రూమ్ ఫ్రెష్‌నర్స్ వాడుతున్నారా? - ఈ విషయాలు తప్పక తెలుసుకోవాల్సిందేనట!
- పరిమళం చాటున ప్రమాదం - రూమ్ ఫ్రెష్‌నర్స్ అతిగా వాడితే ఆరోగ్య సమస్యలు వస్తాయంటున్న నిపుణులు!

Published : August 5, 2026 at 3:27 PM IST
Do Air Fresheners Impact Our Health : ఇంట్లో వాసన వస్తుందనో, బంధువులు వస్తున్నారనో, తాజా పరిమాళాలు వెదజల్లాలనో, ఇతర కారణాల వల్ల ఇళ్లలో రూమ్ ఫ్రెష్‌నర్స్ వాడకం విపరీతంగా పెరిగిపోయింది. బయట మార్కెట్లో ఇవి రకరకాల ఫ్లేవర్లలో లభ్యమవటంతో గదుల్లోనే కాదు, వాహనాల్లోనూ విరివిగా వాడేస్తున్నారు. స్టోర్ రూమ్, బాత్రూమ్ల్లో ఎప్పుడో ఓ సారి వాడితే అంతగా ప్రభావమేమి ఉండదట. కానీ, రోజుల్లో ఎక్కువ సమయం గడిపే ప్రదేశాల్లో ఎక్కువగా వాడొద్దని నిపుణులు చెబుతున్నారు. మార్కెట్లో దొరికే కృత్రిమ పరిమళాలు తాత్కాలికంగా సుగంధం వెదజల్లినా దీర్ఘకాలం వాడితే వివిధ రకాల అలర్జీలు వస్తాయని హెచ్చరిస్తున్నారు. మరి, అదెలాగో ఇప్పుడు తెలుసుకుందాం!
ఎన్నిరకాలో : స్ప్రే చేసేందుకు బాటిల్స్, వెలిగించేందుకు కొవ్వొత్తులు, అగరుబత్తీలు, గది ఉష్ణోగ్రత వద్దే సువాసన వెదజల్లే సాచెట్స్, ఉండలు, గ్రాన్యూల్స్, స్టిక్కర్లుగా ఇలా ఎన్నో రూపాల్లో మార్కెట్లో లభ్యమవుతున్నాయి. ఇందులో స్ప్రే చేసేవి, వెలిగించే వాటితో పాటు అన్నీ ఆరోగ్యానికి హాని చేసేవే అని నిపుణులు చెబుతున్నారు.
'ఐస్ క్యూబ్ బాత్' ట్రెండ్! - హీరోయిన్ల ఫిట్‌నెస్ సీక్రెట్ మీకు సెట్ అవుతుందా?
ప్రభావమేంటి? :
- ఫ్రెష్నర్స్లో థాలేట్స్ (సింధటిక్ రసాయన మిశ్రమం), అస్థిరమైన రసాయన సమ్మేళనాలు ఉంటాయంటున్నారు నిపుణులు. కొన్ని లేబుల్స్‌పై థాలెట్స్ బదులు DEP, DBP, ప్లాస్టిసైజర్ అని తెలియజేస్తారట. అయితే, ఈ థాలెట్స్ కావాల్సిన ఫ్లేవర్ వాసనను అంటిపెట్టుకుని, ఎక్కువ సమయం సువాసన వచ్చేలా చేస్తాయని వివరిస్తున్నారు.
ప్రభావం : తరచూ వాడితే హార్మోన్ల అసమతుల్యత, సంతానోత్పత్తి సమస్యలు వస్తాయంటున్నారు నిపుణులు.
- చాలా ఫ్రెష్నర్స్లో మిథైల్ పారాబెన్, ప్రొపైల్ పారాబిన్, ఫార్మాల్డిహైడ్లు వాడుతారట. ఇవి సుగంధం ఎక్కువ కాలం ఉండేందుకు ఇవి సహాయకారిగా ఉంటాయని నిపుణులు చెబుతున్నారు.
ప్రభావం : ఇవి ఏకంగా హార్మోన్లనే ప్రభావితం చేస్తాయంటున్నారు నిపుణులు. పిల్లల ఆరోగ్యంపై ప్రభావం చూపుతాయని తెలియజేస్తున్నారు.
- రూమ్ ఫ్రెష్నర్ డబ్బాలలో బ్యూటేన్, ఐసో బ్యూటేన్, ప్రోపేన్ అనే రసాయనాలను వాడుతారని నిపుణులు చెబుతున్నారు. తుంపర్లుగా గది అంతా స్ప్రే అయ్యేందుకు ఇవి సహాయపడతాయని తెలియజేస్తున్నారు.
ప్రభావం : ఇలాంటివి విషపూరితమని నిపుణులు చెబుతున్నారు. గాఢత ఎక్కువైతే ఊపిరాడదని అంటున్నారు. అలసట, వికారం అనిపిస్తుందని పేర్కొంటున్నారు.
అంతేకాదు, వాణిజ్యపరమైన రూమ్ ఫ్రెష్నర్ల ప్రధాన ఫార్ములాలో క్రిమి సంహారకాలు, ఆక్సిడైజర్లు, అలర్జీ కారకాలు, శానిటైజర్లు, ఇతర రసాయనాలు శ్వాసకోశ, నాడీ సంబంధ సమస్యలు కలిగిస్తాయని 'Healthy Air' అనే మూలికల ఆధారిత ఫ్రెష్నర్ తయారు చేసినప్పుడు పుణె డీమ్డ్ వర్సిటీ వెల్లడించింది.
దీర్ఘకాలిక సమస్యలు : ఎయిర్ ఫ్రెష్‌నర్‌లలో కొన్ని రకాలను పీలిస్తే కొందరికి వెంటనే తలనొప్పి, వాంతులు, కళ్లు తిరగడం వంటి సమస్యలు వస్తాయంటున్నారు నిపుణులు. దీనివల్ల దీర్ఘకాలిక శ్వాసకోశ సమస్యలు తలెత్తొచ్చని హెచ్చరిస్తున్నారు.
కాయిల్స్, అగరుబత్తీలు, రూమ్ ఫ్రెష్‌నర్స్, ఎయిర్ ఫ్రెష్‌నర్స్, టాయిలెట్ క్లీనర్లు.. ఏవైనా గాఢమైన వాసనను విడుదల చేస్తాయి. దీంతో ముక్కు కారడం, మండటం లాంటి సమస్యలు రావొచ్చు. వీటిని పట్టించుకోకపోతే దగ్గు, తుమ్ముల వరకు వెళ్తుంది. అయినా, వాడేస్తుంటే ఊపిరితిత్తుల్లోకి గాలి వెళ్లే ప్రధాన మార్గంలో సమస్య వస్తుంది. ఛాతీ భాగం బిగుతుగా, పిల్లికూతలు, ఆయాసం వస్తాయి. చాలామంది బయటకు వెళ్తేనే వాయు కాలుష్యం బారిన పడతామని అనుకుంటారు. కానీ,ఇంట్లో కృత్రిమ సుగంధాలతో వచ్చే సమస్యల గురించి పట్టించుకోరు. కృత్రిమ వాసనలను నియంత్రిస్తే 70 శాతం శ్వాస సమస్యలు తగ్గిపోతాయి- డాక్టర్ రమణ ప్రసాద్, పల్మనాలజిస్టు
ప్యాకెట్‌పై పేర్కొనరు : మన దగ్గర దొరికే రూమ్ ఫ్రెష్నర్లో ఏ మిశ్రమాలు వాడుతున్నారో ప్యాకెట్లపై పేర్కొనరు. కేవలం 'ఫ్రాగ్రెన్స్', 'సాల్వెంట్స్' అని మాత్రమే ఇస్తారని నిపుణులు చెబుతున్నారు. వివిధ రసాయనాలతో కూడిన సువాసనలకు పెట్టిన పేర్లు అని అంటున్నారు. అవే బ్రాండ్లు యురోపియన్ దేశాల్లో విక్రయించేటప్పుడు 30 రకాల రసాయనాలు వాడుతున్నట్లు తెలియజేస్తారట. చాలామంది పూల సుగంధం వెదజల్లే అగరుబత్తీలు మంచివని రోజంతా వెలిగిస్తారట. పదార్ధం మండితే వచ్చే ఏ వాయువైనా మనకు మంచివి కావని హెచ్చరిస్తున్నారు.
NOTE : ఇక్కడ మీకు అందించిన ఆరోగ్య సమాచారం, సూచనలు అన్నీ మీ అవగాహన కోసం మాత్రమే. శాస్త్ర పరిశోధనలు, అధ్యయనాలు, వైద్య, ఆరోగ్య నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. కానీ, వీటిని పాటించే ముందు కచ్చితంగా మీ వ్యక్తిగత వైద్యుల సలహాలు తీసుకోవడమే మంచిది.
జిమ్‌కి వెళ్లే టైం లేదా? - 'ఉత్థిత త్రికోణాసనం'తో ఫిట్‌గా అవ్వొచ్చట!
గుండెపోటు, పక్షవాతం ముప్పు తగ్గాలా? - హెల్దీ "లైఫ్‌స్టైల్" మేలు చేస్తుందట!

