ETV Bharat / health

వర్షాకాలంలో వచ్చే వ్యాధులు - ఈ జాగ్రత్తలు పాటించాలంటున్న నిపుణులు!

డెంగ్యూ, మలేరియా, టైఫాయిడ్ - సింపుల్ టిప్స్ సూచిస్తున్న నిపుణులు!

Health Tips for the Monsoon
Health Tips for the Monsoon (ETV Bharat)
author img

By ETV Bharat Health Team

Published : July 14, 2026 at 4:19 PM IST

3 Min Read
Choose ETV Bharat

Essential Health Tips for the Monsoon : వర్షాకాలం వాతావరణంలో ఆహ్లాదకరమైన మార్పును తెస్తుంది. కానీ, ఇది వివిధ ఆరోగ్య సమస్యలను కూడా కలిగిస్తుంది. పెరిగిన తేమ, నీరు నిల్వ ఉండటం, దోమలు, బ్యాక్టీరియా వృద్ధి చెందడానికి అనుకూలమైన పరిస్థితుల వల్ల అంటువ్యాధులు లేదా సీజనల్ వ్యాధులు పెరిగే అవకాశం ఉంది. పిల్లలు, వృద్ధులు, రోగనిరోధక శక్తి తక్కువగా ఉన్నవారు తొందరగా అనారోగ్యానికి గురయ్యే అవకాశం ఉంది.

డెంగ్యూ : వర్షాకాలంలో డెంగ్యూ బారిన పడే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఈ వ్యాధి 'ఏడిస్ ఈజిప్టి' అనే దోమ ద్వారా వ్యాపిస్తుంది. ఇది నిలిచి ఉన్న నీటిలో వృద్ధి చెందుతుంది. ఇంటి పైకప్పులు, ఎయిర్ కూలర్లు, పూల కుండీలు, నీటి ట్యాంకులు వంటి ప్రదేశాలు ఈ దోమల సంతానోత్పత్తికి కేంద్రాలుగా మారవచ్చు. డెంగ్యూ వస్తే జ్వరం, తలనొప్పి, కళ్ల వెనుక నొప్పి, తీవ్రమైన కండరాలు, కీళ్ల నొప్పులు లాంటి లక్షణాలు కనిపిస్తాయని నిపుణులు చెబుతున్నారు. కొన్ని సందర్భాల్లో రక్తకణాల సంఖ్య వేగంగా పడిపోచ్చంటున్నారు. కాబట్టి, వర్షాకాలంలో దోమల కాటు నుంచి రక్షణ పొందేందుకు జాగ్రత్తలు తీసుకోవడం చాలా ముఖ్యం.

మలేరియా : వర్షాకాలంలో వేగంగా వ్యాపించే వ్యాధుల్లో మలేరియా ఒకటి. ఇది 'ఆడ అనాఫిలిస్' అనే దోమ కాటు వల్ల వస్తుంది. సాధారణంగా తీవ్రమైన జ్వరం, చలి, విపరీతంగా చెమటలు పట్టడం, అలసట, ఒళ్లు నొప్పులు దీని లక్షణాలని నిపుణులు చెబుతున్నారు. అయితే, మలేరియాకు సకాలంలో చికిత్స తీసుకోకపోతే తీవ్రమైన పరిస్థితికి దారితీస్తుందని హెచ్చరిస్తున్నారు. దీనిని నివారించడానికి, ఇంటి చుట్టుపక్కల నీరు నిల్వ ఉండకుండా చూసుకోవాలని, దోమ తెరలను వాడాలని సూచిస్తున్నారు.

డెలివరీ తర్వాత పొట్టను తగ్గించుకునేదెలా? - నిపుణులు ఏమంటున్నారంటే!

టైఫాయిడ్ : కలుషితమైన నీరు, ఆహారాన్ని తీసుకోవడం వల్ల వర్షాకాలంలో టైఫాయిడ్ జ్వరం వచ్చే ప్రమాదం పెరుగుతుంది. ఈ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ జీర్ణవ్యవస్థపై ప్రభావం చూపుతుంది. దీనివల్ల నిరంతరం జ్వరం, కడుపు నొప్పి, తలనొప్పి, అలసట, ఆకలి మందగించడం లాంటి లక్షణాలు కనిపిస్తాయని నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా బయట ఫుడ్, కలుషితమైన నీరు ఈ వ్యాధి వ్యాప్తికి ప్రధాన కారణాలుటున్నారు. కాబట్టి, వర్షాకాలంలో తినే ఆహారం, తాగే నీటి విషయంతో చాలా జాగ్రత్తగా ఉండాలని పేర్కొంటున్నారు.

వైరల్ ఫీవర్ : ఉష్ణోగ్రత, వాతావరణంలో వచ్చే హెచ్చుతగ్గుల కారణంగా వర్షాకాలంలో వైరల్ ఇన్ఫెక్షన్లు వేగంగా వృద్ధి చెందుతాయి. వైరల్ ఫీవర్ ఒక వ్యక్తి నుంచి మరొకరికి సులభంగా వ్యాపిస్తుందని నిపుణులు చెబుతున్నారు. తీవ్రమైన జ్వరం, గొంతు నొప్పి, తలనొప్పి, ఒళ్లు నొప్పులు, అలసట దీని సాధారణ లక్షణాలని తెలియజేస్తున్నారు. కొన్ని సందర్భాల్లో ఈ ఇన్ఫెక్షన్ వల్ల బాధితులు కొన్ని రోజుల పాటు తీవ్రమైన నీరసానికి గురవుతారట. అందుకే, రోగనిరోధక శక్తిని పెంచే ఆహారం, వ్యక్తిగత పరిశుభ్రతను పాటించడం వల్ల ఈ ప్రమాదాన్ని తగ్గించుకోవచ్చట.

ఫుడ్ పాయిజనింగ్, విరేచనాలు : వాతావరణంలో ఉండే అధిక తేమ కారణంగా వర్షాకాలంలో ఆహార పదార్థాలు చాలా త్వరగా పాడైపోతాయి. కలుషితమైన ఆహారం లేదా నీటిని తీసుకోవడం వల్ల ఫుడ్ పాయిజనింగ్, విరేచనాలు లాంటి సమస్యలు రావొచ్చని నిపుణులు చెబుతున్నారు. అలాగే, వాంతులు, కడుపు నొప్పి, విరేచనాలు, వికారం, డీ హైడ్రేషన్ దీని ప్రధాన లక్షణాలని పేర్కొంటున్నారు. అందుకే బయట రోడ్డు పక్కన దొరికే ఆహారాన్ని తినడం మానేయాలని సూచిస్తున్నారు. తాజాగా వండిన వేడి ఆహారాన్ని మాత్రమే తీసుకోవాలని సలహా ఇస్తున్నారు.

పరిశోధన మూలాలు :
https://www.who.int/news-room/fact-sheets/detail/dengue-and-severe-dengue

https://www.who.int/news-room/fact-sheets/detail/malaria

https://my.clevelandclinic.org/health/diseases/17730-typhoid-fever

NOTE : ఇక్కడ మీకు అందించిన ఆరోగ్య సమాచారం, సూచనలు అన్నీ మీ అవగాహన కోసం మాత్రమే. శాస్త్ర పరిశోధనలు, అధ్యయనాలు, వైద్య, ఆరోగ్య నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. కానీ, వీటిని పాటించే ముందు కచ్చితంగా మీ వ్యక్తిగత వైద్యుల సలహాలు తీసుకోవడమే మంచిది.

కిడ్నీలను సైలెంట్‌గా దెబ్బతీసే 'ప్రోటీన్యూరియా' - పురుషులు గుర్తించాల్సిన కీలక లక్షణాలు ఇవేొ!

చదువు ఒత్తిడిలో అధిక ఆహారం - ఆరోగ్యాన్ని దెబ్బతీస్తుందంటున్న నిపుణులు!