ఇంట్లో పెంపుడు జంతువులు ఉన్నాయా? - ఈ వ్యాధుల గురించి తెలుసుకోవాల్సిందే!
జంతువుల నుంచి మనుషులకు సంక్రమించే వ్యాధులు - ముందస్తు జాగ్రత్తలు పాటించాలంటున్న నిపుణులు!

Published : July 6, 2026 at 3:13 PM IST
Invisible Journey of Zoonotic Diseases : పెంపుడు జంతువులు మన జీవితంలో భాగమై, కుటుంబ సభ్యుల్లా ఉంటున్నాయి. ఇవి మన ఒంటరితనాన్ని, మానసిక ఒత్తిడిని దూరం చేసి ఎనలేని సంతోషాన్ని ఇస్తున్నాయి. అయితే, పెంపుడు జంతువైనా, మన చుట్టూ ఉన్న జీవులైనా వాటి ద్వారా కొన్ని వ్యాధులు సంక్రమిస్తాయి. అలాంటి వ్యాధులను జూనోటిక్ వ్యాధులంటారు. అవి రాకుండా ముందస్తుగా జాగ్రత్తలు తీసుకోవడం చాలా అవసరమంటున్నారు నిపుణులు. ఈ క్రమంలో జులై 6న ప్రపంచ జూనోసిస్ దినోత్సవం నేపథ్యంలో ఆ వ్యాధులేంటో ఇప్పుడు తెలుసుకుందాం!
రకాలు : జూనోసిస్ వ్యాధులను వైరల్, బ్యాక్టీరియల్, పారాసైటిక్ అనే మూడు విధాలుగా చెబుతారు
వైరల్ : నిఫా, రేబిస్, ఎబోలా, స్వైన్ ఫ్లూ, బర్డ్ ఫ్లూ, మెదడువాపు, పాక్స్ (అమ్మవారు)
బ్యాక్టీరియల్ : క్షయ (TB), ఆంత్రాక్స్, సాల్మొనెల్లోసిస్, బ్రూసెల్లోసిస్, లెప్టోస్పైరోసిస్
పారాసైటిక్ : స్కేబీస్, తామర, అమీబియాసిస్, సార్కోసిస్టోసిస్, టీనియాసిస్
యువతలో వెరికోస్ వెయిన్స్ - ఈ జాగ్రత్తలు పాటించాలంటున్న నిపుణులు!

ప్రధానమైన వ్యాధుల్లో కొన్ని :
బర్డ్ ఫ్లూ : AVN ఇన్ఫ్లూయెంజా వైరస్ వల్ల బర్డ్ ఫ్లూ వస్తుంది. అడవి పక్షులు, కోళ్లు దీని బారిన పడవచ్చు. కోళ్లలో ఈ వ్యాధి బారినపడినప్పుడు చాలా వేగంగా మృత్యువాత పడతాయి. అయితే, వ్యాధిగ్రస్థ కోళ్లు, వాటి ఉత్పత్తులను తాకడం, సరిగా ఉడికించని చికెన్, గుడ్లు తినడం వల్ల కోళ్ల షెడ్లలో గాలి ద్వారా వైరస్ మనుషులకు వ్యాపించే అవకాశం ఉందంటున్నారు నిపుణులు. దగ్గు, జ్వరం, గొంతునొప్పి, విరేచనాలు, తెల్ల రక్త కణాలు, ప్లేట్లెట్లు తగ్గుదల, కంటి వాపు, కండరాల నొప్పులు వంటి లక్షణాలు కనిపిస్తాయట.

రేబిస్ : రాబ్డోవిరిడాక్ జాతికి చెందిన లీస్సా వైరస్ వల్ల రేబిస్ వస్తుంది. పందులు, కుక్కలు, పిల్లులు, కోతులు, గబ్బిలాలు, ఉడతలు, ఆవులు, గేదెలు, గొర్రెలు, మేకలు దీని బారిన పడవచ్చు. వ్యాధి ఉన్న జంతువు కరిచినప్పుడు వాటి లాలాజలం, కంటి స్రావాలు మనుషుల చర్మ గాయాలపై పడడం వల్ల ఈ వ్యాధి మనుషులకూ వ్యాపిస్తుందని నిపుణులు చెబుతున్నారు. అలాగే, సరిగా ఉడకబెట్టని వ్యాధిగ్రస్థ పశువుల మాంసం తిన్నా లేదా వాటి పాలు తాగినా వస్తుందని హెచ్చరిస్తున్నారు. మొదట కళ్ల వెంట నీరు కారడం, తలనొప్పి, జ్వరం, తర్వాత దశలో నీటిని చూడగానే భయం లాంటి లక్షణాలు కనిపిస్తాయి. చివరికి పక్షవాతం, కోమా, మరణం సంభవిస్తాయట.
జూనోటిక్ వ్యాధులు ప్రబలకుండా ముందస్తుగా పెంపుడు జంతువులు, పశువులకు క్రమం తప్పకుండా టీకాలు వేయించాలి. పౌల్ట్రీల్లో కచ్చితమైన బయో సెక్యూరిటీ జాగ్రత్తలు పాటించాలి. అలాగే, వ్యాధి సోకిన పశుపక్షాదులను వెంటనే మంద నుంచి వేరు చేయాలి. మనుషులు వ్యక్తిగత పరిశుభ్రత పాటించాలి. వేడి చేసిన పాలను, బాగా ఉడకబెట్టిన గుడ్లు, మాంసాన్ని తీసుకోవాలి. - డాక్టర్ ఆనంద్ కుమార్, ఎన్టీఆర్ పశువైద్య కళాశాల పశువైద్య సూక్ష్మ జీవశాస్త్ర విభాగాధిపతి

మెదడువాపు : ఈ వ్యాధి ఎక్కువగా పందులు, దోమలు ద్వారా వ్యాపిస్తుంది. ఎక్కువగా 2 నుంచి 15 ఏళ్ల పిల్లలకు సంక్రమిస్తుంది. అందుకే, పందులను నివాసాలకు దూరంగా ఉంచాలి.
క్షయ : ఇది మనుషులతో పాటు అన్ని రకాల మేకలు, గొర్రెలు, పశువులు, పందులకూ వస్తుంది. మైకో బ్యాక్టీరియం బోవిస్ వల్ల పశువుల్లో వచ్చే క్షయ వ్యాధి మనుషులకూ వ్యాపిస్తుందని నిపుణులు చెబుతున్నారు. వ్యాధి బారిన పడిన పశువుల పాలలో ఈ బ్యాక్టీరియా ఉంటుందంటున్నారు.
బ్రూసెల్లోసిస్ : ఈ వ్యాధి సోకిన పశువుల్లో గర్భస్రావం అవుతుంది. అప్పుడు పిండం, మాయలో వ్యాధికారక సూక్ష్మజీవులు పెద్ద సంఖ్యలో ఉంటాయని నిపుణులు చెబుతున్నారు. కాబట్టి, వాటిని దూరంగా లోతుగా గొయ్యితీసి పూడ్చి పెట్టాలని సూచిస్తున్నారు. పశు వైద్యులు, సిబ్బంది, రైతులు, కబేళాలలో పనిచేసే వారు, మాంసం వ్యాపారం చేసే వారికి సోకే అవకాశం ఎక్కువగా ఉంది. ఈ వ్యాధి సోకితే జ్వరం, చలి, చెమట, నీరసం, తలనొప్పి, వికారం లాంటి లక్షణాలు కనిపిస్తాయి.
పరిశోధన మూలాలు :
https://www.sciencedirect.com/science/article/pii/S2950248926000040
https://www.mdpi.com/2076-2607/8/9/1405
https://www.thelancet.com/journals/lansea/article/PIIS2772-3682(25)00072-1/fulltext
NOTE : ఇక్కడ మీకు అందించిన ఆరోగ్య సమాచారం, సూచనలు అన్నీ మీ అవగాహన కోసం మాత్రమే. శాస్త్ర పరిశోధనలు, అధ్యయనాలు, వైద్య, ఆరోగ్య నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. కానీ, వీటిని పాటించే ముందు కచ్చితంగా మీ వ్యక్తిగత వైద్యుల సలహాలు తీసుకోవడమే మంచిది.
బరువు తగ్గాలని డైటింగ్ చేస్తున్నారా? - ఈ విషయాలు తప్పక తెలుసుకోవాల్సిందే!
ప్రాణాంతక క్యాన్సర్ 'మైలోమా' - ఈ లక్షణాలు కనిపిస్తే జాగ్రత్త!

