ETV Bharat / health

నిద్రలో చెమటలు పడుతున్నాయా? - లైట్​ తీసుకుంటే డేంజర్​లో పడ్డట్లేనట!

రాత్రిపూట చెమటలతో ఎన్నో అనారోగ్య సమస్యలు - కొన్ని జాగ్రత్తలు సూచిస్తున్న ఎక్స్​పర్ట్స్​!

Sweat in Sleep
Sweat in Sleep (Getty Images)
author img

By ETV Bharat Health Team

Published : January 11, 2026 at 1:56 PM IST

3 Min Read
Choose ETV Bharat

Health issues Behind Sweat in Sleep: వ్యాయామం, పని ఎక్కువ చేసినా, వేడి ప్రదేశాల్లో ఉన్నా చెమటలు పట్టడం సర్వసాధారణం. కానీ, కొంతమందికి మాత్రం వాతావరణం చల్లగా ఉన్నప్పటికీ రాత్రుళ్లు నిద్రలో విపరీతంగా చెమటలు పడుతుంటాయి. ఇది చిన్న సమస్యే కదా అని చాలామంది ఈ విషయంలో నిర్లక్ష్యం చేస్తుంటారు. కానీ, ఒక్కోసారి ఇది వివిధ ఆరోగ్య సమస్యలకు సంకేతం కావచ్చని నిపుణులు హెచ్చరిస్తున్నారు. సమస్య తీవ్ర రూపం దాల్చకముందే మేల్కొని డాక్టర్లును సంప్రదించడం మేలని సూచిస్తున్నారు. ఈ క్రమంలో ఎలాంటి ఆరోగ్య సమస్యల కారణంగా నిద్రలో చెమటలు పడతాయో ఇప్పుడు తెలుసుకుందాం!

హైపర్‌ థైరాయిడిజం : థైరాయిడ్‌ గ్రంథి జీవక్రియలతో పాటు ఇతర శారీరక విధులు నిర్వర్తించడంలో సమర్థంగా పని చేస్తుందంటున్నారు నిపుణులు. అయితే, ఇది అత్యంత చురుగ్గా మారినప్పుడు హైపర్‌ థైరాయిడిజం బారిన పడతామని హెచ్చరిస్తున్నారు. ఫలితంగా, శరీరం వేడికి తట్టుకోలేక నిద్రలో చెమటలు పడుతుంటాయని తెలియజేస్తున్నారు. హైపర్​ థైరాయిడిజం కారణంగా నిద్రలో చెమటలు పడతాయని mayoclinic అధ్యయనం పేర్కొంది.

Sweat in Sleep
నిద్రలో చెమటలు పట్టడం (Getty Images)

ఒత్తిడి : కొంతమంది ఉన్నట్లుండి ఒక్కోసారి ఒత్తిడి, ఆందోళన చెందుతుంటారు. వీటి ప్రభావం మెదడు, శరీరంపై పడుతుందని నిపుణులు చెబుతున్నారు. నిద్రలో చెమటలు పట్టడానికి ఇదీ ఓ కారణం కావచ్చంటున్నారు.

మానసిక సమస్యలు : కొన్ని రకాల మానసిక సమస్యలు ఉన్నప్పుడు మనసులో ఒక రకమైన ఆందోళన మొదలవుతుందంటున్నారు నిపుణులు. ఇది నిద్రలో చెమటలు పట్టేలా చేస్తుందంటున్నారు.

చెవిలో అదే పనిగా 'మోత' మోగుతోందా? - ఇలా చేస్తే మంచిదంటున్న నిపుణులు!

మెనోపాజ్ : 40 దాటిన మహిళల్లో రాత్రుళ్లు నిద్రలో చెమటలు పడుతున్నాయంటే, వారు మెనోపాజ్‌కు చేరువవుతున్నారని సంకేతంగా భావించవచ్చని నిపుణులు చెబుతున్నారు.

menopause
మెనోపాజ్ (Getty Images)

కొన్ని రకాల మందులు : కొన్ని యాంటిడిప్రెసెంట్స్, డయాబెటిస్ మందులు, స్టెరాయిడ్స్, ఎసిటమైనోఫెన్, ఆస్పిరిన్, అధిక రక్తపోటు మందులు వాడడం వల్ల కూడా నిద్రలో చెమటలు పడతాయని clevelandclinic అధ్యయనం పేర్కొంది.

ఇవి కూడా : రాత్రుళ్లు చెమటలు రావడానికి టీబీ, హెచ్‌ఐవీ, లుకేమియా వంటి సమస్యలు కూడా కారణం కావొచ్చంటున్నారు నిపుణులు. ఎందుకంటే, ఈ వ్యాధులు ఉన్నప్పుడు ఉన్నట్టుండి శరీరంలో ఉష్ణోగ్రత పెరిగిపోతుందని, అది రాత్రిపూట​ చెమటకు దారి తీస్తుందని పేర్కొంటున్నారు.

ఈ జాగ్రత్తలు : రాత్రి పూట నిద్రలో చెమటలు పట్టడమనేది తరచూ తలెత్తినా, దీంతో అసౌకర్యంగా అనిపించినా ఆలస్యం చేయకుండా డాక్టర్​ను సంప్రదించాలంటున్నారు నిపుణులు. తద్వారా సమస్యేంటో తెలుసుకొని, తగిన చికిత్స తీసుకోవాలని చెబుతున్నారు. దీంతో పాటు కొన్ని జాగ్రత్తలు పాటించడం వల్ల కూడా ఈ సమస్య నుంచి ఉపశమనం పొందచ్చని సూచిస్తున్నారు.

  • మెనోపాజ్‌కు దగ్గరవుతున్న, మెనోపాజ్‌లో దశలో ఉన్న మహిళలు జీవనశైలి, ఆహారంలో పలు మార్పులు చేర్పులు చేసుకోవాలని.. మసాలా, కారం వంటి వాటికి దూరంగా ఉండాలని చెబుతున్నారు.
  • బరువును నియంత్రణలో ఉంచుకోవడం వల్ల కూడా రాత్రుళ్లు చెమట సమస్యను తగ్గించుకోవచ్చని అంటున్నారు. ఇందుకోసం డాక్టర్లు సలహా మేరకు పోషకాహారం తీసుకుంటూనే, వ్యాయామాలు చేయడం ముఖ్యమని సూచిస్తున్నారు.
Coffee
కాఫీ (Getty Images)
  • కెఫెన్‌ ఎక్కువగా ఉండేవి, మసాలాలు, చెడు కొవ్వులు ఎక్కువగా ఉండే ఆహార పదార్థాలు, చాక్లెట్ వంటి వాటిని ఎంత దూరం పెడితే అంత మంచిదని అంటున్నారు. పడుకునే ముందు ఆల్కహాల్, కెఫెన్, కారంగా ఉండే ఆహారాలను పరిమితం చేయండి, ఎందుకంటే అవి శరీర ఉష్ణోగ్రతను పెంచుతాయి, రాత్రి చెమటలకు దారితీస్తాయని sleepfoundation అధ్యయనం పేర్కొంది.
  • కొన్ని రకాల మందుల వల్ల ఈ సమస్య ఎదురవుతోందని గుర్తిస్తే, వాటికి ప్రత్యామ్నాయంగా ఇతర మందులేవైనా వాడచ్చేమో డాక్టర్​ను అడిగి సలహా తీసుకోవడం మేలని సలహా ఇస్తున్నారు.
  • మానసిక ఒత్తిళ్లు, ఆందోళనల్ని తగ్గించుకునేందుకు నచ్చిన పుస్తకం చదవడం, పనులు చేయడం, ఆహారంలో అవసరమైన మార్పులు చేసుకోవడం మంచిదంటున్నారు.

NOTE : ఇక్కడ మీకు అందించిన ఆరోగ్య సమాచారం, సూచనలు అన్నీ మీ అవగాహన కోసం మాత్రమే. శాస్త్ర పరిశోధనలు, అధ్యయనాలు, వైద్య, ఆరోగ్య నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. వీటిని పాటించే ముందు కచ్చితంగా మీ వ్యక్తిగత వైద్యుల సలహాలు తీసుకోవడమే మంచిది.

బరువు తగ్గాలని మందులు వాడుతున్నారా? - ప్రమాదం పొంచి ఉందంటున్న నిపుణులు!

చలికాలంలో ఆరోగ్యంగా ఉండాలా? - ఆహారం విషయంలో ఈ పొరపాట్లు వద్దంటున్న నిపుణులు!