చిన్న పిల్లల్లో "రక్తహీనత సమస్య" - సరైన ఆహారాన్ని సూచిస్తున్న నిపుణులు!
రక్తహీనతతో అనారోగ్య సమస్యలు - రోజు వారీ ఆహారంలోనే పరిష్కార మార్గాలు!

Published : April 13, 2026 at 4:45 PM IST
Anemia Causes and Dietary Changes : మనదేశంలో ఎనీమియా తరచూ చూస్తుంటాం. దీనికి చిన్న, పెద్ద అనే తేడా లేదు. కాకపోతే, 5 ఏళ్లలోపు పిల్లల్లో, ముఖ్యంగా రెండేళ్లలోపు పిల్లలు, రజస్వల ఆరంభమైన అమ్మాయిల్లో, మహిళల్లో, వృద్ధుల్లో ఎక్కువగా ఉంటుందంటున్నారు నిపుణులు. రక్తహీనత కొందరిని పెద్దగా ఇబ్బంది పెట్టకపోవచ్చు కానీ, కొందరికి తీవ్రంగా పరిణమించొచ్చని చెబుతున్నారు. ఈ క్రమంలో పిల్లల్లో రక్తహీనతను అరికట్టడానికి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం!
ఏంటీ సమస్య : రక్తంలో ఎర్ర రక్తకణాలు ఉండాల్సిన దాని కన్నా తక్కువగా ఉండటం వల్ల రక్తహీనత తలెత్తుంది. మన శరీరంలో ఆక్సిజన్, కార్బన్ డై ఆక్సైడ్ వాయువుల మార్పిడిలో హిమోగ్లోబిన్ కీలక పాత్ర పోషిస్తుంది. ఇది ఊపిరితిత్తుల నుంచి ఆక్సిజన్‌ను సంగ్రహించి, రక్తం ద్వారా అవయవాలకు చేర వేస్తుందంటున్నారు నిపుణులు. దీన్ని ఆరోగ్యంగా ఉంచుతూ, వివిధ భాగాలకు మోసుకెళ్లేవి రక్త ఎర్రరక్త కణాలే. ఈ క్రమంలో వీటి సంఖ్య తగ్గితే శరీరానికి ఆక్సిజన్‌తో కూడిన రక్తం తగినంత అందదని చెబుతున్నారు. ఫలితంగా, అలసట, బలహీనతకు దారితీస్తుంది. ప్రపంచవ్యాప్తంగా 6–59 నెలల వయస్సు గల పిల్లల్లో 40%, గర్భిణీల్లో 37%, 15–49 సంవత్సరాల వయస్సు గల మహిళల్లో 30% మంది రక్తహీనతతో బాధపడుతున్నారని WHO పేర్కొంది.
"నిద్ర లేమి" సమస్య - స్వల్ప మార్పులతో ఎన్నో ప్రయోజనాలు!
ప్రభావం ఎక్కువే : ఎనీమియా వల్ల పిల్లల్లో ఎదుగుదల, తెలివి తేటలు, విషయగ్రహణ కుంటుపడతాయి. పెద్దవారిలో పని సామర్థ్యం తగ్గుతుందని నిపుణులు చెబుతున్నారు. ఈ క్రమంలో బాల్యంలో ఎనీమియా ప్రభావాలు చాలా అధికంగా ఉంటాయట. గర్భిణుల్లో అయితే గర్భం నిలవకపోవటం, ముందే కాన్పవ్వటం, తక్కువ బరువు బిడ్డలు పుట్టటం వంటి సమస్యలూ ఎదురవుతాయని అంటున్నారు.
లక్షణాలు : మాములుగా ఎనీమియా లక్షణాలు క్రమంగా ముదురుతూ వస్తుంటాయి. సమస్య తీవ్రతను బట్టి ఇవి రకరకాలుగా బయటపడుతుంటాయంటున్నారు నిపుణులు.
స్వల్ప రక్తహీనత : చర్మం పాలిపోవటం, నీరసం, నిస్సత్తువ, కనురెప్ప లోపం భాగం తెల్లగా అవటం, నాలుక తెల్లగా అవటం, నోట్లో పుండ్లు, నాలుక మంట, పెదాల చివర్లు పగలటం, పెదాలు ఉబ్బటం, ఏకాగ్రత లోపించటం, చిరాకు, కోపం, జుట్టు రాలటం, వెంట్రుకలు కళ తప్పటం లాంటి లక్షణాలు కనిపిస్తాయని mayoclinic పేర్కొంది.
మధ్యస్థ రక్తహీనత : శ్వాస వేగంగా తీసుకోవటం, నాడి వేగంగా కొట్టుకోవటం, బలహీనత, చెమటలు పట్టటం, ఎక్కువగా దాహం వేయటం, తల తేలిపోవటం.
తీవ్ర రక్తహీనతలో : తరచూ మూడ్ మారటం, శక్తి సన్నగిల్లటం, విచారం, గుండె వైఫల్యం, గుండె పెద్దగా అవ్వటం, గుండె లయ తప్పటం, మెదడు దెబ్బతినటం, ఆయాసం, వ్యాయామం చేస్తున్నప్పుడు పిక్కలు పట్టేయటం.
తీసుకోవాల్సిన జాగ్రత్తలు :
- రోజువారీ ఆహారంలో కొన్ని పదార్థాలను భాగం చేసుకుంటే పిల్లల్లో రక్తహీనత సమస్యను తగ్గుతుంది.
- రాగి జావ, కిస్మిస్ తరచూ తీసుకుంటే హిమోగ్లోబిన్ పెరుగుతుంది.
- ఆకుకూరలను ఎక్కువగా తీసుకుంటే రక్త కణాల తయారీకి సహాయపడతాయి.
- శరీరంలో రక్తాన్ని పెంచడంలో నువ్వులు సాయపడతాయి. తక్కువ మొత్తంలో తీసుకోవాలి.
- రక్తకణాల తయారీకి పప్పులు చాలా ముఖ్యం. వీటిని అవసరం మేరకూ తరచూ తీసుకోవాలి.
- రక్త కణాల తయారీకి గుడ్లు సాయపడతాయి. తరచూ తీసుకుంటే మంచిది.
- లిమా బీన్స్, పచ్చి బఠానీలు వంటి చిక్కుళ్లు తీసుకోవాలని hopkinsmedicine.org పేర్కొంది.
- అటుకులలో ఐరన్, శక్తినిచ్చే కార్బోహైడ్రేట్స్ ఉంటాయి. బ్రేక్‌ఫాస్ట్‌లోనూ వీటిని తీసుకోవచ్చు.
- విటమిన్ సి ఉండే నారింజ, నిమ్మ, జామ, ఉసిరి, బొప్పాయి తీసుకుంటే ఐరన్ శోషణ పెరుగుతుంది.
NOTE : ఇక్కడ మీకు అందించిన ఆరోగ్య సమాచారం, సూచనలు అన్నీ మీ అవగాహన కోసం మాత్రమే. శాస్త్ర పరిశోధనలు, అధ్యయనాలు, వైద్య, ఆరోగ్య నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. కానీ, వీటిని పాటించే ముందు కచ్చితంగా మీ వ్యక్తిగత వైద్యుల సలహాలు తీసుకోవడమే మంచిది.
బీట్రూట్ జ్యూస్ కాలేయాన్ని డిటాక్స్ చేస్తుందా? - నిపుణులు ఏమంటున్నారో తెలుసా?
రోజుకు ఎంత 'వంట నూనె' వాడాలో తెలుసా? - నిపుణులు ఏమంటున్నారంటే!

