"పేగు ఆరోగ్యానికి, డయాబెటిస్‌కు మధ్య కీలక సంబంధం!"
- "ఈటీవీ భారత్" ఇంటర్వ్యూలో ప్రముఖ గ్యాస్ట్రో ఎంటరాలజిస్ట్, ఎండోస్కోపీ నిపుణులు "డాక్టర్ రాకేశ్ కలపాల"

Published : April 30, 2026 at 3:06 PM IST
Dr Rakesh Kalapala Gut Health and Diabetes Link : మధుమేహం అనగానే.. స్వీట్లు, అన్నం, పిండి పదార్థాల వల్ల వస్తుందని చాలా మంది అనుకుంటారు. అధిక బరువు ఉన్నవారికి మాత్రమే షుగర్ వస్తుందని కూడా భావిస్తారు. కానీ, దీని వెనక అనేక కారణాలు దాగి ఉన్నాయంటున్నారు వైద్య నిపుణులు. మధుమేహానికి మన శరీరంలోని చిన్నపేగు మధ్య కీలక సంబంధం ఉందని ప్రముఖ గ్యాస్ట్రో ఎంటరాలజిస్ట్, ఎండోస్కోపీ నిపుణులు డాక్టర్ రాకేశ్ కలపాల చెబుతున్నారు. "ఈటీవీ భారత్"కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన పలు విషయాలు తెలిపారు. ఆ వివరాలు ఆయన మాటల్లోనే చూద్దాం.
మధుమేహం, పేగు ఆరోగ్యానికి మధ్య సంబంధం : చాలామంది మధుమేహం కేవలం క్లోమగ్రంథి లేదా ఇన్సులిన్ ఉత్పత్తిలో సమస్య వల్ల మాత్రమే వస్తుందని నమ్ముతారు. కానీ, జీర్ణ వ్యవస్థ కూడా ఒక ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. చిన్నపేగు GLP-1, GLP వంటి ఇంక్రిటిన్స్ అనే హార్మోన్లను విడుదల చేస్తుంది. ఆ హార్మోన్లు ఇన్సులిన్, రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడంలో సహాయపడతాయి. కానీ, చిన్నపేగు లోపలి పొర బలహీనపడటం లేదా దెబ్బతినడం వల్ల హానికరమైన విష పదార్థాలు రక్తంలోకి విడుదలవుతాయి. దీంతో హార్మోన్ల సమతుల్యత దెబ్బతినడం వల్ల ఇన్సులిన్ నిరోధకత ఏర్పడి మధుమేహానికి దారితీస్తుంది.
టైప్ 2 డయాబెటిస్‌లో గట్ మైక్రోబయోమ్ పాత్ర : గట్ మైక్రోబయోమ్ జీవక్రియ ఆరోగ్యంలో ప్రధాన పాత్ర పోషిస్తుంది. నిజానికి, పేగులో మంచి, చెడు అనే రెండు రకాల బ్యాక్టీరియా ఉంటుంది. మంచి కంటే చెడు బ్యాక్టీరియా ఎక్కువగా ఉన్నప్పుడు, అది జీవక్రియ సమస్యలకూ దారితీస్తుంది. ముఖ్యంగా, లాక్టోబాసిల్లస్, బైఫిడోబ్యాక్టీరియం వంటివి పేగు ఆరోగ్యాన్ని కాపాడటంలో సహాయపడతాయి. పేగులో ఈ మంచి బ్యాక్టీరియా సంఖ్య తగ్గిపోయినప్పుడు, చెడు బ్యాక్టీరియాలు రక్తంలోకి విడుదల చేసే విషపదార్థాల తీవ్రత పెరుగుతుంది. ఫలితంగా, హార్మోన్ల అసమతుల్యత, మధుమేహం, ఊబకాయం, ఇన్సులిన్ నిరోధకతతోపాటు ఎన్నో జీవక్రియ రుగ్మతలకు దారితీస్తుంది.
సన్నగా ఉండే వారిలో మధుమేహం ఎందుకు వస్తుంది : లావుగా ఉండే వారికే డయాబెటిస్ వస్తుందని మనదేశంలో చాలామంది అనుకుంటారు. కానీ, సన్నగా ఉండే వారిలో కూడా ఈ సమస్య కనిపిస్తుంది. ఇందుకు జీవనశైలి, ఆహారం అలవాట్లు, జన్యువులు సమస్యలు కారణం కావచ్చు. అంతేకాదు, బెల్లీ ఫ్యాట్, విసెరల్ ఫ్యాట్ కూడా ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా కారణమవుతాయి. ముఖ్యంగా అంతర్గత అవయవాల చుట్టూ ఉండే ఫ్యాట్ అత్యంత ప్రమాదకరమైనది. ఇది కాలేయం, క్లోమం, పేగులు అవయవాల చుట్టూ పేరుకుపోతుంది. ఈ కొవ్వు సైటోకిన్స్ అనే వాపును ప్రేరేపించే రసాయనాలను విడుదల చేస్తుంది. అలా శరీరంలో వాపు పెరుగుతుంది. ఆ వాపు హార్మోన్ల సమతుల్యతను దెబ్బతీయడం వల్ల శరీరంలో ఇన్సులిన్ నిరోధకత ఏర్పడి మధుమేహానికి దారితీస్తుంది.
పొట్ట భాగంలో కొవ్వు ఎక్కువ ఉండటానికి కారణాలు : మనలో చాలామంది సన్నగా ఉన్నప్పటికీ.. వారిలో విసెరల్ ఫ్యాట్ ఎక్కువగా ఉంటుంది. విసెరల్ ఫ్యాట్ ఎక్కువగా ఉండటం వల్ల సైటోకిన్స్ ఎక్కువగా ఉత్పత్తి అవుతాయి. ఫలితంగా, మధుమేహం బారిన పడతారు.
GERD, ఊబకాయం, మధుమేహం మధ్య సంబంధం : GERD అంటే - గ్యాస్ట్రో ఎసోఫాగియల్ రిఫ్లక్స్ డిసీజ్. సాధారణంగా ఆహార నాళం, కడుపు కలిసే చోట ఒక వాల్వ్ లాంటి కండరం ఉంటుంది. ఇది బలహీనపడటం లేదా సరిగ్గా పని చేయకపోయినప్పుడు మనం తిన్న ఆహార పదార్ధాలు లేదా కడుపులో ఎక్కువ మోతాదులో ఉత్పత్తి అయ్యే ఆమ్లాలు ఆహారనాళంలోకి రిఫ్లక్ట్ అవుతాయి. ఈ సమస్య ఒబెసిటీ ఉన్నవారిలో ఎక్కువగా ఉంటుంది.
ఒబెసిటీ, డయాబెటిక్ న్యూరోపతితో బాధపడుతున్నవారిలో.. కడుపులోని న్యూరాన్లపై ప్రభావం పడుతుంది. ఈ పరిస్థితిని గ్యాస్ట్రోపరేసిస్ అంటారు. సాధారణంగా ఆహారం కడుపులో నుంచి పేగుల్లోకి వెళ్లే ముందు సుమారు 30 నుంచి 90 నిమిషాల పాటు అక్కడే ఉంటుంది. గ్యాస్ట్రోపరేసిస్ వల్ల ఆహారం అనేది 4-5 గంటల పాటు కడుపులోనే ఉండిపోవచ్చు. దీనివల్ల రిఫ్లక్ట్స్, కడుపు ఉబ్బరం ఇబ్బంది పెట్టొచ్చు. మధుమేహానికి, GERD మధ్య సంబంధం ఉండటానికి ఇది ఒక కారణం.
GRED ఉంటే ఎలాంటి లక్షణాలు కనిపిస్తాయి : గుండె, ఛాతీలో నిత్యం మంటగా అనిపిస్తుంది. తేన్పులు ఎక్కువగా రావడం, పొట్ట ఉబ్బరంగా ఉండటం, ఆహార పదార్థాలను మింగడంలో ఇబ్బందిగా అనిపించడం వంటి లక్షణాలు కనిపిస్తాయి.
డయాబెటిస్ నయం చేయడానికి AIG హాస్పిటల్లో పరిశోధనలు : ఈ పరిశోధన ప్రస్తుతం 3వ, 4వ క్లినికల్ ట్రయల్స్‌లో ఉంది. ట్రయల్స్ పూర్తయి, వినియోగం లోకి వస్తే.. ఆ చికిత్స ద్వారా దాదాపు రెండేళ్ల వరకు HbA1c కంట్రోల్లో ఉంటుంది. ఆ తర్వాత మళ్లీ చికిత్స తీసుకోవచ్చు. దీనివల్ల షుగర్ కంట్రోల్ ఉండటంతోపాటు గట్ మైక్రోబయోమ్ ఆరోగ్యంగా ఉంటుంది.
ట్రెడిషనల్ ఫుడ్ తీసుకోవచ్చు : ప్రస్తుతం మధుమేహం కంట్రోల్లో ఉండటానికి మిల్లెట్స్‌ను ఎక్కువగా తీసుకుంటున్నారు. బియ్యం, గోధుమల్లో గ్లైసెమిక్ ఇండెక్స్ ఎక్కువగా ఉంటుంది. బరువు తగ్గాలి, డయాబెటిస్ కంట్రోల్లో ఉండాలంటే మిల్లెట్స్ తీసుకోవడం మంచిది. ఒకవేళ బియ్యం, గోధుమలతో తయారు చేసిన పదార్థాలు తింటే, తక్కువ మోతాదులో తీసుకోవాలి. అలాగే, జొన్నలు, రాగులతో తయారు చేసిన రొట్టెలు తీసుకోవడం మేలు. వీటితోపాటు ఫైబర్ ఎక్కువగా ఉండే కూరగాయలు తీసుకోవాలి.
GRED, ఒబెసిటీతో బాధపడుతున్న వారు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి :
- జంక్ ఫుడ్, ఫాస్ట్‌పుడ్, మసాలా, కారం, ఆయిల్ ఫుడ్ తగ్గించుకోవాలి.
- ఒకేసారి ఎక్కువ మోతాదులో ఆహారం తీసుకోవడం బదులు కొంచెం కొంచెం ఎక్కువసార్లు తీసుకోవాలి.
- భోజనం చేసిన వెంటనే పడుకోకుండా అరగంట సేపు కూర్చోవాలి.
- రాత్రిపూట భోజనం చేసిన తర్వాత 10 నిమిషాల పాటు వాకింగ్ చేయడం మంచిది.
NOTE : ఇక్కడ మీకు అందించిన ఆరోగ్య సమాచారం, సూచనలు అన్నీ మీ అవగాహన కోసం మాత్రమే. శాస్త్ర పరిశోధనలు, అధ్యయనాలు, వైద్య, ఆరోగ్య నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. వీటిని పాటించే ముందు కచ్చితంగా మీ వ్యక్తిగత వైద్యుల సలహాలు తీసుకోవడమే మంచిది.
"షుగర్" మందులతో సైడ్ ఎఫెక్ట్స్? - ప్రముఖ వైద్య నిపుణులు ఏమంటున్నారంటే!
నోటి ఆరోగ్యంపై "మధుమేహం" ఎఫెక్ట్! - ఈ సమస్యలకూ కారణమవుతుందట!

