'ది కేరళ స్టోరీ 2' రివ్యూ- సినిమా ఎలా ఉందంటే?
దీ కేరళ స్టోరీ 2 సినిమా రివ్యూ మీకోసం!

Published : February 28, 2026 at 10:09 AM IST
Kerala Movie Part 2 : విడుదలకు ముందే వివాదాలతో వార్తల్లో నిలిచిన చిత్రం 'ది కేరళ స్టోరీ 2: తదుపరి కథ' విడుదలకు ఒక్కరోజు ముందు కేరళ హైకోర్టు స్టే విధించగా, మరుసటి రోజే డివిజన్ బెంచ్ గ్రీన్‌సిగ్నల్ ఇవ్వడంతో దేశవ్యాప్తంగా శుక్రవారం సెకండ్ షోలతో ప్రేక్షకుల ముందుకొచ్చింది. తొలి భాగం తరహాలోనే ఆ చిత్రంలోనూ వివాదాస్పద అంశాలున్నాయా? దర్శకుడు ఈసారి ఎంచుకున్న కథాంశం ఏమిటి? చూద్దాం.
కథేంటంటే?
స్వతంత్ర భావాలు కలిగిన నేటితరం యువతులు సురేఖ (ఉల్కా గుప్త), దివ్య (అదితి భాటియా), నేహా (ఐశ్వర్య ఓజా) కథ ఇది. కేరళకు చెందిన సురేఖ యూపీఎస్సీకి సిద్ధమవుతుంటుంది. జర్నలిస్ట్ సలీమ్ (సుమిత్ గహ్లావత్)తో పరిచయం ప్రేమగా మారి, లివింగ్ ఇన్ రిలేషన్‌కు దారితీస్తుంది. దివ్య సోషల్‌మీడియా ఇన్‌ఫ్లూయెన్సర్‌గా గుర్తింపు పొందాలని ఆశపడుతుంది. లైక్‌లు, షేర్‌ల కోసం చేసే వెకిలి డ్యాన్స్‌లను తల్లిదండ్రులు అంగీకరించరు. ఈ సమయంలో పరిచయమైన రషీద్ (యుక్త ఖోస్లా) ప్రేమ పేరుతో ఆమెకు అండగా ఉంటానని నమ్మబలుకుతాడు.
ఇక జావెలిన్ త్రోలో రాణిస్తున్న నేహా జాతీయస్థాయి పోటీలకు సిద్ధమవుతుంటుంది. రాజు అలియాస్ ఫైజన్ ఆమెను ప్రేమ పేరుతో తనవైపు తిప్పుకుని, దిల్లీలో ప్రఖ్యాత శిక్షకుడితో ట్రైనింగ్ ఇప్పిస్తానని మాయమాటలు చెబుతాడు. తల్లిదండ్రుల మాటలను పెడచెవిన పెట్టి ప్రేమించిన వారితో వెళ్లిన ఈ ముగ్గురు యువతుల జీవితాలు ఎటు దిశగా మళ్లాయి? ఆ ప్రేమే ఓ పెద్ద మోసం అని తెలుసుకున్నాక వారు తీసుకున్న నిర్ణయం ఏమిటి? అన్నదే కథాంశం.
ఎలా ఉందంటే
తొలి భాగంలో మతమార్పిడి, విదేశాలకు పంపడం వంటి అంశాలతో వివాదం రేపిన ఈ ఫ్రాంచైజీ, రెండో భాగంలోనూ అదే తరహా భావజాలాన్ని కొనసాగించింది. ప్రచార చిత్రాల ద్వారానే అసలు కథను దర్శకుడు స్పష్టంగా చెప్పేశారు. ప్రేమ పేరుతో యువతులను మోసం చేసి మతం మార్చడం, మాట వినకపోతే చిత్రహింసలకు గురిచేయడం వంటి అంశాలను కొన్ని వాస్తవ సంఘటనల ఆధారంగా తీసుకున్నామని దర్శకుడు కామాఖ్య నారాయణ్ సింగ్ తెలిపారు.
నేటి జెన్-జీ యువత తీసుకునే తొందరపాటు నిర్ణయాలు, తల్లిదండ్రుల మాటలను లెక్క చేయనితనం వల్ల ఎదురయ్యే పరిణామాలను కళ్లకు కట్టేలా చూపించారు. అయితే మొత్తం పరిస్థితి ఇదేనా? అనే సందేహం కలిగేలా కొన్ని సన్నివేశాల్లో సినిమాటిక్ లిబర్టీ స్పష్టంగా కనిపిస్తుంది. కొంత వాస్తవం, కొంత కల్పితం కలిపి కథను నడిపినట్లు అనిపిస్తుంది.
మూడు ప్రాంతాల్లో ముగ్గురు యువతుల కథలను సమాంతరంగా ఆవిష్కరించిన తీరు ఆకట్టుకుంటుంది. ప్రారంభ భాగంలో వారి కలలు, ఆశయాలు, కుటుంబాల నమ్మకం వంటి అంశాలను చూపిస్తూ కథను స్థాపించారు. ప్రేమలో పడే క్రమాన్ని చూపించడంలో కొంత సాగదీత కనిపించినా, వారు మోసపోయిన విషయం తెలిసే సన్నివేశాలతో ఇచ్చిన విరామం ద్వితీయార్ధంపై ఆసక్తి పెంచుతుంది.
రెండో భాగంలో కథ వేగం పెరుగుతుంది. మోసం బయటపడిన తర్వాత యువతులు ఎదుర్కొనే చిత్రహింసలు ఒళ్లు గగుర్పొడిచేలా ఉంటాయి. డబ్బు కోసం ఎంతటి దారుణాలకు ఒడిగడతారో చూపించిన విధానం కఠినంగా అనిపిస్తుంది. సురేఖ, దివ్యల పాత్రలను ముగించిన తీరు భావోద్వేగానికి గురిచేస్తుంది. నేహా పోలీసులను ఆశ్రయించే సన్నివేశాల తర్వాత కథలో వేగం పెరుగుతుంది. యువకులు, వారి కుటుంబాలపై పోలీసుల చర్యలు, 'బుల్డోజర్ న్యాయం' వంటి అంశాలు కొందరికి కనెక్ట్ అయ్యేలా తీర్చిదిద్దారు. అయితే కొన్ని చోట్ల దర్శకుడు మరీ స్వేచ్ఛ తీసుకున్నాడేమో అనిపిస్తుంది. మూడు ప్రాంతాల్లో సాగే కథకు 'ది కేరళ స్టోరీ 2' అనే పేరు ఎందుకు పెట్టారన్న ప్రశ్న తలెత్తుతుంది.
ఎవరెలా చేశారంటే?
బాధిత యువతులుగా ఉల్కా గుప్త, అదితి భాటియా, ఐశ్వర్య ఓజా హృదయానికి హత్తుకునే నటన ప్రదర్శించారు. ముఖ్యంగా నేహా పాత్ర భావోద్వేగంగా నిలుస్తుంది. యువతులను ట్రాప్ చేసే పాత్రల్లో సుమిత్ గహ్లావత్, అర్జున్ సింగ్, యుక్త ఖోస్లా కర్కశత్వాన్ని సమర్థంగా చూపించారు. వారి నటనతోనే కొన్ని సన్నివేశాలు బలంగా నిలిచాయి.
సాంకేతికంగా సినిమా మెరుగ్గా ఉంది. రచయితలు విపుల్ అమృతల్ షా, అమర్‌నాథ్ ఝా కొన్ని వాస్తవ సంఘటనలకు తమదైన రూపకల్పన ఇచ్చారు. క్లైమాక్స్ సన్నివేశాలు కాస్త అతిశయంగా అనిపిస్తాయి. దర్శకుడు కథను ఒక కోణం నుంచే చూపించడం అన్ని వర్గాలకూ నచ్చకపోవచ్చు. 'అబ్దుల్ కలాం లాంటి వారు, ఆస్కార్ గెలుచుకున్న సంగీత దర్శకులు, గొప్ప గాయకులు, సినిమా తారలను చూసి ఈ దేశం గర్వపడుతుంది' అనే డైలాగ్‌తో సమతుల్యత సాధించే ప్రయత్నం చేశారు.
బలాలు
- ప్రధాన నటీనటుల నటన
- కథాంశం
- ద్వితీయార్ధం, క్లైమాక్స్
బలహీనతలు
- ఒక కోణం నుంచే కథను నడపడం
- సినిమాటిక్ లిబర్టీ అధికం
- నేటి యువతకు హెచ్చరికగా నిలిచే ప్రయత్నమే 'ది కేరళ స్టోరీ 2'.

