ETV Bharat / entertainment

టాలీవుడ్‌లో టైటిల్స్ రిపీట్ - ఒకసారి వాడిన టైటిల్స్​ను మళ్లీ ఎవరెవరు వాడారంటే!

పాత హిట్ చిత్రాల టైటిల్స్​పై నేటి హీరోల ఆసక్తి - కమల్ హాసన్ క్లాసిక్ టైటిల్స్​తో యువ హీరోల ప్రయోగాలు.

Tollywood Reused Titles
Tollywood Reused Titles (Movie Posters)
author img

By ETV Bharat Telugu Team

Published : March 2, 2026 at 1:06 PM IST

4 Min Read
Choose ETV Bharat

Tollywood Reused Titles : తెలుగు సినిమా రంగంలో టైటిల్స్ విషయంలో ఒక విచిత్రమైన సెంటిమెంట్ ఉంటుంది. ఒకప్పుడు బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపించిన పాత క్లాసిక్ సినిమాల పేర్లను వాడితే, ఆ క్రేజ్ కొత్త సినిమాలకు కూడా తోడవుతుందని మేకర్స్ భావిస్తుంటారు. అందుకే లెజెండరీ నటులైన ఎన్టీ రామారావు, ఏఎన్నార్ నుంచి పవర్ స్టార్ పవన్ కల్యాణ్ వరకు ఎంతో మంది హిట్ సినిమాల టైటిల్స్ మళ్లీ రిపీట్ అవుతున్నాయి. ఈ ట్రెండ్ వల్ల కొత్త తరం ప్రేక్షకులకు ఆ పేర్ల వెనుక ఉన్న గొప్పతనం తెలుస్తోంది. మరి టాలీవుడ్​లో ఏయే పాత టైటిల్స్​ను మళ్లీ ఏ హీరోలు వాడారో ఆ ఆసక్తికరమైన వివరాలు ఇప్పుడు చూద్దాం.

కమల్ హాసన్ క్లాసిక్స్
విశ్వనటుడు కమల్ హాసన్ కెరీర్​లో బిగ్ హిట్స్​గా నిలిచిన సినిమాల టైటిల్స్​ను నేటి తరం యువ హీరోలు ఎక్కువగా వాడుకున్నారు.1986లో కమల్ హాసన్ నటించిన స్వాతిముత్యం టైటిల్​ను 2022లో బెల్లంకొండ గణేష్ తన సినిమా కోసం తీసుకున్నారు. అలాగే 1987లో వచ్చిన ప్రయోగాత్మక చిత్రం పుష్పక విమానం పేరును 2021లో ఆనంద్ దేవరకొండ వాడగా, 1978 నాటి క్లాసిక్ మరోచరిత్ర టైటిల్​తో 2010లో వరుణ్ సందేశ్ ప్రేక్షకుల ముందుకు వచ్చారు.

ఎన్టీఆర్, ఏఎన్నార్ లెజెండరీ టైటిల్స్
నటరత్న ఎన్టీ రామారావు, నటసామ్రాట్ ఏఎన్నార్​ల టైటిల్స్​కు టాలీవుడ్​లో ఎప్పుడూ డిమాండ్ ఉంటుంది. 1963లో ఎన్టీ రామారావు చేసిన బందిపోటు పేరుతో 2015లో అల్లరి నరేష్ సినిమా చేయగా, 1977 నాటి సంచలనం అడవి రాముడు టైటిల్​ను 2004లో ప్రభాస్ వాడారు.
ఇక ఏఎన్నార్ నటించిన శ్రీమంతుడు (1971) పేరుతో 2015లో మహేష్ బాబు బ్లాక్ బస్టర్ హిట్ అందుకోగా, 1951 నాటి మల్లీశ్వరి పేరును 2004లో వెంకటేష్ తన రొమాంటిక్ కామెడీ కోసం ఉపయోగించారు. అలాగే 1955లో ఎన్టీఆర్, ఏఎన్నార్ కలిసి నటించిన మిస్సమ్మ టైటిల్​ను 2003లో శివాజీ, భూమిక నటించిన చిత్రం కోసం తీసుకున్నారు.

ఏఎన్నార్, చిరంజీవి టైటిల్స్ ఇలా
1976లో ఏఎన్నార్ నటించిన ఆరాధన టైటిల్​ను 1987లో చిరంజీవి వాడగా, 1961 నాటి ఏఎన్నార్ చిత్రం ఇద్దరు మిత్రులు పేరుతో 1999లో చిరంజీవి మళ్లీ సినిమా చేశారు. ఇక 1952లో ఏఎన్నార్ చేసిన ప్రేమ టైటిల్​ను 1989లో వెంకటేష్ వాడుకోగా, 1953 నాటి ఎవర్ గ్రీన్ క్లాసిక్ దేవదాసు పేరుతో 2006లో రామ్ పోతినేని తన కెరీర్​ను ఘనంగా ప్రారంభించారు.

మెగాస్టార్ చిరంజీవి మాస్ టైటిల్స్
1991లో వచ్చిన ఇండస్ట్రీ హిట్ గ్యాంగ్ లీడర్ టైటిల్​ను 2019లో నాని వాడగా, 1986 నాటి రాక్షసుడు పేరును 2019లో బెల్లంకొండ శ్రీనివాస్ ఉపయోగించారు. చిరంజీవి 1985లో నటించిన విజేత టైటిల్​తో ఆయన మాజీ అల్లుడు కల్యాణ్ దేవ్ 2018లో ఎంట్రీ ఇచ్చారు. అలాగే ముగ్గురు మొనగాళ్లు (1994) పేరును 2021లో శ్రీనివాస్ రెడ్డి, రుద్రవీణ (1988) పేరును 2022లో శ్రీరామ్ నిమ్మల తమ సినిమాల కోసం వాడుకున్నారు.

రాజేంద్ర ప్రసాద్ కామెడీ టైటిల్స్ రిపీట్
1992లో రాజేంద్రప్రసాద్ నటించిన బృందావనం పేరుతో 2010లో జూనియర్ ఎన్టీఆర్ మాస్ హిట్ కొట్టాడు. 1959 నాటి ఎన్టీఆర్ చిత్రం అప్పుచేసి పప్పుకూడు పేరును 2008లో రాజేంద్ర ప్రసాద్ తన సినిమా కోసం వాడుకోవడం విశేషం. అలాగే రాజేంద్ర ప్రసాద్ కెరీర్​లో బిగ్ హిట్​గా నిలిచిపోయిన ఆ ఒక్కటీ అడక్కు (1992) టైటిల్​ను 2024లో అల్లరి నరేష్ తన లేటెస్ట్ కామెడీ ఎంటర్టైనర్ కోసం ఉపయోగించారు.

వెంకటేష్, నాగార్జున సూపర్ హిట్స్
1992లో వెంకటేష్ నటించిన సుందరకాండ టైటిల్​ను 2024లో నారా రోహిత్ వాదుకున్నాడు. 1998 నాటి గణేష్ పేరుతో 2009లో రామ్ పోతినేని సినిమా చేశారు. నాగార్జున కెరీర్​లోని ట్రెండ్ సెట్టర్స్ అయిన మజ్ను (1987) టైటిల్​ను 2016లో నాని, గీతాంజలి (1989) పేరును 2014లో అంజలి (కథానాయిక ప్రధాన చిత్రం) తమ సినిమాల కోసం ఎంచుకున్నారు.

పవన్ కల్యాణ్ క్రేజీ టైటిల్స్ పై యువ హీరోల కన్ను
1998 నాటి తొలిప్రేమ టైటిల్ ను 2018లో వరుణ్ తేజ్ వాడుకుని హిట్ కొట్టగా, 2001 నాటి సెన్సేషన్ ఖుషి పేరుతో 2023లో విజయ్ దేవరకొండ ప్రేక్షకుల ముందుకు వచ్చారు. పవన్ 1999లో చేసిన తమ్ముడు టైటిల్​తో 2025లో నితిన్ వచ్చాడు. పవన్ తొలి చిత్రం అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి (1996) పేరును 2025లో ప్రదీప్ మాచిరాజు తన హీరో ఎంట్రీ కోసం వాడుకుంటున్నారు.

చిరస్థాయిగా నిలిచిపోయిన ఆ టైటిల్స్
తెలుగు సినిమా చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయిన కొన్ని గొప్ప చిత్రాల టైటిల్స్ మళ్లీ నేటి తరం సినిమాలకు పెట్టారు. 1957 నాటి అద్భుతం మాయాబజార్ పేరును 2006లో రాజా, భూమిక సినిమాకు వాడారు. 1980 నాటి క్లాసిక్ శంకరాభరణం పేరును 2015లో నిఖిల్ సిద్ధార్థ్ ఉపయోగించారు. ఎన్టీఆర్, కృష్ణ కలిసి నటించిన దేవుడు చేసిన మనుషులు (1973) టైటిల్​ను 2012లో రవితేజ తన సినిమా కోసం ఎంచుకోవడం విశేషం.

నేటి తరం ప్రయోగాలు - నారీ నారీ నుంచి పెళ్లిసందడి వరకు
సీనియర్ హీరోల పాపులర్ టైటిల్స్​ను నేటి యువ హీరోలు పర్ఫెక్ట్​గా వాడుతున్నారు. బాలకృష్ణ నటించిన నారీ నారీ నడుమ మురారి (1990) పేరును 2026 సంక్రాంతికి శర్వానంద్ వాడుకోగా, అంతకుముందు శర్వానంద్ ఆడవాళ్లు మీకు జోహార్లు (1981 కృష్ణంరాజు) టైటిల్​తో కూడా మెప్పించారు. శ్రీకాంత్ హిట్ మూవీ పెళ్లిసందడి (1996) పేరుతో 2021లో రోషన్ మేక గ్రాండ్ హిట్ కొట్టాడు. కృష్ణ నటించిన అశ్వత్థామ (1988) పేరును 2020లో నాగ శౌర్య తన యాక్షన్ థ్రిల్లర్ కోసం తీసుకున్నారు.

మహేశ్​, సుధీర్ బాబు
1971లో కృష్ణ నటించిన మోసగాళ్లకు మోసగాడు పేరును 2015లో సుధీర్ బాబు వాడగా, 1988 నాటి మహర్షి టైటిల్​తో 2019లో మహేశ్​ బాబు తన 25వ సినిమాతో రికార్డులు సృష్టించారు. నితిన్ నటించిన ఇష్క్ (2012) టైటిల్​ను 2021లో తేజ సజ్జా సెలెక్ట్ చేసుకున్నాడు.