మహిళలకే కాదు - పురుషులకూ "బ్రెస్ట్ క్యాన్సర్" - కారణాలు, లక్షణాలు, చికిత్సలివే!
- అక్టోబర్ 1 నుంచి 31 వరకు 'బ్రెస్ట్ క్యాన్సర్ అవగాహన నెల' - పురుషుల్లో బ్రెస్ట్ క్యాన్సర్‌కు సంబంధించిన పూర్తి వివరాలు మీ కోసం!

Published : October 12, 2026 at 12:20 PM IST
Male Breast Cancer: 'బ్రెస్ట్ క్యాన్సర్' ఈ పేరు వినగానే చాలా మంది భయపడుతుంటారు. ఎందుకంటే ప్రపంచవ్యాప్తంగా కొన్ని లక్షల మంది దీని బారినపడుతున్నారు. అత్యంత ప్రమాదకరమైన క్యాన్సర్లలో మొదటి స్థానంలో ఉన్న ఇది వయసుతో సంబంధం లేకుండా అందరినీ పట్టిపీడిస్తోంది. అయితే బ్రెస్ట్ క్యాన్సర్ అనగానే మహిళలకే వస్తుందని అనుకుంటారు. కానీ ఇది నిజం కాదంటున్నారు నిపుణులు. ఈ క్యాన్సర్ కేవలం మహిళలకు మాత్రమే కాకుండా పురుషులకు కూడా వస్తుందని చెబుతున్నారు. అక్టోబర్ 1 నుంచి 31 వరకు 'బ్రెస్ట్ క్యాన్సర్ అవగాహన నెల' సందర్భంగా.. బ్రెస్ట్ క్యాన్సర్ పురుషులకు ఎలా వస్తుంది? కారణాలు ఏంటి? లక్షణాలు? తీసుకోవాల్సిన జాగ్రత్తలు? చికిత్సా విధానాలు? వంటి మరిన్ని వివరాలు ఈ స్టోరీలో చూద్దాం.
పురుషులలో బ్రెస్ట్ క్యాన్సర్ - రకాలు: రొమ్ము క్యాన్సర్ అనేది మహిళలకు మాత్రమే కాకుండా పురుషులకు కూడా వస్తుందని నిపుణులు చెబుతున్నారు. ఎందుకంటే రొమ్ము కణజాలం వారికి కూడా ఉంటుందని వివరిస్తున్నారు. ఇక రొమ్ము కణజాలంలో అసాధారణ కణాల ఎదుగుదల వల్ల పురుషులలో బ్రెస్ట్ క్యాన్సర్ వస్తుందని చెబుతున్నారు. యునైటెడ్ స్టేట్స్‌లో నిర్వహించిన సర్వే ప్రకారం ప్రతి 100 రొమ్ము క్యాన్సర్ కేసులలో 1 కేసు పురుషులకు సంబంధించినట్లు చెబుతున్నారు. ఏ వయసు పురుషులకైనా ఇది రావొచ్చని, ముఖ్యంగా ఎక్కువ వయసు కలిగిన వారికి వస్తుందంటున్నారు.
రకాలివే: పురుషులకు రెండు రకాల రొమ్ము క్యాన్సర్లు వచ్చే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. అవేంటంటే..
- ఇన్వాసివ్ డక్టల్ కార్సినోమా (IDC): రొమ్ము నాళాలలో క్యాన్సర్ కణాలు ఏర్పడి, అవి అక్కడితో ఆగకుండా రొమ్ము కణజాలంలోకి వ్యాపించి, సమీపంలోని శోషరస గ్రంథులకు లేదా శరీరంలోని ఇతర అవయవాలకు కూడా వ్యాపిస్తాయని.. దీనినే ఇన్వాసివ్ డక్టల్ కార్సినోమా (IDC) అంటారని చెబుతున్నారు. పురుషులలో వచ్చే రొమ్ము క్యాన్సర్లలో ఇది అత్యంత సాధారణమైనదట. ఎందుకంటే స్త్రీల రొమ్ముతో పోలిస్తే పురుషుల రొమ్ము చాలా చిన్నదిగా ఉంటుంది కాబట్టి, వారిలో వచ్చే రొమ్ము క్యాన్సర్లన్నీ సాపేక్షంగా చనుమొనకు దగ్గరగా మొదలవుతాయని, అందువల్ల అవి చనుమొనకు వ్యాపించే అవకాశం ఎక్కువగా ఉంటుందని వివరిస్తున్నారు.
- డక్టల్ కార్సినోమా ఇన్ సిటు (DCIS): దీనిని ఇంట్రాడక్టల్ కార్సినోమా లేదా నాన్-ఇన్వాసివ్ లేదా ప్రీ-ఇన్వాసివ్ రొమ్ము క్యాన్సర్‌గా పరిగణిస్తారని నిపుణులు చెబుతున్నారు. ఇందులో రొమ్ము నాళాల లోపల క్యాన్సర్ కణాలు ఏర్పడుతాయి, కానీ అవి రొమ్ము చుట్టుపక్కల కణజాలంలోకి గానీ లేదా బయటకు గానీ వ్యాపించలేవంటున్నారు. పురుషులలో రొమ్ము క్యాన్సర్ కేసులలో సుమారు 10 కేసులలో 1 DCIS ఉంటుందని.. దీనిని శస్త్రచికిత్సతో నయం చేయవచ్చని చెబుతున్నారు.
పురుషులలో రొమ్ము క్యాన్సర్‌కు కారణాలు(Causes): పురుషులలో బ్రెస్ట్ క్యాన్సర్‌కు కచ్చితమైన కారణం ఏంటనేది తెలియనప్పటికీ.. శరీరంలో ఈస్ట్రోజెన్ స్థాయిలు పెరగడం, కణాలలోని DNA జన్యువులలో జరిగే మార్పుల కారణంగా ఈ క్యాన్సర్ వచ్చే అవకాశమని అమెరికన్ క్యాన్సర్ సొసైటీ పేర్కొంది.
ప్రమాద కారకాలు(Risk Factors): పురుషులలో రొమ్ము క్యాన్సర్‌తో సహా చాలా క్యాన్సర్లకు వృద్ధాప్యం ఒక ప్రమాద కారకంగా నిపుణులు చెబుతున్నారు. వీటితో పాటు మరికొన్ని ఉన్నట్లు వివరిస్తున్నారు. అవేంటంటే..
- ఛాతీకి రేడియేషన్ థెరపీ చేయించుకున్న వారికి ఈ క్యాన్సర్ వచ్చే ముప్పు అధికమని నిపుణులు చెబుతున్నారు.
- BRCA1 లేదా BRCA2 జన్యువులలో లేదా రొమ్ము క్యాన్సర్ ప్రమాదాన్ని పెంచే ఇతర జన్యువులలో సంక్రమించిన మార్పుల వల్ల ఈ క్యాన్సర్ ముప్పు పెరుగుతుందని వివరిస్తున్నారు.
- ప్రొస్టేట్ క్యాన్సర్ చికిత్సకు లేదా ఈస్ట్రోజెన్ ఉన్న మందులు వాడటం వల్ల రిస్క్ పెరుగుతుందని తెలుపుతున్నారు.
- రక్తసంబంధీకులలో ఎవరికైనా బ్రెస్ట్ క్యాన్సర్ ఉంటే పురుషులకు వచ్చే అవకాశం ఎక్కువంటున్నారు.
- క్లైన్‌ఫెల్టర్ సిండ్రోమ్: ఇది పురుషులలో ఒకటి లేదా అంతకంటే ఎక్కువ అదనపు X క్రోమోజోములు ఉండటం వల్ల కలిగే జన్యుపరమైన రుగ్మతగా చెబుతున్నారు. ఈ సిండ్రోమ్ కారణంగా కూడా బ్రెస్ట్ క్యాన్సర్ ముప్పు పెరుగుతుందని వివరిస్తున్నారు.
- కాలేయ సిర్రోసిస్ వల్ల కూడా రొమ్ము క్యాన్సర్ వచ్చే ప్రమాదం పెరుగుతుందంటున్నారు.
- ఊబకాయం ఉన్న మగవారికి రొమ్ము క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉంటుందని వివరిస్తున్నారు.
పురుషులలో రొమ్ము క్యాన్సర్ లక్షణాలు:
- ఛాతీ భాగంలో గడ్డలు. అయితే ఇవి నొప్పిగా ఉండవు.
- ఛాతీపై ఉండే చర్మంలో మార్పులు ఉంటాయి. అంటే పొలుసులుగా లేదా చర్మం రంగు మారడం.
- చనుమొనలలో మార్పులు అంటే అది లోపలికి ముడుచుకుపోవడం లేదా అక్కడ చర్మం పొలుసులుగా మారడం.
- చనుమొనల నుంచి ఏదైనా ద్రవం లేదా రక్తం కారడం లాంటి లక్షణాలు కనిపిస్తే అలర్ట్ కావాల్సిందే అంటున్నారు.
నిర్ధారణ ఎలా: పైన చెప్పినట్లుగా లక్షణాలు కనిపించిన వారు డాక్టర్‌ను సంప్రదిస్తే వారు కొన్ని పరీక్షల ద్వారా ఈ క్యాన్సర్‌ను నిర్ధారిస్తారని నిపుణులు చెబుతున్నారు. ఆ పరీక్షలు ఏంటంటే..
- క్లినికల్ బ్రెస్ట్ ఎగ్జామ్‌తో పాటు ఫిజికల్ పరీక్ష
- బ్రెస్ట్ అల్ట్రాసౌండ్, మామోగ్రామ్ వంటి ఇమేజింగ్ పరీక్షలు
- బ్రెస్ట్ బయాప్సీ
క్యాన్సర్ ఉన్నట్లు తెలిస్తే ఈ పరీక్షలు:
- క్యాన్సర్ కణాలలో హార్మోన్ రిసెప్టర్లు, HER2 ప్రోటీన్‌ను తనిఖీ చేసేందుకు బయోమార్కర్ పరీక్షలు
- క్యాన్సర్ ఎముకలకు వ్యాపించిందో లేదో తెలుసుకునేందుకు బోన్ స్కాన్
- క్యాన్సర్ ఎంతవరకు వ్యాపించిందో నిర్ధారించడానికి PET స్కాన్ లేదా CT స్కాన్
- రొమ్ము క్యాన్సర్ ప్రమాదాన్ని పెంచే BRCA1 , BRCA2 జన్యువులలో మార్పులను గుర్తించేందుకు జన్యు పరీక్షలు
ప్రమాదాన్ని ఎలా తగ్గించాలి:
- కుటుంబంలో ఎవరికైనా బ్రెస్ట్ క్యాన్సర్ సంబంధిత జన్యు మార్పులు ఉంటే సంబంధిత వైద్యుల సలహాలు తీసుకోవాలని చెబుతున్నారు.
- ఛాతీ భాగంలోని చర్మం, చనుమొనలను ఎప్పటికప్పుడు పరిశీలించాని చెబుతున్నారు. ఆ ప్రదేశంలో ఏ చిన్న మార్పు కనిపించినా వెంటనే డాక్టర్లను సంప్రదించాలని సూచిస్తున్నారు.
చికిత్స: రొమ్ము క్యాన్సర్ వచ్చిన మహిళలకు చేసే చికిత్సనే పురుషులకు చేస్తారని, అయితే మగవారిలో రొమ్ము కణజాలం తక్కువగా ఉండటం వల్ల, క్యాన్సర్‌ను తొలగించడానికి లంపెక్టమీ కంటే మాస్టెక్టమీ చేసే అవకాశం ఎక్కువగా ఉంటుందని చెబుతున్నారు. అయితే క్యాన్సర్ పరిమాణం, వ్యక్తికి ఉన్న రొమ్ము కణజాలం పరిమాణం, ఇతర కారకాలపై ఆధారపడి, పురుషుల రొమ్ము క్యాన్సర్‌లకు లంపెక్టమీతో చికిత్స చేయవచ్చంటున్నారు. సర్జరీతో పాటు కీమోథెరపీ, రేడియేషన్ థెరపీ, హార్మోన్ థెరపీ, టార్గెటెడ్ థెరపీ వంటి పద్ధతులను కూడా పాటిస్తారని వివరిస్తున్నారు.
పరిశోధనా మూలాలు:
- https://www.cdc.gov/breast-cancer/about/men.html
- https://www.cancer.gov/types/breast/male-breast-cancer
- https://www.cancer.org/cancer/types/breast-cancer-in-men.html
NOTE : పురుషులలో బ్రెస్ట్ క్యాన్సర్‌కు సంబంధించి అందించిన ఆరోగ్య సమాచారం, సూచనలు అన్నీ మీ అవగాహన కోసం మాత్రమే. శాస్త్ర పరిశోధనలు, అధ్యయనాలు, వైద్య, ఆరోగ్య నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. వీటిని పాటించే ముందు కచ్చితంగా మీ వ్యక్తిగత వైద్యుల సలహాలు తీసుకోవడమే మంచిది.
రొమ్ము క్యాన్సర్ ముప్పును తగ్గించే సూపర్ ఫుడ్స్ - ఆహారంలో వీటిని చేర్చుకుంటే మేలంటున్న నిపుణులు!
మాంసాహారం, నిద్రలేమి, ఒబెసిటీ వల్ల మహిళల్లో బ్రెస్ట్ క్యాన్సర్ రిస్క్ ఎక్కువ : ICMR అధ్యయనం

