'దగ్గు'ను ఇంట్లోనే తగ్గించుకోవచ్చా? - డాక్టర్ దగ్గరికి వెళ్లాలా?- అధ్యయనాలు ఏం చెబుతున్నాయంటే!
తడి, పొడి దగ్గు మధ్య తేడా? - డాక్టర్ దగ్గరికి ఎప్పుడు వెళ్లాలంటే?

Published : October 28, 2025 at 1:54 PM IST
Cough Treatment and Types : దగ్గు చాలా చికాకు పెడుతుంది. ఇది పగలు పనులు చేసుకోనీయదు, రాత్రి సరిగా నిద్ర పట్టనీయదు. దీంతో దగ్గును తగ్గించుకోవటానికి చాలామంది పుదీనా బిళ్లలు చప్పరించటం, లవంగాలు నోట్లో వేసుకోవటం వంటి ఎన్నెన్నో చిట్కాలు పాటిస్తుంటారు. మరి కొందరైతే, గూగుల్, యూట్యూబ్, సోషల్ మీడియాలో ఉపశమన మార్గాలనూ వెతుకుతుంటారు. అయితే వీటి కన్నా ముందు దగ్గు తడిదా? పొడిదా? అనేది గుర్తించాలంటున్నారు నిపుణులు. ఎందుకంటే, అన్ని దగ్గులూ ఒకటి కావని చెబుతున్నారు. మరి, ఎలా గుర్తించాలో ఇప్పుడు తెలుసుకుందాం!
తడి, పొడి దగ్గు రకాలు శరీరంలో ఏం జరుగుతుందో అనే దానికి సంబంధించిన ముఖ్యమైన సూచనలు ఇస్తుంటాయని నిపుణులు చెబుతున్నారు. దీన్ని ఇంట్లోనే తగ్గించుకోవచ్చా? డాక్టర్ దగ్గరికి వెళ్లాలా? అనేవీ తెలియజేస్తాయని అంటున్నారు. ఈ క్రమంలో తడి, పొడి దగ్గు మధ్య తేడా ఏంటీ? పొడి దగ్గులో కళ్లె పడదని, గొంతులో ఏదో దురద పెడుతున్నట్టు అనిపిస్తుంటుందని వివరిస్తున్నారు. అదే తడి దగ్గులోనైతే కళ్లె పడుతుందని తెలియజేస్తున్నారు.
కారణాలు వేర్వేరే : పొడి దగ్గు చాలా వరకూ గొంతులో దురద, వాపు మూలంగా వస్తుందని నిపుణులు చెబుతున్నారు. అదే తడి దగ్గు అయితే ఇన్ఫెక్షన్తో పుట్టుకొచ్చిన కళ్లె వంటి వాటిని శరీరం బయటకు తోసే ప్రయత్నం చేస్తోందని అంటున్నారు. వీటిని రకరకాల అంశాలు ప్రేరేపిస్తుంటాయని వివరిస్తున్నారు.
పొడి దగ్గు ప్రేరకాలు : పొడి దగ్గు అంటే శ్లేష్మం ఉత్పత్తి చేయని దగ్గు అని, అలెర్జీలు, ఉబ్బసం, యాసిడ్ రిఫ్లక్స్, బ్రోన్కైటిస్ సాధారణ కారకాలుగా ఉన్నాయని clevelandclinic పేర్కొంది.
తడి దగ్గు ప్రేరకాలు : బ్రాంకైటిస్, జలుబు, ఫ్లూ, సీవోపీడీ, కొవిడ్-19, న్యుమోనియా లాంటివి కారకాలుగా నిపుణులు చెబుతున్నారు. అయితే, కొన్ని దగ్గులు ఒకరకంగా మొదలై మరో రకంగానూ మారొచ్చని అంటున్నారు. ఎలాగంటే, జలుబు అనేది తడి దగ్గుతో మొదలవుతుందని, వైరస్‌తో పోరాడటానికి శరీరం ఎక్కువగా కళ్లెను ఉత్పత్తి చేస్తుందని చెబుతున్నారు. దీన్ని ఊపిరితిత్తులు దగ్గు రూపంలో బయటకు వెళ్లగొడుతుంటాయని, జలుబు లక్షణాలు తగ్గిన తర్వాత దగ్గు ఉండొచ్చని వివరిస్తున్నారు. కాకపోతే అదప్పుడు పొడిగా మారుతుందని పేర్కొంటున్నారు. ఈ సమస్య కొద్ది రోజులు, నెలల వరకూ వేధించొచ్చని తెలియజేస్తున్నారు. అలాగే, ఇన్ఫెక్షన్ తగ్గిన తర్వాత వాపు మూలంగానూ శ్వాస మార్గాలు చికాకుకు గురై పొడి దగ్గు రావొచ్చని సూచిస్తున్నారు.
మీ పేస్ట్‌లో 'ముప్పు' ఉందట! - కొనే ముందు ఇవి చూడటం తప్పనిసరంటున్న నిపుణులు!
ఏం చేయాలి? : దగ్గు ఏ రకమో తెలుసుకుంటే సరైన చికిత్సకు వీలుంటుందని నిపుణులు చెబుతున్నారు. తడి దగ్గు అనేది కళ్లె ద్వారా సూక్ష్మక్రిములను బయటకు నెట్టేస్తుందంటున్నారు. అదే పొడి దగ్గు అయితే శ్వాసమార్గాలకు ఉపశమనం అవసరమని వివరిస్తున్నారు. ఏ రకమైన దగ్గు అయినా తగ్గటానికి కొన్ని చిట్కాలు మేలు చేస్తాయని సూచిస్తున్నారు. ఇవి శ్వాసమార్గాల్లో చికాకు తగ్గటానికి, కశ్లె తేలికగా బయటకు రావటానికి తోడ్పడతాయని సలహా ఇస్తున్నారు.
- టీ, నిమ్మకాయ రసం కలిపిన గోరు వెచ్చటి నీరు తాగటం.
- గొంతులో చికాకు తగ్గటానికి చెంచాడు తేనె తీసుకోవచ్చు.
- కాస్త ఎక్కువ నీరు తాగటం, తగినంత విశ్రాంతి తీసుకోవటమూ మేలని medlineplus అధ్యయనం పేర్కొంది.
ఇలాంటి చిట్కాలేవీ పనిచేయకపోతే మందులు అవసరమవుతాయని నిపుణులు సూచిస్తున్నారు. పొడి దగ్గుకు, దగ్గును అణచిపెట్టే మందులు మేలు చేస్తాయని, ఇవి గొంతు, శ్వాసనాళం, ఊపిరితిత్తులను చికాకు పెట్టే దుమ్ము, సూక్ష్మక్రిములు వంటి వాటిని తొలగించటం ద్వారా ఉపశమనం కలిగిస్తాయని అంటున్నారు. తడి దగ్గుకైతే కళ్లె తేలికగా బయటకు వెళ్లగొట్టే సిరప్లు(ఎక్స్పెక్టోరేంట్) ఉపయోగపడతాయని చెబుతున్నారు. ఈ క్రమంలో దగ్గు మందులు పెద్ద పిల్లలకు, పెద్దవారికి మాత్రమేనని గుర్తించుకోవాలని పేర్కొంటున్నారు. సాధారణంగా నాలుగేళ్లలోపు పిల్లలకు దగ్గు, జలుబు మందులు ఇవ్వరని, ఒకవేళ పిల్లలు దగ్గుతో బాధపడుతుంటే వెంటనే డాక్టర్‌ను సంప్రదించి, సలహా తీసుకోవాలని సూచిస్తున్నారు.
డాక్టర్ దగ్గరికి ఎప్పుడు : ఇబ్బంది, చికాకు పెట్టినా కూడా దగ్గు ఒకరకంగా రక్షణ చర్యే అని నిపుణులు అంటున్నారు. అన్ని సమయాల్లోనూ దీన్ని అణచివేయటం సమంజసం కాదని, కొన్ని దగ్గులు క్షయ వంటి జబ్బులకు సంకేతం కావొచ్చని హెచ్చరిస్తున్నారు. తీవ్రమైన దగ్గును ఏకపక్షంగా గరిష్టంగా 3 వారాల పాటు ఉంటే దగ్గుగా సూచిస్తారని, చాలా మంది రోగులలో, ఇది ఎగువ శ్వాసకోశ ఇన్ఫెక్షన్లు (URTI), తీవ్రమైన బ్రోన్కైటిస్ లేదా బాక్టీరియల్ లేదా తరచుగా వైరల్ ఇన్ఫెక్షన్ల వల్ల కలిగే ట్రాకియో-బ్రోన్కైటిస్ వల్ల వస్తుందని National Library of Medicine అధ్యయనం పేర్కొంది. URTI-ప్రేరిత దగ్గు ఉన్న కొద్ది మంది రోగులు మాత్రమే వైద్య సహాయం అవసరమని సూచిస్తుంది.
- ఖంగుఖంగుమని మోగుతూ దగ్గుతున్నా
- దగ్గులో రక్తం, కళ్లె పడుతున్నా
- శ్వాస తీసుకోవటం కష్టమవుతున్నా, ఆయాసం వస్తున్నా
- మూడు వారాలు దాటినా దగ్గు తగ్గకపోయినా
- జ్వరం, ఛాతీనొప్పి వంటి ఇతర ఇబ్బందికర లక్షణాలు కనిపిస్తున్నా - వెంటనే సంబంధిత వైద్యులను సంప్రదించాలని నిపుణులు సూచిస్తున్నారు. దగ్గుకు కారణమేంటో తెలుసుకొని, తగు చికిత్స తీసుకోవాలని సలహా ఇస్తున్నారు.
NOTE : ఇక్కడ మీకు అందించిన ఆరోగ్య సమాచారం, సూచనలు అన్నీ మీ అవగాహన కోసం మాత్రమే. శాస్త్ర పరిశోధనలు, అధ్యయనాలు, వైద్య, ఆరోగ్య, మానసిక నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. వీటిని పాటించే ముందు కచ్చితంగా మీ వ్యక్తిగత వైద్యుల సలహాలు తీసుకోవడమే మంచిది.
"ఉప్పు" విషయంలో ఆ తప్పు చేయకండి! - మోతాదుకు మించి తీసుకుంటే ఏమవుతుందో తెలుసా?
హైబీపీతో బాధపడుతున్నారా? - ఈ నేచురల్ టిప్స్ పాటిస్తే మంచిదంటున్న నిపుణులు!

