ETV Bharat / entertainment

పవర్ స్టార్ నుంచి పవర్​లోకి- రాజకీయాలతో పాటు సినిమాలు! పవన్ కల్యాణ్​ ప్రయాణం సాగిందిలా

1996లో హీరోగా మొదలైన పవన్ సినిమా ప్రయాణం- తొలిప్రేమ నుంచి ఖుషి వరకు యూత్‌లో ఫాలోయింగ్- 2019 ఓటమి తర్వాత 2024లో మారిపోయిన రాజకీయ లెక్క

Pawan Kalyan Birthday Special
పవన్ కళ్యాణ్ ((Photo: IANS))
author img

By ETV Bharat Telugu Team

Published : September 2, 2026 at 11:34 AM IST

5 Min Read
Choose ETV Bharat

Pawan Kalyan Birthday Special : పవన్ కల్యాణ్​ సెప్టెంబర్ 2తో 55వ పుట్టినరోజు జరుపుకొంటున్నారు. 1996లో హీరోగా మొదలైన జర్నీ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం బాధ్యతల వరకు వచ్చింది. మధ్యలో సినిమాల్లో భారీ విజయాలు దక్కాయి. ఇక కొన్ని సంవత్సరాలు సరైన ఫలితం కోసం కూడా ఎదురుచూడాల్సి వచ్చింది. రాజకీయాల్లోనూ మొదటి ఎన్నికలు ఓటమిని చూపించాయి. అయినా రెండు రంగాల్లోనూ నమ్మకంతోనే కొనసాగారు. ప్రస్తుతం ప్రభుత్వ బాధ్యతల్లో కొనసాగుతూనే సినిమాలు కూడా చేసేలా ప్లాన్ చేసుకుంటున్నారు. ఈ పుట్టినరోజు సందర్భంగా దేశంలోని ప్రముఖ రాజకీయ నాయకులు, సినీ తారలు ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలిపారు.

తొలిప్రేమతో మారిన లెక్క
ఈవీవీ సత్యనారాయణ దర్శకత్వంలో వచ్చిన 'అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి'తో పవన్ కల్యాణ్​ హీరోగా పరిచయమయ్యారు. ఆ తర్వాత 'గోకులంలో సీత', 'సుస్వాగతం' సినిమాలతో వరుసగా ప్రేక్షకుల ముందుకొచ్చారు. 1998లో వచ్చిన 'తొలిప్రేమ' కెరీర్‌లో పెద్ద యూ టర్న్ తీసుకొచ్చింది. కరుణాకరన్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా ఆ ఏడాది ఉత్తమ తెలుగు చిత్రంగా జాతీయ అవార్డు అందుకుంది. నంది అవార్డుల్లో కూడా ఉత్తమ చిత్రంగా నిలవడంతో పాటు మొత్తం ఆరు అవార్డులు దక్కాయి. ఆ ప్రేమకథలో పవన్ పాత్ర, కామెడీ టైమింగ్, యూత్‌కు దగ్గరగా ఉన్న క్యారెక్టర్ బాగా క్లిక్ అయ్యింది. అదే ఒక ఫాలోయింగ్ తీసుకొచ్చింది. చిరంజీవి తమ్ముడిగా ఇండస్ట్రీలోకి వచ్చిన పవన్‌కు మొదట తనకంటూ వేరే గుర్తింపు ఇచ్చింది మాత్రం 'తొలిప్రేమ' సినిమానే.

తమ్ముడు నుంచి ఖుషి వరకు
1999లో తమ్ముడు, 2000లో బద్రి, 2001లో ఖుషి వరుసగా రిలీజ్ అయ్యాయి. మూడు సినిమాల్లోనూ పవన్ పాత్ర, సినిమా ట్రీట్‌మెంట్ ఒకేలా ఉండదు. 'తమ్ముడు'లో మార్షల్ ఆర్ట్స్ నేపథ్యం, బద్రిలో పూరి జగన్నాథ్ స్టైల్ హీరో క్యారెక్టర్, ఖుషిలో ప్రేమకథతో పాటు వచ్చిన కామెడీ యూత్‌కు మరింత దగ్గర చేశాయి. పవన్ హెయిర్ స్టైల్, డ్రెస్సింగ్, మాట్లాడే విధానం, కొన్ని మేనరిజమ్స్‌ను అప్పటి యువత ఫాలో అయ్యేది. ముఖ్యంగా 'ఖుషి' తర్వాత పవన్ టాప్ హీరోల్లో ఒకరిగా మారారు. అభిమానులు 'పవర్ స్టార్' అని పిలవడం కూడా ఈ దశలో మరింత పెరిగింది. యాక్షన్ సీన్స్‌లో తనకు తెలిసిన మార్షల్ ఆర్ట్స్‌ను ఉపయోగించడం, హీరో క్యారెక్టర్‌లో తనదైన మేనరిజమ్స్ పెట్టడం అప్పటి పవన్ సినిమాల్లో ఎక్కువగా కనిపించేది. ముఖ్యంగా తమ్ముడు సినిమాలో చేతుల మీద నుంచి కార్లను పోనివ్వడం రియల్ స్టంట్. అందుకోసం పవన్ చాలా హార్డ్ వర్క్ చేశాడు.

మధ్యలో ఫ్లాప్స్- మళ్లీ గబ్బర్ సింగ్
2003లో 'జానీ'తో పవన్ కల్యాణ్​ దర్శకుడిగానూ ప్రయత్నించారు. ఆ సినిమా ఆశించిన ఫలితం ఇవ్వలేదు. తర్వాత గుడుంబా శంకర్, బాలు, బంగారం, అన్నవరం లాంటి సినిమాలు వచ్చాయి. వాటిలో కొన్ని బాక్సాఫీస్ దగ్గర అనుకున్న స్థాయిలో ఆడలేదు. 2008లో త్రివిక్రమ్ దర్శకత్వంలో వచ్చిన జల్సాతో మళ్లీ హిట్ అందుకున్నారు. 2012లో హరీశ్ శంకర్ తెరకెక్కించిన గబ్బర్ సింగ్ కెరీర్‌లో మరో పెద్ద విజయంగా నిలిచింది. ఆ తర్వాత 2013లో వచ్చిన 'అత్తారింటికి దారేది' కూడా భారీ వసూళ్లు సాధించింది. తర్వాత 'గోపాల గోపాల'లో వెంకటేశ్‌తో దేవుడి పాత్రలో కనిపించారు. సర్దార్ గబ్బర్ సింగ్, కాటమరాయుడు, అజ్ఞాతవాసి వరకు సినిమాలు చేసుకుంటూ వచ్చిన పవన్, ఆ తర్వాత రాజకీయాలకు ఎక్కువ సమయం ఇవ్వడం మొదలుపెట్టారు.

2019లో రెండు చోట్ల ఓటమి
పవన్ కల్యాణ్​ 2014లో జనసేన పార్టీని స్థాపించారు. ఆ ఏడాది ఎన్నికల్లో పార్టీ పోటీ చేయకుండా టీడీపీ, బీజేపీ కూటమికి మద్దతు ఇచ్చింది. తర్వాత రాష్ట్రంలో పలు సమస్యలపై కార్యక్రమాలు చేస్తూ పార్టీని విస్తరించారు. 2019 ఎన్నికల్లో జనసేన బీఎస్పీ, వామపక్షాలతో కలిసి బరిలోకి దిగింది. పవన్ గాజువాక, భీమవరం నుంచి పోటీ చేశారు. రెండు చోట్లా ఓడిపోయారు. జనసేన 137 అసెంబ్లీ స్థానాల్లో పోటీ చేసి ఒక్క సీటు మాత్రమే గెలిచింది. 18 లోక్‌సభ స్థానాల్లో పోటీ చేసినా ఒక్కటి కూడా దక్కలేదు. ఆ ఫలితం తర్వాత కూడా పార్టీని కొనసాగించిన పవన్ రైతుల సమస్యలు, రోడ్లు, ప్రభుత్వ విధానాలపై కార్యక్రమాలు నిర్వహిస్తూ వచ్చారు. 2024 ఎన్నికలకు వచ్చేసరికి మాత్రం ఆయన రాజకీయ ప్రయాణం మరో మలుపు తీసుకుంది.

21కి 21- పిఠాపురం ఎమ్మెల్యే నుంచి డిప్యూటీ సీఎం
2024 ఎన్నికల్లో జనసేన టీడీపీ, బీజేపీతో కలిసి పోటీ చేసింది. ఆ పార్టీకి 21 అసెంబ్లీ స్థానాలు కేటాయించగా అన్ని 21 చోట్లా గెలిచింది. పోటీ చేసిన రెండు లోక్‌సభ స్థానాలు కూడా జనసేన ఖాతాలోకే వెళ్లాయి. దీంతో 21 మంది ఎమ్మెల్యేలతో ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో రెండో అతిపెద్ద పార్టీగా నిలిచింది. పవన్ పిఠాపురం నుంచి 1.34 లక్షలకు పైగా ఓట్లు సాధించి, 70 వేలకుపైగా మెజారిటీతో గెలిచారు. ఆ తర్వాత చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో డిప్యూటీ సీఎంగా బాధ్యతలు తీసుకున్నారు. పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరా, పర్యావరణం, అటవీ, సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖలు ఆయనకు కేటాయించారు.

రాజకీయాల మధ్యే సినిమాలు
రాజకీయాల్లో ఎక్కువ సమయం కేటాయించిన తర్వాత పవన్ సినిమాలు తగ్గించారు. 2018లో వచ్చిన అజ్ఞాతవాసి తర్వాత దాదాపు మూడేళ్ల గ్యాప్ తీసుకుని 2021లో 'వకీల్ సాబ్'తో మళ్ళీ సినిమాల్లోకి వచ్చారు. హిందీ 'పింక్'కు రీమేక్‌గా వచ్చిన ఆ సినిమా తర్వాత భీమ్లా నాయక్, బ్రో సినిమాలు చేశారు. 2024 ఎన్నికల తర్వాత ముందే ఒప్పుకున్న సినిమాల షూటింగ్ పూర్తి చేసేందుకు డేట్స్ ఇచ్చారు. 2025లో హరిహర వీరమల్లు, సుజీత్ దర్శకత్వంలోని 'ఓజీ' విడుదలయ్యాయి. 'ఓజీ'కి రిలీజ్ సమయంలో భారీ ఓపెనింగ్స్ వచ్చాయి. 2026 మార్చిలో హరీశ్ శంకర్ దర్శకత్వంలోని 'ఉస్తాద్ భగత్ సింగ్' ప్రేక్షకుల ముందుకొచ్చింది. దీంతో ఎన్నికలకు ముందు మొదలైన పెండింగ్ సినిమాలు పూర్తయ్యాయి.

మళ్లీ సినిమాలు చేస్తారా?
ఇక్కడి నుంచి పవన్ మళ్లీ వరుసగా సినిమాలు చేస్తారా అన్నదానిపై పూర్తి క్లారిటీ లేదు. 'ఓజీ 2' మాత్రం ఉంటుందని ఇప్పటికే ఓ క్లారిటీ ఇచ్చారు. 2026 జూన్‌లో పవన్ కల్యాణ్​ క్రియేటివ్ వర్క్స్, దర్శకుడు సుజీత్‌తో 'ఓజీ యూనివర్స్'పై పని మొదలైనట్లు అనౌన్స్ చేశారు. షూటింగ్ ఎప్పుడు మొదలవుతుందనే తేదీ మాత్రం ఇంకా ప్రకటించలేదు. మరోవైపు సురేందర్ రెడ్డి దర్శకత్వంలో పవన్ సినిమా చేస్తారని అప్పట్లో నిర్మాత రామ్ తాళ్లూరి ప్రకటించారు. వక్కంతం వంశీ కథ అందిస్తారని కూడా చెప్పారు. కానీ పవన్ కల్యాణ్​ క్రియేటివ్ వర్క్స్ వెంటనే కొత్త సినిమాలు మొదలుపెట్టే ప్లాన్ లేదని క్లారిటీ ఇచ్చింది. ఆ తర్వాత సురేందర్ రెడ్డి సినిమా ప్లాన్‌పై అధికారిక అప్డేట్ రాలేదు.