ETV Bharat / entertainment

అజిత్ కుమార్​కు మాతృవియోగం- పరామర్శించిన సీఎం విజయ్, హీరోయిన్ త్రిష

తల్లి మరణంతో తీవ్ర దుఃఖంలో అజిత్ కుమార్- అజిత్ నివాసానికి వచ్చి ఓదార్చిన సీఎం విజయ్- కన్నీటి పర్యంతమైన అజిత్​ను పరామర్శించిన త్రిష

Vijay And Trisha Visit Ajith Kumar To Offer Condolences After His Mother's Death
Vijay And Trisha Visit Ajith Kumar To Offer Condolences After His Mother's Death (IANS)
author img

By ETV Bharat Telugu Team

Published : May 31, 2026 at 2:59 PM IST

3 Min Read
Choose ETV Bharat

Ajith Kumar Mother Death : కోలీవుడ్ ప్రముఖ నటుడు అజిత్ కుమార్ ఇంట్లో తీవ్ర విషాదం నెలకొంది. ఆయన తల్లి మోహినీ మణి శనివారం వేకువజామున చెన్నైలో కన్నుమూశారు. ఈ వార్త తెలియగానే అజిత్ అభిమానులతో పాటు సినీ వర్గాలు తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేస్తున్నాయి. ఇక ఈ కఠిన సమయంలో హీరో, తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ అలాగే త్రిష అజిత్ ఇంటికి చేరుకొని నివాళులర్పించారు. గత కొన్ని రోజులుగా వయసు పైబడటం వల్ల వచ్చే అనారోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతున్న ఆమె ప్రశాంతంగా తుదిశ్వాస విడిచారని కుటుంబ సభ్యులు ఒక ప్రకటన ద్వారా వెల్లడించారు. కన్నతల్లి దూరం కావడంతో ఆ కుటుంబం అంతా తీవ్ర శోకసంద్రంలో మునిగిపోయింది. ఇక విజయ్, త్రిష ఇద్దరు ఒకేసారి అజిత్ ఇంటికి చేరుకున్నారు. పూర్తి వివరాల్లోకి వెళితే!

పరామర్శించిన సీఎం విజయ్
తమిళ చిత్ర పరిశ్రమలో అజిత్ కుమార్​తో పాటు దళపతి విజయ్ కూడా ఒక పెద్ద స్టార్. ప్రస్తుతం విజయ్ తమిళనాడు ముఖ్యమంత్రిగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. అజిత్ తల్లి మరణించిన సంగతి తెలియగానే సీఎం విజయ్ నేరుగా అజిత్ నివాసానికి చేరుకున్నారు. మోహినీ మణి భౌతికకాయానికి పూలమాలలు వేసి శ్రద్ధాంజలి ఘటించారు. ఆ తర్వాత పుట్టెడు దుఃఖంలో ఉన్న అజిత్ కుమార్‌ను దగ్గరకు తీసుకుని, గట్టిగా హత్తుకుని ధైర్యం చెప్పారు.

ధైర్యం చెప్పిన హీరోయిన్ త్రిష
ముఖ్యమంత్రి విజయ్​తో పాటు స్టార్ హీరోయిన్ త్రిష కూడా అజిత్ ఇంటికి వచ్చి పరామర్శించారు. అజిత్​ను పలకరించి, ఆయన కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. ఇండస్ట్రీలో ఎంతో కాలంగా కలిసి నటిస్తున్న తోటి నటుడి ఇంట్లో జరిగిన ఈ పెద్ద విషాదానికి ఆమె తీవ్ర విచారం వ్యక్తం చేశారు. అజిత్ కుటుంబానికి ఈ కష్ట సమయంలో దేవుడు ధైర్యాన్ని ఇవ్వాలని ఆమె కోరుకున్నారు. వీళ్లతో పాటు మరికొందరు సినీ ప్రముఖులు కూడా నివాళులు అర్పించారు.

అంత్యక్రియలపై కుటుంబ సభ్యుల నిర్ణయం
అంతిమ సంస్కారాల నిర్వహణకు సంబంధించి అజిత్ కుమార్ సోదరులు ఒక అధికారిక ప్రకటనను విడుదల చేశారు. తమ తల్లి మోహినీ మణి అంత్యక్రియలను కేవలం అత్యంత ఆప్తులు, కుటుంబ సభ్యుల సమక్షంలోనే చాలా ప్రైవేట్​గా ముగించాలనుకుంటున్నట్లు స్పష్టం చేశారు. కన్నవారిని కోల్పోయినప్పుడు ఉండే ఆ వేదన ఎలాంటిదో ప్రతి ఒక్కరికీ తెలుసని, అందుకే తమ నిర్ణయాన్ని అందరూ అర్థం చేసుకుంటారని ఆశిస్తున్నట్లు వారు ఆ నోట్​లో పేర్కొన్నారు. ఈ లేఖపై అజిత్​తో పాటు ఆయన సోదరులు అనుప్ కుమార్, అనిల్ కుమార్ సంతకాలు చేశారు.

ఈ కష్ట సమయంలో తమ కుటుంబానికి కొంత ప్రైవసీని ఇవ్వాలని అజిత్ ఫ్యామిలీ మీడియాను, అభిమానులను కోరింది. తమ తల్లి జ్ఞాపకాలను ఎంతో ప్రశాంతంగా, గౌరవప్రదంగా సాగనంపేందుకు అందరూ సహకరించాలని వేడుకున్నారు. అలాగే గత కొన్నేళ్లుగా తమ తల్లి ఆరోగ్య విషయాల్లో ఎంతో శ్రద్ధ తీసుకుని, తమ కుటుంబానికి అండగా నిలిచిన డాక్టర్లకు, మెడికల్ టీమ్​కు ఈ సందర్భంగా వారు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు.

ఇంటర్నెట్​లో వైరల్ అవుతున్న వీడియోలు
సీఎం విజయ్, హీరోయిన్ త్రిష లాంటి బిగ్ స్టార్లు అజిత్ ఇంటికి వెళ్లి పరామర్శించిన విజువల్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇండస్ట్రీలో ఇద్దరు పెద్ద హీరోల మధ్య ఇలాంటి కష్ట సమయంలో కనిపించిన ఆత్మీయత నెటిజన్లను ఎంతో ఆకట్టుకుంటోంది. సీఎం హోదాలో ఉండి కూడా స్వయంగా వచ్చి ఓదార్చడం అందరినీ కదిలించింది. అజిత్ కుమార్ కు ఈ పెద్ద బాధ నుంచి కోలుకునే శక్తిని ఇవ్వాలని భగవంతుడిని కోరుకుంటున్నట్లు ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు.

నటుడు అజిత్‌ కుమార్‌ తల్లి కన్నుమూత- సినీ ప్రముఖుల సంతాపం

రణ్‌వీర్‌ను కాదు వాళ్లను బ్యాన్ చేయాలి- ధురంధర్ సక్సెస్ చూసి కొందరు భయపడుతున్నారు: ఆర్జీవీ