శరీరంలో వచ్చే ఈ నొప్పులు క్యాన్సర్ సంకేతాలా? - నిర్లక్ష్యం చేస్తే ప్రమాదమంటున్న నిపుణులు!
కారణం లేకుండా వచ్చే దీర్ఘకాలిక నొప్పులా? - జాగ్రత్తగా ఉండాలంటున్న నిపుణులు!

Published : June 27, 2026 at 12:06 AM IST
Unusual Pain Signs of Cancer : నొప్పి అనేది కేవలం అలసట, తప్పుడు భంగిమల వల్ల వస్తుందని అనుకుంటే పొరపాటే! ఒక్కొసారి మన శరీరంలో వచ్చే చిన్న నొప్పులే భవిష్యత్తులో రాబోయే పెద్ద ముప్పుకు హెచ్చరిక సంకేతం కావొచ్చు. ముఖ్యంగా, ఎటువంటి కారణం లేకుండా వచ్చే దీర్ఘకాలిక నొప్పులు క్యాన్సర్ వంటి ప్రాణాంతక వ్యాధులకు దారితీయవచ్చని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ క్రమంలో శరీరంలో వివిధ భాగాలలో వచ్చే నొప్పులను ఎప్పుడు నిర్లక్ష్యం చేయవద్దో ఇప్పుడు తెలుసుకుందాం!
శరీరంలోని వివిధ భాగాలలో వచ్చే నొప్పులు కేవలం మానసిక ఒత్తిడి లేదా కూర్చునే విధానం సరిగ్గా లేకపోవడం వల్లే కాదు, క్యాన్సర్ వంటి తీవ్రమైన వ్యాధికి లక్షణం కూడా కావచ్చని నిపుణులు చెబుతున్నారు. ఈ నొప్పితో పాటు బరువు తగ్గడం, అలసట లేదా ఆకలి లేకపోవడం వంటి ప్రమాదకర సంకేతాలు కనిపిస్తే, వెంటనే వైద్యుడిని సంప్రదించాలంటున్నారు. ఎందుకంటే, శరీరం ఇచ్చే ఈ హెచ్చరికలు ఏదైనా తీవ్రమైన సమస్యకు సంకేతం కావచ్చని హెచ్చరిస్తున్నారు.
నడుము నొప్పి : నడుము నొప్పి అనేది దైనందిన జీవితంలో చాలా మంది ఎదుర్కొనే ఒక సాధారణ ఆరోగ్య సమస్య. ల్యాప్‌టాప్‌లపై పనిచేయడం లేదా తప్పుడు పద్ధతిలో కూర్చోవడం వల్ల 80% మంది తమ జీవితంలో ఏదో ఒక సమయంలో దీనిని అనుభవిస్తారు. కానీ, నడుము నొప్పి తీవ్రంగా, దీర్ఘకాలికంగా ఉండి, విశ్రాంతి తీసుకున్నా లేదా మందులు వాడినా తగ్గకపోతే, అది మరేదైనా కావచ్చంటున్నారు నిపుణులు. చాలా అరుదైన సందర్భాల్లో, నడుము నొప్పి అనేది ప్యాంక్రియాటిక్ (క్లోమగ్రంథి) క్యాన్సర్, రొమ్ము, ఊపిరితిత్తులు, ప్రొస్టేట్ లేదా కిడ్ని వ్యాధులకు లక్షణం కావచ్చని హెచ్చరిస్తున్నారు. ప్యాంక్రియాటిక్ క్యాన్సర్‌లో పొత్తికడుపు లేదా నడుము నొప్పి సర్వసాధారణమని American Cancer Society పేర్కొంది.
అధిక బరువుతో 19 రకాల క్యాన్సర్ల ముప్పు - తాజా పరిశోధనలో వెల్లడి!
కడుపు నొప్పి : గ్యాస్, కడుపు ఉబ్బరం, తిమ్మిరి వంటివి ఎక్కువగా టీ/కాఫీ తాగడం లేదా జంక్ ఫుడ్ తినడం వంటి సాధారణ కారణాల వల్ల రావచ్చని నిపుణులు చెబుతున్నారు. అయితే, పొట్ట సమస్యలు తగ్గకుండా కాలక్రమేణా పెరుగుతుంటే నిర్లక్ష్యం చేయవద్దంటున్నారు. ఎందుకంటే, అండాశయ క్యాన్సర్, పెద్దపేగు క్యాన్సర్, కాలేయ క్యాన్సర్ వంటి అనేక రకాల క్యాన్సర్లు దీర్ఘకాలిక పొత్తికడుపు లేదా పెల్విక్ నొప్పిని కలిగిస్తాయని పేర్కొంటున్నారు.
తల నొప్పులు : తలనొప్పి ఏదో సమయంలో అందరినీ వేధిస్తుంది. కానీ, సాధారణ మందులకు తగ్గని దీర్ఘకాలిక తలనొప్పులు ఒక హెచ్చరిక సంకేతం కావచ్చని నిపుణులు చెబుతున్నారు. బ్రెయిన్ ట్యూమర్లు ఒత్తిడితో కూడిన తలనొప్పిని కలిగిస్తాయంటున్నారు. ఇవి ఉదయం పూట లేదా పడుకున్నప్పుడు మరింత ఎక్కువగా ఉండవచ్చని తెలియజేస్తున్నారు. బ్రెయిన్ ట్యూమర్లు ఉన్నవారిలో ఉదయం పూట తలనొప్పి ఎక్కువగా ఉంటుందని mayoclinic పేర్కొంది.
ఎముకలు లేదా కీళ్ల నొప్పులు : మీకు కాలు లేదా భుజంలో నొప్పి ఉందా? ఇది ఎక్కువ దూరం నడవడం లేదా కండరాలు పట్టేయడం వల్ల రావచ్చని చాలామంది పొరపాటు పడుతుంటారు. కానీ, నొప్పి తగ్గకుండా, ముఖ్యంగా విశ్రాంతి తీసుకుంటున్నప్పుడు కూడా వస్తుంటే, అది తీవ్రమైన సమస్యకు సంకేతం కావచ్చని నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా, రాత్రివేళలో ఎక్కువగా ఎముక నొప్పి ఉంటే, అది ఆస్టియోసార్కోమా లేదా మెటాస్టాటిక్ క్యాన్సర్ సంకేతం కావచ్చని హెచ్చరిస్తున్నారు. ఈ క్రమంలో తగినంత విశ్రాంతి తీసుకున్న తర్వాత కూడా నొప్పి తగ్గకపోయినా, మందులు ఉపశమనం కలించకపోయినా కచ్చితంగా డాక్టర్‌ను సంప్రదించాలని సూచిస్తున్నారు. ఆస్టియోసార్కోమా చాలా తరచుగా చేతులు, కాళ్లులోని పొడవాటి ఎముకలను ప్రభావితం చేస్తుందని clevelandclinic పేర్కొంది.
ఛాతీ నొప్పి : ఛాతీ నొప్పి అనగానే ప్రజలు తరచుగా హార్ట్ ఎటాక్ గురించే ఆలోచిస్తారు. అది నిజమే, అయినప్పటికీ, గుండె పరీక్షలు చేసిన తర్వాత కూడా ఛాతీలో బిగుతు, బరువు లేదా మొండి నొప్పి కొనసాగితే, క్యాన్సర్ సహా ఇతర కారణాలను పరిశీలించాలని నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా, ఊపిరితిత్తుల క్యాన్సర్ ఛాతీలో అసౌకర్యాన్ని కలిగిస్తుందంటున్నారు. లంగ్ క్యాన్సర్ ఉన్నవారు దీర్ఘ శ్వాస తీసుకున్నప్పుడు, దగ్గినప్పుడు లేదా నవ్వినప్పుడు ఛాతీలో నొప్పి వస్తుందని American Cancer Society పేర్కొంది.
దీర్ఘకాలిక నొప్పిని ఎందుకు నిర్లక్ష్యం చేయకూడదు? : నొప్పి అనేది శరీరపు అలారం వ్యవస్థ. ఏ అలారం కూడా కారణం లేకుండా మోగదు. అలాగని, దీర్ఘకాలిక నొప్పి ఉన్నంత మాత్రాన మీకు క్యాన్సర్ ఉందని అర్థం కాదు. కానీ, మీ శరీరం మీకు ఏదో చెప్పడానికి ప్రయత్నిస్తోందట. అయితే, మీకు 2-3 వారాల కంటే ఎక్కువ కాలం నొప్పి ఉండి, అది మరింత తీవ్రమవుతూ లేదా నిద్రకు భంగం కలిగిస్తూ ఉంటే నిర్లక్ష్యం చేయవద్దంటున్నారు నిపుణులు. వీటితో పాటు అలసట, బరువు తగ్గడం లేదా ఆకలి మందగించడం వంటి ఇతర లక్షణాలు ఉంటే జాగ్రత్త పడాలని సూచిస్తున్నారు. మాటిమాటికీ పెయిన్ కిల్లర్స్ వేసుకోవద్దని, మీ శరీరం ఇచ్చే సంకేతాలను గమనించి, డాక్టర్‌ను సంప్రదించాలని సూచిస్తున్నారు.
NOTE : ఇక్కడ మీకు అందించిన సమాచారం, సూచనలు అన్నీ మీ అవగాహన కోసం మాత్రమే. శాస్త్ర పరిశోధనలు, అధ్యయనాలు, వైద్య, ఆరోగ్య నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. వీటిని పాటించే ముందు కచ్చితంగా మీ వ్యక్తిగత వైద్యుల సలహాలు తీసుకోవడమే మంచిది.
రోజువారీ డైట్‌లో 'యోగర్ట్' - ఈ ఉపయోగాలు తెలిస్తే అస్సలు వదలరు?
పగలు నిద్రమత్తు, రాత్రి నిద్రలేమి - ఇలాంటి వారు అప్రమత్తంగా ఉండాల్సిందే!

