బీపీకే కాదు, షుగర్ నియంత్రణకు ‘డ్యాష్’ డైట్! - కానీ, ఈ మార్పులు తప్పనిసరంటున్న నిపుణులు!
డయాబెటిస్ ఉన్నవారికి ‘డ్యాష్’ ఆహార పద్ధతి మంచిదేనా? - నిపుణులు ఏం చెబుతున్నారంటే!

Published : July 15, 2026 at 3:47 PM IST
|Updated : July 15, 2026 at 4:58 PM IST
DASH Diet to Prevent Diabetes Comorbidities : అధిక రక్తపోటును తగ్గించుకోవటానికి డైటరీ అప్రోచెస్ టు స్టాప్ హైపర్‌టెన్షన్ (డ్యాష్) ఆహార పద్ధతిని చాలా కాలంగా అనుసరిస్తున్నారు. ఇది మధుమేహుల్లో గ్లూకోజు మోతాదులు అదుపులో ఉంచుకోవడానికి తోడ్పడుతుందని పలు అధ్యయనాల్లో వెల్లడైంది. కాకపోతే డ్యాష్ పద్ధతిని స్వల్పంగా మార్చుకోవాలంటున్నారు నిపుణులు. ఈ క్రమంలో డ్యాష్ ఆహార పద్ధతి డయాబెటిస్ పేషెంట్స్‌కు మంచిదేనా? ఎలాంటి మార్పులు చేసుకోవాలి? లాంటి విషయాలు గురించి ఇప్పుడు తెలుసుకుందాం!
DASH డైట్ : డ్యాష్ అనేది సరళమైన ఆహార పద్ధతి. ఆరోగ్యకరమైన ఆహారం బీపీ నియంత్రణలో ఉంచుకునేందుకు సహాయపడుతుంది. ఈ క్రమంలో DASH డైట్ అధిక రక్తపోటు కోసం ఉత్తమ ఆహారంగా పేరు పొందింది. ఇందులో తాజా పండ్లు, కూరగాయలు కూడిన ధాన్యాలు, పప్పులు, గింజ పలుకులు, వెన్న తీసిన పాలు లాంటివి ఉంటాయి. ఒకవేళ మాంసాహారులకైతే చికెన్, చేపల వంటి వాటికి ప్రాధాన్యం ఇవ్వవచ్చు. ఇలాంటప్పుడు ఉప్పు పరిమితం చేసుకోవటం చాలా ముఖ్యం. ఈ క్రమంలో ఉప్పు రోజుకు 2,300 మి.గ్రా కన్నా మించనీయొద్దంటున్నారు నిపుణులు. 1500 మి.గ్రా మించకపోతే ఇంకా మంచిదట. అలాగే, మిఠాయిలు, చక్కెర, తీపి పానీయాలు, మాంసం లాంటి ఆహార ఉత్పత్తులు తగ్గించుకోవాలని సూచిస్తున్నారు.
ఈ డ్యాష్ పద్ధతి బీపీని తగ్గించటం ద్వారా గుండె ఆరోగ్యం మెరుగవటానికి తోడ్పడుతున్నట్టు చాలా అధ్యయనాలు పేర్కొంటున్నాయి. అయితే, డయాబెటిస్ గలవారిలో రక్తంలో గ్లూకోజ్ మోతాదుల మీద ఎలాంటి ప్రభావం చూపుతుందనేది సృష్టంగా తెలియరాలేదు. అందుకే, కొత్త అధ్యయనంలో దీనిపై దృష్టి సారించారు.
వర్షాకాలంలో వచ్చే వ్యాధులు - ఈ జాగ్రత్తలు పాటించాలంటున్న నిపుణులు!
కొద్దిగా మార్చి : బీపీని సమర్థంగా తగ్గిస్తున్నందున డ్యాష్ పద్ధతిని డయాబెటిస్, ఇతర సమస్యలు గల వారికీ తరచూ సూచిస్తుంటారు. అయితే, రక్తంలో గ్లూకోజ్ నియంత్రణ కోసం పరిశోధకులు డ్యాష్ పద్ధతిలో స్వల్పంగా మార్పులు చేశారు. చక్కెర పదార్థాలు, స్టార్చ్‌తో కూడిన బంగాళాదుంపల వంటి వాటిని మరింతగా తగ్గించారు. దీనికి డ్యాష్ 4D అని పేరు పెట్టారు.
- కొంతమంది డయాబెటిస్ పేషెంట్స్‌ను ఎంచుకొని ఐదు వారాల పాటు దీని ప్రభావాన్ని పరిశీలించారు. సాధారణ ఆహారం తీసుకున్న వారితో పోలిస్తే డ్యాష్ 4D పద్ధతిని పాటించిన వారిలో రక్తంలో గ్లూకోజ్ నిర్ణీత మోతాదుల్లో ఎక్కువ సేపు స్థిరంగా ఉన్నట్లు గమనించారు.
- డ్యాష్ పద్ధతి రక్తంలో గ్లూకోజ్ మోతాదులను గణనీయంగా మెరుగుపరుస్తున్నట్టు ఒక నియంత్రిత అధ్యయనంలో తేలటం ఇదే మొదటిసారని జాన్స్ హాప్కిన్స్ యూనివర్సిటీకి చెందిన డాక్టర్ ఎలిజబెత్ సెల్విన్ పేర్కొన్నారు.
ఎలాంటి ప్రయోజనాలు ఉన్నాయి : DASH డైట్ అనేది రక్తంలో చక్కెర స్థాయిలను అదుపులో ఉంచి, టైప్ 2 మధుమేహం రాకుండా నిరోధించడంలో, దాని తీవ్రతను తగ్గించడంలో అద్భుతంగా పనిచేస్తుంది. ఈ ఆహార విధానం రక్తంలో గ్లూకోజ్ స్థాయిలను సమతుల్యం చేయడమే కాకుండా, హిమోగ్లోబిన్ A1c (HbA1c)ని తగ్గిస్తుంది. ఇది శరీరంలో ఇన్సులిన్ హార్మోన్ సున్నితత్వాన్ని పెంచి, ఇన్సులిన్ నిరోధకతను తగ్గిస్తుంది. అలాగే, రక్తంలో లిపిడ్స్ జీవక్రియను క్రమబద్ధీకరిస్తూ, శరీర కణాల నష్టాన్ని, లోపలి వాపులను అడ్డుకుంటుందని నిపుణులు చెబుతున్నారు.
మధుమేహం ఉన్నవారిలో వచ్చే ఇతర ఆరోగ్య సమస్యలను నిర్వహించడంలో కూడా ఈ డైట్ ఎంతో మేలు చేస్తుందంటున్నారు నిపుణులు. ముఖ్యంగా, ఇది డయాబెటిక్ నెఫ్రోపతీ ప్రమాదాన్ని తగ్గించి, మూత్రపిండాల పనితీరు క్షీణించకుండా కాపాడుతుంది. దీనితో పాటు రక్తపోటును అదుపులో ఉంచడం, రక్తనాళాల సాగే గుణాన్ని మెరుగుపరచడం ద్వారా గుండె సంబంధిత జబ్బులు రాకుండా రక్షణ ఇస్తుంది.
పరిశోధన మూలాలు :
https://www.frontiersin.org/journals/nutrition/articles/10.3389/fnut.2025.1689467/full
https://www.nhlbi.nih.gov/health/dash-eating-plan
NOTE : ఇక్కడ మీకు అందించిన ఆరోగ్య సమాచారం, సూచనలు అన్నీ మీ అవగాహన కోసం మాత్రమే. శాస్త్ర పరిశోధనలు, అధ్యయనాలు, వైద్య, ఆరోగ్య నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. వీటిని పాటించే ముందు కచ్చితంగా మీ వ్యక్తిగత వైద్యుల సలహాలు తీసుకోవడమే మంచిది.
'బ్రెయిన్ ట్యూమర్' ప్రాణాంతకమేనా? - లక్షణాలు ఎలా ఉంటాయంటే!
"చెవిలో మోత" అధిక రక్తపోటుకు రిలేటివ్? - అధ్యయనాలు ఏం చెబుతున్నాయంటే!

