బాల్యంలో పోషకాహారం లోపిస్తే ఏం జరుగుతుందో తెలుసా? - తీసుకోవాల్సిన జాగ్రత్తలివే!
చిల్డ్రన్ ఇన్ ఇండియా 2025 - పోషకాహార లోపం పిల్లలకు శాపంగా మారుతుందంటున్నారు నిపుణులు

Published : October 29, 2025 at 3:43 PM IST
Children in India 2025 Report : మొక్కకు నీరు పోసి సంరక్షిస్తేనే వృక్షంగా ఎదుగుతుంది. పంటకు నీటితో పాటు సరైన మోతాదులో ఎరువు వేస్తేనే మంచి దిగుబడి వస్తుంది. ఇది పిల్లలకూ కూడా వర్తిస్తుంది. పసిపిల్లలు ఆరోగ్యంగా ఉంటూ, ఎత్తుకు తగ్గ బరువు పెరగాలంటే పోషకాహారం తప్పనిసరి. ఎదిగే వయసులో పిల్లలు అనారోగ్యం బారిన పడకుండా ఉండాలంటే తల్లిదండ్రులు సమతుల ఆహారం అందించాలంటున్నారు నిపుణులు. కానీ, చాలామంది పేదరికం, నిరక్షరాస్యత, అవగాహన లేమి తదితర కారణాలతో పిల్లలకు పోషకాహారం ఇవ్వలేకపోతున్నారని వివరిస్తున్నారు. దీంతో చిన్నారులు వయసుకు తగ్గ ఎత్తు, బరువు ఉండటం లేదని తెలియజేస్తున్నారు. ఈ క్రమంలో పిల్లల ఎదుగుదలకు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం!
చిన్నారుల ఆరోగ్యాన్ని అత్యంత జాగ్రత్తగా చూసుకోవాలి. మొదటి ఆరేళ్లలోపు వారి శారీరక, మానసిక, సామాజిక ఎదుగుదలపై దృష్టిపెట్టాలంటున్నారు నిపుణులు. కానీ, పోషకాహారం లోపం వీరి పాలిట శాపంగా మారుతోందని చెబుతున్నారు. పిల్లల సమగ్ర ఎదుగుదలకు అవరోధంగా ఉన్న సవాళ్లు, తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరిస్తూ కేంద్ర గణాంకాలు, పథకాల అమలు శాఖ తాజాగా ' చిల్డ్రన్ ఇన్ ఇండియా 2025' పేరుతో ఓ నివేదిక విడుదల చేసింది.
కాబోయే అమ్మకు 'ఈ పోషకాలు' అందాల్సిందేనట! - ఎందుకో తెలుసా?
కన్నీటి గుర్తులు : పోషకాహార లోపంతో పిల్లలకు విటమిన్లు, ప్రొటీన్లు, మినరల్స్ తగినంతగా అందట్లేదు. 35.5 శాతం పిల్లల్లో పెరుగుదల లోపాలున్నాయి. ఈ సమస్య అనేది గ్రామీణ ప్రాంతాల్లో 37.3 శాతం, పట్టణ ప్రాంతాల్లో 30.1 శాతం మందిలో ఉంటోంది. మేఘాలయ రాష్ట్రంలో అత్యధికంగా 46.5 శాతం పిల్లలు ఈ లోపంలో బాధపడుతున్నారని ఈ నివేదికలో పేర్కొంది.
- ఎత్తుకు తగ్గ బరువు లేని పిల్లలు దేశవ్యాప్తంగా 19.3 శాతం ఉన్నారు. ఈ తీవ్రత మహారాష్ట్రలో ఎక్కువగా ఉంది.
- 10-14 ఏళ్లలోపు పిల్లల్లో డి విటమిన్ లోపం 23.9 శాతం, జింక్ లోపం 31.7 శాతం మందిలో ఉంది. 10-19 ఏళ్ల పిల్లల్లో మధుమేహానికి ప్రీ డయాబెటిక్ 10.4 శాతం ఉండగా, ఇప్పటికే డయాబెటిస్ ఉన్నవారు 0.6 శాతం మంది ఉన్నారు. రక్తంలో అధిక కొవ్వు 3.7 శాతం మందికి, రక్తపోటు 4.9 శాతం మందికి ఉంటోంది.
తల్లిపాలే పరమౌషధం : పిల్లల సమగ్ర ఎదుగుదలకు తల్లిపాలే పరమౌషధం. పుట్టిన 1 గంటలోపు తల్లిపాలు ఇవ్వడం ప్రారంభిస్తే, నవజాత శిశువుకు ఇన్ఫెక్షన్లు రాకుండా కాపాడుతుందని, నవజాత శిశువుల మరణాలను తగ్గిస్తుందని World Health Organization అధ్యయనం పేర్కొంది. పిల్లలకు 6 నెలలు ప్రత్యేకంగా తల్లిపాలు ఇవ్వడం వల్ల శిశువు, తల్లికి అనేక ప్రయోజనాలు ఉన్నాయని తెలిపింది. తర్వాత రెండేళ్ల వయసొచ్చేవరకు తగిన ఆహారం తినిపిస్తే పిల్లల్లో శక్తి, ప్రొటీన్లు, విటమిన్లు, మినరల్స్‌తో పాటు రోగనిరోధక శక్తి పెరుగుతుందని చిల్డ్రన్ ఇన్ ఇండియా 2025 నివేదిక చెప్పింది. తల్లిపాలే శిశువుకు తొలి వ్యాక్సిన్‌గా పనిచేస్తాయని పేర్కొంది.
అయోడైజ్డ్ ఉప్పుతో : అయోడిన్ ఉప్పు వాడితే పిల్లలకు సూక్ష్మపోషకాలు చేరడంతో పాటు, థైరాయిడ్ సమస్య తలెత్తదని నివేదిక తెలిపింది. ప్రత్యేకించి అయోడిన్ లోపాలున్న పిల్లలు అత్యధికంగా దేశంలో ఏపీలోనే 82.5 శాతం ఉన్నట్లు పేర్కొంది.
సూక్ష్మపోషకాలు అవసరం : పిల్లల శరీరానికి విటమిన్లు, మినరల్స్ అవసరం చాలా తక్కువ. అవి కూడా అందక ఆరోగ్య సమస్యలు, మరణాలు సంభవిస్తున్నాయి. తీసుకునే ఆహారంలో ఐరన్, విటమిన్ ఎ ఉండేలా చూసుకోవాలంటున్నారు నిపుణులు. ఇవి దృష్టిలోపం, అనీమియా నుంచి కాపాడతాయని చెబుతున్నారు.
టీకాలతో రక్ష : వ్యాధుల నుంచి చిన్నారులను సంరక్షించేందుకు టీకాలు వేయించడం తప్పనిసరి. కనీసంగా ఒక డోస్ బీసీజీ, మూడు డోస్‌ల డీపీటీ, 3 డోస్‌ల పోలియో, ఒక డోస్ మీజిల్స్ వ్యాక్సిన్లు తప్పనిసరని కేంద్రం సూచిస్తుంది.
NOTE : ఇక్కడ మీకు అందించిన ఆరోగ్య సమాచారం, సూచనలు అన్నీ మీ అవగాహన కోసం మాత్రమే. శాస్త్ర పరిశోధనలు, అధ్యయనాలు, వైద్య, ఆరోగ్య నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. వీటిని పాటించే ముందు కచ్చితంగా మీ వ్యక్తిగత వైద్యుల సలహాలు తీసుకోవడమే మంచిది.
'దగ్గు'ను ఇంట్లోనే తగ్గించుకోవచ్చా? - డాక్టర్ దగ్గరికి వెళ్లాలా?- అధ్యయనాలు ఏం చెబుతున్నాయంటే!
నడుస్తున్నప్పుడు కాళ్లలో నొప్పి? - అయితే మీలో 'ఆ సమస్య' ఉండొచ్చంటున్న వైద్యులు!

