ETV Bharat / entertainment

మహేశ్ చేతికి వచ్చి ఆగిపోయిన ఆ సినిమా - జరిగి ఉంటే ఓ స్పెషల్ రికార్డ్!

ఫస్ట్ విజయ్‌కు స్టోరీ చెప్పిన సుధా కొంగర- ఆ తర్వాత అదే స్క్రిప్ట్ మహేశ్ బాబు దగ్గరకు- 2021లోనే కాంబినేషన్‌పై వచ్చిన వార్తలు

Mahesh Babu - Sudha Kongara
మహశ్ ​బాబు - సుధా కొంగర (ETV Bharat, Eenadu)
author img

By ETV Bharat Telugu Team

Published : August 30, 2026 at 11:02 AM IST

3 Min Read
Choose ETV Bharat

Mahesh Sudha Kongara Combo : సూపర్​స్టార్​ మహేశ్ బాబు కెరీర్‌లో ఎంతో మంది పెద్ద దర్శకులతో సినిమాలు వచ్చాయి. ఇప్పుడు రాజమౌళితో 'వారణాసి' చేస్తుండటంతో కెరీర్‌లోనే భారీ ప్రాజెక్ట్‌గా సిద్ధమవుతోంది. అయితే కొన్నేళ్ల క్రితం మరో డిఫరెంట్ కాంబినేషన్ కూడా దాదాపు సెట్టయ్యే వరకు వెళ్లిందట! అప్పట్లో దీనిపై రకరకాల వార్తలు వచ్చినా ఆ తర్వాత సినిమా ముందుకు వెళ్లలేదు. ఇప్పుడు సంగీత దర్శకుడు జీవీ ప్రకాశ్ కుమార్ ఆ ప్రాజెక్ట్ వెనుక అసలు కథను బయటపెట్టారు. ఆ స్క్రిప్ట్ మొదట మహేశ్ కోసం రాసింది కూడా కాదు. అక్కడి నుంచి అది ఆయన దగ్గరకు ఎలా వచ్చిందన్నది ఇప్పుడు బయటకు వచ్చింది. పూర్తి వివరాల్లోకి వెళితే!

మొదట విజయ్ కోసం ఆ కథ
జీవీ ప్రకాశ్ చెప్పిన వివరాల ప్రకారం దర్శకురాలు సుధా కొంగర ఆ కథను మొదట తమిళ స్టార్ విజయ్‌కు వినిపించారు. ఆయనకు స్క్రిప్ట్ నచ్చిందని, సినిమా చేయడానికి కూడా ఆసక్తి చూపించారని చెప్పారు. అయితే ఈ ప్రాజెక్ట్ కోసం దాదాపు ఏడాది సమయం కేటాయించాల్సి వచ్చేదట. అప్పటికే ఇతర సినిమాలతో బిజీగా ఉన్న విజయ్ అంత పెద్ద గ్యాప్ ఇవ్వలేకపోయారు. దీంతో అక్కడ సినిమా కుదరలేదు. ఆ తర్వాత సుధ అదే కథను మహేశ్​కు వినిపించారు. ఇది దాదాపు 2021 సమయంలో జరిగినట్లు జీవీ వెల్లడించారు. అప్పట్లో మహేశ్, సుధా కొంగర కలిసి సినిమా చేయబోతున్నారంటూ వార్తలు కూడా వచ్చాయి. కానీ కథ వినడం వరకు వెళ్లిన ఈ ప్రాజెక్ట్ చివరకు సెట్స్‌పైకి రాలేదు. ఎందుకు ఆగిపోయిందనే విషయంపై మాత్రం జీవీ పూర్తి వివరాలు చెప్పలేదు.

జరిగి ఉంటే మహేశ్‌కు ఇదే ఫస్ట్
సుధా కొంగర సినిమా ఫిక్స్ అయి ఉంటే మహేశ్ కెరీర్‌లో అది మరో స్పెషల్ సినిమా అయ్యేది. ఎందుకంటే ఇప్పటివరకు ఆయన మహిళా దర్శకురాలి దర్శకత్వంలో హీరోగా సినిమా చేయలేదు. ఈ తరం తెలుగు టాప్ హీరోల్లో కూడా ఇలాంటి కాంబినేషన్స్ చాలా అరుదు. ప్రభాస్, జూనియర్ ఎన్టీఆర్, పవన్ కళ్యాణ్ కూడా ఇప్పటివరకు మహిళా దర్శకురాలి సినిమాలో హీరోగా నటించలేదు. ఆ సమయంలోనే సుధా 'ఆకాశం నీ హద్దురా'తో మంచి పేరు తెచ్చుకున్నారు. అలాంటి సమయంలో మహేశ్‌తో ఆమె సినిమా మొదలై ఉంటే ఒక స్టార్ హీరో, మహిళా దర్శకురాలి కాంబినేషన్‌గా హైలెట్ అయ్యేది.

కృష్ణ మాత్రం అప్పుడే ఆ రూట్‌లో!
మహేశ్ తండ్రి కృష్ణ కెరీర్‌కు మాత్రం మరో కనెక్షన్ ఉంది. విజయ నిర్మల నటిగానే కాకుండా దర్శకురాలిగా కూడా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఆమె దర్శకత్వంలో కృష్ణ పలు సినిమాల్లో నటించారు. స్టార్ హీరోగా ఉన్న సమయంలోనే మహిళా దర్శకురాలితో వరుసగా పనిచేయడం అప్పట్లోనే ఒక రికార్డ్. విజయ నిర్మల తెలుగు సినిమా చరిత్రలో ఎక్కువ చిత్రాలకు దర్శకత్వం వహించిన మహిళా దర్శకుల్లో ఒకరిగా నిలిచారు. కృష్ణతో ఆమె చేసిన సినిమాలు కూడా మంచి ఫలితాలను అందుకున్నాయి. అందుకే మహేశ్, సుధా కొంగర సినిమా జరిగి ఉంటే తండ్రి కెరీర్‌లో కనిపించిన ఓ స్పెషల్ కాంబో కొడుకు కెరీర్‌లో కూడా కనిపించేది.

ఇప్పుడు మొత్తం ఫోకస్ వారణాసిపైనే
ప్రస్తుతం మాత్రం మహేశ్ పూర్తిగా రాజమౌళి వారణాసితో బిజీగా ఉన్నారు. సినిమా షూటింగ్ గ్యాప్ లేకుండా జరుగుతుండగా ఇప్పటికే మెజారిటీ షూట్ పూర్తయినట్లు సమాచారం. రాజమౌళి సినిమా కావడంతో మహేశ్ కూడా ఈ ప్రాజెక్ట్‌కు ఎక్కువ సమయం కేటాయిస్తున్నారు. ఇక సుధా కొంగరతో అప్పట్లో ఆగిపోయిన సినిమా మళ్లీ మొదలవుతుందనే సమాచారం ఇప్పటివరకు లేదు. ఇక మరోసారి భవిష్యత్తులో ఆమె మహేశ్ బాబు దగ్గరకు వెళతారో లేదో చూడాలి.

'అర్ధరాత్రి 12:45 గంటలకు ఆ స్టార్ హీరో నుంచి కాల్' - సుధా కొంగర ఎమోషనల్​!

దూకుడు రీరిలీజ్- ఆ డైలాగ్ విన్నాకే శంకర్ సినిమా వదులుకున్న మహేశ్! అసలేం జరిగిందంటే?