ETV Bharat / health

రొమ్ము క్యాన్సర్ ముప్పును తగ్గించే సూపర్ ఫుడ్స్ - ఆహారంలో వీటిని చేర్చుకుంటే మేలంటున్న నిపుణులు!

డైట్​లో చిన్న మార్పులు చేసుకుంటే మంచిదంటున్న ఎక్స్​పర్ట్స్​!

రొమ్ము క్యాన్సర్
రొమ్ము క్యాన్సర్ (Getty Images)
author img

By ETV Bharat Health Team

Published : August 27, 2026 at 4:23 PM IST

5 Min Read
Choose ETV Bharat

Breast Cancer Fighting Foods : జెనెటిక్స్, జీవనశైలి, పర్యావరణ కారకాలతో పాటు రొమ్ము క్యాన్సర్ ప్రమాదాన్ని తగ్గించడంలో ఆహారం కీలక పాత్ర పోషిస్తుంది. కొన్ని రకాల ఆహారాలు శరీరానికి యాంటీ ఆక్సిడెంట్లు, ఫైబర్, ఆరోగ్యకరమైన కొవ్వులు, విటమిన్లు, ఖనిజాలు, యాంటీ ఇన్​ఫ్లమేటరీ సమ్మేళనాలను అందిస్తాయని పలు అధ్యయనాల్లో వెల్లడైంది. ఇవన్నీ కణాలు దెబ్బతినకుండా కాపాడటంలో హార్మోన్ల సమతుల్యతను నియంత్రించడంలో సహాయపడతాయని నిపుణులు చెబుతున్నారు. అదే సమయంలో, కొన్ని రకాల ఆహారాలు, పానీయాలు క్యాన్సర్​ ప్రమాదాన్ని పెంచుతాయంటున్నారు. కాబట్టి వాటిని వీలైనంత వరకు పరిమితం చేయాలని సూచిస్తున్నారు.

రొమ్ము క్యాన్సర్​ నివారణలో ఆహారం ముఖ్యమైన పాత్ర పోషిస్తుందని పలు అధ్యయనాల్లో తేలింది. పండ్లు, కూరగాయలు, ఫైబర్​ను తక్కువగా తీసుకునే మహిళలతో పోలిస్తే, ఎక్కువగా తీసుకునే వారిలో రొమ్ము క్యాన్సర్ వచ్చే ప్రమాదం తక్కువగా ఉన్నట్లు వెల్లడైంది. అదేవిధంగా, పూర్తిగా మొక్కల ఆధారిత ఆహారాలు ఎక్కువగా ఉండే జీవనశైలి, క్యాన్సర్ మళ్లీ తిరగబెట్టే ప్రమాదాన్ని తగ్గించడంతో పాటు మెరుగైన ఆరోగ్య ఫలితాలతో ముడిపడి ఉందని నిపుణులు చెబుతున్నారు.

ఆకుకూరలు : పాలకూర, కేల్, కొల్లార్డ్ గ్రీన్స్, స్వీస్​ చార్డ్​ వంటి ఆకుకూరల్లో బీటా - కెరోటిన్, లుటీన్ వంటి కెరోటినాయిడ్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి హానికరమైన ఫ్రీ రాడికల్స్​ను నిర్వీర్యం చేయడానికి యాంటీ ఆక్సిడెంట్లుగా పనిచేస్తాయి. వీటిలో ఫోలేట్ కూడా సమృద్ధిగా ఉంటుంది. ఇది DNA మరమ్మత్తుకు, కణాల పెరుగుదల నియంత్రణకు తోడ్పడుతుంది. సలాడ్​లు, సూప్​లు లేదా స్మూతీస్​లో ఆకుకూరలను చేర్చుకోవడం వల్ల రోజువారీ పోషకాలను పెంచుకోవచ్చు. అంతేకాదు, శరీర సహజ రక్షణ వ్యవస్థను బలోపేతం చేయవచ్చు.

క్రూసిఫెరస్ కూరగాయలు : బ్రోకలీ, క్యాలీఫ్లవర్, బ్రస్సెల్స్ మొలకలు, క్యాబేజీ వంటి కూరగాయలు గ్లూకోసినోలేట్లను అందిస్తాయంటున్నారు నిపుణులు. ఇవి ఐసోథియోసైనేట్లుగా విచ్ఛిన్నమవుతాయి. ఈ కూరగాయలలో ఫైబర్, విటమిన్ సి కూడా సమృద్ధిగా ఉంటాయి. ఇవి ఆరోగ్యకరమైన కణాలను రక్షించడానికి, అలాగే, రోగనిరోధక శక్తిని పెంచడానికి సహాయపడతాయి. వీటిని సలాడ్​లు లేదా కోల్​క్లాస్​లలో పచ్చిగా కూడా తినవచ్చు. అయితే, వీటిలోని పోషకాలు వృథా కాకుండా పూర్తిగా లభించాలంటే తేలికగా ఆవిరిపై ఉడికించడం ఉత్తమమైన మార్గం.

పీరియడ్స్ ముందు జ్వరంగా అనిపిస్తోందా? - ఈ జాగ్రత్తలు తీసుకోవాలని నిపుణుల సూచన!

అల్లియమ్ కూరగాయలు : వెల్లుల్లి, ఉల్లిపాయలు, లీక్స్, షాలోట్స్ వాటి ఘాటైన రుచి, ఔషధ గుణాలకు ప్రసిద్ధి చెందాయి. వీటిలో ఆర్గానోసల్ఫర్ సమ్మేళనాలు, ఫ్లేవనాయిడ్లు ఉంటాయి. ఇవి శరీరంలోని టాక్సిన్స్ తొలగించే ఎంజైమ్​లను పెంచుతాయి. అలాగే, DNA దెబ్బతినకుండా తగ్గించవచ్చు. ఈ సమ్మేళనాలలో యాంటీ ఇన్​ఫ్లమేటరీ గుణాలు క్యాన్సర్ నివారణ ఆహారంలో అల్లియమ్ కూరగాయలను ఒక ముఖ్యమైన భాగంగా మారుస్తాయని నిపుణులు చెబుతున్నారు. సలాడ్​లలో పచ్చి ఉల్లిపాయలను లేదా సూప్​లు, స్టైర్-ఫ్రైస్ వెల్లుల్లిని చేర్చుకోవడం వల్ల రుచితో పాటు ఆరోగ్య ప్రయోజనాలు కూడా లభిస్తాయని వివరిస్తున్నారు.

సిట్రస్ పండ్లు : నారింజ, నిమ్మకాయలు, దబ్బకాయలు వంటి సిట్రస్ పండ్లు విటమిన్ సి కి అద్భుతమైన వనరులు. ఇది కొల్లాజెన్ ఉత్పత్తికి, రోగనిరోధక ఆరోగ్యానికి తోడ్పడుతుంది. ఇవి హెస్పెరిడిన్, నారింగెనిన్ వంటి ఫ్లేవనాయిడ్లను కూడా అందిస్తాయి. ఇవి హార్మోన్ల కార్యకలాపాలను నియంత్రించడంలో, ఆక్సికరణ ఒత్తిడిని తగ్గించడంలో సహాయపడవచ్చు. ఒక గ్లాసు తాజా సిట్రస్ జ్యూస్ తాగడం లేదా వంటకాల్లో నిమ్మను చేర్చుకోవడం వల్ల రిఫ్రెషింగ్​గా ఉండటమే కాకుండా శరీరానికి రక్షణ కూడా లభిస్తుంది.

బెర్రీలు : బ్లూబెర్రీస్, స్ట్రాబెర్రీస్, రాస్ప్‌బెర్రీస్, బ్లాక్‌బెర్రీస్​లలో ఆంథోసైనిన్లు, ఎలాజిక్ యాసిడ్ పుష్కలంగా ఉంటాయి. ఇవి శక్తివంతమైన యాంటీఆక్సిడెంట్ గుణాలను కలిగి ఉండే సమ్మేళనాలు. ఇవి వాపును తగ్గించడానికి, DNA దెబ్బతినకుండా కాపాడటానికి, అసాధారణ కణాల పెరుగుదలను నెమ్మదింపజేయడానికి సహాయపడవచ్చు. బెర్రీలలో ఫైబర్ కూడా ఎక్కువగా ఉంటుందని, ఇది జీర్ణక్రియ ఆరోగ్యానికి తోడ్పడుతుంది. పోషకాలు నిండిన ఈ పండ్లను ఉదయం తినే ఓట్స్, పెరుగులో చేర్చుకోవచ్చు లేదా స్నాక్‌గా నేరుగా ఆస్వాదించవచ్చని సూచిస్తున్నారు.

యాపిల్స్, బేరిపండ్లు, రేగుపండ్లు : ఈ పండ్లలో పాలిఫెనాల్స్, ఫైబర్, విటమిన్ సి ఉంటాయంటున్నారు నిపుణులు. ఇవన్నీ కలిసి ఆక్సీకరణ ఒత్తిడిని తగ్గించడానికి, ఆరోగ్యకరమైన జీర్ణక్రియకు తోడ్పడతాయి. వీటి తొక్కలలో యాంటీఆక్సిడెంట్లు చాలా ఎక్కువగా ఉంటాయి. కాబట్టి వీటిని తొక్క తీయకుండా తినడం వల్ల గరిష్ఠ ప్రయోజనాలు లభిస్తాయి. ఈ పండ్లను క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల కొన్ని రకాల క్యాన్సర్ల ప్రమాదం తగ్గుతుందని పలు అధ్యయనాల్లో వెల్లడైంది. సహజమైన తీపి కోసం వీటిని తాజా పండ్లుగా తినవచ్చు లేదా బేక్ చేసి తీసుకోవచ్చు.

పులియబెట్టిన ఆహారాలు : పెరుగు, కెఫీర్, కిమ్చీ, సౌర్‌క్రాట్, మిసో వంటి వాటిలో ప్రోబయోటిక్స్ పుష్కలంగా ఉంటాయి. ఇవి శరీరానికి మేలు చేసే బ్యాక్టీరియాను సమతుల్యం చేయడం ద్వారా పేగు ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి. ఆరోగ్యకరమైన పేగు మైక్రోబయోమ్, బలమైన రోగనిరోధక శక్తి, హార్మోన్ల మెరుగైన జీవక్రియతో ముడిపడి ఉంటుంది. ఇది రొమ్ము క్యాన్సర్ ప్రమాదాన్ని తగ్గించడంలో సహాయపడవచ్చని నిపుణులు చెబుతున్నారు.

గింజధాన్యాలు, పప్పుధాన్యాలు : పప్పులు, శనగలు, రాజ్మా, చిక్కుళ్లలో ప్లాంట్ ప్రొటీన్, ఫైబర్, ఫోలేట్, మెగ్నీషియం వంటి సూక్ష్మపోషకాలు పుష్కలంగా ఉంటాయి. వీటిలో ఉండే అధిక పీచు పదార్థం జీర్ణక్రియ సజావుగా సాగడానికి తోడ్పడుతుంది. అలాగే, కొలెస్ట్రాల్‌ను తగ్గిస్తుంది. రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడంలో సహాయపడుతుందని నిపుణులు చెబుతున్నారు. ఇవన్నీ పరోక్షంగా క్యాన్సర్ నివారణకు మద్దతు ఇస్తాయని అంటున్నారు.

తృణధాన్యాలు : బ్రౌన్ రైస్, ఓట్స్, క్వినోవా, హోల్-వీట్ బ్రెడ్ వంటివి కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్లు, ఫైబర్ యాంటీ ఆక్సిడెంట్లకు మంచి వనరులు. తృణధాన్యాలు జీర్ణక్రియ ఆరోగ్యానికి తోడ్పడతాయి. రక్తంలో చక్కెర స్థాయిలను స్థిరంగా ఉంటాయి. దీర్ఘకాలిక వాపును తగ్గిస్తాయి. ఇవన్నీ క్యాన్సర్ ప్రమాదాన్ని తగ్గించే అంశాలతో ముడిపడి ఉందని నిపుణులు చెబుతున్నారు.

వైట్ రైస్ లేదా మైదా బ్రెడ్ వంటి రిఫైన్డ్ ధాన్యాలకు బదులుగా, తృణధాన్యాల ప్రత్యామ్నాయాలను ఎంచుకోవడం అనేది దీర్ఘకాలిక ఆరోగ్యం కోసం ఒక సులభమైన, ప్రభావవంతమైన ఆహార మార్పు. తృణధాన్యాలు, పండ్లు, కూరగాయలు, లీన్ ప్రొటీన్లు ఎక్కువగా ఉండే ఆహారం, రొమ్ము క్యాన్సర్ వచ్చే ప్రమాదాన్ని తగ్గించడంలో రక్షణగా నిలిచే అవకాశం ఉందని పలు అధ్యయనాల్లో తేలింది.

వీటికి దూరంగా : కొన్ని రకాల ఆహారాలు రక్షణను అందించినప్పటికీ, మరికొన్ని రకాల ఆహారాలు రొమ్ము క్యాన్సర్ ప్రమాదాన్ని పెంచుతాయంటున్నారు నిపుణులు. కాబట్టి వాటిని పరిమితం చేయాలని సూచిస్తున్నారు.

ఆల్కహాల్ : స్వల్ప పరిమాణంలో తీసుకున్నప్పటికీ ఇది క్యాన్సర్ ప్రమాదాన్ని గణనీయంగా పెంచుతుంది.

ఫాస్ట్ ఫుడ్స్ : వీటిలో అనారోగ్యకరమైన కొవ్వులు, రిఫైన్డ్ కార్బోహైడ్రేట్లు చాలా ఎక్కువగా ఉంటాయి.

వేపుళ్లు/ ఫ్రై చేసిన ఆహారాలు : వేయించిన ఆహారాలు ఎక్కువగా తీసుకోవడం వల్ల రొమ్ము క్యాన్సర్ వచ్చే అవకాశం ఎక్కువని పలు అధ్యయనాల్లో తేలింది. ప్రాసెస్ చేసిన మాంసం, బేకన్, సాసేజ్‌లు, డెలి మీట్స్ వంటి ప్రాసెస్ చేసిన మాంసాలు క్యాన్సర్ ప్రమాదాన్ని పెంచుతాయి.

అదనపు చక్కెరలు : మితిమీరిన చక్కెర వినియోగం శరీరంలో వాపును పెంచుతుంది. ట్యూమర్ పెరుగుదలను ప్రేరేపించవచ్చు. రిఫైన్డ్ కార్బోహైడ్రేట్లు, తెల్లటి బ్రెడ్, కేకులు, పేస్ట్రీలు వంటివి క్యాన్సర్ ప్రమాదం పెరగడానికి కారణమవుతాయి.

పరిశోధన మూలాలు :

https://pmc.ncbi.nlm.nih.gov/articles/PMC8292326/

https://pmc.ncbi.nlm.nih.gov/articles/PMC9750928/

https://pmc.ncbi.nlm.nih.gov/articles/PMC11854917/

NOTE : ఇక్కడ మీకు అందించిన ఆరోగ్య సమాచారం, సూచనలు అన్నీ మీ అవగాహన కోసం మాత్రమే. శాస్త్ర పరిశోధనలు, అధ్యయనాలు, వైద్య, ఆరోగ్య నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. కానీ, వీటిని పాటించే ముందు కచ్చితంగా మీ వ్యక్తిగత వైద్యుల సలహాలు తీసుకోవడమే మంచిది.

'థైరాయిడ్' సమస్యలున్నాయా? - ఇంట్లోనే ఇలాంటి సహజ చిట్కాలు పాటించండి!

'పరగడుపు అలవాట్లు' - వీటితో ఎంతో ప్రమాదం ఉందంటున్న నిపుణులు!