ETV Bharat / entertainment

రీల్ లైఫ్ టు రియల్ లైఫ్ పార్ట్‌నర్స్‌- టాలీవుడ్ క్రేజీ కపుల్స్ వీళ్లే!

నిజ జీవితంలోనూ వివాహ బంధంతో ఒక్కటైన వెండితెర జంటలు- సూపర్ స్టార్ కృష్ణ నుంచి విజయ్ దేవరకొండ దాకా- లిస్ట్​లో ఎందరో స్టార్లు!

Reel To Real Couple
Reel To Real Couple (Source : Actors Social Media Posts)
author img

By ETV Bharat Telugu Team

Published : February 28, 2026 at 5:50 PM IST

6 Min Read
Choose ETV Bharat

Reel To Real Couple In Tollywood : సినిమా షూటింగ్ సమయంలో హీరో హీరోయిన్ల మధ్య స్నేహం పెరగడం సహజం. నెలల తరబడి కలిసి పని చేయడం వల్ల ఒకరి ఆలోచనలు, అలవాట్లు మరొకరికి నచ్చి అది ప్రేమగా మారుతుంది. టాలీవుడ్​లో ఇలాంటి ప్రేమ కథలు ఎన్నో విజయవంతమయ్యాయి. కేవలం నటులే కాకుండా, దర్శకులు, నిర్మాతలు కూడా తమ వృత్తిలో తోడుగా ఉన్న వారినే జీవిత భాగస్వాములుగా మార్చుకున్నారు. వారు కలిసి చేసిన సినిమాలు బాక్సాఫీస్ వద్ద రికార్డులు సృష్టించడమే కాకుండా, వారి జీవితాల్లో కూడా కొత్త వెలుగులు నింపాయి. మరి ఆ స్టార్ జంటలు ఎంతమంది ఉన్నారో ఇప్పుడు చూద్దాం!

విజయ్ దేవరకొండ - రష్మిక మందన్నా
విజయ్ దేవరకొండ- రష్మిక మందన్నా టాలీవుడ్​లో మోస్ట్ సక్సెస్​ఫుల్ ఆన్​స్క్రీన్ జోడీగా పేరు తెచ్చుకున్నారు. చాలా కాలంగా ప్రేమలో ఉన్నప్పటికీ వీరు బయటకు చెప్పలేదు. అప్పుడప్పుడు హింట్స్ ఇచ్చినా నిజం బయటకు రానివ్వలేదు. ఇక ఇటీవల గ్రాండ్​గా పెళ్లి చేసుకొని ఒకటయ్యారు. వీరు కలిసి నటించిన 'గీత గోవిందం' సినిమా వంద కోట్ల క్లబ్​లో చేరి సంచలనం సృష్టించగా, 'డియర్ కామ్రేడ్' వీరి నటనకు మంచి గుర్తింపు తెచ్చింది. ఇప్పుడు పెళ్లి తర్వాత కూడా వీరిద్దరూ కలిసి 'రణబాలి' అనే సినిమాలో నటించబోతుండటం విశేషం.

కృష్ణ - విజయనిర్మల
సూపర్ స్టార్ కృష్ణ- నటి, దర్శకురాలు విజయనిర్మల జంట తెలుగు ఇండస్ట్రీలో ఒక లెజెండరీ జోడీ. వీరు కలిసి వందకుపైగా చిత్రాల్లో నటించి ప్రపంచ రికార్డు సృష్టించారు. నటిగా మాత్రమే కాకుండా గిన్నిస్ బుక్​లోనూ ఎక్కిన దర్శకురాలిగా విజయనిర్మల తన వృత్తిలో అద్భుతమైన గుర్తింపు తెచ్చుకున్నారు.

నాగార్జున - అమల
నాగార్జున, అమల కలిసి 'శివ', 'ప్రేమ యుద్ధం', 'నిర్ణయం' వంటి ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో నటించారు. వీరి ఆన్​స్క్రీన్ కెమిస్ట్రీ అప్పట్లో ఒక ట్రెండ్ సెట్ చేసింది. ప్రస్తుతం అమల సామాజిక సేవా కార్యక్రమాల్లో బిజీగా ఉండగా, నాగార్జున స్టార్ హీరోగా, నిర్మాతగా తన ప్రయాణాన్ని కొనసాగిస్తున్నారు.

రాజశేఖర్ - జీవిత
యాంగ్రీ యంగ్ మ్యాన్ రాజశేఖర్ - నటి జీవిత కలిసి 'తలంబ్రాలు', 'అంకుశం' వంటి ఎన్నో సంచలన చిత్రాల్లో నటించారు. ఈ సినిమాలన్నీ వీరి కెరీర్​ను మలుపు తిప్పడమే కాకుండా వీరి మధ్య ప్రేమకు పునాది వేశాయి. ప్రస్తుతం రాజశేఖర్ నటుడిగా బిజీగా ఉండగా, జీవిత దర్శకత్వ, రాజకీయ వ్యవహారాల్లో రానిస్తున్నారు.

కృష్ణవంశీ - రమ్యకృష్ణ
దర్శకుడు కృష్ణవంశీ- విలక్షణ నటి రమ్యకృష్ణ 'చంద్రలేఖ' సినిమా సమయంలో క్లోజ్ అయ్యారు. దర్శకుడిగా కృష్ణవంశీ మార్క్ సినిమాలతో గుర్తింపు తెచ్చుకుంటే, రమ్యకృష్ణ తన నటనతో దక్షిణ భారత చిత్ర పరిశ్రమలో అగ్ర నటిగా ఎదిగారు. వీరిద్దరూ కలిసి తమ వృత్తిలో ఎన్నో అవార్డులు అందుకున్నారు.

శ్రీకాంత్ - ఊహ
నటుడు శ్రీకాంత్- హీరోయిన్ ఊహ కలిసి 'ఆమే', 'కూతురు', 'అల్లరి మొగుడు' వంటి హిట్ చిత్రాల్లో నటించారు. కొన్నాళ్లు స్నేహంగా కొనసాగిన వారి ప్రయాణం ఆ తరువాత ఏడు అడుగుల వరకు వెళ్లింది. వీరిద్దరూ కలిసి నటించిన దాదాపు అన్ని సినిమాలు బాక్సాఫీస్ వద్ద విజయం సాధించాయి. పెళ్లి తర్వాత ఊహ సినిమాలకు దూరంగా ఉన్నప్పటికీ, శ్రీకాంత్ ఇండస్ట్రీలో సహాయ నటుడిగా, విలన్ గా తన ప్రయాణాన్ని కొనసాగిస్తున్నారు.

సెల్వమణి - రోజా
దర్శకుడు సెల్వమణి- నటి రోజా ఇద్దరిది కూడా ఒక క్రేజీ కాంబినేషన్. సెల్వమణి దర్శకత్వం వహించిన 'చామంతి' సినిమాతో రోజా కెరీర్ మలుపు తిరగడమే కాకుండా, వీరి మధ్య ప్రేమకు పునాది పడింది. ప్రస్తుతం రోజా రాజకీయాల్లో బిజీగా ఉండగా, సెల్వమణి బిజినెస్ వ్యవహారాలతో పాటు తన దర్శకత్వ పనులను కొనసాగిస్తున్నారు.

మహేశ్ బాబు -నమ్రత శిరోద్కర్
మహేష్ బాబు- నమ్రత శిరోద్కర్ 2000వ సంవత్సరంలో వచ్చిన 'వంశీ' చిత్రంలో మొదటిసారి కలిసి నటించారు. ఆ సినిమా షూటింగ్ సమయంలోనే వీరి మధ్య ప్రేమ చిగురించింది. పెళ్లి తర్వాత నమ్రత నటనకు స్వస్తి చెప్పినప్పటికీ, మహేశ్​ కెరీర్​కు సంబంధించిన బిజినెస్ వ్యవహారాలు నిర్మాణ బాధ్యతలను ఆమె దగ్గరుండి చూసుకుంటున్నారు.

రాజీవ్ కనకాల - సుమ
రాజీవ్ కనకాల సినిమాల్లో సహాయ నటుడిగా రానిస్తుంటే, సుమ బుల్లితెరపై తిరుగులేని యాంకర్​గా గుర్తింపు పొందారు. వీరిద్దరూ కెరీర్ మొదట్లోనే ప్రేమలో పడ్డారు. పెళ్లి సమయంలో కొన్ని అడ్డంకులు వచ్చినా చివరికి అందరిని ఒప్పించి ఒకటయ్యారు. వీరిద్దరూ కలిసి కొన్ని టీవీ షోలు ఈవెంట్లలో సందడి చేస్తుంటారు. వినోద రంగంలోని రెండు వేర్వేరు విభాగాల్లో ఉన్నప్పటికీ, ఒకరి వృత్తిని మరొకరు ప్రోత్సహించుకుంటూ దశాబ్దాలుగా అన్యోన్యంగా ఉంటున్నారు.

శివ బాలాజీ - మధుమిత
శివ బాలాజీ, మధుమిత కెరీర్ మొదట్లోనే ప్రేమలో పడ్డారు. ఆ తర్వాత పెద్దలను ఒప్పించి వీరు వివాహం చేసుకున్నారు. బిగ్ బాస్ మొదటి సీజన్ విజేతగా నిలిచిన శివ బాలాజీకి మధుమిత ప్రతి దశలోనూ అండగా నిలుస్తూ వస్తున్నారు. అప్పుడప్పుడు ఈ జంట సామాజిక అంశాలపై కూడా వారి స్టైల్​లో స్పందిస్తున్నారు.

వరుణ్ సందేశ్ - వితికా షేరు
'పడ్డానండీ ప్రేమలో మరి' అనే సినిమాలో వరుణ్ సందేశ్- వితికా షేరు కలిసి నటించారు. ఆ సినిమా సమయంలోనే వీరిద్దరి మధ్య పరిచయం ఏర్పడి పెళ్లి వరకు వెళ్లింది. బిగ్ బాస్ వంటి రియాలిటీ షోలలో కూడా వీరిద్దరూ కలిసి పాల్గొని తమ బంధం ఎంత బలమైనదో ప్రేక్షకులకు చూపించారు.

నాగ్‌ అశ్విన్ - ప్రియాంక దత్
దర్శకుడు నాగ్‌ అశ్విన్, నిర్మాత ప్రియాంక దత్​ది అరుదైన జోడీ. ఎవడే సుబ్రహ్మణ్యం సినిమా సమయంలో వీరిద్దరి మనసులు ఒకటయ్యాయి. ఇక ఆ తరువాత 'మహానటి', 'కల్కి 2898 AD' వంటి భారీ చిత్రాలను వీరిద్దరూ కలిసి నిర్మించి తెలుగు సినిమాను ప్రపంచ స్థాయికి తీసుకెళ్లారు. దర్శకుడిగా అశ్విన్ విజన్ కు, నిర్మాతగా ప్రియాంక అందిస్తున్న సహకారం పర్ఫెక్ట్​గా కుదిరింది. ఇండస్ట్రీలో ఈ కపుల్స్ సో స్పెషల్ అని చెప్పవచ్చు.

నాగ చైతన్య - శోభిత ధూళిపాళ
అక్కినేని నాగ చైతన్య, శోభిత ధూళిపాళ ఇద్దరూ తమకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు ఉన్న నటులు. శోభిత కేవలం తెలుగులోనే కాకుండా హిందీలో అలాగే వెబ్ సిరీస్​లలో కూడా మంచి పేరు తెచ్చుకుంది. వీరిద్దరి ప్రొఫెషనల్ లైఫ్​లో ఒకరినొకరు గౌరవించుకుంటూ, నటనలో తమదైన ముద్ర వేస్తూ ఇప్పుడు కొత్త జీవితాన్ని హ్యాపీగా కొనసాగిస్తున్నారు.

వరుణ్ తేజ్ - లావణ్య త్రిపాఠి
మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్- లావణ్య త్రిపాఠి 'మిస్టర్' సినిమా సెట్స్​లో మొదటిసారి కలుసుకున్నారు. ఆ తర్వాత 'అంతరిక్షం' సినిమాలో కూడా వీరు కలిసి నటించి మెప్పించారు. విభిన్నమైన కథాంశాలు ఎంచుకోవడంలో వరుణ్​కు, నటనలో తనదైన శైలి చూపించడంలో లావణ్యకు మంచి గుర్తింపు ఉంది. ఇక కొంతకాలం ప్రేమ తరువాత వీరు ఇరువురి కుటుంబ సభ్యులను ఒప్పించి గ్రాండ్​గా పెళ్లి చేసుకున్నారు. వీరికి ఒక బాబు ఉన్నాడు.

కిరణ్ అబ్బవరం - రహస్య గోరఖ్
యువ హీరో కిరణ్ అబ్బవరం తన తొలి చిత్రం 'రాజావారు రాణిగారు' లో హీరోయిన్​గా నటించిన రహస్య గోరఖ్​ను వివాహం చేసుకున్నారు. మొదటి సినిమాతోనే నటీనటులుగా మంచి గుర్తింపు తెచ్చుకున్న ఈ జోడీ, రియల్ లైఫ్​లో కూడా జంటగా మారడం విశేషం. కిరణ్ వరుస సినిమాలతో బిజీగా ఉండగా, రహస్య ఆయనకు పూర్తి మద్దతుగా నిలుస్తున్నారు.

నారా రోహిత్ - సిరి లెల్లా
నారా రోహిత్ తన రీఎంట్రీ సినిమా 'ప్రతినిధి 2' లో హీరోయిన్​గా నటించిన సిరి లెల్లాతో వివాహం చేసుకున్నారు. ఒకే సినిమాలో కలిసి నటించిన తక్కువ కాలంలోనే వీరిద్దరూ ఒకరినొకరు అర్థం చేసుకుని పెద్దల సమక్షంలో ఏడడుగులు వేశారు. నారా రోహిత్ విభిన్నమైన కథా చిత్రాలతో ప్రేక్షకులను అలరిస్తూనే, ఇప్పుడు కొత్త జీవితాన్ని ప్రారంభించారు.

సమంత - రాజ్ నిడిమోరు
స్టార్ హీరోయిన్ సమంత- ప్రముఖ దర్శకుడు రాజ్ నిడిమోరుల వివాహం సినీ వర్గాల్లో హాట్ టాపిక్ గా నిలిచిన విషయం తెలిసిందే. వీరిద్దరి కాంబినేషన్లో వచ్చిన 'ది ఫ్యామిలీ మ్యాన్ 2' వెబ్ సిరీస్ సమంతకు జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చిపెట్టడమే కాకుండా, వీరి మధ్య వృత్తిపరమైన అనుబంధాన్ని పెంచింది. రాజ్ నిడిమోరు తన విభిన్నమైన మేకింగ్ స్టైల్ తో బాలీవుడ్ లో టాప్ డైరెక్టర్​గా కొనసాగుతుండగా, సమంత తన నటనతో పాన్ ఇండియా క్రేజ్ అందుకున్నారు.

మధు శాలిని - గోకుల్ ఆనంద్
మధు శాలిని గోకుల్ ఆనంద్ ఇద్దరూ నటనపై ఉన్న మక్కువతో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన వారే. వీరిద్దరూ కలిసి ఒక వెబ్ సిరీస్​లో నటించిన సమయంలో ఏర్పడిన పరిచయం పెళ్లికి దారితీసింది. మధు శాలిని విభిన్నమైన పాత్రలతో మెప్పిస్తుండగా, గోకుల్ ఆనంద్ కూడా నటుడిగా తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకున్నారు.