ETV Bharat / entertainment

'బిజ్జలదేవ నుంచి కుంభ దాకా'- టాలీవుడ్​లో కొత్త ట్రెండ్- ఈ విలన్లు మోస్ట్​ పవర్​ఫుల్​ బాబోయ్!

టాలీవుడ్‌లో విలనిజంలో సరికొత్త ప్రయోగాలు- కండలు కాదు మైండ్​తోనే పని

SSMB 29
SSMB 29 (Source : Movie Poster)
author img

By ETV Bharat Telugu Team

Published : November 12, 2025 at 4:51 PM IST

3 Min Read
Choose ETV Bharat

New Villain Trend In Tollywood : ఒకప్పుడు టాలీవుడ్ సినిమాలో విలన్ అంటే ఆరడుగుల కటౌట్, గంభీరమైన గొంతు, వంద మందిని ఒక్కడే కొట్టేంత బలం ఉండాలి. హీరో ఎంత పవర్‌ఫుల్‌గా ఉంటే, విలన్ అంతకుమించి ఉండాలి. కానీ, ఇప్పుడు ట్రెండ్ మారింది. మన డైరెక్టర్లు రొటీన్ విలనిజానికి ఫుల్ స్టాప్ పెడుతున్నారు. విలన్ అంటే కండలు కాదు, మైండ్ అని నిరూపిస్తున్నారు. శారీరకంగా బలహీనంగా ఉన్నా, కేవలం కళ్లతో డార్క్ మైండ్​సెట్​తో హీరోను, సామ్రాజ్యాలను వణికించే కొత్తరకం విలన్లను మనకు పరిచయం చేస్తున్నారు.

'బాహుబలి'తో మొదలైన మార్పు!
ఈ కొత్త ట్రెండ్‌కు శ్రీకారం చుట్టింది జక్కన్న రాజమౌళినే. 'బాహుబలి' సినిమాలో బిజ్జలదేవ (నాజర్) పాత్రే దీనికి పెద్ద ఉదాహరణ. ఆ పాత్రకు శారీరకంగా ఎలాంటి బలం ఉండదు, ఒక చేయి పనిచేయదు, సరిగ్గా నడవలేడు. కానీ, అతని మైండ్ మాత్రం కత్తి కంటే పదును. రాజ్యాన్ని దక్కించుకోవడానికి అతని కుటిలత్వం, అధికార దాహం, వ్యూహాలే మొత్తం 'బాహుబలి' కథను మలుపు తిప్పుతాయి. శారీరకంగా బలహీనంగా ఉన్నా, ఎంతటి క్రూరమైన విలనిజాన్ని పండించవచ్చో బిజ్జలదేవ పాత్రతో రాజమౌళి నిరూపించారు. కండల బలం ఉన్న కాలకేయల కంటే, మైండ్ బలం ఉన్న బిజ్జలదేవే ఎక్కువ ప్రమాదకారి అని చూపించారు.

'కల్కి'లో కమల్- శరీరం లేని విలన్!
'బాహుబలి' మొదలుపెట్టిన ఈ ట్రెండ్‌ను 'కల్కి 2898 AD' నెక్స్ట్ లెవెల్‌కు తీసుకెళ్లింది. ఈ సినిమాలో లోకనాయకుడు కమల్ హాసన్ 'సుప్రీమ్ యాస్కిన్' అనే విలన్ పాత్రలో నటించారు. ఈ పాత్రకు "పాక్షికంగా శరీరం లేదని" చూపించిన విధానం మైండ్ బ్లోయింగ్ ఎక్స్‌పీరియన్స్ ఇచ్చాయి. సెకండ్ పార్ట్​లో ఆ పాత్ర మరింత పవర్ఫుల్​గా ఉంటుందని చెప్పవచ్చు. అసలు శరీరం లేని విలన్ ఏంటి? హీరోతో ఎలా పోరాడుతాడు? అనే క్యూరియాసిటీ అందరిలోనూ పెరిగిపోయింది. ఇది విలనిజంలో ఒక సరికొత్త ప్రయోగం. శారీరక బలం కాదు, టెక్నాలజీ, తెలివితేటలే అసలైన బలమని ఈ పాత్రతో చూపించబోతున్నారు.

SSMB29- వీల్ చైర్ విలన్!
మహేష్ బాబు రాజమౌళి కాంబినేషన్‌లో రాబోతున్న 'SSMB29'. ఈ సినిమాలో విలన్​గా నటిస్తున్న మలయాళ స్టార్ పృథ్వీరాజ్ సుకుమారన్​కు సంబంధించిన తొలి పోస్టర్​ను ఇటీవల రిలీజ్ చేశారు. ఇందులో దివ్యాంగుడిగా కనిపించిన ఆయన వీల్​చైర్​లో కూర్చొని ఉన్నాడు. ఈ వీల్ చైర్ పోస్టర్ బాగానే హైలెట్ అయ్యింది. వీల్ చైర్​కు టెక్నాలజీతో కూడిన చేతులు ఉండడం కిక్ ఇచ్చింది. కేవలం తన మైండ్ పవర్‌తో, తన కమాండింగ్ ప్రెజెన్స్‌తోనే భయాన్ని పుట్టిస్తాడట. ఒకచోట నుంచే కదలకుండా, హీరోకు చుక్కలు చూపించేంత ఇంటెలిజెంట్ విలన్ పాత్రను రాజమౌళి డిజైన్ చేస్తున్నట్లు తెలుస్తోంది.

సైకలాజికల్ విలన్లు
శారీరక వైకల్యమే కాదు, మానసిక, సైకలాజికల్ బలాన్ని చూపించే విలన్లు కూడా ఈ ట్రెండ్‌లోకి వస్తారు. 'ధ్రువ' సినిమాలో అరవింద్ స్వామి పోషించిన 'సిద్ధార్థ్ అభిమన్యు' పాత్రే దీనికి సరైన ఉదాహరణ. అతను కండలు తిరిగిన రౌడీ కాదు, ఒక స్టైలిష్ సైంటిస్ట్. తన తెలివితేటలతో, సోషల్ నెట్‌వర్క్‌తో వ్యవస్థనే శాసిస్తాడు. హీరోతో ఫిజికల్‌గా ఫైట్ చేయడు, మైండ్ గేమ్‌తో చుక్కలు చూపిస్తాడు.

అలాగే, శంకర్ సృష్టించిన 'అపరిచితుడు'లో విక్రమ్ పాత్ర కూడా ఇదే కోవలోకి వస్తుంది. అందులో అసలైన విలన్, హీరోలోని 'మల్టిపుల్ పర్సనాలిటీ డిజార్డర్' అనే మానసిక సమస్యే. ఆ సమస్యే 'అన్యన్' అనే క్రూరమైన వ్యక్తిగా మారి హత్యలు చేస్తుంది. ఏదేమైనా మన డైరెక్టర్లు రొటీన్ ఫైట్ల కోసం కాకుండా, సైకలాజికల్ గేమ్‌కు, బలమైన ఎమోషన్స్‌కు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు.

'కుమ్మేశావ్ బ్రో!'- 'కుంభ​' లుక్​పై బాలీవుడ్ హీరో కామెంట్

జక్కన్న ఫార్ములాతో సక్సెస్ అవుతున్న ప్రశాంత్- NTR 'డ్రాగన్' కూడా అదే దారిలో!