పెళ్లయ్యాక 'విరోష్' ఫస్ట్ అప్డేట్- 'రణబాలి' స్పెషల్ సర్ప్రైజ్ వావ్ అనేలా ఉందే!
కొత్త జంటకు గిఫ్ట్- రణబాలి స్పెషల్ డబుల్ సర్ప్రైజ్ - కొన్ని బంధాలు శాశ్వతం అనే ట్యాగ్‌తో పోస్టర్ - ఏందయ్యా సామి సాంగ్‌లో 90s వైబ్స్

Published : February 28, 2026 at 11:21 AM IST
Ranabaali Movie Special Surprise : రౌడీ బాయ్‌గా యువత హృదయాల్లో ప్రత్యేక స్థానం సంపాదించుకున్న విజయ్ దేవరకొండ మరోసారి తన అభిమానులకు సర్‌ప్రైజ్ ఇచ్చారు. ఆయన, దర్శకుడు రాహుల్ సంకృత్యాన్ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న తాజా చిత్రం 'రణబాలి' ఇప్పటికే టాలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారింది. ఆ చిత్రంలో విజయ్ సరసన నేషనల్ క్రష్ రష్మిక మందన్న హీరోయిన్‌గా నటిస్తున్నారు. తెరపై వీరిద్దరి జంటకు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇప్పుడు అదే జంట రియల్ లైఫ్‌లో కూడా ఒక్కటవ్వడంతో అభిమానుల్లో ఆనందానికి అవధుల్లేవు. దీంతో రణబాలి చిత్ర బృందం ఒక సర్ప్రైజ్ అప్డేట్ ఇచ్చింది.
'రణబాలి' డబుల్ సర్ప్రైజ్
ఫిబ్రవరి 26న విజయ్ దేవరకొండ – రష్మిక మందన్నలు బంధుమిత్రుల సమక్షంలో వివాహ బంధంతో ఒక్కటయ్యారు. ఆ శుభసందర్భాన్ని మరింత ప్రత్యేకంగా మార్చేందుకు 'రణబాలి' చిత్రబృందం అభిమానులకు డబుల్ ట్రీట్ ఇచ్చింది. కొత్త జంటకు గిఫ్ట్‌గా పోస్టర్‌తో పాటు 'ఏందయ్యా సామి' పేరుతో ఓ ప్రత్యేక సర్ప్రైజ్ సాంగ్‌ను విడుదల చేసింది. పాట విడుదలైన కొద్దిసేపటికే సోషల్ మీడియాలో వైరల్ అయింది. యూట్యూబ్, ఇన్‌స్టాగ్రామ్, ఎక్స్ వేదికలపై ఈ సాంగ్‌కు లక్షల్లో వ్యూస్ వస్తుండటం విశేషం.
కొన్ని బంధాలు శాశ్వతం
చిత్రబృందం విడుదల చేసిన పోస్టర్ కూడా ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. "కొన్ని బంధాలు శాశ్వతం" అనే క్యాప్షన్‌తో రిలీజ్ చేసిన ఈ పోస్టర్‌లో విజయ్ – రష్మికలు భార్యాభర్తలుగా కనిపిస్తున్నారు. ఒక బల్లపై పక్కపక్కన కూర్చుని ఉన్న వీరి లుక్ చాలా సింపుల్‌గా, అచ్చం పల్లెటూరి వాతావరణాన్ని గుర్తు చేసేలా ఉంది. పోస్టర్ చూస్తేనే కథలోని భావోద్వేగాల్ని అర్థం చేసుకోవచ్చని సినీ విశ్లేషకులు చెబుతున్నారు.
పోస్టర్‌లో విజయ్ దేవరకొండ 'రణబాలి' పాత్రలో పూర్తిగా లీనమైనట్లు కనిపిస్తున్నారు. గంభీరమైన చూపు, మౌనంలో దాగిన భావోద్వేగం, సాదాసీదా దుస్తుల్లోనూ కనిపించే ఆ వ్యక్తిత్వం పోస్టర్‌కు ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. మరోవైపు రష్మికా 'జయమ్మ' పాత్రలో నిజమైన పల్లెటూరి అమ్మాయిలా మెరిసిపోతున్నారు. పెళ్లి కూతురు అలంకరణలో అమాయకత్వం, కొత్త ఇంటికి వెళ్లే ఆత్రుత, కొంచెం భయం – అన్నీ ఆమె ముఖ కవళికల్లో స్పష్టంగా కనిపిస్తున్నాయి. పాత్రలో జీవించినట్టే రష్మిక నటన ఉందని అభిమానులు కామెంట్లు చేస్తున్నారు.
ఏందయ్యా సామిలో 90s వైబ్స్
ఇక 'ఏందయ్యా సామి' పాట విషయానికి వస్తే, పూర్తిగా 90s వైబ్‌ను మళ్లీ గుర్తు చేస్తోంది. స్వచ్ఛమైన జానపద గేయంలా సాగుతూ అందరినీ ఆకట్టుకుంటోంది. గ్రామీణ నేపథ్యానికి తగ్గట్టుగా సాగే రిథమ్ పాటను ప్రత్యేకంగా నిలబెట్టాయి. సంగీత ప్రియులు సాంగ్‌ను విపరీతంగా షేర్ చేస్తున్నారు. పాటలో కొత్తగా పెళ్లైన జంటను అత్తవారింటికి ఆహ్వానించే సన్నివేశాలు ఎంతో మంచిగా చిత్రీకరించారు. ఇంటి ముందు తోరణాలు, రంగవల్లులు, పల్లెటూరి ఆడపడుచుల పాటలు – మొత్తం సన్నివేశం అచ్చం పాతకాలపు తెలుగు ఇంటి వాతావరణాన్ని తలపిస్తోంది. కొత్త మనుషులు, కొత్త ఇంటి వాతావరణం చూసి కొంచెం భయపడే కొత్త కోడలిగా రష్మిక నటన ఆకట్టుకుంటోంది.
ఈ పాటలో విజయ్ – రష్మికల మధ్య కెమిస్ట్రీ సహజంగా ఉందని అభిమానులు అభిప్రాయపడుతున్నారు. వారి మధ్య చూపులు, చిన్నచిన్న నవ్వులు, మాటలకన్నా భావాలు ఎక్కువగా చెప్పే క్షణాలు – ఇవన్నీ తెరపై ఎంతో సహజంగా కనిపిస్తున్నాయి. గతంలో వీరిద్దరి కాంబినేషన్‌కు వచ్చిన స్పందనను గుర్తుచేస్తూ అభిమానులు ఈ పాటను ట్రెండ్ చేస్తున్నారు.
సినిమా పై భారీ అంచనాలు
దర్శకుడు రాహుల్ సంకృత్యాన్ ఈ చిత్రాన్ని పూర్తి భావోద్వేగాలతో, గ్రామీణ నేపథ్యంలో మలిచినట్టు తెలుస్తోంది. కథలో ప్రేమ, కుటుంబ బంధాలు, ఆత్మగౌరవం వంటి అంశాలు ప్రధానంగా ఉండనున్నాయని టాలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి. 'సెప్టెంబర్ 11న' ఈ చిత్రాన్ని గ్రాండ్‌గా థియేటర్లలో విడుదల చేయనున్నట్లు చిత్రబృందం ప్రకటించింది. ఇప్పటికే విడుదలైన పోస్టర్, సాంగ్‌తో సినిమాపై అంచనాలు భారీగా పెరిగాయి. పెళ్లి వేడుకతో పాటు సినిమా ప్రమోషన్‌ను అనుసంధానించడం ద్వారా చిత్రబృందం మంచి మార్కెటింగ్ స్ట్రాటజీ అమలు చేసిందని సినీ వర్గాలు విశ్లేషిస్తున్నాయి.
'విరోష్' పెళ్లి నగల కోసం 10నెలల కష్టం- కిలోల కొద్దీ బంగారంతో 'రాజసం'- ఆ జ్యువెలరీ స్పెషాలిటీ తెలుసా?
'మేం ఇప్పటికీ టచ్‌లోనే ఉన్నాం'- రష్మిక మాజీ బాయ్‌ఫ్రెండ్ కామెంట్స్ వైరల్

