'విరోష్' పెళ్లి నగల కోసం 10నెలల కష్టం- కిలోల కొద్దీ బంగారంతో 'రాజసం'- ఆ జ్యువెలరీ స్పెషాలిటీ తెలుసా?
పెళ్లిలో విజయ్, రష్మిక ధరించిన కిలోల కొద్దీ బంగారు నగలు - నగలను సిద్ధం చేయడానికి 10 నెలలు పట్టింది!

Published : February 28, 2026 at 7:32 AM IST
Vijay Rashmika Wedding Gold Jewellery : ప్రస్తుతం ఎక్కడ చూసినా విజయ్ దేవరకొండ- రష్మిక పెళ్లి ముచ్చట్లే వినిపిస్తున్నాయి. ఫిబ్రవరి 26న ఉదయపుర్‌లో జరిగిన వీరి వివాహం ఒక రాజ వైభవాన్ని తలపించింది. అయితే ఈ పెళ్లిలో అందరినీ ఆశ్చర్యపరిచింది మాత్రం ఈ జంట ధరించిన భారీ బంగారు ఆభరణాలు. పెళ్లిళ్లలో నగలతో కనిపించడం సాధారణమే. కానీ ఈ రేంజ్లో కనిపించడం అనేది చాలా ప్రత్యేకం. విజయ్, రష్మిక రొటీన్‌కి భిన్నంగా కిలోల కొద్దీ బరువున్న సంప్రదాయ ఆలయ నగలతో మెరిసిపోయారు.
ఈ నగలను చూస్తుంటే ఏదో పౌరాణిక సినిమాలోని రాజు, రాణి మన కళ్ల ముందు ఉన్నట్లుగా అనిపిస్తోంది. కేవలం అలంకరణ కోసమే కాకుండా, భారతీయ సంస్కృతిని, శిల్పకళను చాటిచెప్పేలా ఈ ఆభరణాలను సిద్ధం చేశారు. ఈ అపురూపమైన నగలు తయారవ్వడానికి వెనుక ఉన్న కష్టం, ఆ డిజైన్ల వెనుక ఉన్న కథ ఏంటో ఇప్పుడు వివరంగా చూద్దాం.
10 నెలల సమయం
విజయ్- రష్మిక పెళ్లి నగలను రూపొందించిన బాధ్యతను హైదరాబాద్‌కు చెందిన ప్రముఖ 'శ్రీ జ్యువెలర్స్' సంస్థ తీసుకుంది. ఈ నగలను సిద్ధం చేయడానికి వారికి దాదాపు 10 నెలల సమయం పట్టింది. డిజైన్లను సెలెక్ట్ చేయడం దగ్గర నుంచి, వాటిపై చర్చలు జరపడం, తయారీ, ఆ తర్వాత ట్రయల్స్ వేయడం వరకు ప్రతి దశలోనూ ఎంతో శ్రద్ధ తీసుకున్నారు. దక్షిణాది ఆలయాల గోపురాలు, శిల్పకళ నుంచి స్ఫూర్తి పొంది ఈ నగలను డిజైన్ చేసినట్లు ఆ సంస్థ నిర్వాహకులు వెల్లడించారు. కేవలం బంగారమే కాకుండా, అందులో ఉన్న ప్రతి చిన్న పనితనం కూడా చేతి తోనే మలిచినవి కావడం విశేషం. ఈ ప్రయాణంలో విజయ్, రష్మికల అభిరుచులకు అనుగుణంగా మార్పులు చేస్తూ ఫైనల్ అవుట్ పుట్ ఇచ్చారు.
One day, I missed her.
— Vijay Deverakonda (@TheDeverakonda) February 26, 2026
Missed her in a way that made me feel like my day would’ve been better if she were around.
Like my meals would’ve felt more wholesome if she were sitting across from me.
Like my workouts would’ve been more fun and less of a punishment if she were doing… pic.twitter.com/fy7umfHWjN
రాజసం ఉట్టిపడేలా విజయ్ నగలు
సాధారణంగా పెళ్లికొడుకు నగలు అంటే చాలా సింపుల్‌గా ఉంటాయి, కానీ విజయ్ మాత్రం ఈ విషయంలో ఒక కొత్త ట్రెండ్ సెట్ చేశారు. ఒక పవర్ఫుల్ రాజులా కనిపించడానికి భారీ ఆభరణాలను సెలెక్ట్ చేసుకున్నారు. అతను ధరించిన ఆభరణాల్లో తెలివితేటలకు గుర్తుగా ఏనుగు డిజైన్లు, చురుకుదనానికి గుర్తుగా పులి ఆకారాలను పొందుపరిచారు. ముఖ్యంగా విజయ్ ధరించిన చెవి దుద్దులు రెగ్యులర్ గా ఉండే వాటికంటే పెద్దవిగా, ఒక నాణెం సైజులో ఉన్నాయి. అంతేకాకుండా చేతికి కడాలు, మెడలో పొడవాటి చిన్న హారాలు, వేలికి ఉంగరాలు ధరించి పూర్తి వైభవంగా కనిపించారు. పెళ్లికొడుకు కాలికి కూడా బంగారు కడియాలు ధరించడం చాలా అరుదుగా చూస్తుంటాం, విజయ్ ఆ విషయంలో కూడా తన ప్రత్యేకతను చాటుకున్నారు.
దేవతలా మెరిసిన రష్మిక
రష్మిక తన పెళ్లిలో సాక్షాత్తు ఒక దేవతలా కనిపించాలనేది డిజైనర్ల ప్రధాన ఉద్దేశం అని తెలుస్తోంది. ఇందుకోసం ఆమె మొత్తం 11 రకాల ఆభరణాలను ధరించారు. తల నుంచి కాలి వేలి వరకు ఆమె ధరించిన ప్రతి నగలోనూ దక్షిణాది కళాకృతులు కనిపిస్తున్నాయి. పాపిడి బిళ్ల, నెక్లెస్, చెవి కమ్మలు, జడ బిళ్లలు, వడ్డాణం, ముక్కు పుడక, చేతి నగలు, బాజుబంద్, బంగారు గాజులు అలాగే కాలి పట్టీలతో రష్మిక మెరిసిపోయారు. ఈ నగలన్నింటినీ యాంటిక్ మ్యాట్ ఫినిషింగ్‌తో తయారు చేశారు, దీనివల్ల అవి పాతకాలపు వారసత్వ సంపదలా కనిపిస్తున్నాయి. ఇవి కేవలం ఒక రోజు వేసుకునే నగలు కాదని, రాబోయే తరాలకు అందించే ఆస్తిలా వీటిని రూపొందించారు.
ప్రతి డిజైన్లోనూ ప్రత్యేకత
ఈ నగల్లో వాడిన టెక్నాలజీ లేదా పనితనం గురించి చెప్పుకుంటే 'నక్షి' అలాగే 'రావా' అనే కళాత్మక పద్ధతులను ఉపయోగించారు. నక్షి అంటే బంగారంపై లోతైన చెక్కడాలు చేసి ఒక 3D రూపాన్ని తీసుకువస్తారు. రావా పనితనం అంటే చిన్న చిన్న బంగారు గింజలను ఉపయోగించి డిజైన్‌కు బరువు అందాన్ని చేకూర్చడం. ఈ రెండు పద్ధతుల వల్ల నగలు చాలా బరువుగా, కళాత్మకంగా కనిపిస్తాయి. పూల డిజైన్లు, మెలికలు తిరిగిన తీగలు వంటివి ఈ ఆభరణాలకు మరింత అందాన్ని తెచ్చిపెట్టాయి. ఈ కిలోల కొద్దీ బంగారు నగలను ధరించినా, అవి రష్మిక బాడీ లాంగ్వేజ్ కు సరిపోయేలా ఎంతో జాగ్రత్తగా తయారు చేశారు.
ట్రెండ్ సెట్ చేసిన 'విరోష్'
విజయ్, రష్మిక పెళ్లి నగలు చూసిన తర్వాత మళ్లీ పాతకాలపు ఆభరణాలకు క్రేజ్ పెరుగుతోంది. గత కొన్నాళ్లుగా పెళ్లిళ్లలో రెగ్యులర్ ట్రెండ్ నడుస్తోంది, కానీ వీరు దానికి భిన్నంగా డిఫరెంట్ నగలవైపు అడుగులు వేశారు. ఒక పెళ్లి కొడుకు కూడా ఇంత అందంగా, గౌరవంగా నగలు ధరించవచ్చని విజయ్ నిరూపించారు. రష్మిక తన మూలాలను మర్చిపోకుండా దక్షిణాది సంస్కృతిని ప్రతిబింబించే నగలను ఎంచుకోవడం మరో హైలైట్. ఈ నగలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవ్వడమే కాకుండా భవిష్యత్తులో పెళ్లి చేసుకోబోయే వారికి కూడా బాగా కనెక్ట్ అయ్యేలా ఉన్నాయి. దీంతో ఈ ట్రెండ్ గట్టిగానే కొనసాగేలా కనిపిస్తోంది.

