ETV Bharat / entertainment

ప్రతి"నాయకుడు"!

- రానా, సూర్య, యశ్​ బాటలో.. విజయ్​ దేవరకొండ? - "బీటౌన్ రౌడీ"​గా ఎంట్రీ ఇవ్వబోతున్నాడని టాక్!

Villain trend
Villain trend (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : May 28, 2026 at 4:06 PM IST

3 Min Read
Choose ETV Bharat

Villain trend : పదిహేనేళ్ల ముందు వరకు నటుడికి పారామీటర్స్ ఉండేవి. యాక్టింగ్​లో అత్యున్నతమైన స్థానం అంటే హీరో మాత్రమే! ఆ రేంజ్​కు చేరిన తర్వాత నటుడు ఇతర పాత్రలు చేస్తే "స్థాయి తగ్గింది" అనేవారు! బట్, క్రమంగా కాలం మారింది. హీరోలే విలన్లుగా మారడం మొదలు పెట్టారు. ప్రతినాయక పాత్రలోని పవర్​ అర్థమైన తర్వాత.. ఆ నెగెటివ్​ షేడ్​ను పూసుకునేందుకు పలువురు నటులు ఎగ్జైట్​ అవుతున్నారు. ఈ ట్రెండ్​ సౌత్​లో ఊపకుందుకున్నది ఎప్పుడంటే.. ఎక్కువ మంది "భళ్లాలదేవుడి" వైపే వేలు చూపిస్తారు! ఆ తర్వాత డానీ.. ఉరఫ్ డానియల్ శేఖర్ కూడా గుర్తొస్తాడు.

ఇలా రానాతోపాటు నెగెటివ్ షేడ్​లో పలువురు నటులు కనిపించారు. జగపతిబాబు, శ్రీకాంత్, శివాజీతోపాటు మంచు మనోజ్​ కూడా అలరించాడు. తమిళస్టార్​ విజయ్​ సేతుపతి.. హీరో, విలన్​ క్యారెక్టర్లు ప్లే చేస్తూ.. రెండు పడవలపై జర్నీ చేస్తున్నారు.

యశ్ :

అయితే, స్టార్​ హీరోగా పీక్​ స్టేజ్​లో ఉండగానే ముఖానికి విలన్ రంగు వేసుకుంటున్న మరో నటుడు యశ్. కేజీఎఫ్​ ప్రాంఛైజీతో అలరించి ఒక్కసారిగా పాన్​ ఇండియా రేంజ్​లో ఫేమస్​ అయిపోయిన యశ్.. "రామాయణ"లో రావణుడి రోల్​ ప్లే చేస్తున్నారు. ఇంత స్టార్​డమ్​ వచ్చిన తర్వాత ప్రతినాయక పాత్ర పోషించేందుకు అంగీకరించడంతో చాలా మంది షాక్​ అయ్యారు. కానీ, ఆ పాత్రలోని టెంపో అలాంటిది మరి! అది కూడా అందరికీ దక్కే ఛాన్స్​ కాదు. ఇంకా చెప్పాలంటే.. ఒక నటుడికి తన జీవిత కాలంలో ఒకసారి మాత్రమే తలుపు తట్టే అవకాశం! అందుకే.. యశ్​ "సై" అన్నాడని చెబుతారు.

విజయ్ :

ఇలా.. వీళ్ల బాటలో లేటెస్ట్​గా విజయ్​ దేవరకొండ కూడా నడవనున్నాడా? అనే డిస్కషన్​ ఫిల్మ్​ సర్కిల్స్​లో రన్​ అవుతోంది! అది కూడా తెలుగులో కాదు.. బీటౌన్​లో! ప్రస్తుతం అక్కడ "డాన్​ 3" రచ్చ ఏ స్థాయిలో సాగుతోందో తెలిసిందే. రణ్​వీర్​ సడన్​గా ఆ ప్రాజెక్టు నుంచి తప్పుకోవడంతో కౌంటర్లు, ఎన్​కౌంటర్లు నడుస్తున్న ఈ దశలో.. మళ్లీ "కింగ్​"నే ఈ ప్రాంఛైజీని కంటిన్యూ చేయబోతున్నాడనే టాక్​ వినిపిస్తోంది. డాన్​1, డాన్​2లో అద్దిరిపోయే యాక్షన్​తో అదరగొట్టారు షారూక్. అయితే మూడో ప్లేస్​లో స్క్రిప్టు, క్రియేటివిటీ విషయంలో క్లాష్​ రావడంతో షారూక్ పక్కకు తప్పుకున్నారని, ఆ తర్వాత రణ్​వీర్​ వచ్చి, చివరి నిమిషంలో ఎక్జిట్​ అయిపోయారని బాలీవుడ్​ రూమర్స్.

చివరకు మూవీ టీమ్​ మళ్లీ షారూక్ నే అప్రోచ్​ అయ్యిందని టాక్. అయితే, ఈ సందర్భంగా కింగ్​ ఓ ఇంట్రస్టింగ్​ ప్రపోజల్​ పెట్టారట! తనకు జవాన్​తో అద్దిరిపోయే హిట్​ ఇచ్చిన "అట్లీ" డైరెక్ట్​ చేస్తే.. తాను వచ్చేస్తానని చెప్పారట! ప్రస్తుతం ఈ న్యూస్​ హాట్​ టాపిక్​గా మారిపోయింది. ఈ సందర్భంలోనే మరో ఫ్లాష్​ కూడా చక్కర్లు కొడుతోంది. షారూక్​ను ఢీకొని ప్రతినాయకుడి పాత్రకు రౌడీ హీరో విజయ్ దేవరకొండను అనుకుంటున్నారట! అంతేకాదు.. అతన్ని సంప్రదించారని కూడా తెలుస్తోంది. మరి, విజయ్​ ఎలాంటి నిర్ణయం తీసుకున్నారో తెలియాల్సి ఉంది.

విలన్​కే దమ్ము ఎక్కువ! :

హీరోగా అవకాశాలు పెద్దగా రానివారు నెగెటివ్​ రోల్స్​ చేయడం సహజం. కానీ.. స్టార్లుగా ఉన్నవారు సైతం విలన్​ పాత్రలు చేయడానికి ఆసక్తిచూపడం ఇంట్రస్టింగ్ పాయింట్! మారుతున్న ఆడియన్స్ టేస్ట్​ ప్రకారమే హీరోలు ఇలాంటి టర్న్ తీసుకుంటున్నారన్నది క్రిటిక్స్ రివ్యూ! నిజం చెప్పాలంటే.. యాక్షన్ స్కోప్​ హీరోకన్నా వన్​ పర్సెంట్​ విలన్​కే ఎక్కువ ఉంటుందంటారు. హీరో పాత్ర ఎంత వీరోచితంగా చేసినా.. దానికంటూ కొన్ని హద్దులు ఉంటాయి. వాటిని మీరడం కుదరదు. కానీ, విలన్.. ఏ సరిహద్దులూ లేనివాడు. ఏమైనా చేయగలడు.. ప్రేక్షకులను ఒప్పించి, మెప్పించగలడు! ఎందుకంటే.. ఆ పాత్ర స్వభావమే అంతకాబట్టి! క్రూరత్వానికి బ్రాండ్​ అంబాసిడర్​ కాబట్టి!! అలాంటి నటనా చాతుర్యం ప్రదర్శించడానికి మాక్కూడా ఒక్క ఛాన్స్​ కావాలంటున్నారు నేటి హీరోలు!

రోలెక్స్​ రచ్చ :

విక్రమ్​ సినిమాలో "రోలెక్స్​" విశ్వరూపం చూసిన ప్రతి సినీ ప్రేమికుడూ ఫిదా అయ్యారు. నెగెటివ్​ షేడ్​ రేంజ్​ ఏంటో.. సూర్య మరోసారి చూపించిన రోల్​ అది. కనిపించింది ఐదు నిమిషాలే అయినా.. సిల్వర్​ స్క్రీన్​ పై నెత్తుటిని అత్తరులా చల్లేశాడు రోలెక్స్! ఇదే తరహాలో విజయ్​ కూడా తన రౌడీ హీరో ట్యాగ్​ను సార్థకనామధేయంగా మార్చేసే పనిలో ఉన్నాడని అంటున్నారు. మరి, ఈ ప్రతి నాయకుల జాబితాలో ఎంతమంది కథానాయకులు చేరుతారో చూడాలి.