ETV Bharat / health

మీ గుండె ఆరోగ్యంగా ఉండాలా? - ఈ మార్పులు తప్పనిసరంటున్న నిపుణులు!

- జీవనశైలి, ఆహారపు అలవాట్లతోనే గుండె ఆరోగ్యంగా ఉంటుందని నిపుణుల సూచన!

Representational image
Representational image (Getty Images)
author img

By ETV Bharat Health Team

Published : July 16, 2026 at 1:48 PM IST

3 Min Read
Choose ETV Bharat

Lifestyle Changes to Prevent a Heart Attack : మనదేశంలో ఏటా 28 లక్షల మంది గుండె సమస్యలతో చనిపోతున్నారని తాజా లెక్కలు చెబుతున్నాయి. వీరిలో 62 శాతం మంది 40-69 ఏళ్ల మధ్య వయస్సు వారేనట. జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే(NFHS), నమూనా రిజిస్ట్రేషన్ వ్యవస్థ (SRS) ప్రకారం 2022-24 మధ్య సంభవించిన మరణాల్లో అసాంక్రమిక వ్యాధులతో చనిపోయిన వారు 60 శాతం మంది ఉంటే.. అందులో గుండె సమస్యలతో మృతిచెందిన వారు 32 శాతం మంది ఉన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో గుండె గతి తప్పకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉందంటున్నారు నిపుణులు. మరి, అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం!

నడక, డ్యాన్స్, వెయిట్​లిఫ్టింగ్ :

  • వారానికి మూడు నుంచి నాలుగు సార్లు ఒక నిమిషం జాగింగ్ చేసి, రెండు నిమిషాలు నడవడం కూడా మేలు చేస్తుందంటున్నారు నిపుణులు.
  • 20-30 నిమిషాల సైక్లింగ్ గుండె ఆరోగ్యాన్ని మెరుగు పరుస్తుందని పలు అధ్యయనాల్లో వెల్లడైంది.
  • ఈత వల్ల గుండె, ఊపిరితిత్తులు బాగా పని చేస్తాయని నిపుణులు చెబుతున్నారు. ఈత కొట్టడం వల్ల ఒత్తిడి ఉపశమనం కలుగుతుంది, అది హృదయ సంబంధ ప్రయోజనాలకు తోడవుతుందని harvard.edu పేర్కొంది.
  • వెయిట్​ లిఫ్టింగ్​తో కండరాల నిర్మాణం జరుగుతుందని తెలియజేస్తున్నారు. ఈ కండరాలు ఆక్సిజన్​ను మరింత సమర్థంగా ఉపయోగిస్తాయని చెబుతున్నారు. దీనివల్ల గుండెపై ఒత్తిడి తగ్గుతుందని వివరిస్తున్నారు.
  • జుంబా, సల్సా.. కనీసం ఇంట్లో డ్యాన్స్ చేయడం అయినా సరే, చెమటలు పట్టేంత వరుకు చేస్తే అది గుండెకు ప్రయోజనం చేకూరుస్తుందని పేర్కొంటున్నారు.
  • గుండె జబ్బుకు పెద్ద కారణాల్లో ఒకటైన ఒత్తిడిని యోగా తగ్గిస్తుందని చెబుతున్నారు. గుండెను బలంగా ఉంచుతుందని వివరిస్తున్నారు. వేగంగా నడవడం వంటి సాంప్రదాయ వ్యాయామాలతో సమానంగా యోగా కూడా గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గించడంలో సహాయపడగలదని harvard.edu పేర్కొంది.

'బ్రెయిన్ ట్యూమర్' ప్రాణాంతకమేనా? - లక్షణాలు ఎలా ఉంటాయంటే!

ఏం కావాలి, ఏది వద్దు? :

ఎంచుకోదగిన ఫ్యాట్స్ :

  • ఆలివ్ ఆయిల్, కెనోలా ఆయిల్, వెజిటబుల్, వేరుశనగ తదితర నూనెలు
  • ట్రాన్స్​ఫ్యాట్ లేని వనస్పతి ఆయిల్
  • బెనెకోల్ వంటి కొలెస్ట్రాల్​ను తగ్గించే వనస్పతి
  • నట్స్, మొలకలు, అవకాడో

తగ్గించుకోవాల్సిన ఫ్యాట్స్ :

  • వెన్న
  • బేకన్ ఫ్యాట్
  • క్రీమ్ సాస్
  • చాక్లెట్​లో లభించే కోకో వెన్న
  • కొబ్బరి, పత్తి గింజలు, తాటి గింజల నూనెలు

మితం-సమతులం అనేది మంచి ఆరోగ్యకరమైన ఆహారపు అలవాటు అంటున్నారు నిపుణులు. గుండె ఆరోగ్యం కోసం.. పండ్లు, కూరగాయలు, హోల్​గ్రేయిన్స్, చిక్కుళ్లకు ప్రాధాన్యమిస్తే మేలంటున్నారు. ఇవి ఫైబర్, యాంటీ ఆక్సిడెంట్లు, ఆరోగ్యకరమైన కొవ్వులను అందిస్తాయని పేర్కొంటున్నారు. స్పెయిన్, ఫ్రాన్స్, ఇటలీ, గ్రీస్, సిరియా, లెబనాన్ వంటి దేశాల్లో తక్కువ కొలెస్ట్రాల్ ఉండే మెడిటరేనియన్ డైట్​ను అనుసరిస్తుంటారట. ఈ క్రమంలో మెడిటరేనియన్ డైట్ పాటించే వారికి రక్తపోటు, కొలెస్ట్రాల్ స్థాయిలు, రక్తంలో గ్లూకోజ్ స్థాయిలు తక్కువగా ఉన్నాయని ucdavis.edu పేర్కొంది. దీనివల్ల గుండె ఆరోగ్యంగా ఉంటుందట.

గుండె ఆరోగ్యం కోసం సమతులాహారం తీసుకోవడం చాలా ముఖ్యం. ఆహారం రూపంలో తీసుకునే కేలరీలను శారీరక శ్రమతో బ్యాలెన్స్​ చేయాలి. మద్యం, ధూమపానానికి దూరంగా ఉండాలి. బరువునూ అదుపులో ఉంచుకోవాలి. ఆలివ్, సోయాబీన్ వంటి ఉష్ణమండలేతర నూనెలను వినియోగించాలి. సజ్జలు, జొన్నలు, కొర్రలు, రాగులు, ఉలవలు, సామలు వంటి హోల్ గ్రెయిన్స్ వాడకం మంచిది. ఉప్పును తక్కువగా తీసుకోవాలి- డాక్టర్ బి. శ్రీహరి

ఇవి తగ్గిద్దాం :

  • LDL కొలెస్ట్రాల్స్​ను పెంచే రెడ్​మీట్, వెన్న, జున్ను, ప్రాసెస్ చేసిన స్నాక్స్, వేయించిన ఆహారాల వినియోగాన్ని తగ్గించుకోవాలంటున్నారు నిపుణులు.
  • రక్తంలో గ్లూకోజ్ స్థాయిలను ఎక్కువ చేసే వైట్ బ్రెడ్, షుగర్ వంటి రిఫైన్డ్ గ్రెయిన్స్​కు దూరంగా ఉండాలని చెబుతున్నారు.
  • బీపీని నియంత్రించడానికి ఉప్పును, డయాబెటిస్, ఒబెసిటీ నివారించడానికి షుగర్​ను తగ్గించుకోవాలని సూచిస్తున్నారు.

NOTE : ఇక్కడ మీకు అందించిన ఆరోగ్య సమాచారం, సూచనలు అన్నీ మీ అవగాహన కోసం మాత్రమే. శాస్త్ర పరిశోధనలు, అధ్యయనాలు, వైద్య, ఆరోగ్య నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. వీటిని పాటించే ముందు కచ్చితంగా మీ వ్యక్తిగత వైద్యుల సలహాలు తీసుకోవడమే మంచిది.

బీపీకే కాదు, షుగర్‌ నియంత్రణకు ‘డ్యాష్’ డైట్! - కానీ, ఈ మార్పులు తప్పనిసరంటున్న నిపుణులు!

"అలర్ట్" శరీరం పంపే సంకేతాలను మీరు గుర్తిస్తున్నారా? - నిర్లక్ష్యం చేస్తే ప్రమాదమంటున్న నిపుణులు!