ETV Bharat / health

"కడుపుబ్బరం, అజీర్తి"తో బాధపడుతున్నారా? - 'ఇవి' సహజసిద్ధంగా పనిచేస్తాయంటున్న నిపుణులు

జీర్ణ సమస్యల నియంత్రణకు ఇవి ట్రై చేస్తే బెటర్ అంటున్న నిపుణులు

digestive issues
digestive issues (Getty Images)
author img

By ETV Bharat Health Team

Published : March 11, 2026 at 5:03 PM IST

3 Min Read
Choose ETV Bharat

Struggling with digestive issues : మనం తీసుకునే ఆహారాన్ని జీర్ణం చేసే ముఖ్యమైన భాగం జీర్ణ వ్యవస్థ. ఇది ఆహారాన్ని విచ్ఛిన్నం చేసి వాటిలోని పోషకాలను శరీరానికి అందిస్తుంది. ఒక్క మాటలో చెప్పాలంటే శరీరంలోని అన్ని భాగాలు సరిగ్గా పనిచేయాలంటే జీర్ణక్రియ సాఫీగా జరగాలి. ఇది పాడైపోయిందంటే, అరుగుదల నుంచి బరువు పెరగడం వరకూ చాలా ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయి. ముఖ్యంగా, కడుపు ఉబ్బరం, గ్యాస్, మలబద్ధకం లేదా విరేచనాలు లాంటివి మన దైనందిన జీవితాన్ని అస్తవ్యస్తం చేస్తాయంటున్నారు నిపుణులు. ఈ క్రమంలో కొన్ని వంటింటి పదార్థాలతో జీర్ణ సమస్యలను సులభంగా తగ్గించుకోవచ్చని సూచిస్తున్నారు. మరి, అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం!

Buttermilk
మజ్జిగ (Getty Images)

కేఫీర్ లేదా మజ్జిగ : గట్ మైక్రోబయోమ్​ను పునరుద్ధరించడానికి కేఫీర్ లేదా మజ్జిగ ఉత్తమమైన పానీయాలని నిపుణులు చెబుతున్నారు. కెఫీర్ (ఒక రకమైన పులియబెట్టిన పానీయం), మజ్జిగలలో ప్రోబయోటిక్స్ పుష్కలంగా ఉంటాయి. ఇవి ముఖ్యంగా యాంటీ బయాటిక్స్ వాడిన తర్వాత లేదా జీర్ణ సమస్యలు తలెత్తినప్పుడు సూక్ష్మజీవుల సమతుల్యతను కాపాడటానికి సహాయపడతాయట. ఈ ప్రోబయోటిక్స్ ఇరిటబుల్ బవెల్ సిండ్రోమ్ లక్షణాలను తగ్గించి, జీర్ణక్రియను మెరుగుపరుస్తాయి.

Ginger tea
అల్లం టీ (Getty Images)

జీర్ణక్రియ మెరుగుపడటానికి అల్లం టీ : అల్లం టీ జీర్ణ సమస్యలను తగ్గించడంలో చాలా సమర్థవంతంగా పనిచేస్తుంది. ఇందులోని ఔషధ గుణాల కారణంగా శతాబ్దాలుగా వాడుకలో ఉంది. ఈ క్రమంలో నెమ్మదిగా సాగే జీర్ణక్రియ సమస్యతో బాధపడుతుంటే, అల్లం టీ తాగాలని డాక్టర్లు కూడా సిఫార్సు చేస్తుంటారు. ఇది కడుపులో యాసిడ్ స్థాయిని క్రమబద్దీకరించడం ద్వారా అజీర్ణం, అసిడిటీ నుంచి ఉపశమనం కలిగిస్తుందంటున్నారు నిపుణులు. అలాగే, గ్యాస్ట్రిక్ సమస్యలు, కడుపు ఉబ్బరం వంటి సమస్యలను తగ్గించడానికి అల్లం ఒక సహజ నివారణగా పనిచేస్తుందట. అలాగే, జీర్ణ ఎంజైములను ఉత్తేజితం చేసి, శరీరం ఆహారాన్ని మరింత సమర్థవంతంగా విచ్ఛిన్నం చేయడంలో సహాయపడుతుంది. అల్లం ఎగువ జీర్ణశయాంతర లక్షణాలను మెరుగుపరుస్తుందని National Library of Medicine అధ్యయనం పేర్కొంది.

మలబద్ధకానికి ప్రూనే జ్యూస్ (ఎండిన రేగు పండ్ల) : ప్రస్తుతం చాలామంది మలబద్ధకంతో బాధపడుతున్నారు. ఫైబర్ తక్కువ ఉండి, ప్రాసెస్ చేసిన ఆహారాలు, చక్కెర ఎక్కువగా ఉంటే జీవనశైలి అలవాట్లు ఈ సమస్యను మరింత పెంచుతాయంటున్నారు నిపుణులు. ఈ క్రమంలో ప్రూన్స్​లో 'సార్బిటాల్' అనే సహజ చక్కెర, పీచు పదార్థం పుష్కలంగా ఉండటం వల్ల మలబద్ధకం సమస్యను తగ్గిస్తుందట. అలాగే, జీర్ణవ్యవస్థను శుభ్రపరచడానికి, ప్రేగు కదలికలను క్రమబద్ధీకరించడానికి సహాయపడుతుందని చెబుతున్నారు.

నేలపై కూర్చొని తింటున్నారా! - లాభమా, నష్టమా? - ఈ విషయాలు తప్పక తెలుసుకోవాల్సిందే!

Mint tea
పుదీనా టీ (Getty Images)

కడుపు ఉబ్బరానికి పుదీనా టీ : చాలామంది ఎదుర్కొనే ప్రధాన సమస్య కడుపు ఉబ్బరం. దీనికి సహజ పరిష్కారంగా పుదీనా టీని నిపుణులు సూచిస్తున్నారు. ఈ క్రమంలో ఫుదీనాలో ఉండే మెంథాల్ జీర్ణవ్యవస్థ కండరాలను రిలాక్స్ చేయడంతో పాటు గ్యాస్​ను తగ్గిస్తుందట. పుదీనాలోని కీలకమైన నూనెలు కడుపు ఉబ్బరం, ఇరిటబుల్ బవెల్ సిండ్రోమ్ లక్షణాలను తగ్గిస్తాయని పలు అధ్యయనాల్లో తేలింది. స్వల్పకాలిక జీర్ణక్రియ సమస్యల నుంచి ఉపశమనం పొందడానికి పెప్పర్‌మింట్ టీ విస్తృతంగా ఉపయోగిస్తారని National Library of Medicine అధ్యయనం పేర్కొంది.

విరేచనాలకు కొబ్బరి నీళ్లు : విరేచనాలతో బాధపడేవారు కొబ్బరి నీళ్లు తాగవచ్చని నిపుణులు సూచిస్తున్నారు. విరేచనాల వల్ల శరీరంలో నీటి శాతం తగ్గి డీ హైడ్రేషన్​కు దారితీస్తుందని చెబుతున్నారు. కాబట్టి, శరీరాన్ని తిరిగి హైడ్రేట్ చేయడానికి కొబ్బరి నీళ్లు బాగా సహాయపడతాయట. పొటాషియం, సోడియం వంటి ఎలక్ట్రోలైట్లు పుష్కలంగా ఉండే కొబ్బరి నీళ్లు, శరీరంలో కోల్పోయిన తేమను పునరుద్ధరించడమే కాకుండా త్వరగా కోలుకోవడానికి తోడ్పడతాయి.

NOTE : ఇక్కడ మీకు అందించిన ఆరోగ్య సమాచారం, సూచనలు అన్నీ మీ అవగాహన కోసం మాత్రమే. శాస్త్ర పరిశోధనలు, అధ్యయనాలు, వైద్య, ఆరోగ్య నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. వీటిని పాటించే ముందు కచ్చితంగా మీ వ్యక్తిగత వైద్యుల సలహాలు తీసుకోవడమే మంచిది

మధ్య వయసులోనూ 'బ్రెయిన్ స్ట్రోక్' ముప్పు - ICMR అధ్యయనంలో షాకింగ్ విషయాలు!

"మేక రక్తం" తింటున్నారా? - ఆరోగ్యానికి మంచిదేనా? - నిపుణులు ఏమంటున్నారంటే!