టాక్సిక్ 'తబాహి' సాంగ్ ఔట్ - యశ్, కియారా అడ్వాణీ మధ్య కెమెస్ట్రీ సూపర్బ్
టాక్సిక్ మూవీ నుంచి 'తబాహి' వీడియో సాంగ్ రిలీజ్ - ఆన్‌స్క్రీన్‌లో ఆకట్టుకుంటున్న యశ్, కియారా పెయిర్

Published : July 8, 2026 at 2:29 PM IST
Tabaahi Song Toxic : కేజీఎఫ్ చిత్రాల హీరో యశ్ కథానాయకుడిగా పాన్ఇండియా స్థాయిలో తెరకెక్కుతున్న టాక్సిక్ మూవీ వచ్చే నెల 26న థియేటర్లలోకి రానుంది. దీంతో చిత్రబృందం ప్రమోషన్స్‌లో జోరు పెంచింది. అందులో భాగంగానే సినిమా నుంచి 'తబాహి' సాంగ్ లిరికల్ వీడియోను మేకర్స్ బుధవారం రిలీజ్ చేశారు. 'కాలం పరదాలు కాల్చేద్దాం, మనకై మనమే జీవించుదాం!' అంటూ సాగిన ఈ పాటలో యశ్- కియారా అడ్వాణీ మధ్య కెమెస్ట్రీ అద్భుతంగా కుదిరింది. తెలుగుతో పాటు ఈ పాట హిందీ, తమిళం, కన్నడ, మలయాళ భాషల్లోనూ విడుదలైంది.
బోల్డ్ డోసేజ్ కాస్త ఎక్కువగా!
అయితే కొన్ని రోజుల కిందటే తబాహి పాట పోస్టర్‌తో మూవీటీమ్ ఆడియో విడుదల చేసింది. కానీ ఈ పాట, పోస్టర్ తీవ్ర చర్చనీయాంశంగా మారింది. దీనిపై అనేక విమర్శలు వచ్చాయి. ఇందులో బోల్డ్ సన్నివేశాలు ఎక్కువగా ఉన్నాయని వాదనలు వచ్చాయి. హీరోయిన్ కియారా సైతం ఈ పాటలోని బోల్డ్ సీన్స్ తగ్గించాలని రిక్వెస్ట్ చేశారని వార్తలొచ్చాయి. కానీ, అప్పట్లోనే వీటిని ఆమె కొట్టిపారేశారు. అయితే పాట మాత్రం హాట్ టాపిక్‌గా మారింది. తాజాగా ఈ పాట పూర్తి వీడియోను మేకర్స్ సోషల్ మీడియా వేదికగా షేర్ చేసుకున్నారు. ఇప్పటి వరకూ 'టాక్సిక్' నుంచి వచ్చిన అన్ని ప్రమోషనల్ కంటెంట్ల్లోలాగే ఇందులోనూ బోల్డ్ సన్నివేశాలు ఉండడం మరోసారి చర్చకు దారితీస్తోంది.
Out beyond ideas of wrongdoing and rightdoing, There is a field. I'll meet you there.
— KVN Productions (@KvnProductions) July 8, 2026
– Rumi #Tabaahi Out now…
Kannada:https://t.co/NBxqflHI0d
Hindi:https://t.co/bOduqs0AwW
Telugu:https://t.co/RJR2Pb1gx9
Tamil:…
యశ్ హీరోగా మలయాళ దర్శకురాలు గీతూ మోహన్ దాస్ ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. భారీ యాక్షన్, మాఫియా బ్యాక్ డ్రాప్ జాన్రాలో రానున్న ఈ మూవీలో యశ్ హై- యాక్షన్ అవతార్‌లో కనిపించనున్నారు. ఇందులో మొత్తం ఐదుగురు హీరోయిన్లు నటిస్తున్నారు. కియారా అడ్వాణీ నదియా పాత్రలో కనిపించనున్నారు. కియారాతోపాటు నయనతార, రుక్మిణి వసంత్, తారా సుతారియా, హ్యుమా ఖురేషీ ఫీమేల్ లీడ్స్‌లో నటిస్తున్నారు. వాళ్లంతా ఇంతకు మునుపెన్నడూ చూడని శక్తిమంతమైన పాత్రల్లో కనిపించనున్నారు. సినిమా నుంచి ఇప్పటికే రిలీజైన గ్లింప్స్‌కు మంచి రెస్పాన్స్ రాగా, ఇప్పుడు రిలీజైన తబాహి సాంగ్‌తో అంచనాలు మరింత పెరిగాయి.
కాగా, ఈ చిత్రంలో అక్షయ్ ఒబెరాయ్, సుదేవ్ నాయర్, అమిత్ తివారీ కీలక పాత్ర పోషించనున్నారు. రవి బస్రూర్ ఈ మూవీకి సంగీతం అందిస్తున్నారు. కేవీఎన్ బ్యానర్స్‌పై యశ్, వెంకట్ కే నారాయణ నిర్మిస్తున్నారు. జాన్ విక్ యాక్షన్ డైరెక్టర్ జెజె పెర్రీ కొన్ని యాక్షన్ సన్నివేశాలకు కొరియోగ్రఫీ చేశారు. ఈ సినిమా కన్నడ, ఇంగ్లీష్, హిందీ, మలయాళం, తెలుగు, తమిళంతో పాటు ఆరు భారతీయ భాషల్లో ఒకేసారి పాన్ఇండియా లెవెల్లో గ్రాండ్‌గా విడుదల కానుంది.
ఆ కారణంగానే రిలీజ్ ఆలస్యం
వాస్తవానికి ఈ సినిమా ఈ ఏడాది మార్చిలోనే రిలీజ్ కావాల్సి ఉంది. అయితే షూటింగ్ ఆలస్యంతోపాటు పలు కారణాల వల్ల వాయిదా పడింది. తర్వాత జూన్ 04న రిలీజ్ చేస్తామని ప్రకటించారు. కానీ ప్రపంచవ్యాప్తంగా డిస్ట్రిబ్యూషన్, పార్ట్‌నర్‌షిప్ కోసం ప్రయత్నాల్లో ఆలస్యం కారణంగా మరోసారి చిత్రాన్ని వాయిదా వేశారు. దీనిపై అప్పట్లోనే మేకర్స్ క్లారిటీ ఇచ్చారు. ఎట్టకేలకు ఆగస్టు 26న విడుదల అయ్యేందుకు సిద్ధమవుతుంది. అయితే ఈ సినిమాకు అంతర్జాతీయ స్థాయిలో ప్రేక్షకుల్ని ఆకట్టుకునే సామర్థ్యం ఉందని టీమ్ నమ్ముతోంది.

