'ఆమె పాటలు శాశ్వతంగా ప్రతిధ్వనిస్తూనే ఉంటాయి'- ఆశా భోస్లేకు ప్రముఖుల సంతాపం
ప్రముఖ గాయనీ ఆశా భోస్లే మృతి పట్ల ప్రముఖుల సంతాపం- సోషల్ మీడియాలో పోస్టులు

Published : April 12, 2026 at 2:39 PM IST
Modi Tributes To Asha Bhosle : లెజెండరీ సింగర్ ఆశా భోస్లే మృతి పట్ల సినీ, రాజకీయ ప్రముఖులు సంతాపం ప్రకటిస్తున్నారు. ఆశా భోస్లే మరణం పట్ల భారత ప్రధాని నరేంద్రమోదీ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. భారతదేశం ఇప్పటివరకు చూసిన అత్యంత ప్రసిద్ధ, బహుముఖ ప్రజ్ఞాశాలి గాయకులలో ఆశా భోస్లే ఒకరని అన్నారు. ఈమేరకు ఆమెతో ఆయనకున్న అనుబంధాన్ని ఎక్స్‌లో షేర్ చేసుకున్నారు.
'ఇప్పటివరకు భారత్ చూసిన అత్యంత ప్రసిద్ధ, బహుముఖ ప్రజ్ఞాశాలి గాయకులలో ఒకరైన ఆశా భోస్లే మరణం పట్ల దిగ్బ్రాంతికి గురయ్యాను. దశాబ్దాల పాటు సాగిన ఆమె అసాధారణ సంగీత ప్రస్థానం మన సాంస్కృతిక వారసత్వాన్ని సుసంపన్నం చేసింది. ప్రపంచవ్యాప్తంగా లెక్కలేనన్ని హృదయాలను తాకింది. ఆమె హృద్యమైన రాగాలైనా, ఉత్సాహ భరితమైన స్వరకల్పనలైనా, ఆమె స్వరంలో కాలాతీతమైన ప్రకాశం నిండి ఉంది. ఆమెతో నాకు ఉన్న అనుబంధాలను నేను ఎప్పటికీ గుర్తుంచుకుంటాను. ఆమె కుటుంబ సభ్యులకు, అభిమానులకు, సంగీత ప్రియులకు నా ప్రగాఢ సానుభూతి. ఆమె తరతరాలకు స్ఫూర్తినిస్తూనే ఉంటారు, ఆమె పాటలు ప్రజల జీవితాల్లో శాశ్వతంగా ప్రతిధ్వనిస్తూనే ఉంటాయి' అని మోదీ ట్వీట్లో పేర్కొన్నారు.
.Deeply saddened by the passing of Asha Bhosle Ji, one of the most iconic and versatile voices India has ever known. Her extraordinary musical journey, spanning decades, enriched our cultural heritage and touched countless hearts across the world. Be it her soulful melodies or… pic.twitter.com/SbFrzf1Meu
— Narendra Modi (@narendramodi) April 12, 2026
అలాగే సంగీత రంగంలో ఆశా భోస్లే చెరగని ముద్ర వేశారని హోంమంత్రి అమిత్ షా తెలిపారు. ఆమె గళంలో ఎంత మాధుర్యం ఉంటుందో, వ్యక్తిత్వంలోనూ అంతే సరళత, ఆత్మీయత ఉండేదని గుర్తు చేశారు. ఆశా భోస్లే పాటలు తరతరాలుగా భారతీయులకు స్ఫూర్తినిచ్చాయని రక్షణమంత్రి రాజ్‌నాథ్ సింగ్ తెలిపారు. ఆశా భోస్లే మరణవార్త తనను ఎంతో బాధించిందని యూపీ సీఎం యోగీ ఆదిత్యనాథ్ తెలిపారు. ఆమె మధుర గాత్రం దేశ ప్రజల హృదయాల్లో ఎప్పటికీ ప్రతిధ్వనిస్తూనే ఉంటుందని చెప్పారు. ఆశా భోస్లే గొప్ప సంగీత మేధావి అని బంగాల్ సీఎం మమతా బెనర్జీ తెలిపారు. బంగాల్‌తో ఆమెకు విడదీయరాని అనుబంధం ఉందని మమత గుర్తు చేశారు.
'ఆశా భోస్లే గాత్రం తరతరాలుగా ఎన్నో రకాల భావోద్వేగాలను మోసుకొస్తూ, భారతీయ సినిమాకు ఒక శాశ్వతమైన తోడుగా నిలిచింది. ఆమె ప్రతి పాటకు తీసుకువచ్చిన అప్రయత్నమైన సౌందర్యాన్ని, బహుముఖ ప్రజ్ఞను నేను ఎల్లప్పుడూ ఆరాధిస్తాను. భారతీయ సినిమా తన అత్యంత అమూల్యమైన గాత్రాలలో ఒకదానిని కోల్పోయింది. ఆమె కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతి. ఓం శాంతి' అని మెగాస్టార్ చిరంజీవి పోస్టు చేశారు.
ఆమెను ఎప్పుడూ గుర్తుచేసుకుంటూనే ఉంటాం : ఎన్టీఆర్
'ఆశా భోస్లే మరణవార్త విని దిగ్బ్రాంతికి గురయ్యాను. ఆమె మధురమైన స్వరం దశాబ్దాల పాటు భారతీయ సినిమాకు ప్రాణంగా నిలిచి, లక్షలాది హృదయాలను తాకింది. తరతరాలు నిలిచిపోయే జ్ఞాపకాలను వదిలివెళ్లారు. ప్రేమ, గౌరవంతో ఆమెను ఎప్పుడూ గుర్తుచేసుకుంటూనే ఉంటాం. ఆమె కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతి. ఓం శాంతి' అని హీరో ఎన్టీఆర్ ఎక్స్‌లో పోస్టు షేర్ చేశారు.
Deeply saddened by the news of Asha Bhosle ji’s passing. Her magical voice was the heartbeat of Indian cinema for decades and touched millions of hearts. She leaves behind a legacy that will live on for generations and will always be remembered with respect and love. My deepest… pic.twitter.com/U81F2NBBeD
— Jr NTR (@tarak9999) April 12, 2026
'ప్రముఖ గాయని శ్రీమతి ఆశా భోస్లే గారు కన్నుమూశారని తెలిసి చింతించాను. ఆశాజీ ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నాను. సుదీర్ఘ కాలం హిందీతోపాటు మరాఠీ, తెలుగు, బెంగాలీ వంటి భాషల్లో సినీ గీతాలు ఆలపించిన మధుర గాయని ఆమె. పాశ్చాత్య సంగీత శైలి గీతాలను సైతం ఆలపించి ఒక తరం యువతను ఉర్రూతలూగించారు. దమ్ మారో దమ్, చురా లియా హై తుమ్నే, ఇన్ అంకో కి మస్తీ, రాధా కైసే న జలే లాంటి గీతాలతో సినీ, సంగీతాభిమానులను అలరించారు. తెలుగులో ఆశాజీ పాడిన గీతాలు తక్కువే అయినా హిందీ గీతాలతో తెలుగు రాష్ట్రాల్లో చిరపరిచితమే. శ్రీమతి ఆశా భోస్లే కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను. ఆశాశీ ఆత్మకు శాంతి చేకూరాలి' అని పవన్‌కల్యాణ్ ఎక్స్‌లో పేర్కొన్నారు.
శ్రీమతి ఆశా భోస్లే గారు ఆత్మకు శాంతి చేకూరాలి
— Deputy CMO, Andhra Pradesh (@APDeputyCMO) April 12, 2026
ప్రముఖ గాయని శ్రీమతి ఆశా భోస్లే గారు కన్నుమూశారని తెలిసి చింతించాను. ఆశాజీ ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నాను. సుదీర్ఘ కాలం హిందీతోపాటు మరాఠీ, తెలుగు, బెంగాలీ వంటి భాషల్లో సినీ గీతాలు ఆలపించిన మధుర గాయని ఆమె.…
లెజెండరీ సింగర్ ఆశా భోస్లే- రూ. వందల కోట్ల ఆస్తులు- ప్రపంచవ్యాప్తంగా రెస్టారెంట్లు- ఆమె సంపాదన ఎంత?
తెలుగులో ఆశా భోస్లే పాటలు- ఆ ఒక్క సాంగ్ 90's కిడ్స్‌కు బాగా తెలుసు!

