ప్రభాస్ 'ది రాజాసాబ్' రివ్యూ- హారర్ థ్రిల్లర్ ఎలా ఉందంటే?
థియేటర్లలోకి వచ్చిన 'రాజాసాబ్'- సినిమా రివ్యూ మీకోసం!

Published : January 9, 2026 at 7:14 AM IST
|Updated : January 9, 2026 at 7:20 AM IST
Rajasaab Movie Review : పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా దర్శకుడు మారుతి తెరకెక్కించిన తాజా చిత్రం ది రాజాసాబ్’ ఈరోజు (జనవరి 9, 2026) ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇటీవలి కాలంలో ప్రభాస్ నటించిన చిత్రాలన్నీ భారీ స్థాయి, సీరియస్ కథలతో సాగగా, ఈసారి మాత్రం పూర్తిగా భిన్నమైన జాన్రాను ఎంచుకున్నారు. ఫాంటసీ హారర్ థ్రిల్లర్‌గా రూపొందిన ది రాజాసాబ్ ద్వారా వింటేజ్ ప్రభాస్‌ను మళ్లీ చూపించాలన్నదే చిత్రబృందం లక్ష్యంగా ప్రచారం చేసింది. మరి ఆ ప్రయత్నం ఎంతవరకు ఫలించింది? ప్రేక్షకులకు సినిమా ఏ స్థాయి అనుభూతిని ఇచ్చింది? ఇప్పుడు చూద్దాం.
కథ విషయానికి వస్తే
ఒకప్పుడు దేవనగర సంస్థానానికి చెందిన జమీందారు గంగాదేవి (జరీనా వాహబ్). గత వైభవాన్ని వదిలేసి మనవడు రాజు అలియాస్ రాజాసాబ్ (ప్రభాస్)తో కలిసి సాధారణ జీవితం గడుపుతుంది. వయసు కారణంగా మతిమరుపు సమస్యతో బాధపడుతున్న గంగమ్మ చాలా విషయాలు మర్చిపోయినా, తన భర్త కనకరాజు (సంజయ్ దత్)ను మాత్రం మరిచిపోదు. కలల్లో కనిపిస్తున్న తన భర్తను వెతికి తీసుకురావాలని రాజాసాబ్‌ను కోరుతుంది.
అయితే, అసలు విషయం ఏమిటంటే, మార్మిక విద్యల్లో నిపుణుడైన కనకరాజే నానమ్మ, మనవడిని నర్సాపూర్ అడవిలోని రాజమహల్‌కు రప్పిస్తాడు. అక్కడ జరిగే సంఘటనలు రాజాసాబ్ జీవితాన్ని పూర్తిగా మార్చేస్తాయి. కనకరాజు గతం ఏమిటి? అతని లక్ష్యం ఏంటి? రాజాసాబ్ ఈ ప్రమాదాల నుంచి ఎలా బయటపడ్డాడు? భైరవి (మాళవిక మోహనన్), బ్లెస్సీ (నిధి అగర్వాల్)గా పరిచయమైన మహిళల పాత్ర ఏమిటి? అనే ప్రశ్నలకు సమాధానాలు తెరపైనే తెలుసుకోవాల్సిందే.
సినిమా విశ్లేషణలోకి వెళ్తే
లార్జర్ దెన్ లైఫ్ పాత్రలతోనే అలవాటైన ప్రభాస్ ఈసారి కామెడీ టచ్ ఉన్న ఫాంటసీ హారర్ జానర్‌ను ఎంచుకోవడం ప్రశంసనీయం. అలాగే అలాంటి స్టార్‌తో ఈ తరహా సినిమా చేయాలని దర్శకుడు మారుతి ముందుకు రావడం కూడా మంచి ప్రయత్నమే. సినిమా ప్రారంభమైన కొద్దిసేపటికే ఒకప్పటి సరదా ప్రభాస్ మళ్లీ కనిపించాడన్న భావన ప్రేక్షకుల్లో కలుగుతుంది. కామెడీ టైమింగ్, ఎనర్జీతో ప్రభాస్ పాత్రను ఆసక్తికరంగా తీర్చిదిద్దారు.
అయితే, కథను తెరపై ఆవిష్కరించడంలో దర్శకుడికి కొంత తడబాటు కనిపిస్తుంది. ముఖ్యంగా ప్రథమార్థం ఆశించిన స్థాయిలో ప్రభావం చూపదు. హారర్ ఎలిమెంట్స్ ఉన్నప్పటికీ టెన్షన్ బిల్డ్‌అప్ సరిగా లేకపోవడంతో అవి పూర్తిగా ఎంగేజ్ చేయలేకపోయాయి. కామెడీ సన్నివేశాలు నవ్విస్తాయిగానీ కొత్తదనం మాత్రం కొరవడింది. పాటలు కూడా ప్రత్యేకంగా గుర్తుండిపోయేలా లేవు.
ద్వితీయార్థంలో మాత్రం ప్రభాస్- సంజయ్ దత్ మధ్య నడిచే సంఘర్షణ సినిమాకు ప్రధాన బలంగా నిలుస్తుంది. కనకరాజు పాత్రలో సంజయ్ దత్ మైండ్ గేమ్స్, మార్మిక శక్తులతో హీరోకు సవాల్ విసిరే తీరు ఆకట్టుకుంటుంది. భారీ విజువల్ ఎఫెక్ట్స్‌తో తెరకెక్కించిన పతాక సన్నివేశాలు సినిమాను నిలబెట్టాయి. ఇక్కడ ప్రభాస్ నటన, యాక్షన్, కామెడీ కలగలిసిన ప్రదర్శన అభిమానులను సంతృప్తిపరుస్తుంది.
నటీనటుల విషయానికి వస్తే
ప్రభాస్ తన లుక్, ఎనర్జీతో అభిమానులను మెప్పించాడు. మాళవిక మోహనన్ గ్లామర్‌తో పాటు యాక్షన్ సన్నివేశాల్లోనూ ఆకట్టుకుంది. నిధి అగర్వాల్ పాటలకే పరిమితమైంది. కనకరాజుగా సంజయ్ దత్ బలమైన పాత్రలో కనిపించినా, పరిచయం చేసిన స్థాయిలో పాత్ర పూర్తిగా వినియోగించుకోలేదన్న భావన కలుగుతుంది. జరీనా వాహబ్ పాత్ర ఈ కథకు ప్రాణం.
సాంకేతికంగా చూస్తే
తమన్ నేపథ్య సంగీతం సినిమాకు ప్రధాన బలం. కార్తిక్ పళణి సినిమాటోగ్రఫీ ఆకట్టుకుంటుంది. విజువల్ ఎఫెక్ట్స్, నిర్మాణ విలువలు ఉన్నతంగా ఉన్నాయి. అయితే ఎడిటింగ్, కథనంలో ఇంకాస్త పదును పెట్టాల్సిందన్న అభిప్రాయం కలుగుతుంది.
మొత్తంగా చెప్పాలంటే
ది రాజాసాబ్ పూర్తి స్థాయి హారర్ థ్రిల్లర్ అనుభూతిని ఇవ్వకపోయినా, చాలా రోజుల తర్వాత ప్రభాస్‌ను సరదా, కామెడీ టచ్ ఉన్న పాత్రలో చూడాలనుకునే అభిమానుల కోసం ఈ సినిమా ఒకసారి చూడదగినదే.
గమనిక: ఇది సమీక్షకుడి వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే.
'రాజాసాబ్‌కు రూ.100కోట్ల ఓపెనింగ్స్ పక్కా'- నార్త్ USలో అప్పుడే రూ.8.3 కోట్లు!

