ETV Bharat / health

షుగర్ పేషెంట్స్ 'సీతాఫలం' తినొచ్చా? - అధ్యయనాలు ఏం చెబుతున్నాయంటే!

-సీతాఫలంతో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు - గుండె పనితీరును మెరుగుపరుస్తుందని నిపుణుల వెల్లడి!

Custard Apple
Custard Apple (Getty Images)
author img

By ETV Bharat Health Team

Published : November 1, 2025 at 4:18 PM IST

3 Min Read
Choose ETV Bharat

Health Benefits of Custard Apple: ప్రకృతి ప్రసాదించే అద్భుతమైన పండ్లలో సీతాఫలం ఒకటి. ఆపిల్ రంగూ, మామిడి రుచీ లేని కొండ పండు ఇది. అయితే ఎంత తిన్నా తనివి తీరని ఈ పండు ఎన్నో అనారోగ్యాల్ని నయం చేస్తుందంటున్నారు నిపుణులు. సీతాఫలంలో ఉండే ఫైబర్, విటమిన్లు, ఖనిజాలు అనేవి రోగనిరోధక శక్తిని పెంచడంలో సహకరిస్తాయని చెబుతున్నారు. మరి డయాబెటిస్​తో ఇబ్బందిపడేవారు ఈ పండ్లను తినొచ్చా? అనే వివరాలు ఇప్పుడు చూద్దాం.

రోగనిరోధక శక్తి పెరుగుదల : సీతాఫలంలో ఎ, సి, బి6 వంటి విటమిన్లతో పాటు కాపర్, పొటాషియం, పీచు వంటి ఖనిజాలు కూడా పుష్కలంగా లభిస్తాయంటున్నారు నిపుణులు. ఇందులోని విటమిన్ సి అనేది రోగనిరోధక శక్తిని బలోపేతం చేసి, అనేక వ్యాధులను నివారించడంలో సహాయపడుతుందని The Pharma Innovation Journal ప్రచురించింది. అలాగే, ఇందులోని యాంటీ ఇన్​ఫ్లమేటరీ గుణాలు శరీరంపై ఏర్పడిన వాపును తగ్గించడంలో సహకరిస్తాయంటున్నారు నిపుణులు.

'గుండెకు' ముప్పు తెచ్చే అలవాట్లు ఇవే! - వీటికి దూరంగా ఉండాలంటున్న నిపుణులు

గుండె ఆరోగ్యానికి : సీతాఫలంలో అధిక మెగ్నీషియం కంటెంట్ మృదువైన గుండె కండరాలను సడలించి, స్ట్రోక్, గుండెపోటును నివారిస్తుందని Indian institute of food processing Technology అధ్యయనం పేర్కొంది. ఇందులోని ఫైబర్, నియాసిన్ శరీరంలో మంచి కొలెస్ట్రాల్‌ను పెంచుతూ చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించడంలో సహాయపడుతుందని నిపుణులు చెబుతున్నారు.

షుగర్ కంట్రోల్ : ఫైబర్ ఎక్కువగా ఉండటం వల్ల చక్కెర శోషణ నెమ్మదిగా జరుగుతుందంటున్నారు నిపుణులు. తద్వారా టైప్ 2 డయాబెటిస్ ప్రమాదాన్ని తగ్గించడంలో సహాయపడుతుందని చెబుతున్నారు. సీతాఫలంలో గ్లైసెమిక్ సూచిక తక్కువగా ఉంటుందని, ఈ పండులోని యాంటీ ఆక్సిడెంట్స్​ డయాబెటిక్ రోగులకు మేలు చేస్తుందని International Journal of Current Microbiology and Applied Sciences ప్రచురించింది. అయితే మరీ ఎక్కువ మొత్తంలో కాకుండా మితంగా, డాక్టర్ల సూచన మేరకు తినాలని చెబుతున్నారు.

గర్భిణులకు : గర్భం దాల్చిన మహిళల్లో వేవిళ్లు, మూడ్ స్వింగ్స్​, తిన్న ఆహారం జీర్ణం కాకపోవడం లాంటి సమస్యలు కామన్​. అయితే వీటిని సీతాఫలంతో చెక్ పెట్టొచ్చంటున్నారని నిపుణులు. ఇందులో కాపర్ ఎక్కువ మొత్తంలో లభిస్తుందని, దీంతో శరీరంలో హిమోగ్లోబిన్ స్థాయిలు పెరుగుతాయంటున్నారు. అంతేకాకుండా, పిండం అభివృద్ధిలో సహాయపడుతుందని తెలియజేస్తున్నారు. గర్భాధారణ సమయంలో సీతాఫలం తినడం వల్ల, పుట్టబోయే శిశువు మెదడు, నాడీ వ్యవస్థ, రోగనిరోధక శక్తి అభివృద్ధికి తోడ్పడుతుందని వివరిస్తున్నారు. ఈ క్రమంలో గర్భిణులకు కాపర్ తక్కువైతే పూర్తిగా నెలలు నిండకుండానే బిడ్డ పుట్టే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు. కాబట్టి, వీరు సీతాఫలం తినడం మంచిదని సూచిస్తున్నారు.

బరువు అదుపులో : సీతాఫలంలో కొవ్వులు, క్యాలరీలు చాలా తక్కువగా ఉంటాయి. అలాగే, ఇందులో అధిక మొత్తంలో ఉండే ఫైబర్ కడుపు నిండిన భావన కలిగేలా చేస్తుందంటున్నారు నిపుణులు. దీంతో ఎక్కువ సమయం ఆకలేయకుండా, చిరుతిండ్ల జోలికి పోకుండా జాగ్రత్తపడచ్చని చెబుతున్నారు. తద్వారా క్రమంగా బరువు తగ్గచ్చని సూచిస్తున్నారు. ఇందులో ఉండే విటమిన్ బి6 కడుపుబ్బరం, అజీర్తి, అల్సర్లు వంటి సమస్యల నుంచి విముక్తి కలిగిస్తుందని పేర్కొంటున్నారు.

పీసీఓఎస్ ఉన్నవారు : పీసీఓఎస్ ఉన్న వారిలో హార్మోన్ల అసమతుల్యత కారణంగా అలసట, నీరసం, మూడ్ స్వింగ్స్, చికాకు వంటివి సర్వసాధారణంగా ఉంటాయి. అయితే వీటన్నింటికీ ఐరన్ విరుగుడుగా పనిచేస్తుందని, సీతాఫలంలో అది ఎక్కువగా లభిస్తుందని అంటున్నారు నిపుణులు. కాబట్టి, పీసీఓఎస్ ఉన్న వారూ ఈ పండు తీసుకోవడం మంచిదని చెబుతున్నారు. అలాగే, ఇది సంతాన సాఫల్యతను సైతం పెంచుతుందని తెలియజేస్తున్నారు.

ఇవీ కూడా :

  • ఈ పండులో ఉండే కొన్ని సమ్మేళనాలు క్యాన్సర్లు రాకుండా రక్షిస్తాయి.
  • ఇందులో బి- కాంప్లెక్స్ అధికంగా ఉండటం వల్ల మెదడు ఆరోగ్యాన్ని మెరుగుపరచడం, ఒత్తిడి, ఆందోళన తగ్గించడంలో సహాయపడుతుంది.
  • ఈ పండులో విటమిన్ c, రైబోఫ్లేవిన్ ఎక్కువ మొత్తంలో ఉంటాయి. ఇవి ఫ్రీరాడికల్స్​తో పోరాడి కంటిచూపును మెరుగుపరచడంతో పాటు కంటి సమస్యల్ని నివారిస్తాయి.
  • సీతాఫలంలో అధికంగా ఉండే డైటరీ పీచు పదార్థం జీర్ణ వ్యవస్థను మెరుగుపరుస్తుంది.

అయితే సీతాఫలం ఆరోగ్యానికి అన్ని విధాలా మంచిది కదా అని ఎక్కువగా తినడం కూడా శ్రేయస్కరం కాదని నిపుణులు చెబుతున్నారు. అలాగే వివిధ రకాల అనారోగ్య సమస్యలు ఉన్నవారు ఈ పండు మోతాదు విషయంలో ఏవైనా సందేహాలు ఉంటే నిపుణుల్ని అడిగి తెలుసుకోవడం మంచిదంటున్నారు.

NOTE : ఇక్కడ మీకు అందించిన ఆరోగ్య సమాచారం, సూచనలు అన్నీ మీ అవగాహన కోసం మాత్రమే. శాస్త్ర పరిశోధనలు, అధ్యయనాలు, వైద్య, ఆరోగ్య నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. వీటిని పాటించే ముందు కచ్చితంగా మీ వ్యక్తిగత వైద్యుల సలహాలు తీసుకోవడమే మంచిది.

మీ పిల్లలు ఆటిజంతో బాధపడుతున్నారా? - ఈ జాగ్రత్తలు తీసుకుంటే మంచిదంటున్న నిపుణులు!

ఎముకలు బలహీనమవుతున్నాయా? - ఈ సలహాలు పాటిస్తే మంచిదంటున్న నిపుణులు!