"డయాబెటిస్" కంటి చూపును ప్రభావితం చేస్తుందా? - పరిశోధనలు ఏం చెప్తున్నాయి?
-మధుమేహంతో వచ్చే సమస్యలెన్నో - కళ్లను జాగ్రత్తగా చూసుకోవాలంటున్న నిపుణులు!

Published : July 11, 2026 at 3:41 PM IST
Early Signs of Diabetic Eye Disease: ప్రస్తుతం వయస్సుతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరిని ఇబ్బంది పెడుతున్న ఆరోగ్య సమస్యల్లో మధుమేహం ఒకటి. ఒకసారి దీని బారిన పడ్డామంటే.. నియంత్రణలో ఉంచుకోవటం తప్పించి, చేయగలిగిందేమీ లేదు. అయితే, ఇది అదుపులో లేకపోతే కళ్లను నిశ్శబ్దంగా దెబ్బతీస్తుందంటున్నారు నిపుణులు. రక్తంలో గ్లూకోజ్ స్థాయిలు రెటినాలోని చిన్న రక్తనాళాలను దెబ్బతీస్తాయని, ఇది డయాబెటిక్ రెటినోపతి, ఇతర దృష్టి సమస్యలకు దారితీస్తుందని హెచ్చరిస్తున్నారు. ఈ క్రమంలో డయాబెటిక్ రెటినోపతి బారిన పడినప్పుడు కొన్ని లక్షణాలు కనిపిస్తాయని సూచిస్తున్నారు. వాటిని ఎప్పుడూ నిర్లక్ష్యం చేయవద్దని సలహా ఇస్తున్నారు. మరి, అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం!
మసకబారిన దృష్టి : కొందరికి అకస్మాత్తుగా కంటి చూపు మసకబారడం లేదా చేసే పనిపై దృష్టి పెట్టలేకపోతుంటారు. ఇది కేవలం కంటి అలసట వల్ల మాత్రమే కాకపోవచ్చని నిపుణులు అంటున్నారు. రక్తంలో గ్లూకోజ్ స్థాయిలలో మార్పులు కంటిలోని లెన్స్ వాపుకు దారితీయవచ్చని చెబుతున్నారు. దీనివల్ల కంటి చూపు తగ్గిపోతుందని తెలియజేస్తున్నారు. అయితే, వివిధ కారణాల వల్ల అప్పుడప్పుడు దృష్టి మసకబారవచ్చట. కానీ, డయాబెటిస్ ఉన్న వారిలో దృష్టి మసకబారడం అనేది డయాబెటిక్ రెటినోపతి అభివృద్ధిని లేదా మాక్యులర్ ఎడెమా సమస్యను సూచించే లక్షణాలలో ఒకటని వివరిస్తున్నారు. రెటీనా రక్తనాళాల నుంచి ద్రవం లీక్ అవ్వడం వల్ల, కేంద్ర దృష్టికి బాధ్యత వహించే మాక్యులాలో ఎడెమా ఏర్పడి, తద్వారా దృష్టి లోపానికి దారితీయవచ్చని harvard.edu పేర్కొంది.
మీరు పీల్చే గాలి సురక్షితమైనా? - ఈ జాగ్రత్తలు పాటించాలంటున్న నిపుణులు!
ఫ్లోటర్ల్ లేదా నల్లటి మచ్చలు : దృష్టిలో తేలియాడే చిన్న, నల్లటి లేదా బూడిద రంగు చుక్కలు, దారాలు లేదా సాలీడు గూడు వంటి నిర్మాణాలను 'ఫ్లోటర్స్' అంటారు. అయితే, డయాబెటిక్ కంటి వ్యాధిలో ఇవి కనిపించవచ్చని mayoclinic పేర్కొంది. ఇక్కడ దెబ్బతిన్న రక్తనాళాల నుంచి కంటిలోకి ద్రవం లీక్ అవ్వడం లేదా రక్తస్రావం కావడం జరుగుతుందంటున్నారు. ఇవి 'విట్రస్ హెమరేజ్' ప్రారంభాన్ని సూచిస్తాయని పేర్కొంటున్నారు. ఈ సమస్యను నిర్లక్ష్యం చేయకుండా చికిత్స తీసుకోవాలని సూచిస్తున్నారు.
రాత్రివేళల్లో చూడటం కష్టమవ్వడం : రాత్రిపూట సరిగ్గా కనిపించకపోవడం లేదా చదివేటప్పుడు ఎక్కువ వెలుతురు అవసరం కావడం వంటివి ప్రారంభ రెటినా నష్టానికి సంకేతాలు కావచ్చని నిపుణులు చెబుతున్నారు. డయాబెటిస్ వల్ల రెటినా సామర్థ్యంపై ప్రభావం పడుతుందని అంటున్నారు. తద్వారా తక్కువ వెలుతురులో దేనినైనా గుర్తించడం కష్టమవుతుందని వివరిస్తున్నారు. ఇది ప్రారంభ డయాబెటిక్ రెటినోపతి లేదా శుక్లాలు రెండింటికీ సంకేతం కావొచ్చని తెలియజేస్తున్నారు.
మారే దృష్టి సామర్థ్యం : ఒకరోజు అన్ని వస్తువులు సృష్టంగా కనిపిస్తాయి. మరుసటి రోజుకి మళ్లీ దృష్టి మసకబారతుంది. ఈ సమస్య ఎక్కువగా రక్తంలో చక్కెర స్థాయిల హెచ్చతగ్గులతో ముడిపడి ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. ఇది కంటి లెన్స్ ఆకారంలో స్థిరత్వం లేకుండా చేస్తుందట. ఇది కంటి ఆరోగ్యానికి హానిచేయనిదిగా అనిపించినప్పుటికీ.. తరచుగా జరిగే మార్పులు కళ్లుపై ఒత్తిడిని కలిగిస్తాయంటున్నారు. ఇది రెటినాకు అంతర్గతంగా నష్టం జరుగుతుందని తెలియజేస్తున్నారు.
పాక్షిక దృష్టిలోపం లేదా బ్లైండ్ స్పాట్స్ : దృష్టిలో కొన్ని భాగాలు అకస్మాత్తుగా కనిపించకుండా పోయినా, చూపులో నల్లటి లేదా ఖాళీ ప్రాంతాలను గమనించినా.. రెటినాలోని కొన్ని ప్రాంతాలకు తగినంత రక్త సరఫరా అందడం లేదని నిపుణులు చెబుతున్నారు. దీనికి చికిత్స తీసుకోకపోతే శాశ్వత దృష్టి లోపానికి దారితీయవచ్చని అంటున్నారు. దృష్టిలో కొంత భాగాన్ని కమ్మేసిన చీకటి నీడ, ఒక తెరలాగా ఉంటుందని medlineplus పేర్కొంది.
NOTE : ఇక్కడ మీకు అందించిన ఆరోగ్య సమాచారం, సూచనలు అన్నీ మీ అవగాహన కోసం మాత్రమే. శాస్త్ర పరిశోధనలు, అధ్యయనాలు, వైద్య, ఆరోగ్య నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. వీటిని పాటించే ముందు కచ్చితంగా మీ వ్యక్తిగత వైద్యుల సలహాలు తీసుకోవడమే మంచిది.
ఈ పండ్లు కాలేయాన్ని "డిటాక్స్" చేస్తాయట! - అవేంటో తెలుసా?
టీ, కాఫీలను అతిగా తాగుతున్నారా? - ఈ విషయాలు తప్పక తెలుసుకోవాల్సిందేనట!

