'ఆ కారణం వల్లే నా సినిమాలు లేట్ అవుతాయి'- నవీన్ పొలిశెట్టి ఎమోషనల్ స్పీచ్!
మల్లారెడ్డి కాలేజీలో 'అనగనగా ఒక రాజు' సందడి - సంక్రాంతికి రాబోతున్న నవ్వుల రాజు - ప్రేక్షకుల కష్టార్జితాన్ని వృథా చేయనన్న యువ హీరో

Published : December 26, 2025 at 8:31 PM IST
Naveen Polisetty Emotional Speech : టాలీవుడ్ యంగ్ హీరో నవీన్ పొలిశెట్టి అంటేనే ఎనర్జీకి కేరాఫ్ అడ్రస్. 'ఏజెంట్ సాయి శ్రీనివాస్ ఆత్రేయ', 'జాతిరత్నాలు', 'మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి' వంటి వరుస విజయాలతో ఆయన ప్రేక్షకులకు ఎంతగానో దగ్గరయ్యారు. అయితే ఆయన మొదట్నుంచీ బ్యాక్ టు బ్యాక్ కాకుండా కాస్త నెమ్మదిగా సినిమాలు చేస్తున్నారు. అలా నెమ్మదిగా సినిమాలు చేయడానికి ఎందుకు అంత సమయం తీసుకుంటారనే డౌట్ చాలా మందికి ఉంది. దీనికి నవీన్ తాజాగా సమాధానం ఇచ్చారు. హైదరాబాద్ మల్లారెడ్డి ఇంజినీరింగ్ కాలేజీలో శుక్రవారం తన కొత్త సినిమా 'అనగనగా ఒక రాజు' సినిమా ప్రమోషన్స్‌లో పాల్గొన్నారు. ఈ ఈవెంట్‌లో 'రాజు గారి పెళ్లి రో' అనే పాటను విడుదల చేశారు. ఆనంతరం కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ఈ సందర్భంగా తాను సినిమాలు ఆలస్యంగా చేయడం వెనుక ఉన్న కారణాన్ని చెప్పారు.
రూ. 400 టికెట్ విలువ నాకు తెలుసు
తాను కెరీర్ ప్రారంభంలో ఎదుర్కొన్న పరిస్థితులను నవీన్ గుర్తు చేసుకున్నారు. "నా సినిమాలు టైమ్ తీసుకోవచ్చు. కానీ దానికి ఒక సింపుల్ రీజన్ ఉంది. నేను ఇబ్బందుల్లో ఉన్నప్పుడు పరిస్థితి వేరుగా ఉండేది. అప్పుడు నా ఫ్రెండ్ ఎవరైనా సినిమాకి వెళ్దాం అని అడిగితే, టికెట్ ధర రూ. 400 రూపాయలు అని తెలిస్తే భయపడేవాడిని. ఆ సినిమా బాగోలేకపోతే నా డబ్బులు వృథా అవుతాయని అనిపించేది. అందుకే, 'ఆ సినిమా నేను ఆల్రెడీ చూశాను, బాగాలేదు' అని ఫ్రెండ్స్‌కు అబద్ధాలు చెప్పి తప్పించుకునేవాడిని. ఎందుకంటే ఆ రూ.400 నాకు చాలా విలువైనవి" అని నవీన్ ఎమోషనల్ అయ్యారు.
అది మీ కష్టార్జితం, బ్లాక్ మనీ కాదు
ప్రేక్షకులు సినిమాపై పెట్టే ఖర్చు గురించి నవీన్ గొప్పగా వివరించారు. "ఒక ఫ్యామిలీ సినిమాకు వస్తే కనీసం రూ.2000 ఖర్చు అవుతుంది. పైగా ట్రాఫిక్‌లో వచ్చి, రెండున్నర గంటల సమయాన్ని కేటాయిస్తారు. ఆడియన్స్ పెట్టేది బ్లాక్ మనీ కాదు. అది వాళ్ళ కష్టార్జితం. మధ్యతరగతి తల్లిదండ్రులు, విద్యార్థులు, సాఫ్ట్‌వేర్ ఉద్యోగులు, బ్యాంకర్లు ఇలా అందరూ కష్టపడి సంపాదించిన జీతాల నుంచి మాకు కొంత ఇస్తున్నారు. అందుకే మీ ప్రతి రూపాయికి విలువ ఇవ్వాలని నేను కోరుకుంటాను. మీరు పెట్టే ఖర్చుకు న్యాయం జరిగేలా, ప్రతి సీన్ అద్భుతంగా రావడానికే నేను ఎక్కువ టైమ్ తీసుకుంటాను" అని స్పష్టం చేశారు.
హిట్లు ఇచ్చింది మీరే!
తన కెరీర్ విజయాలన్నీ ప్రేక్షకుల వల్లే సాధ్యమయ్యాయని నవీన్ పేర్కొన్నారు. "నన్ను 'ఏజెంట్'ని చేసింది మీరే. 'జాతిరత్నాలు'గా మార్చింది మీరే. 'మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి'ని గెలిపించింది మీరే. నా కెరీర్‌లో ఫ్లాప్స్ ఉన్నాయా అంటే లేవనే చెప్పాలి. ఎందుకంటే మీరంతా అంతగా నన్ను ఓన్ చేసుకున్నారు. మీరు నాపై చూపించిన ప్రేమకు డబుల్ ఎంటర్‌టైన్‌మెంట్ ఇవ్వడానికే ఈ గ్యాప్ తీసుకున్నాను" అని తెలిపారు.
సంక్రాంతికి 'రాజు' వస్తున్నాడు
'అనగనగా ఒక రాజు' సంక్రాంతికి వస్తుందని చెప్పారు. "మీ ప్రేమను రెట్టింపు చేసి తిరిగి ఇవ్వడానికే 'అనగనగా ఒక రాజు' సినిమా చేశాను. మరింత ఎంటర్‌టైన్‌మెంట్‌తో ఈ సినిమా రాబోతోంది. రేపు పండక్కి, అంటే జనవరి 14న సంక్రాంతి కానుకగా ఈ చిత్రం విడుదల కానుంది" అని తెలిపారు. ఈ ఈవెంట్‌లో విద్యార్థుల కేరింతల మధ్య నవీన్ ఉత్సాహంగా పాల్గొన్నారు. సంక్రాంతి బరిలో నవీన్ సినిమా వస్తుండటంతో అభిమానుల్లో జోష్ పెరిగింది. టికెట్ రేట్లు, ప్రేక్షకుల కష్టార్జితం గురించి నవీన్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
రూ.1000 కోట్ల క్లబ్లో 'ధురంధర్'- 2025లో బిగ్గెస్ట్ హిట్‌గా రికార్డ్
కొత్త లుక్‌లో మహేశ్ బాబు - ఫొటో వైరల్- 'వారణాసి' సినిమా కోసమేనా?

