ప్రాణాంతక క్యాన్సర్ 'మైలోమా' - ఈ లక్షణాలు కనిపిస్తే జాగ్రత్త!
- ముందుగానే గుర్తించి అలర్ట్ కావాలంటున్న నిపుణులు

Published : July 4, 2026 at 5:02 PM IST
Symptoms Causes and Treatments of Multiple Myeloma : మైలోమా అనేది ఓ ప్రమాదకర బ్లడ్ క్యాన్సర్. దీన్ని మల్టీపుల్ మైలోమా అని కూడా పిలుస్తారు. ఈ వ్యాధి ఎముక లోపల ఉండే మజ్జపై ప్రభావితం చూపుతుందని నిపుణులు చెబుతున్నారు. దీన్ని ఆలస్యంగా గుర్తిస్తే ప్రాణాంతకంగా మారే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు. ఈ క్రమంలో మైలోమా లక్షణాలు ఏంటి? ఎలా గుర్తించాలి? దీని నివారణకు అందుబాటులో ఉన్న చికిత్సలు ఏంటి? లాంటి విషయాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం!
మైలోమా అంటే : మైలోమా అనేది ఒక రకమైన రక్త క్యాన్సర్. ఇది ఎముక మజ్జలోని ప్లాస్మా కణాల నుంచి ఉత్పన్నమయ్యే ఒక ప్రమాదకరమైన వ్యాధి అని నిపుణులు చెబుతున్నారు. నిజానికి, ఈ ప్లాస్మా కణాలు మన శరీరంలో రోగనిరోధక శక్తిని పెంచి, ఇన్ఫెక్షన్లపై పోరాడే తెల్ల రక్తకణాలలో ఒక ముఖ్యమైనవి అని అంటున్నారు. అయితే, ఇవి క్యాన్సర్ కణాలుగా మారినప్పుడు అనియంత్రితంగా పెరిగిపోతాయని పేర్కొంటున్నారు. ఫలితంగా, ఇవి ఎముక మజ్జలో చేరి ఆరోగ్యకరమైన ఎర్ర రక్తకణాలు, తెల్ల రక్తకణాలు, ప్లేట్‌లెట్ల సహజ ఉత్పత్తిని తీవ్రంగా దెబ్బతీస్తాయని వివరిస్తున్నారు.
లక్షణాలు : మైలోమా వ్యాధి లక్షణాలు మొదట్లో స్పష్టంగా కనిపించవట. కానీ, తరచు అలసటగా, బలహీనంగా అనిపిస్తుందని mayoclinicపేర్కొంది. ఎముకలు నొప్పి పెడుతూ ఉంటాయంటున్నారు. ముఖ్యంగా, వెన్నెముక, నడుము, పక్కటెముకల్లో నొప్పి వస్తుందని పేర్కొంటున్నారు. రక్తహీనత వల్ల తల తిరగడం, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, తరచూ జ్వరం రావడం వంటివి జరుగుతూ ఉంటాయని తెలియజేస్తున్నారు. ఇలాంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే డాక్టర్లులను సంప్రదించాలని సూచిస్తున్నారు. ఈ క్రమంలో మైలోమా క్యాన్సర్ రావడానికి ప్రత్యేకమైన కారణాలు లేవని చెబుతున్నారు. కానీ, కొన్ని సందర్భాల్లో ఈ వ్యాధి వారసత్వంగాను లేదంటే జన్యువుల మ్యూటేషన్ వల్ల కూడా వచ్చే అవకాశం ఉందని తెలియజేస్తున్నారు.
మహిళలు తప్పక తినాల్సిన పండు 'ఇది' - ఆరోగ్యానికే కాదు అందానికి మంచిదట!
మైలోమా క్యాన్సర్‌ను పూర్తిగా నివారించే చికిత్స ఇప్పటి వరకు అందుబాటులో లేదట. కానీ, దీన్ని ప్రాధమిక దశలోనే గుర్తిస్తే నియంత్రణలో ఉంచుకోవచ్చంటున్నారు నిపుణులు. శరీరంలో మీకు ఏవైనా మార్పులు కనిపిస్తే వెంటనే సంబంధిత డాక్టర్లును సంప్రదించాలని సూచిస్తున్నారు. రక్త పరీక్షలు, ఎముక మధ్య వంటి పరీక్షల ద్వారా మైలోమాను గుర్తించవచ్చని తెలియజేస్తున్నారు. ఈ క్రమంలో మైలోమా తీవ్రమైనది కానీ, టైంకి గుర్తిస్తే మాత్రం ఎక్కువ కాలం ఆరోగ్యంగా జీవించవచ్చని పేర్కొంటున్నారు.
ఒకవేళ పేషెంట్‌కు మల్టిపుల్ మైలోమా అని నిర్ధారణ అయితే, మొదటి లైన్ ప్రామాణిక చికిత్సగా కీమోథెరపీని అందిస్తారు. అయితే, ఈ మైలోమా కొన్నిసార్లు ఎముక మజ్జ అంతటా కాకుండా, కేవలం ఒకే ఒక ఎముకలో మాత్రమే కేంద్రీకృతమై ఉంటుంది. దీన్ని'ప్లాస్మాసైటోమా' అంటారు. అలాంటప్పుడు మనం 'రేడియేషన్ థెరపీ' ఇవ్వవచ్చు. ఒకవేళ మైలోమా అనేది మల్టిపుల్ సైట్స్ లేదా ఎముకల్లో విస్తరించి ఉన్నా, లేదా రక్తంలో మైలోమా ప్రొటీన్ ఉన్నా అది మల్టిపుల్ మైలోమా కిందకు వస్తుంది. కాబట్టి, ప్రాథమికంగా రేడియేషన్ అవసరం ఉండదు. కానీ, కొంతమంది తీవ్రమైన ఎముక నొప్పితో బాధపడుతుంటారు. వారికి 'స్టెరాయిడ్స్' ప్రారంభించిన మొదటి 48 గంటల్లోనే నొప్పి తగ్గిపోతుంది. ఒకవేళ స్టెరాయిడ్స్ ఇచ్చినప్పటికీ నొప్పి తగ్గకపోతే, ఆ నిర్దిష్టమైన భాగంలో నొప్పి నివారణ కోసం రేడియేషన్ ట్రీట్‌మెంట్ చేయాలి-డా. పద్మజ లోకిరెడ్డి, హెమటాలజిస్ట్
clevelandclinic ప్రకారం చికిత్సలు :
మూలకణ మార్పిడి : మూలకణాలు అనేవి ఎముక మజ్జ లేదా రక్తంలో ఉండే ప్రత్యేక కణాలు. ఇవి ఆరోగ్యకరమైన కొత్త ప్లాస్మా కణాలను ఉత్పత్తి చేయడంలో సహాయపడతాయి. ఈ చికిత్స ద్వారా శరీరంలో దెబ్బతిన్న లేదా అనారోగ్యకరమైన మూల కణాల స్థానంలో ఆరోగ్యకరమైన కణాలతో భర్తీ చేస్తారు.
కీమోథెరపీ : కీమోథెరపీ మందులు అసాధారణ ప్లాస్మా కణాల సంఖ్యను తగ్గిస్తాయి. మూలకణాల మార్పిడి చేయించుకోవాలనుకుంటే, దానికి ముందు కచ్చితంగా కీమోథెరపీ చేయించుకోవాల్సి ఉంటుంది.
ఇమ్యునోథెరపీ : ఈ చికిత్స రోగనిరోధక వ్యవస్థ క్యాన్సర్‌తో పోరాడే కణాలను ఎక్కువగా అభివృద్ధి చేసుకోవడానికి సహాయపడుతుంది. కొత్త చికిత్సలను పరీక్షించే క్లినికల్ ట్రయల్స్‌లో CAR T-cell థెరపీ అనే ప్రత్యేక విధానం అద్భుతమైన ఫలితాలను ఇచ్చిందట.
స్టెరాయిడ్స్ : ఎక్కువ మోతాదులో స్టెరాయిడ్స్ ఇవ్వడం వల్ల క్యాన్సర్ కణాలను చంపవచ్చు, వాపును తగ్గించవచ్చు.
రేడియేషన్ థెరపీ : ఈ చికిత్స ద్వారా లక్షణాలకు కారణమవుతున్న ఎముకల కణితులను తగ్గించవచ్చు.
NOTE : ఇక్కడ మీకు అందించిన ఆరోగ్య సమాచారం, సూచనలు అన్నీ మీ అవగాహన కోసం మాత్రమే. శాస్త్ర పరిశోధనలు, అధ్యయనాలు, వైద్య, ఆరోగ్య నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. కానీ, వీటిని పాటించే ముందు కచ్చితంగా మీ వ్యక్తిగత వైద్యుల సలహాలు తీసుకోవడమే మంచిది.
నిద్రలేమి సమస్యతో బాధపడుతున్నారా? - "మ్యూజిక్ థెరపీ"తో పరిష్కారమట!

