ETV Bharat / health

చక్కెర తినడం మానేస్తే ఏం జరుగుతుందో తెలుసా? - ఆశ్చర్యకరమైన ఫలితాలకు అవకాశం ఇచ్చినట్టే!

చక్కెరను వదిలేస్తే - మీ శరీరంలో జరిగే మార్పులు ఇవేనట!

No Sugar Diet
No Sugar Diet (Getty Images)
author img

By ETV Bharat Health Team

Published : November 10, 2025 at 2:45 PM IST

|

Updated : November 10, 2025 at 3:01 PM IST

5 Min Read
Choose ETV Bharat

Benefits of No Sugar Diet : ఆధునిక జీవనశైలిలో చక్కెర పరమశత్రువుగా మారింది. అనేక వ్యాధులకు అది ప్రధాన కారణమవుతోంది. అయితే, షుగర్ కంటెంట్​ను తీసుకోవడాన్ని తగ్గిస్తే, ఆశ్చర్యకరమైన ఫలితాలు వస్తాయంటున్నారు నిపుణులు. ఈ ప్రయోజనాల కోసం నెలలు, సంవత్సరాలు నిరీక్షించాల్సిన అవసరం లేదని చెబుతున్నారు. తీపికి కోత పెట్టిన కొద్దిరోజుల్లోనే అవి కనిపిస్తాయని వివరిస్తున్నారు. ఈ క్రమంలో చక్కెరను తీసుకోకపోవడం వల్ల ఎలాంటి ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం!

అధిక చక్కెర ఆరోగ్యానికి మంచిది కాదని తెలుసు. అయితే, ఏదో రూపంలో దాన్ని తీసుకుంటూనే ఉంటాం. దీనివల్ల ఒబెసిటీ, ఫ్యాటీ లివర్, టైప్ 2 డయాబెటిస్, గుండె జబ్బు, క్యాన్సర్ వంటి ప్రమాదాలు పొంచి ఉన్నాయంటున్నారు నిపుణులు. అధిక సుక్రోజ్ లేదా ఫ్రక్టోజ్ వినియోగం కాలేయం, అస్థిపంజర కండరాలలో ఇన్సులిన్ నిరోధకతను కలిగిస్తుందని sciencedirect ప్రచురించింది. షుగర్ కంటెంట్ తీసుకోవడాన్ని తగ్గించేస్తే అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని చెబుతున్నారు. అంతేకాదు, ఎక్కువ కాలం నిరీక్షించాల్సిన అవసరం లేకుండానే ఆశ్చర్యకరమైన ఫలితాలను పొందొచ్చని తెలియజేస్తున్నారు. అందులో, మూడ్ మెరుగుపడటం, చర్మ, దంత ఆరోగ్యం, విషయగ్రహణ సామర్థ్యం, క్రీడా సామర్థ్యం మెరుగుపడటం జరుగుతుందని వివరిస్తున్నారు.

No Sugar Diet
చక్కెర తినడం మానేస్తే (Getty Images)

అటు ప్రకృతి, ఇటు వికృతి : బ్రెడ్​లోని గ్లూకోజ్, పండ్లు, అనేక కూరగాయల్లో ఉండే ఫ్రక్టోజ్, పాలల్లోని ల్యాక్టోజ్ వంటి చక్కెరలు సహజ సిద్ధంగానే లభిస్తాయని నిపుణులు చెబుతున్నారు. అవి శక్తిని అందించడమే కాకుండా తీపిదనం, ఫ్లేవర్ వంటివి జోడిస్తాయంటున్నారు. తద్వారా ముఖ్యమైన విటమిన్లు, ఖనిజాలు, ఇతర పోషకాలు కలిగిన ఆహారాలను తినేలా మనల్ని ఆకర్షిస్తాయని తెలియజేస్తున్నారు. వాటిలోని చక్కెరలతో కలిగే నష్టాన్ని ఈ పోషకాలు తగ్గిస్తాయని వివరిస్తున్నారు. ఈ నేపథ్యంలో మామిడి పళ్లలో అత్యధిక స్థాయిలో సహజ సిద్ధ చక్కెరలు ఉంటాయని పేర్కొంటున్నారు. మధ్యస్థ పరిమాణం కలిగిన పండులోనే 20 గ్రాముల వరకూ ఉంటుందని వెల్లడిస్తున్నారు. అయితే, మామిడిలో ప్రొటీన్, కాల్షియం, ఐరన్, మెగ్నీషియం, పొటాషియం, సి విటమిన్, ఫైబర్ ఉంటాయని అంటున్నారు. దీనివల్ల చక్కెర పరిమాణం అకస్మాత్తుగా పెరిగే పరిస్థితి ఉండదని, శక్తి ఎక్కువకాలం సాగడానికి వీలవుతుందని సూచిస్తున్నారు.

ఎప్పుడూ టీ, కాఫీలనే తాగుతున్నారా? - ఈ "హెర్బల్ టీ" లు ట్రై చేస్తే కొలెస్ట్రాల్ తగ్గుతుందట!

No Sugar Diet
చక్కెర తినడం మానేస్తే (Getty Images)

కృత్రిమ చక్కెరలను ప్రాసెసింగ్, వంట లేదా తినేటప్పుడు ఆహారం లేదా పానీయాల్లోకి చేరుస్తారు. వీటిని యాడెడ్ షుగర్స్ అంటారు. అమెరికా ఎఫ్​డీఏ సూచనల ప్రకారం వీటిని రోజుకు 50 గ్రాములకు మించి తీసుకోకూడదని నిపుణులు చెబుతున్నారు. అయితే 260కి పైగా వివిధ రకాల చక్కెరలు మార్కెట్​లో అందుబాటులో ఉన్నాయని పలు అధ్యయనాల్లో వెల్లడైంది. ఆహారాన్ని నిల్వ చేయడానికి, టెక్స్​చర్​ను పెంచడానికి, తీపిని జోడించడానికి, రుచిని పెంచడానికి వీటిని వాడుతుంటారు. చాలావరకూ అనారోగ్యకరమైన అల్ట్రాప్రాసెస్డ్ ఆహారాల్లోనే వీటిని ఉపయోగిస్తుంటారు. ఇలాంటి యాడెడ్ షుగర్స్ కలిగిన ఆహారాల్లో, వాటి వల్ల తలెత్తే దుష్ప్రభావాలను తగ్గించే స్థాయిలో విటమిన్లు, ఖనిజాలు, పీచు ఉండవు.

  • యాడెడ్ షుగర్స్ అధికంగా ఉండే ఆహారాన్ని ఎక్కువగా తీసుకోవడం వల్ల క్రోన్స్ డిసీజ్, మల్టిపుల్ స్క్లెరోసిస్ వంటి ఆటోఇమ్యూన్ రుగ్మతలు, అధిక రక్తపోటు, దాదాపు పది రకాల క్యాన్సర్ల ముప్పు పొంచి ఉంటుంది. ప్రాథమికంగా, జోడించిన చక్కెరను ఎక్కువగా తీసుకుంటే, గుండె జబ్బుల ప్రమాదం అంత ఎక్కువగా ఉంటుందని Harvard Health Publishing అధ్యయనం పేర్కొంది.
  • చక్కెర 5 శాతం పెరిగినా, గుండె జబ్బు ముప్పు 6 శాతం, పక్షవాతం ముప్పు 10 శాతం పెరగొచ్చు.
  • ఇలాంటి హాని జరగడానికి ప్రధాన కారణం, శరీరంలోకి చేరిన చక్కెర వినియోగం కాకుంటే అది కొవ్వుగా నిల్వ ఉండటమే. ఇది ఒబెసిటీ, ఇన్సులిన్ నిరోధకతకు దారితీయవచ్చు. అంతిమంగా మధుమేహం తలెత్తవచ్చు. చక్కెర ఎక్కువగా తినడం వల్ల కాలేయంలో కొవ్వు అధికంగా చేరి, ఫ్యాటీ లివర్ వ్యాధికి దారితీయవచ్చు.
  • యాడెడ్ షుగర్లు, పేగుల్లో చెడు బ్యాక్టీరియాను పెంచి పోషిస్తాయి. ఇది దీర్ఘకాల ఇన్​ఫ్లమేషన్​కు దారితీయవచ్చు. ఆరోగ్యకరమైన సూక్ష్మజీవుల అసమతౌల్యానికి ఇది కారణం కావచ్చు.
  • రక్తంలో అధిక చక్కెర ఉంటే, అది లిపిడ్లు లేక కొల్లాజెన్​, ఎలాస్టిన్ వంటి ప్రొటీన్లతో బంధాన్ని ఏర్పరిచి చర్మ వార్ధక్యానికి కారణమవుతుంది. దీనివల్ల చర్మం ముడతలు పడటం, సాగే గుణాన్ని కోల్పోవడం వంటివి జరగొచ్చు.
  • మెదడును అతిగా ప్రేరేపించడం ద్వారా నిద్ర నాణ్యతను చక్కెర దెబ్బతీస్తుందంటున్నారు నిపుణులు. అందువల్ల నిద్రకు ఉపక్రమించడం కష్టమవుతుందని చెబుతున్నారు. బ్లడ్ షుగర్ క్రాషెస్​కు ఇది దారితీస్తుందని. దీనివల్ల మెలకువ రావడం, దాహం వేయడం, ఆకలి, బాత్​రూమ్​కు వెళ్లాల్సి రావడం వంటివి జరుగుతాయని తెలియజేస్తున్నారు.
Type 2 diabetes
టైప్ 2 డయాబెటిస్ (Getty Images)

చక్కెరను తగ్గిస్తే ఆరోగ్యంపై పడే ప్రభావం : యాడెడ్ షుగర్లపై స్వస్తి పలకడం లేదా తగ్గించడం వల్ల ఇలాంటి వ్యాధుల ముప్పు తగ్గడమే కాకుండా జీవన నాణ్యత మెరుగుపడుతుందని నిపుణులు పేర్కొంటున్నారు. చక్కెర్లను తగ్గించడం వల్ల ఏజీఈలు అనే హానికరమైన పదార్థం ఉత్పత్తి తగ్గుతుందని వివరిస్తున్నారు. వార్ధక్య ప్రక్రియను వేగవంతం చేయడం, అల్జీమర్స్ వ్యాధి వంటి దీర్ఘకాల సమస్యలతో ఈ పదార్థాలకు సంబంధం ఉందంటున్నారు. చక్కెర తీసుకోవడం తగ్గించడం వల్ల అధిక బరువు, ఊబకాయం, మధుమేహం వచ్చే ప్రమాదం తగ్గుతుందని World Health Organization అధ్యయనం పేర్కొంది. ఇది దంత క్షయాలను తగ్గించడంలో కూడా గణనీయమైన ప్రభావాన్ని చూపుతుందని తెలిపింది.

మెదడులో భావోద్వేగాలను నియంత్రించే రసాయనాలను చక్కెర అడ్డగిస్తుందని నిపుణులు చెబుతున్నారు. అందువల్ల తీపిని తగ్గిస్తే కుంగుబాటు ముప్పు తగ్గిపోతుందని తెలియజేస్తున్నారు. ఈ నేపథ్యంలో తీపిని తగ్గిస్తే, రక్తంలో చక్కెర స్థాయి స్థిరీకరణ చెంది, క్రీడాకారులు ఎక్కువసేపు అలసిపోకుండా రాణించగలుగుతారని వివరిస్తున్నారు. క్రోన్'స్ వ్యాధి, మల్టిపుల్ స్క్లెరోసిస్ వంటి ఆటో ఇమ్యూన్ వ్యాధులను నివారించడానికి లేదా చికిత్స చేయడానికి తక్కువ చక్కెర ఆహారం సహాయపడుతుందని National Institutes of Health అధ్యయనం పేర్కొంది.

No Sugar Diet
చక్కెర తినడం మానేస్తే (Getty Images)

తాత్కాలికంగా తగ్గించుకున్నా మేలే : చక్కెరను పూర్తిగా మానేసినా లేదా దీర్ఘకాలం పాటు తగ్గించుకున్నా ఆరోగ్యపరంగా ఎక్కువ ప్రయోజనాలు ఉంటాయని నిపుణులు చెబుతున్నారు. దీన్ని తాత్కాలికంగా తగ్గించుకున్నా మంచిదేనంటున్నారు. లివర్ స్టీటోసిస్ ఉన్న కౌమార ప్రాయ బాలలు 8 వారాల పాటు చక్కెరను తగ్గించినా వారి కాలేయ ఆరోగ్యం మెరుగుపడినట్లు ఒక అధ్యయనంలో తేలింది. అంతేకాకుండా, టైప్ 2 డయాబెటిస్ ముప్పు బాగా తగ్గిపోతుందంటున్నారు నిపుణులు. అంతేకాకుండా, ఏదైనా పరీక్షకు ముందు తీపి తక్కువగా ఉన్న ఆహారాన్ని తీసుకుంటే ఆలోచనల్లో సృష్టతకు వీలవుతుందని తెలియజేస్తున్నారు. ఈ క్రమంలో చక్కెర వల్ల ఏకాగ్రతకు భంగం కలుగుతుందని, మెదడులోని జ్ఞాపకశక్తికి సంబంధించిన గ్రాహకాలను అది అడ్డుకునే ముప్పు ఉందని పలు అధ్యయనాలు వెల్లడించాయి.

NOTE : ఇక్కడ మీకు అందించిన ఆరోగ్య సమాచారం, సూచనలు అన్నీ మీ అవగాహన కోసం మాత్రమే. శాస్త్ర పరిశోధనలు, అధ్యయనాలు, వైద్య, ఆరోగ్య నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. వీటిని పాటించే ముందు కచ్చితంగా మీ వ్యక్తిగత వైద్యుల సలహాలు తీసుకోవడమే మంచిది.

సైనసైటిస్​తో బాధపడుతున్నారా? - ఈ జాగ్రత్తలు తీసుకుంటే మంచిదంటున్న నిపుణులు!

చిన్న చిన్న వాటికే భయపడుతున్నారా? - ఈ సలహాలు పాటిస్తే ఫోబియా నుంచి బయటపడవచ్చట!

Last Updated : November 10, 2025 at 3:01 PM IST