రాత్రికి రాత్రే రక్తంలో గ్లూకోజు పెరుగుతోందా? - ప్రధాన కారణాలేమిటో తెలుసా?
హఠాత్ మధుమేహమా? - క్లోమగ్రంథి ఇబ్బందిలో పడిందనటానికి సంకేతం కావొచ్చు!

Published : December 2, 2025 at 2:47 PM IST
Diabetes that Appears Overnight : వయసుతో సంబంధం లేకుండా మధుమేహం వచ్చేస్తోంది. కొంతమందిలో ఊబకాయం, బరువు పెరగడం, అధిక ఒత్తిడి కారణంగా దీని బారిన పడుతుంటారు. కానీ, ఇలాంటి ముప్పు కారకాలేవీ లేకుండా ఉన్నట్టుండి, రాత్రికి రాత్రే రక్తంలో గ్లూకోజు మోతాదులు పెరిగిపోతుంది. ఇది క్లోమగ్రంథి (పాంక్రియాస్) ఇబ్బందిలో పడిందనటానికి సంకేతం కావొచ్చని తాజా అధ్యయనం చెబుతోంది. తక్షణం మేల్కోవటం మంచిదని పేర్కొంది. ఈ క్రమంలో పాంక్రియాస్ వల్ల మధుమేహం ఎందుకు పెరుగుతుందో ఇప్పుడు తెలుసుకుందాం!
క్లోమగ్రంథి వాపు వల్ల : సాధారణంగా టైప్2 డయాబెటిస్ క్రమంగా తలెత్తుతూ వస్తుంటుంది. సడన్ డయాబెటిస్ అలా కాదు. ఉన్నట్టుండి రక్తంలో గ్లూకోజు స్థాయి బాగా పెరుగుతాయి. దీనికి పాంక్రియాటైటిస్ (క్లోమం వాపు), దానిపై రోగనిరోధక వ్యవస్థ దాడి చేయటం లేదా అరుదే అయినా పాంక్రియాస్ క్యాన్సర్ వంటి తీవ్ర సమస్యలు కారణం కావొచ్చు. అక్యూట్ పాంక్రియాటైటిస్. అంటే ఉన్నట్టుండి క్లోమగ్రంథి వాపునకు గురైన ప్రతి ఐదుగురిలో ఒకరు ఆ తర్వాత మధుమేహం బారినపడుతున్నట్టు ఫ్రాంటియర్స్ ఇన్ ఫిజియాలజీ తాజాగా ప్రచురించింది. హఠాత్ మధుమేహానికీ క్లోమగ్రంథి ఆరోగ్యానికీ సంబంధం ఉంటున్నట్టు ఇది పేర్కొంది. క్లోమం వాపు, క్యాన్సర్ వంటి సమస్యలు గ్రంథి పనితీరును అస్తవ్యస్తం చేయటం మూలంగా గ్లూకోజు మోతాదుల నియంత్రణ గాడి తప్పుతుందంటున్నారు నిపుణులు.
శరీరంలో కనిపించే ఈ లక్షణాలను నిర్లక్ష్యం చేస్తున్నారా? - ముప్పు తప్పదంటున్న నిపుణులు!
ఎందుకిలా? : క్లోమగ్రంధి మనం తిన్న ఆహారంలోని కొవ్వు పదార్థాలను జీర్ణం చేయడంతో పాటు కీలకమైన ఇన్సులిన్ హార్మొన్‌ను స్రవించడంతో శరీరంలో గ్లూకోజ్ స్థాయిని సమతుల్యంలో ఉంచుతుందంటున్నారు నిపుణులు. ఏదైనా కారణంతో క్లోమగ్రంధిలో అడ్డంకులు ఎదురయినపుడు క్లోమరసం బయటకు రాకుండా లోపలే నిలిచిపోతుందని చెబుతున్నారు. ఇలాంటప్పుడు వాపు మొదలవుతుందని పేర్కొంటున్నారు. ఈ క్రమంలో గ్రంథి వాచినా, గాయపడినా, దానిపై రోగనిరోధక వ్యవస్థ దాడి చేసినా ఇన్సులిన్‌ను ఉత్పత్తి చేసే సామర్థ్యం ఉన్నట్టుండి పడిపోతుందంటున్నారు. ఇలా ఇన్సులిన్ మోతాదులు హఠాత్తుగా తగ్గటం వల్ల రక్తంలో గ్లూకోజు స్థాయిలు హఠాత్తుగా పెరుగుతాయని పేర్కొంటున్నారు. ఇది మధుమేహాన్ని ప్రేరేపిస్తుందని తెలియజేస్తున్నారు.
పరీక్షించుకోవటం మేలు : హఠాత్తుగా డయాబెటిస్ బయటపడితే వయసుతో పాటు వచ్చి ఉండొచ్చని కొట్టిపారేయకుండా క్లోమగ్రంథి సమస్యలేవైనా ఉన్నాయేమో పరీక్షించుకోవటం మంచిదంటున్నారు నిపుణులు. ముఖ్యంగా బక్క పలుచగా ఉన్నవారు, చురుకుగా శారీరక శ్రమ చేసేవారు, 50 ఏళ్లు పైబడిన వారిలో డయాబెటిస్ లక్షణాలేవీ లేకుండా ఉన్నట్టుండి గ్లూకోజు మోతాదులు పెరిగితే అసలే నిర్లక్ష్యం చేయొద్దని సూచిస్తున్నారు. కడుపు స్కానింగ్, క్లోమగ్రంథి ఎంజైమ్‌ల విశ్లేషణతో అంతర్గత వాపు, కణితుల వంటి సమస్యలను మరింత తీవ్రం కాకముందే గుర్తించొచ్చని చెబుతున్నారు.
గ్లూకోజు పరీక్షలూ : అక్యూట్ పాంక్రియాటైటిస్‌కు గురైనవారు క్రమం తప్పకుండా గ్లూకోజు పరీక్షలూ చేయించుకోవాలని నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా, మద్యం అలవాటు గలవారు, క్లోమం వాపుతో కణజాలం చచ్చుబడిన వారికిది తప్పనిసరని వివరిస్తున్నారు. వీరిని నిశితంగా గమనిస్తూ ఉండటం చాలా ముఖ్యమంటున్నారు. సమస్యను ముందే గుర్తించి, చికిత్స తీసుకుంటే పరిస్థితి దిగజారకుండా చూసుకోవచ్చని సూచిస్తున్నారు. ఆరోగ్యకరమైన ఆహారం, మద్యం జోలికి వెళ్లకపోవటం వంటి జాగ్రత్తలతో కాపాడుకోవచ్చని సలహా ఇస్తున్నారు.
NOTE : ఇక్కడ మీకు అందించిన ఆరోగ్య సమాచారం, సూచనలు అన్నీ మీ అవగాహన కోసం మాత్రమే. శాస్త్ర పరిశోధనలు, అధ్యయనాలు, వైద్య, ఆరోగ్య, మానసిక నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. వీటిని పాటించే ముందు కచ్చితంగా మీ వ్యక్తిగత వైద్యుల సలహాలు తీసుకోవడమే మంచిది.
ఆస్తమా పేషెంట్స్‌కు అలర్ట్ - చలికాలంలో ఈ జాగ్రత్తలు సూచిస్తున్న నిపుణులు!
దిండ్లు, దుప్పట్లను సరిగా శుభ్రం చేయట్లేదా? - ఈ ఆరోగ్య సమస్యలు ఇబ్బంది పెట్టే అవకాశమట!

