ETV Bharat / entertainment

జపాన్​లో పెద్ది రిలీజ్ క్యాన్సిల్ - అభిమానులకు భారీ షాక్!

పెద్ది సినిమా ప్రమోషన్లలో బిజీగా ఉన్న చిత్ర బృందం - జపాన్​లో సినిమా విడుదలైతే మరిన్ని వసూళ్లు వస్తాయని ఆశించిన భారతీయ అభిమానులు

Peddi Japan Release Cancelled
Peddi Japan Release Cancelled (film poster)
author img

By ETV Bharat Telugu Team

Published : May 27, 2026 at 9:45 AM IST

3 Min Read
Choose ETV Bharat

Peddi Japan Release Cancelled : మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటించిన 'పెద్ది' చిత్రం జూన్ 4న విడుదలకు సిద్ధమవుతోంది. ప్రస్తుతం పెద్ది చిత్ర బృందం సినిమా ప్రమోషన్లతో బిజీగా ఉంది. అయితే, విడుదలకు కొన్ని రోజుల ముందు ఒక కీలక అప్‌డేట్ అభిమానులను తీవ్రంగా నిరాశపరిచింది. పెద్ది సినిమాను ఇండియాలో రిలీజ్​ చేసినప్పుడే జపాన్​లో విడుదల చేయాలని మేకర్స్ ప్రణాళిక చేశారు. అయితే, కొన్ని కారణాల వల్ల జపాన్​లో విడుదల చేయడం లేదని టాక్ వినిపిస్తోంది. దీంతో జపాన్‌లో ఉన్న రామ్ చరణ్ అభిమానులు తీవ్ర నిరాశ వ్యక్తం చేస్తున్నారు. కొత్త విడుదల తేదీ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. జపాన్​లో సినిమా విడుదలయితే మరిన్ని వసూళ్లు వస్తాయని ఆశించిన భారతీయ అభిమానులు కూడా తమ అసంతృప్తిని తెలియజేస్తున్నారు.

సోషల్‌ మీడియాలో హాట్‌టాపిక్‌
తాజాగా చిత్రబృందం విడుదల చేసిన పెద్ది కొత్త పోస్టర్‌, సినిమాటోగ్రాఫర్‌ రత్నవేలు వెల్లడించిన ఆసక్తికర విషయాలు అభిమానుల్లో మరింత ఉత్సాహాన్ని రేకెత్తిస్తున్నాయి. ముఖ్యంగా "దిల్లీ ఎపిసోడ్‌" గురించి వస్తున్న అప్​డేట్లు ఇప్పుడు సోషల్‌ మీడియాలో హాట్‌ టాపిక్‌గా మారాయి. గ్రామీణ నేపథ్యంతో రూపొందుతున్న పెద్దిలో రామ్‌చరణ్‌ రెండు విభిన్న కోణాల్లో కనిపించనున్నట్లు తాజా పోస్టర్‌తో స్పష్టమైంది. ఒకవైపు పట్టుదలతో పోరాడే రెజ్లర్‌గా మరోవైపు పల్లెటూరి యువకుడిగా చరణ్‌ లుక్స్​ మాస్‌ ఆడియన్స్​ను విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి. అగ్ని, భావోద్వేగాలు, పోరాటస్ఫూర్తిని ప్రతిబింబించేలా రూపొందించిన ఈ పోస్టర్‌లో రైల్వే ట్రాక్‌ను ప్రత్యేకంగా హైలైట్‌ చేయడం కథలో కీలక మలుపునకు సంకేతంగా అభిమానులు భావిస్తున్నారు.

సహజ కాంతిలోనే చిత్రీకరణ
ఈ చిత్రానికి సంబంధించిన గ్లింప్స్‌, పోస్టర్లు, పాటలు, ప్రచార కార్యక్రమాలు ప్రేక్షకుల్లో సినిమాపై భారీగా అంచనాలు పెంచాయి. తాజాగా సినిమాటోగ్రాఫర్‌ రత్నవేలు చేసిన వ్యాఖ్యలు సినిమాపై మరింత ఆసక్తిని పెంచాయి. ఈ చిత్రంలో తనకు అత్యంత ఇష్టమైన భాగం "దిల్లీ సీక్వెన్స్‌" అని రత్నవేలు వెల్లడించారు. ఆ సన్నివేశాలను పూర్తిగా సహజ కాంతిలోనే చిత్రీకరించామని ఎలాంటి కృత్రిమ లైటింగ్‌ ఉపయోగించలేదని చెప్పారు. ఆ ఎపిసోడ్‌ కోసం ఫిల్మ్‌ నెగటివ్‌లను ఉపయోగించినట్లు ఆయన తెలిపారు. దాదాపు 17 ఏళ్ల తర్వాత మళ్లీ ఫిల్మ్‌ నెగటివ్‌తో పని చేయడం ఇదే మొదటిసారి అని వెల్లడించారు. డిజిటల్‌ టెక్నాలజీ అందుబాటులో ఉన్నప్పటికీ సన్నివేశాలకు మరింత సహజత్వం, వాస్తవికత తీసుకురావడానికే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన చెప్పారు.

అసక్తిగా ఎదురు చూస్తున్న అభిమానులు
ఇటీవల రామ్‌చరణ్‌ కూడా 'దిల్లీ ఎపిసోడ్‌' సినిమాకు హైలైట్‌గా నిలుస్తుందని పేర్కొనడం విశేషం. దీంతో ఆ సీన్లు చూడటానికి అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. 2026 జూన్‌ 4 న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానున్న 'పెద్ది' సినిమా ముందు రోజు సాయంత్రం అన్ని ప్రధాన నగరాల్లో ప్రీమియర్‌ షోలు వేయనున్నట్లు చిత్రబృందం ప్రకటించింది. విడుదలకు ముందే టాలీవుడ్‌లో అత్యంత చర్చనీయాంశమైన ప్రాజెక్ట్‌లలో ఒకటిగా పెద్ది నిలుస్తోంది. వృద్ధి సినిమాస్ బ్యానర్‌పై వెంకట సతీష్ కిలారు నిర్మించిన ఈ స్పోర్ట్స్ యాక్షన్ డ్రామాకు బుచ్చి బాబు సానా దర్శకత్వం వహించారు. జాన్వీ కపూర్ హీరోయిన్​గా నటించగా, శివ రాజ్‌కుమార్, జగపతి బాబు, దివ్యేందు శర్మ, బోమన్ ఇరానీ వంటి నటులు కీలక పాత్రల్లో నటించారు.

లాంగ్ రన్ టైమ్​
గతంలో వచ్చిన యానిమల్, సలార్ వంటి భారీ చిత్రాల తరహాలోనే పెద్ది కూడా లాంగ్ రన్ టైమ్​తో రాబోతుందని సినీ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది. ఈ సినిమా నిడివి సుమారుగా 3 గంటలకు పైగానే ఉన్నట్లు ఫిల్మ్ నగర్​లో జోరుగా ప్రచారం జరుగుతోంది. డైరెక్టర్ బుచ్చిబాబు సానా కథను ఎంతో ఎమోషనల్‌గా, డీటెయిల్డ్‌గా తెరకెక్కించారని, అందుకే సినిమా నిడివి అంత పెరిగిందని టాక్ నడుస్తోంది.

పెద్దితో మున్నాభాయ్​ టాలీవుడ్ ఎంట్రీ- మనోళ్లకు సరైన విలన్ దొరికినట్లేనా?

'పెద్ది'కి సెన్సార్​ క్లియరెన్స్​- 'చికిరి చికిరి' పాటలో కొత్త మార్పులు!