మీరు చేసే చిన్న తప్పులే మెదడును దెబ్బతీస్తాయట! - అవేంటో తెలుసా?
- బ్రెయిన్ హెల్త్‌ను దెబ్బతీసే అలవాట్లు ఇవే - ముందుగా గుర్తించి జాగ్రత్త పడాలని సూచన!

Published : May 2, 2026 at 2:04 PM IST
Habits that Damage your Brain : మన శరీరంలో అతి ముఖ్యమైన అవయవాల్లో మెదడు ఒకటి. ఇది మన ఆలోచనలు, మాటలు, భావోద్వేగాలను నియంత్రిస్తుంది. మనం చేసే ప్రతి కదలిక, తీసుకునే ప్రతి నిర్ణయం మెదడు ఇచ్చే ఆదేశాల వల్లే జరుగుతాయి. అంతటి ముఖ్యమైన బ్రెయిన్.. కొన్ని అలవాట్ల కారణంగా ఎవరికి వారే దెబ్బ తీసుకుంటున్నారని నిపుణులు చెబుతున్నారు. ఈ క్రమంలో మెదడును దెబ్బతీసే ఆ అలవాట్లు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం!
అల్పాహారం మానేయడం : అల్పాహారం మానేస్తే మెదడుకు అందాల్సిన గ్లూకోజ్ స్థాయిలు తగ్గి, దాని పనితీరు మందగిస్తుందంటున్నారు నిపుణులు. రాత్రంతా ఖాళీ కడుపుతో ఉన్న తర్వాత మెదడుకు తక్షణ శక్తి అవసరమవుతుందని చెబుతున్నారు. అది అందకపోతే జ్ఞాపక శక్తి తగ్గడం, ఏకాగ్రత లోపించడం, మెదడు మసకబారడం, చిరాకు, అలసటగా అనిపిస్తుందని పేర్కొంటున్నారు. నిరంతరం అల్పాహారం మానేయడం వల్ల వయసు పెరిగే కొద్దీ తెలివితేటలు, గ్రహణ శక్తి తగ్గే అవకాశం ఉందని National Library of Medicine పేర్కొంది.
ఆలస్యంగా నిద్రపోవడం : శరీరానికి, మెదడుకు ప్రతిరోజూ కనీసం 6–8 గంటల నిద్ర అవసరం. నిద్రలోనే మెదడు సమాచారాన్ని నిక్షిప్తం చేసుకుంటుందని నిపుణులు చెబుతున్నారు. ఈ క్రమంలో ఆలస్యంగా నిద్రపోవడం వల్ల మెదడు మొద్దుబారి, సరైన నిర్ణయాలు తీసుకోలేమని తెలియజేస్తున్నారు. అందుకే, త్వరగా పడుకోవడం వల్ల మెదడు ఆరోగ్యంగా ఉంటుందని వివరిస్తున్నారు. రాత్రి నిద్ర మెదడు పనితీరును, జ్ఞాపకశక్తిని మెరుగుపరచడంలో సహాయపడుతుందని mayoclinic పేర్కొంది.
సంతాన భాగ్యం లేదా? - ఈ జాగ్రత్తలు తీసుకుంటే "అమ్మ" కావొచ్చట!
చక్కెరను అధికంగా తీసుకోవడం : షుగర్ కంటెంట్ ఫుడ్స్ ఎంత ఎక్కువగా తీసుకుంటే.. మెదడుపై అంత ప్రభావం పడుతుందంటున్నారు నిపుణులు. రక్తంలో గ్లూకోజ్ హెచ్చుతగ్గులకు చక్కెర కారణమవుతుందని చెబుతున్నారు. దీనివల్ల వాపు, ఇన్సులిన్ నిరోధకతకు దారితీస్తుందట. మెదడులో తగినంత గ్లూకోజ్ లేకపోతే, మెదడు రసాయన సందేశవాహకాలైన న్యూరోట్రాన్స్‌మిటర్లు ఉత్పత్తి కావు, న్యూరాన్‌ల మధ్య సమాచార మార్పిడికి అంతరాయం కలుగుతుందని Harvard Medical School పేర్కొంది.
ధూమపానం : పొగాకు సంబంధిత ఉత్పత్తుల్లోని నికోటిన్.. మెదడుకు రక్త ప్రవాహాన్ని ప్రభావితం చేస్తుందంటున్నారు నిపుణులు. ఈ క్రమంలో సిగరెట్ తాగడం వల్ల మెదడు కుంచించుకుపోతుందని పలు పరిశోధనల్లో వెల్లడైంది. అది డిమెన్షియా, అల్జీమర్స్ వంటి బ్రెయిన్ సంబంధిత వ్యాధుల ప్రమాదాన్ని పెంచుతుందని పేర్కొంటున్నారు. ధూమపానం వల్ల మెదడు ఆరోగ్యం క్షీణిస్తుందని, హృదయ సంబంధ వ్యాధుల ప్రమాదాన్ని గణనీయంగా పెంచుతుందని American Heart Association పేర్కొంది.
అధిక స్క్రీన్ సమయం : ఈ రోజుల్లో ఎలక్ట్రానిక్ వస్తువుల వినియోగం విపరీతంగా పెరిగింది. పిల్లల నుంచి పెద్దల వరకు అందరూ దాదాపు గంటల తరబడి ఎలక్ట్రానిక్ పరికరాలతో గడుపుతున్నారు. ఈ అలవాటు కూడా మెదడు ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. కాబట్టి, వీలైనంత వరకు స్క్రీన్ టైమ్ తగ్గించుకోవాలని సూచిస్తున్నారు.
డీహైడ్రేషన్ : తగినంత నీరు తాగకపోవడం వల్ల మెదడు పనితీరు మందగిస్తుందంటున్నారు నిపుణులు. రోజంతా సరిపడా నీరు తాగడం వల్ల మెదడు, శరీరం రెండూ ఆరోగ్యంగా ఉంటాయని తెలియజేస్తున్నారు.
NOTE : ఇక్కడ మీకు అందించిన ఆరోగ్య సమాచారం, సూచనలు అన్నీ మీ అవగాహన కోసం మాత్రమే. శాస్త్ర పరిశోధనలు, అధ్యయనాలు, వైద్య, ఆరోగ్య నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. వీటిని పాటించే ముందు కచ్చితంగా మీ వ్యక్తిగత వైద్యుల సలహాలు తీసుకోవడమే మంచిది.

