తినడానికీ ఓ లెక్కుందట! - ఎప్పుడు? ఎలా తినాలో తెలుసా?
-అతి వేగం, అమిత నిదానమూ వద్దు - ధ్యాస పెట్టి తినడమే మంచిదంటున్నారు నిపుణులు!

Published : July 8, 2026 at 3:00 AM IST
Mindful Eating: ఆరోగ్యంగా ఉండాలంటే కేవలం ఏం తింటున్నాం అనేదే ముఖ్యం కాదు. ఎప్పుడు, ఎలా తింటున్నాం? తినడానికి ఎంత సమయం తీసుకుంటున్నాం? అనేది కూడా ముఖ్యమంటున్నారు నిపుణులు. ఈ గజిబిజీ లైఫ్లో తినకూడని సమయాల్లో ఆహారం తీసుకుంటూ, హడావుడిగా తింటూ సమస్యలు తెచ్చుకుంటున్నామని చెబుతున్నారు. అవసరానికి మించి తిన్నా, హడావుడిగా తిన్నా అజీర్తితో పాటు ఒబెసిటీ, డయాబెటిస్ లాంటి దీర్ఘకాలిక సమస్యలు తప్పవని హెచ్చరిస్తున్నారు. ఈ క్రమంలో తినడానికీ ఓ లెక్కుందని, అది తప్పితే ఆరోగ్యం తలకిందులవుతుందని పేర్కొంటున్నారు. మరి, ఆహారాన్ని ఎలా, ఏ సమయంలో తినాలి? లాంటి విషయాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం!
తినడానికి 20 నిమిషాలు కేటాయించాల్సిందే : మనం తినడం ప్రారంభించిన తర్వాత, కడుపు నిండిందనే సంకేతం మెదడుకు చేరడానికి కనీసం 20 నుంచి 30 నిమిషాల సమయం పడుతుందని నిపుణులు చెబుతున్నారు. ఆహారం హడావుడిగా నమిలి మింగేయకుండా, ప్రతి ముద్దనూ బాగా నమిలి తినాలని అంటున్నారు. ఇలా చేస్త శరీరంలో ఆకలిని పెంచే 'గ్రెలిన్ హార్మోన్' స్థాయి తగ్గుతుందని పేర్కొంటున్నారు. అదే సమయంలో కడుపు నిండినట్లు చేసే చోలేసిస్టోకైనిన్ (CCK), గ్లూకాగాన్ లైక్పెప్టైడ్ -1 (GLP-1) విడుదలై సంతృప్తి స్థాయి పెంచుతాయని తెలియజేస్తున్నారు. ఎక్కువ సేపు ఆహారం నమలడం వల్ల నోట్లో లాలాజలం బాగా ఊరుతుందని వివరిస్తున్నారు. ఇందులోని ఎంజైములు ఆహారాన్ని నోట్లోనే సగం జీర్ణం చేసి పొట్టపై భారం తగ్గిస్తాయంటున్నారు. అంతేకాదు. శరీరానికి పోషకాలు అందుతాయట.
బరువు తగ్గాలని డైటింగ్ చేస్తున్నారా? - ఈ విషయాలు తప్పక తెలుసుకోవాల్సిందే!
80 శాతం నియమంతో జీర్ణక్రియ సాఫీగా : కడుపు పూర్తిగా నిండే వరకు తినకుండా, 80% నిండినట్లు అనిపించగానే ఆపేయాలంటున్నారు నిపుణులు. ఉదయం పూట పోషకాలతో కూడిన ఎక్కువ అల్పాహారం, మధ్యాహ్నం మితమైన భోజనం, రాత్రి వేళల్లో తేలికపాటి ఆహారం తీసుకోవడం మంచిదని చెబుతున్నారు. అలాగే, భోజనానికి అరగంట ముందు, తిన్న తర్వాతే నీళ్లు తాగాలని సూచిస్తున్నారు.
రాత్రి 8 గంటల తర్వాత ఎక్కువగా తినేవారిలో ఇన్సులిన్ నిరోధకత పెరిగి టైప్ 2 డయాబెటిస్, రక్తంలో కొలెస్ట్రాల్ పెరిగే ప్రమాదం ఉందంటున్నారు నిపుణులు. అంతేకాదు, రాత్రి ఆలస్యంగా తినడం వల్ల ఆహారం జీర్ణం కాక, అది కొవ్వుగా మారి రక్తనాళాల్లో చేరి అనర్థాలకు దారితీస్తుందని హెచ్చరిస్తున్నారు.
తినేటప్పుడు ధ్వాస అంతా భోజనంపైనే ఉండాలని పెద్దలు చెబుతుంటారు. దీన్నే అందరూ పాటించాలి. తిన్న కాసేపైనా మైండ్ ఫుల్ ఈటింగ్కు ప్రాధాన్యం ఇవ్వాలి. దీనివల్ల మంచి ఫలితం ఉంటుంది. ఆహారం చూడడం, రుచి, వాసన ఆస్వాదించడం, నేలపై కూర్చుని, చేత్తో తినడం వల్ల ఎక్కువ ప్రయోజనాలు ఉంటాయి. ఈ పద్ధతి చిన్నతనం నుంచి అలవాటు చేయాలి. చిన్నపిల్లలు మొబైల్, టీవీలు చూస్తూ నమలకుండా మింగేస్తుంటారు. అవసరానికి మించి తింటున్నారు. దీనివల్ల అనేక సమస్యలు వస్తున్నాయి. కడుపు నిండినా మెదడుకు సంకేతాలు అందవు. కడుపుపై ఒత్తిడిపడి భవిష్యత్తులో ఈ అలవాటు అనర్థాలకు దారితీసే ప్రమాదం ఉంది-డాక్టర్ R.రేఖ, ఫుడ్, న్యూట్రిషన్ అండ్ డైటెటిక్స్ విభాగం, ఆంధ్ర విశ్వవిద్యాలయం
కంగారు వద్దు : నెమ్మదిగా నమిలితినే వారితో పోలిస్తే చాలా వేగంగా ఆహారం తినే వారికి ఒబెసిటీ వచ్చే ముప్పు మూడు రెట్టు ఎక్కువగా ఉందని పలు అధ్యయనాల్లో వెల్లడైంది. వేగంగా తినే వారిలో కడుపు నిండిన భావన త్వరగా రాకపోవడమే దీనికి కారణమని BMJ తేలింది.
- ఆహారాన్ని ఎక్కువసేపు నమిలి తినడం వల్ల కడుపు నిండిన భావన త్వరగా కలిగి, తీసుకునే ఆహారం పరిమాణం తగ్గుతుందని nutritionsource పేర్కొంది.
- మనం వేగంగా తిన్నప్పుడు, కడుపు నిండిందనే సంకేతాన్నిచ్చే లెప్టిన్ హార్మోన్ల ద్వారా మెదడుకు సంకేతాలు అందేలోపే మనం పరిమితికి మించి క్యాలరీలు తీసుకుంటామని నిపుణులు చెబుతున్నారు. అదే నిదానంగా నమిలి తింటే.. మెదడు సకాలంలో స్పందించి జీర్ణ వ్యవస్థకు ఇక చాలు అనే సంకేతాలు పంపుతుందని అంటున్నారు. ఈ ప్రక్రియ ఒబెసిటీ తగ్గించడానికి ఉపయోగపడుతుందని Harvard Health Publishing పేర్కొంది
ఏ సమయంలో తినాలి?:
- బ్రేక్ఫాస్ట్ నిద్రలేచిన 2 గంటల లోపు అంటే ఉదయం 7 నుంచి 8.30 గంటల లోపు తినాలి.
- మధ్యాహ్నం లంచ్ 12.30 నుంచి 2 గంటల లోపు తినడం మేలు.
- నైట్ డిన్నర్ నిద్రపోవడానికి కనీసం 3 గంటల ముందే అంటే సాయంత్రం 7 నుంచి రాత్రి 8.30 గంటల లోపు తినాలి.
NOTE : ఇక్కడ మీకు అందించిన ఆరోగ్య సమాచారం, సూచనలు అన్నీ మీ అవగాహన కోసం మాత్రమే. శాస్త్ర పరిశోధనలు, అధ్యయనాలు, వైద్య, ఆరోగ్య నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. కానీ, వీటిని పాటించే ముందు కచ్చితంగా మీ వ్యక్తిగత వైద్యుల సలహాలు తీసుకోవడమే మంచిది.
కండరాల నొప్పిని లైట్ తీసుకుంటున్నారా? - ఈ లక్షణాలు ఉంటే ప్రమాదకరమంటున్న నిపుణులు
ఇంట్లో పెంపుడు జంతువులు ఉన్నాయా? - ఈ వ్యాధుల గురించి తెలుసుకోవాల్సిందే!

