కరెంటుతో కండలా? - EMS ట్రెండ్‌తో లాభమెంత? నష్టమెంత?
EMS అంటే ఏమిటీ? - ఇది ఆరోగ్యానికి మంచిదేనా?

Published : June 2, 2026 at 5:03 PM IST
Electrical Muscle Stimulation Side Effects : ఒంటినిండా కండరాలు, మంచి శరీర సౌష్ఠవం కావాలంటే ఏం చేయాలి? బాగా వ్యాయామం చేయాలి. అయితే, కొంతమంది మాత్రం కసరత్తులకు బదులుగా కరెంటును ఆశ్రయిస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా విస్తరిస్తున్న ఎలక్ట్రికల్ మజిల్ స్టిమ్యులేషన్‌తో (EMS) ట్రెండ్‌తో లాభమెంత? నష్టమెంత? లాంటి విషయాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం!
కండగలవాడేను మనిషోయ్, అంటే దానికి చాలా కసరత్తులు చేయాలి. పెద్దగా శ్రమించకుండానే కండలు తిరిగిన దేహం కావాలంటే ఏదైనా మార్గం ఉందా అని అడిగేవాళ్ల కోసం ఓ మార్గాన్ని కనిపెట్టారు ఆ రంగం నిపుణులు. EMSతో తేలిగ్గా కండ కలవారు కావచ్చంటున్నారు. ఈ క్రమంలో శరీరానికి పని చెప్పకుండానే మంచి దేహ సౌష్ఠవం సాధ్యమవుతుండడంతో దాన్ని అవలంబిస్తున్న వారి సంఖ్య ప్రపంచ వ్యాప్తంగా పెరుగుతోంది. మాకు వ్యాయామానికి సమయం లేదనే వారు, కష్టమైన కసరత్తులు చేయలేని స్థితిలో ఉన్నవాళ్లు, అంతగా శ్రమించలేం అనే వాళ్లు దీన్ని ఆశ్రయిస్తున్నారు. హాస్పిటల్స్, రీహాబిలిటేషన్ సెంటర్లలో రోగులు నొప్పి తగ్గించడానికి, కండరాల క్షీణత నివారించడానికి, రక్త ప్రసరణ మెరుగుదలకు EMSను ఉపయోగించేవారని sciencedirect పేర్కొంది. కండర క్షీణత ఉన్న రోగుల్లో వాటిని బలోపేతం చేయడానికి, నాడీ వ్యవస్థను ప్రేరేపించడానికి దీన్ని వాడేవారు. అయితే, కొన్నేళ్లుగా ఈ సాంకేతికతను ఫిట్నెస్ కోసం వాడడం ఎక్కువైంది.
తీవ్రమైన ఒత్తిడి ఎదుర్కొంటున్నారా? - నిర్లక్ష్యం చేయొద్దంటున్న నిపుణులు
ఏం చేస్తారు? :
- ఈ విధానంలో చర్మ ఎలక్ట్రోడ్ల ద్వారా తేలికపాటి విద్యుత్తు ప్రవాహాలను పంపుతారు. దీని కోసం ప్రత్యేకమైన సూట్లను వాడతారు. గతంలో దీనికి కేవలం తడి సూట్లు మాత్రమే ఉండేవి. ఇప్పుడు పొడివి కూడా వాడుతున్నారు.
- ఈ సూట్లను ధరించాక శరీరంలోని ముఖ్యమైన కండరాలన్నిటికీ నేరుగా విద్యుత్తు సంకేతాలను పంపుతారు. ఇవి ప్రధాన కండరాలన్నిటినీ ఏకకాలంలో షాక్‌కు గురిచేసి, వాటిని బాగా కదిలేలా చేస్తాయి. దీన్ని వాడుతున్న సమయంలో మనిషి శరీరం వైబ్రేషన్లో ఉన్న మొబైల్ ఫోన్‌కు కాల్ వస్తే ఎలా ఉంటుందో అలా ఉంటాడు.
- సాధారణ వ్యాయామంలో అన్ని కండరాలను ఒకేసారి కదిలించలేం. అదే EMSలో ఒకేసారి, ఒకే స్థాయిలో కండరాలన్నీ కదలడం వల్ల అవి అదే మోతాదులో పరిపుష్టం అవుతాయంటున్నారు నిపుణులు. EMS పరికరాలు నరాలకు విద్యుత్తు ఉద్దీపనలను పంపి, అవి లయబద్ధంగా సంకోచించి, సడలడానికి కారణమవుతాయట. ఇది ఒక్కో సెషన్ దాదాపు 20 నిమిషాలు ఉంటుంది.
- EMS పరికరం తాత్కాలికంగా కండరాన్ని బలోపేతం చేయడానికి, టోన్ చేయడానికి లేదా దృఢపరచడానికి ఉపయోగపడినప్పటికీ, బరువు తగ్గడానికి, నడుము చుట్టుకొలత తగ్గించుకోవడానికి, లేదా "రాయిలా గట్టి" అబ్స్ పొందడానికి ఇప్పటివరకు ఏ EMS పరికరాలకూ అనుమతి లభించలేదని U.S Food & Drug Administration పేర్కొంది.
ప్రత్యామ్నాయం కాదు : పెద్దగా కష్టంలేని విధానం కావడంతో ప్రపంచ వ్యాప్తంగా దీనికి ఆదరణ పెరుగుతోంది. 2023-2025 మధ్య ప్రపంచ వ్యాప్తంగా EMS ఫిట్నెస్ సెంటర్ల సంఖ్య 16 శాతం పెరిగింది. అయితే, సంప్రదాయ వ్యాయామాలు చేయలేని స్థితిలో ఉన్నవారికి ఇవి ఉపయోగపడ్డా, అసలైన వ్యాయామాలకు ఇది ప్రత్యామ్నాయం కాదంటున్నారు నిపుణులు. కొంతమంది మాత్రం సంప్రదాయ వ్యాయామాలతో పాటు దీన్ని కూడా అనుసరిస్తున్నారు.
తస్మాత్ జాగ్రత్త :
- ఇది విద్యుత్ ప్రవాహంలో పని కాబట్టి అత్యంత అప్రమత్తంగా ఉండాలి. సరైన శిక్షణ, అవగాహన లేని కోచ్‌లు ఎక్కువ మోతాదులో విద్యుత్తును పంపితే పెద్ద ప్రమాదాలు చోటు చేసుకోవచ్చు.
- సాధారణంగా పేస్‌మేకర్ లాంటి గుండె స్పందన, నియంత్రణ పరికరాలున్న వారు ఇతర పెద్ద ఆరోగ్య సమస్యలున్న వారికి ఈ వ్యాయామాన్ని సూచించరు.
- ఈ విధానంలో కండరాలపై మన నియంత్రణ ఉండదు. విద్యుత్తు పరికరం చేసిన మేరకు కదులుతాయి. కాబట్టి, మన శరీరం ఎక్కువగా శ్రమించవచ్చు. దీనివల్ల రాబ్డోమయోలిసిస్ వంటి తీవ్ర కండర క్షీణత వ్యాధులు వచ్చే అవకాశం ఉంది. ఒక్కోసారి మూత్ర పిండాల వైఫల్యానికి దారితీయొచ్చు.
- ఈ కంపనాల తీవ్రతతో కొందరు శ్వాస తీసుకోవడం మర్చిపోతారు. దీంతో వారు అపస్మారక స్థితిలోకి వెళ్లే అవకాశం ఉంది. అందుకే, ఈ విధానాన్ని అనుసరించాలనుకునేవారు నిపుణుల సమక్షంలోనే చేయాలి.
NOTE : ఇక్కడ మీకు అందించిన ఆరోగ్య సమాచారం, సూచనలు అన్నీ మీ అవగాహన కోసం మాత్రమే. శాస్త్ర పరిశోధనలు, అధ్యయనాలు, వైద్య, ఆరోగ్య నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. వీటిని పాటించే ముందు కచ్చితంగా మీ వ్యక్తిగత వైద్యుల సలహాలు తీసుకోవడమే మంచిది.
సంపూర్ణ ఆరోగ్యానికి 'స్టోన్ ఫ్రూట్స్' - ఎన్ని లాభాలో తెలుసా?
చిన్న వయస్సులో మోకాళ్ల, తుంటి నొప్పులా? - ఈ చిన్న చిన్న అలవాట్లే కారణమని తెలుసా?

