ETV Bharat / health

హైబీపీ కొత్త మార్గదర్శకాలు ఇవే! - ఏం సూచిస్తున్నాయో తెలుసా?

- జీవనశైలి చాలా కీలకమంటున్న నిపుణులు - కొన్ని చర్యలు తప్పనిసరని సూచన

Blood Pressure
Blood Pressure (Getty Images)
author img

By ETV Bharat Telugu Team

Published : November 14, 2025 at 3:05 PM IST

6 Min Read
Choose ETV Bharat

American Heart Association New Guidelines for Blood Pressure : హైబీపీ చడీచప్పుడు లేకుండా శరీరాన్ని దెబ్బతీస్తుంది. ఇది నియంత్రణలో లేకపోతే గుండెపోటు, కిడ్నీ జబ్బులు, పక్షవాతం, మతిమరుపు వంటి సమస్యలెన్నో చుట్టుముడతాయి. అందుకే దీన్ని తేలికగా తీసుకోకూడదని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఉప్పు తగ్గించటం, వ్యాయామం చేయటం, బరువు అదుపులో ఉంచుకోవటం, మానసిక ఒత్తిడిని తగ్గించుకోవటం వంటి జాగ్రత్తలు తప్పనిసరంటున్నారు. వీలైనంత త్వరగా మందులు ప్రారంభించడం మంచిదని అమెరికన్ హార్ట్ అసోసియేషన్ కొత్త మార్గదర్శకాలు సూచిస్తున్నాయి. ఈ క్రమంలో లేటెస్ట్ సైంటిఫిక్ రుజువుల ఆధారంగా రూపొందించిన ఈ మార్గర్శకాల్లోని కీలకాంశాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం!

American Heart Association ప్రకారం, కొలతలు అవే : అధిక రక్తపోటు కొలతలు ఏమీ మారలేదు. 2017 నాటి మార్గదర్శకాలే ఇప్పుడూ కొనసాగించారు.

  • సాధారణ రక్తపోటు - 120/80 mm Hg కంటే తక్కువగా ఉండాలి.
  • పెరిగిన రక్తపోటు - 120/80 నుంచి 129/80 mm Hg
  • దశ 1 రక్తపోటు - 130/80 నుంచి 139/89 mm Hg
  • దశ 2 రక్తపోటు - 140/90 లేదా అంత కంటే ఎక్కువ

ప్రస్తుతం రక్తనాళాల్లో పూడికలు, డయాబెటిస్, కిడ్నీజబ్బులు, పక్షవాత లక్షణాలు, ఒబెసిటీ వంటి ముప్పు కారకాలుండి, వచ్చే పదేళ్లలో గుండెజబ్బు వచ్చే అవకాశం 10 శాతం కన్నా ఎక్కువగా ఉన్నవారికి బీపీ 130/80 కన్నా మించితే డాక్టర్లు మందులు ఇస్తున్నారని సీనియర్ కార్డియాలజిస్ట్ డాక్టర్ రమేశ్ గూడపాటి చెబుతున్నారు. మిగతావారికి రక్తపోటు అదేపనిగా 140/90 కన్నా ఎక్కువుంటే మందులిస్తున్నారట. 130/80 నుంచి 140/90 మధ్యలో ఉన్నవారికి జీవనశైలి, ఆహార మార్పులే సూచిస్తున్నారని చెబుతున్నారు.

అయితే, వీరి విషయంలో మరింత శ్రద్ధ అవసరమని, జీవనశైలి మార్పులతో 3-6 నెలల్లో ఎలాంటి ఫలితమూ కనిపించకపోతే మందులు మొదలు పెట్టాలని అమెరికన్ హార్ట్ అసోసియేషన్ కొత్త మార్గదర్శకాలు సూచిస్తున్నాయి. వచ్చే పదేళ్లలో గుండెజబ్బు ముప్పు అంచనా 7.5%, అంతకన్నా ఎక్కువున్నా, మధుమేహం వంటి గుండెజబ్బు ముప్పు కారకాలున్నా దీన్ని కచ్చితంగా పాటించాలని సూచిస్తున్నాయి.

  • ఇప్పటివరకూ 140/90 దాటినవారికి ఒక మందుతో మొదలు పెట్టి, బీపీ తగ్గకపోతే మోతాదు పెంచుతున్నారు. అప్పటికీ ఫలితం కనిపించకపోతే రెండో మందు జత చేస్తున్నారు. అయితే.. తాజా మార్గదర్శకాలు వీరికి మొదటి నుంచే రెండు రకాల మందులను ఆరంభించాలని కొత్త మార్గదర్శకాలు సూచిస్తున్నాయి. వీటిని విడివిడిగానైనా, కాంబినేషన్ మాత్రగానైనా ఇవ్వచ్చని, దీంతో త్వరగా బీపీ అదుపులోకి వస్తుందని తాజా ప్రయోగ పరీక్షలు చెబుతున్నాయి.
  • గర్భధారణ సమయంలో అధిక రక్తపోటు ఉంటే తల్లి ఆరోగ్యంపై శాశ్వత ప్రభావాలను చూపుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అందుకే, గర్భిణుల విషయంలో బీపీ 140/80, అంతకన్నా ఎక్కువగా ఉంటే చికిత్స ప్రారంభించటమే మంచిదంటున్నారు. వీరిలో బీపీని కచ్చితంగా అదుపులో ఉండేలా చూసుకుంటే ప్రిఎక్లాంప్సియా (గుర్రపువాతం), గర్భవాతం, పక్షవాతం, కిడ్నీజబ్బులు, నెలల నిండకముందే కాన్పు కావటం వంటి తీవ్ర దుష్ప్రభావాలు తగ్గుముఖం పడుతున్నట్టు కొన్ని అధ్యయనాల్లో వెల్లడైంది.
  • అంతేకాకుండా, కాన్పు తర్వాతా హైబీపీ కొనసాగే అవకాశం ఉండటం వల్ల వైద్యుల పర్యవేక్షణ, సరైన సమయంలో చికిత్స చేయటమూ ముఖ్యమేనంటున్నారు. వీరు కనీసం ఏడాదికి ఒకసారైనా బీపీ టెస్ట్ చేయించుకోవాలని సూచిస్తున్నారు. ఈ క్రమంలో గర్భిణులు తప్ప మిగతవారికీ బీపీ 180/120 ఉన్నట్టయితే చాలా తీవ్రమైన సమస్యగా పరిగణించాలని, ఇలాంటి వారికి మరింత కచ్చితమైన చికిత్స చేయాలని చెబుతున్నారు.
During pregnancy
గర్భధారణ సమయంలో (Getty Images)

చిన్న చిన్న వాటికే భయపడుతున్నారా? - ఈ సలహాలు పాటిస్తే ఫోబియా నుంచి బయటపడవచ్చట!

ఇంటి పరీక్షలకూ ప్రాధాన్యం : హాస్పిటల్​లో బీపీ టెస్ట్ చేయించుకుంటే కొన్నిసార్లు రీడింగ్ ఎక్కువగా రావొచ్చని నిపుణులు చెబుతున్నారు. ఆసుపత్రిలోని వాతావరణం, వేచి ఉండటం, డాక్టర్​ను చూడగానే ఆందోళనకు గురికావడం వంటివి దీనికి కారణమవుతాయంటున్నారు. అందువల్ల ఇంట్లో బాగా విశ్రాంతిగా ఉన్నప్పుడు టెస్ట్ చేసుకుంటే బీపీ రీడింగ్ కచ్చితంగా తెలుస్తుందని చెబుతున్నారు. కాకపోతే, నాణ్యమైన బీపీ కొలత పరికరాలు వాడటం, సరైన పద్ధతిలో పరీక్షించుకోవటం ముఖ్యమని సూచిస్తున్నారు. డాక్టర్లు, నర్సుల వద్ద నేర్చుకొని బీపీని టెస్ట్ చేసుకుంటే మంచి ఫలితం కనిపిస్తుందని వివరిస్తున్నారు.

  • ప్రస్తుతం బీపీని కొలవడానికి స్మార్ట్​వాచ్​ వంటి ఎన్నో పరికరాలున్నాయి. అయితే, ఇవి అంతగా కచ్చితమైనవి, విశ్వసనీయమైనవి కావని నిపుణులు అంటున్నారు. కాబట్టి, పట్టీతో కూడిన నాణ్యమైన పరికరాలతోనే రక్తపోటు కొలుచుకోవాలని సూచిస్తున్నారు.
Blood Pressure
రక్తపోటు (Getty Images)

ఉప్పు తగ్గించటం ముఖ్యం : హైబీపీ గలవారు రోజుకు 2.3 గ్రాముల వరకూ ఉప్పు తీసుకోవచ్చని ఇప్పటివరకూ అనుకునేవారు. దీన్ని 1.5 గ్రాములకే పరిమితం చేయటం మేలని కొత్త మార్గదర్శకాలు నిర్దేశిస్తున్నాయి. ఉప్పు మరీ తక్కువైతే ఎలా? అనుకునేవారు, కిడ్నీజబ్బులేవీ లేకపోతే పొటాషియం ఆధారిత సైంధవ లవణం వంటి ప్రత్యామ్నాయ ఉప్పు ఉపయోగించుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు. పెద్దలు రోజుకు 2000 mg కంటే తక్కువ సోడియం (5 g/రోజు ఉప్పు కంటే తక్కువ) లేదా ఒక టీస్పూన్ కంటే తక్కువ తీసుకోవాలని World Health Organization సిఫార్సు చేస్తుంది.

salt
ఉప్పు (Getty Images)

కొన్ని పరీక్షలూ తప్పనిసరి : హైబీపీ గలవారంతా మూత్రంలో అల్బుమిన్, క్రియాటినైన్ నిష్పత్తి పరీక్ష చేయించుకోవాలంటున్నారు నిపుణులు. కిడ్నీ ఆరోగ్యాన్ని తెలుసుకోవటానికిది తోడ్పడుతుందని చెబుతున్నారు. అలాగే, స్లీప్ అప్నియా గలవారితో పాటు చాలామందికి రక్తంలో ఆల్డోస్టిరాన్​ను ఉత్పత్తి చేయటం (ఆల్డోస్టెరోనిజమ్) రక్తపోటు పెరగటానికి, పొటాషియం మోతాదులు తగ్గటానికి దారితీస్తుందని తెలియజేస్తున్నారు.

మద్యం జోలికి వెళ్లొద్దు : మద్యం విషయంలో కఠినంగా ఉండాలంటున్నారు నిపుణులు. దీని జోలికి వెళ్లకపోవటమే మేలని చెబుతున్నారు. ఒకవేళ అలవాటుంటే మానెయ్యటం మంచిదని సూచిస్తున్నారు. మానలేమని అనుకునేవారు పరిమితం చేసుకోవాలని తెలియజేస్తున్నారు. ఎక్కువగా మద్యం సేవించడం వల్ల రక్తపోటు పెరుగుతుందని American Heart Association అధ్యయనం పేర్కొంది.

Alcohol
మద్యం (Getty Images)

బరువు అదుపు ప్రత్యేకంగా : బరువు పెరిగే కొద్దీ రక్తపోటు తరచుగా పెరుగుతుందని mayoclinic అధ్యయనం పేర్కొంది. బీపీ అదుపులో బరువు నియంత్రణకూ కొత్త మార్గదర్శకాలు అధిక ప్రాధాన్యమిచ్చాయని నిపుణులు చెబుతున్నారు. కేవలం 5 శాతం బరువు తగ్గినా బీపీ 5 mm Hg తగ్గుతుండటం గమనార్హం. దీంతో గుండె, రక్తనాళాల మీద భారం తగ్గుతుందని, ఫలితంగా గుండె ఆరోగ్యం మెరుగవుతుందంటున్నారు నిపుణులు. ముఖ్యంగా, డయాబెటిస్ ఉన్నవారు బరువు తగ్గటం చాలా ముఖ్యమనీ తాజా మార్గదర్శకాలు చెబుతున్నాయి. బరువు తగ్గితే ఇన్సులిన్​ను శరీరం బాగా వినియోగించుకుంటుందని, దీంతో గ్లూకోజ్ మోతాదులూ తగ్గుముఖం పడతాయని తెలియజేస్తున్నారు. డయాబెటిస్​తో ముడిపడిన గుండె జబ్బుల వంటి దుష్ప్రభావాలు తగ్గే అవకాశముందని వివరిస్తున్నారు. అందువల్ల, వీళ్లు జీవనశైలి మార్పులతో పాటు జీఎల్​పీ-1 రిసెప్టర్ అగోనిస్ట్ రకానికి చెందిన సెమాగ్లుటైడ్ వంటి మందులూ వాడుకోవాలని తొలిసారి బీపీ నియంత్రణ మార్గదర్శకాల్లో చేర్చారు.

జీవనశైలి పాత్ర కీలకం :

  • హైబీపీ నివారణ, నియంత్రణలో ఆరోగ్యకరమైన జీవనశైలి పాత్ర చాలా కీలకమని కొత్త మార్గదర్శకాలు మరోసారి నొక్కి చెబుతున్నాయి. ఇదే తొలి చికిత్సనీ సూచిస్తున్నాయి.
  • నిండు గింజ ధాన్యాలు, పెద్ద మొత్తంలో పండ్లు, కూరగాయలు, పప్పులు, గింజపప్పులు, విత్తనాలు, శాకాహార ప్రొటీన్, వెన్న తీసిన పాలు, మాంసాహారులైతే చికెన్, చేపలతో కూడిన సమగ్ర పోషకాహారం తీసుకోవాలంటున్నారు నిపుణులు. అంతేకాకుండా, రోజంతా తగినంత నీరు తాగాలని చెబుతున్నారు.
  • వారానికి కనీసం 75 నిమిషాలు కాస్త కఠినమైన వ్యాయామాలు చేయాలంటున్నారు.
  • సిగరెట్లు, చుట్టలు, బీడీలు, ఇ-సిగరెట్లు తాగొద్దని సూచిస్తున్నారు.
  • రాత్రిపూట 7-9 గంటల సేపు నిద్రపోవాలని తెలియజేస్తున్నారు.
  • శరీర బీఎంఐ (ఎత్తు, బరువు నిష్పత్తి) 25 కన్నా మించనీయొద్దు.
  • రక్తంలో కొలెస్ట్రాల్ అదుపులో ఉంచుకోవాలని, మంచి కొలెస్ట్రాల్ పెంచుకోవాలంటున్నారు.
  • గ్లూకోజు మోతాదులు నియంత్రణలో ఉంచుకోవాలని తెలియజేస్తున్నారు.
  • వ్యాయామం, ధ్యానం, ప్రాణాయామం, యోగా వంటి వాటితో మానసిక ఒత్తిడిని తగ్గించుకోవాలని సూచిస్తున్నారు.

NOTE : ఇక్కడ మీకు అందించిన ఆరోగ్య సమాచారం, సూచనలు అన్నీ మీ అవగాహన కోసం మాత్రమే. శాస్త్ర పరిశోధనలు, అధ్యయనాలు, వైద్య, ఆరోగ్య నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. కానీ, వీటిని పాటించే ముందు కచ్చితంగా మీ వ్యక్తిగత వైద్యుల సలహాలు తీసుకోవడమే మంచిది.

డిప్రెషన్ మందులు వాడుతూ మద్యం సేవిస్తున్నారా? - అధ్యయనాలు ఏం చెబుతున్నాయంటే!

చక్కెర తినడం మానేస్తే ఏం జరుగుతుందో తెలుసా? - ఆశ్చర్యకరమైన ఫలితాలకు అవకాశం ఇచ్చినట్టే!