విజయ్ పొలిటికల్ విక్టరీ- జననాయగన్ గ్రాండ్ రిలీజ్‌కు మేకర్స్ ప్లాన్! విడుదల ఆరోజేనా?
తమిళనాడు ఎన్నికల్లో విజయ్ పార్టీ ఊహించని రికార్డ్- త్వరలోనే థియేటర్లలోకి విజయ్ ఆఖరి సినిమా జననాయగన్ - పైరసీ, లీక్ ఇబ్బందులు ఉన్నా తగ్గని సినిమా క్రేజ్

Published : May 5, 2026 at 3:11 PM IST
Vijay Jananayagan : తమిళనాడు రాజకీయాల్లో ఇప్పుడు ఒకటే పేరు మారుమోగిపోతోంది. సినీ గ్లామర్‌ను పక్కన పెట్టి పూర్తిస్థాయి రాజకీయాల్లోకి ఎంట్రీ తొలి ఎన్నికల్లోనే ఘన విజయం అందుకున్నారు దళపతి విజయ్. ఇప్పుడు ఆయన పార్టీ టీవీకే ఎన్నికల ఫలితాల్లో మొదటి స్థానంలోకి రావడంతో అందరి దృష్టి విజయ్ ఆఖరి చిత్రం జననాయగన్ మీద పడింది. గత కొంతకాలంగా ఈ సినిమా చుట్టూ వివాదాలు, లీక్ ఇబ్బందులు చుట్టుముట్టినా, ఇప్పుడు సీన్ మొత్తం మారిపోయింది. విజయ్ రాజకీయ ప్రయాణంలో వస్తున్న ఈ అనూహ్య మార్పులు సినిమా భవిష్యత్తును ఎలా మార్చబోతున్నాయి? అసలు ఈ చిత్రం ఎప్పుడు విడుదల కానుంది? అభిమానులు ఎందుకు ఇంత ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు?
రాజకీయ పవర్- మారిన సినిమా లెక్కలు!
సినిమా రంగంలో ఉన్న క్రేజ్ రాజకీయాల్లో పవర్‌గా మారితే ఆ కిక్కే వేరుగా ఉంటుంది. దళపతి విజయ్ విషయంలో ఇప్పుడు సరిగ్గా ఇదే జరుగుతోంది. విజయ్ రాజకీయ పార్టీ టీవీకేకు తమిళనాడు ఎన్నికల్లో ప్రజల నుంచి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. మెజారిటీ రాకపోయినా విజయ్‌కి అనుకూలంగా ఉండే ఛాన్స్ ఉండటంతో, ఆఖరి సినిమా జననాయగన్‌కు ఒక్కసారిగా డిమాండ్ పెరిగిపోయింది. సీఎం కుర్చీపై ఇంకా అధికారికంగా క్లారిటీ రాకపోయినా, ఆయనే అధిపతి అని అర్ధమవుతుంది. ఇక ఈ పాజిటివ్ వేవ్ బాక్సాఫీస్ వద్ద వందల కోట్ల వసూళ్లు తెచ్చిపెట్టేలా కనిపిస్తోంది.
జననాయగన్ చిక్కులు వీడనున్నట్లేనా?
జననాయగన్ సినిమా ప్రయాణం అంత సులభంగా సాగలేదు. మొదట్లో ఈ చిత్రానికి సెన్సార్ పరంగా చాలా అడ్డంకులు ఎదురయ్యాయి. దానికి తోడు ఎడిటింగ్ రూమ్ నుంచే సినిమా లీక్ అవ్వడం చిత్ర బృందాన్ని తీవ్ర ఆందోళనకు గురిచేసింది. పైరసీ దెబ్బతో సినిమా పరిస్థితి ఏంటో అర్థం కాక బయ్యర్లు కూడా వెనక్కి తగ్గారు. కానీ ఇప్పుడు రాజకీయాల్లో విజయ్‌కి వస్తున్న ఆదరణ చూస్తుంటే, ఆ నెగటివ్ వైబ్స్ అన్నీ పోయి సినిమాకు ఒక మంచి శకునం లాగా అనిపిస్తోంది. ఈ మైలేజ్‌తో సినిమాను అత్యంత గ్రాండ్‌గా రిలీజ్ చేయడానికి నిర్మాతలకు ధైర్యం వచ్చింది.
సినిమా వచ్చేది ఎప్పుడు?
ప్రస్తుతం ఉన్న పరిస్థితుల ప్రకారం మే 8న జననాయగన్ సినిమాను విడుదల చేయడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయని ఇండస్ట్రీలో ఒక టాక్ అయితే వస్తోంది. ఈ రిలీజ్ డేట్ విషయంలో ఇంకా అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. అప్పట్లో లీక్ వ్యవహారంతో వెనక్కి తగ్గిన బయ్యర్లు ఇప్పుడు మళ్లీ ఈ సినిమాను దక్కించుకోవడానికి క్యూ కడుతున్నారు. విజయ్ రాజకీయ విజయానికి ఈ సినిమా ఒక పునాది లాంటిదని అభిమానులు గట్టిగా నమ్ముతున్నారు. అందుకే తమిళనాడు వ్యాప్తంగా ఎర్లీ మార్నింగ్ షోల కోసం భారీ ఏర్పాట్లు జరిగే అవకాశం ఉంది. మునుపెన్నడూ లేని విధంగా థియేటర్ల దగ్గర భారీ హడావుడి కనిపించబోతోందని తెలుస్తోంది.
నిర్మాతలకు ఊహించని పండగ
పొత్తులో విజయ్ ముఖ్యమంత్రి పీఠం ఎక్కడం దాదాపు ఖరారైన నేపథ్యంలో నిర్మాతలకు అది పెద్ద పండగ లాంటి వార్త అని చెప్పవచ్చు. జననాయగన్ నిర్మించిన కెవిఎన్ ప్రొడక్షన్స్‌కు పైరసీతో సంబంధం లేకుండా భారీ వసూళ్లు రావడం ఖాయమని ట్రేడ్ నిపుణులు అంచనా వేస్తున్నారు. కేవలం ఈ సినిమానే కాదు, విజయ్ గతంలో నటించిన పాత సినిమాలు కూడా ఇప్పుడు నిర్మాతలకు జాక్ పాట్‌గా మారనున్నాయి. విజయ్ ఇకపై కొత్త సినిమాలు చేయబోరు కాబట్టి, పాత సినిమాల రీ రిలీజ్‌ల ద్వారా భారీగా లాభాలు అందుకునే అవకాశం ఉంది.
విజయ్‌కి ఉన్న మాస్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. గిల్లి వంటి సినిమాలు రెండు దశాబ్దాల తర్వాత విడుదలైనా రికార్డులు సృష్టించాయి. ఇప్పుడు విజయ్ పొలిటికల్‌గా బిజీ అవుతుండటంతో, ఫ్యాన్స్ ఈ స్టార్ హీరోను వెండితెరపై చూడటానికి పాత సినిమాల వైపే మొగ్గు చూపుతారు. శివకాశి, ఖుషి, లియో వంటి బ్లాక్ బస్టర్ చిత్రాలు మళ్లీ థియేటర్లలోకి వచ్చి రికార్డ్ కలెక్షన్స్ అందుకునే ఛాన్స్ ఉంది. గతంలో ఎన్టీఆర్, ఎంజీఆర్ విషయంలో జరిగినట్లే ఇప్పుడు విజయ్ పాత సినిమాలు కూడా పంపిణీదారులకు లాభాల పంట పండించనున్నాయి.
సినిమాలకు గుడ్ బై- ఇక పూర్తిస్థాయి పాలన
విజయ్ తన ఆఖరి సినిమాతో అటు బాక్సాఫీస్ వద్ద, ఇటు రాజకీయాల్లోనూ తన సత్తా చాటాలని గట్టిగా ఫిక్స్ అయ్యారు. షూటింగ్ దశలో ఎదురైన అడ్డంకులన్నీ ఇప్పుడు ఒక్కొక్కటిగా తొలగిపోతున్నాయి. సెన్సార్ ఇబ్బందులు కూడా ఉండవు. అయితే సీఎం సీటు ఎక్కిన తరువాత విజయ్ ఇకపై సినిమాల్లో నటించరు. పూర్తిగా పాలన మీద దృష్టి పెట్టి తన టీవీకే పార్టీని బలోపేతం చేయడమే అతని ఫోకస్. ఈ అవకాశాన్ని వాడుకుని ప్రజల మనిషిగా నిలబడాలని దళపతి భావిస్తున్నారు. రాజకీయాల్లో MGR, ఎన్టీఆర్ లాంటి స్టార్స్ తరువాత మళ్లీ ఆ స్థాయిలో ఇంపాక్ట్ చూపించాడు విజయ్. ఇక నెక్స్ట్ అతని పాలనతో ఏ విధంగా ఆకట్టుకుంటాడో చూడాలి.
OTT డీల్‌పై పైరసీ ఎఫెక్ట్ - 'జననాయకుడు' మేకర్స్‌కు రూ.70 కోట్లు నష్టం!
తమిళనాడులో విజయ్ 'విజిల్ మోత'- సినిమాల్లోనే కాదు పాలిటిక్స్‌లోనూ సూపర్ హిట్

