్తాయంటున్నారు. దీనివల్ల రక్తనాళాలు వేగవంతంగా సన్నబడతాయని పేర్కొంటున్నారు.

అధిక ఉప్పు ఉన్న ఆహారాలు : ఇన్‌స్టంట్ నూడుల్స్, ప్యాకేజ్ చేసిన సూప్‌లు, ఊరగాయలు, చిప్స్, రెస్టారెంట్ భోజనాలలో తరచుగా సోడియం ఎక్కువగా ఉంటుందంటున్నారు నిపుణులు. అధిక ఉప్పు తీసుకోవడం వల్ల బీపీ పెరుగుతుందని చెబుతున్నారు. అలాగే, ధమని గోడలు దెబ్బతీయడంతోపాటు ఫలకం పేరుకుతుందని పేర్కొంటున్నారు. ఈ క్రమంలో గుండె ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి సోడియం తగ్గించాలని కార్డియాలజిస్టులు పదేపదే సలహా ఇస్తున్నారు. అధిక ఉప్పు ఆహారం అధిక రక్తపోటుతో దగ్గరి సంబంధం కలిగి ఉంటుంది. ఇది అథెరోస్క్లెరోసిస్‌కు ఒక ముఖ్యమైన కారణమని Harvard Health Publishing అధ్యయనం పేర్కొంది.
కృత్రిమంగా తీపి చేసిన పానీయాలు : ఎనర్జీ డ్రింక్స్ గుండె వేగాన్ని, రక్తపోటును పెంచుతాయని నిపుణులు చెబుతున్నారు. తద్వారా హృదయనాళ వ్యవస్థపై ఒత్తిడి పెరుగుతుందంటున్నారు. వీటిని తరచుగా సేవించడం వల్ల దీర్ఘకాలంలో గుండె సమస్యలు వస్తాయని పేర్కొంటున్నారు.
NOTE : ఇక్కడ మీకు అందించిన ఆరోగ్య సమాచారం, సూచనలు అన్నీ మీ అవగాహన కోసం మాత్రమే. శాస్త్ర పరిశోధనలు, అధ్యయనాలు, వైద్య, ఆరోగ్య నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. కానీ, వీటిని పాటించే ముందు కచ్చితంగా మీ వ్యక్తిగత వైద్యుల సలహాలు తీసుకోవడమే మంచిది.
క్యాల్షియం మాత్రలతో కిడ్నీలో రాళ్లు వస్తాయా? - నిపుణులు ఏమంటున్నారంటే!
ఇంట్లోనే బీపీ, షుగర్ చెక్ చేసుకుంటున్నారా? - ఈ జాగ్రత్తలు పాటించాలట!

