మీ ఫ్రెండ్స్ అతిగా ఆందోళన చెందుతున్నారా? - ఇలా చేస్తే బెటర్ అంటున్న నిపుణులు!
-మీ స్నేహితులు, బంధువులలో ఎవరైనా అదే పనిగా ఆందోళన చెందుతున్నారా? - ఈ టిప్స్ పాటిస్తే వారిని అందులోనుంచి బయటికి తీసుకురావచ్చట!

Published : November 16, 2025 at 10:15 AM IST
Ways to Help a Partner with Anxiety: ఆందోళన అనేది పరిధులు దాటితే ఇదొక మానసిక సమస్యగా మారుతుంది. ముఖ్యంగా ఒకే విషయం గురించి అదే పనిగా ఆలోచించడం, కలత చెందడం వంటివి దీని ప్రధాన లక్షణాలుగా నిపుణులు చెబుతున్నారు. మరి, ఇలాంటి వ్యక్తులతో మనం ఎలా మసలుకోవాలి? వారి ఆందోళన తగ్గించడానికి ఏం చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం!
ప్రధాన లక్షణాలు : అతిగా ఆందోళన చెందే వ్యక్తుల్లో ప్రధానంగా కనిపించే లక్షణాలు
- ప్రతి చిన్న విషయానికీ బాధపడడం
- రిలాక్స్ అవడానికి ఇష్టపడకపోడం
- డల్‌గా అనిపించడం, ఊపిరి ఆడనట్లు ఉండడం
- సరిగా నిద్ర పట్టకపోవడం
- ఏకాగ్రత లోపించడం
ఇలా అతిగా ఆందోళన చెందే వ్యక్తుల మనస్తత్వం చాలా వరకు సున్నితంగా ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. కాబట్టి వారితో చాలా జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు. అందుకోసం
బోరింగ్ వ్యాయామాలతో విసిగెత్తిపోతున్నారా? - జుంబా డ్యాన్స్‌తో ఫన్ అండ్ ఫిట్నెస్!
చెప్పేది వినండి : ఆందోళన చెందే సమయంలో మెదడులో ఒకేసారి రకరకాల ఆలోచనలు వస్తుంటాయి. అంతకుమించి ఎన్నో భావోద్వేగాలు కూడా వారిలో కలుగుతాయంటున్నారు నిపుణులు. ఇలాంటి సమయంలో మనసులో ఉన్న బాధ, ఆలోచనల గురించి ఇతరులతో పంచుకుంటే వారికి కాస్త రిలాక్డ్స్‌గా అనిపించే వీలుంటుందని చెబుతున్నారు. అందుకే ఎవరైనా ఆందోళన చెందుతున్నట్లు అనిపిస్తే మొదట వారి మనసులో ఉన్న బాధ, ఆలోచనలు ఏంటో తెలుసుకోవడానికి ప్రయత్నిచాలని సూచిస్తున్నారు. ఫలితంగా వారు వాటి నుంచి తేరుకునే అవకాశం ఉంటుందని పేర్కొంటున్నారు. అలాగే వారు చెప్పేదానిని బట్టి మనం ఎలా స్పందించాలనే విషయంలో కూడా ఒక అవగాహన ఏర్పడుతుందని వివరిస్తున్నారు.
తోడుగా ఉండండి : ఆందోళన చెందే వ్యక్తుల్లో చాలా వరకు కాసేపటి తర్వాత ఎదుటి వ్యక్తి సాంత్వన కలిగించే మాటల వల్ల తిరిగి మాములు స్థితికి చేరుకుంటారు. కానీ కొందరు మాత్రం అలా కాదు, అలాంటి వారు నిపుణుల పర్యవేక్షణలో చికిత్స తీసుకోవాల్సి ఉంటుందంటున్నారు నిపుణులు. అటువంటప్పుడు వారిని ఒంటరిగా పంపించడం కాకుండా మీరూ వారికి తోడు వెళ్లాలని చెబుతున్నారు. తద్వారా 'నీకు ఎల్లవేళలా నేను తోడున్నా' అనే నమ్మకాన్ని వారిలో కలిగించే వీలుంటుందని పేర్కొంటున్నారు. ఇలా ఏర్పడే నమ్మకం కారణంగా మనం చెప్పే మాటలు కూడా వారి మనసుని బాగా ప్రభావితం చేసే అవకాశం ఉంటుందని తెలియజేస్తున్నారు. ఇవి వారిని సాధారణ స్థితికి తీసుకురావడంలో ముఖ్య పాత్ర పోషిస్తాయని వివరిస్తున్నారు.
సహనంతో మెలగండి : మాములు స్థితిలోనే మనం చెప్పే మాట ఎదుటి వ్యక్తి వినకపోవచ్చు. అలాంటిది అతిగా ఆందోళన చెందే వ్యక్తులు కూడా చెప్పిన వెంటనే మన మాట వినాలని ఆశించకూడదని నిపుణులు సూచిస్తున్నారు. ఒకటికి పదిసార్లు వారికి నచ్చచెప్పాలని, మన మాట వినేలా చేసుకోవడానికి అవసరమయ్యే సహనాన్ని కలిగి ఉంటూనే వారిలోనూ మానసిక ధైర్యాన్ని నింపే ప్రయత్నం చేయాలని అంటున్నారు. మనలో ఉన్న సహనం కూడా వారిలో మార్పు తీసుకురావడానికి ఉపయోగపడే సాధనమే అని గుర్తుంచుకోవాలని తెలియజేస్తున్నారు.
నిర్ణయాలు వద్దు : అతిగా ఆందోళన చెందే వ్యక్తులకు సాధారణ సమయాల్లో నిర్ణయాత్మక శక్తి బాగానే ఉంటుంది. కానీ ఏదైనా విషయం గురించి లోతుగా ఆలోచించేటప్పుడు లేదా ఆందోళనకి గురైనప్పుడు మాత్రం వారు తమ నిర్ణయాత్మక శక్తిని కోల్పోయే అవకాశాలు ఉన్నాయంటున్నారు నిపుణులు. అందుకే ఆ సమయంలో వారు దేనికి సంబంధించైనా సరే ఎలాంటి నిర్ణయాలు తీసుకోకుండా జాగ్రత్తపడాలని సూచిస్తున్నారు. మరీ అవసరమైతే వారికి బదులుగా వారి సమక్షంలో వారి సమ్మతితో మీరే నిర్ణయాలు తీసుకోవడం కూడా మేలని సలహా ఇస్తున్నారు.
ఏ విధంగా సహాయపడాలి?: ఆందోళన చెందే వ్యక్తికి మన సహాయం ఏ విధంగా అవసరమో వారినే అడిగి తెలుసుకోవాలని అంటున్నారు నిపుణులు. వారిని సాధారణ స్థితికి తీసుకొచ్చేందుకు ఇది కూడా చాలా వరకు తోడ్పడుతుందని చెబుతున్నారు. వారి మనోభావాలు పంచుకోవడం, సరదాగా కలిసి బయటకు వెళ్లడం, పాటలు వినడం ఇలా వారికి నచ్చే పనుల్లో తోడు ఉండడం ద్వారా మానసికంగా వారిలో మరింత త్వరగా మార్పు వస్తుందని పేర్కొంటున్నారు. ఫలితంగా వారు ఆందోళన నుంచి సత్వరమే బయటపడే వీలుంటుందని సూచిస్తున్నారు.
ఇలా చేస్తే ముద్ద 'మందారం'లా మెరిసిపోతారు - ఒత్తైన కురులే కాదు అందానికీ మేలు చేసే మందార!

