నేషనల్ అవార్డ్స్ లేటెస్ట్ అప్డేట్- వచ్చే వారం కూడా అనౌన్స్మెంట్ డౌటే!
ఇంకా పరిశీలనలో జాతీయ చలనచిత్ర అవార్డుల జ్యూరీ - కన్ఫర్మ్ కాని విజేతలు- ప్రకటనకు మరింత సమయం పట్టే అవకాశం!

Published : July 4, 2026 at 4:17 PM IST
National Film Awards 2026 : 2026 నేషనల్ ఫిల్మ్ అవార్డ్స్ ప్రకటనపై కీలక అప్డేట్ వచ్చింది. వాస్తవానికి శుక్రవారం అవార్డుల ప్రకటన జరగాల్సి ఉంది. కానీ పలు కారణాల వల్ల ఆఖర్లో వాయిదా పడింది. దీంతో వచ్చే వారంలో ప్రభుత్వం విజేతలను ప్రకటించవచ్చని ప్రచారం సాగుతున్న నేపథ్యంలో తాజా సమాచారం బయటకు వచ్చింది. అవార్డుల ప్రకటన వచ్చే వారం కూడా ఉండకపోవచ్చని తెలిసింది. విజేతలను ఖరారు చేసేందుకు ఇంకో వారం కంటే ఎక్కువ సమయం పట్టే అవకాశాలు ఉన్నట్లు ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి.
72వ జాతీయ చలనచిత్ర అవార్డుల విజేతల ప్రకటనకు వారం కంటే ఎక్కువ రోజులు పట్టొచ్చని ప్రభుత్వ వర్గాలు శనివారం తెలిపాయి. ప్రస్తుతం జ్యూరీ ఇంకా విజేతలను ఖరారు చేసే ప్రక్రియలోనే ఉన్నట్లు సమాచారం. జ్యూరీ సభ్యులకు ముందుగా ఖరారైన ఇతర కార్యక్రమాలు ఉండటం వల్ల ఈ ప్రక్రియకు ఆలస్యం అవుతున్నట్లు తెలుస్తోంది. "జ్యూరీ పరిశీలన కొనసాగుతోంది. కొందరు సభ్యులకు ఇతర కార్యక్రమాలు ఉండటం వల్ల ప్రక్రియకు మరికొంత సమయం పట్టవచ్చు. అందుకే ప్రకటన వెలువడానికి వారం కంటే ఎక్కువ సమయం పట్టే అవకాశం ఉంది" అని ప్రభుత్వ వర్గాలు పేర్కొన్నాయి. అలాగే "ప్రక్రియ పూర్తయ్యే వరకు మీడియా సంస్థలు ఊహాజనిత కథనాలను ప్రచురించడం లేదా ప్రసారం చేయడం మానుకోవాలని కోరుతున్నాం" అని తెలిపాయి.
కాగా, 2024 డిసెంబర్ దాకా సెన్సార్ అయిన సినిమాలను పరిశీలిస్తారు. ఇందులో సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ (CBFC) పొందిన సినిమాలను ఎంపిక చేస్తారు. భారత్‌లో అత్యున్నత చలనచిత్ర పురస్కారంగా భావించే ఈ అవార్డు సినీ రంగంలో ఎంతో ప్రతిష్ఠాత్మకం. ఇందుసో ఫీచర్, నాన్ ఫీచర్ చిత్రాలలో నటన, దర్శకత్వం, స్క్రీన్‌ప్లే, సంగీతం, సినిమాటోగ్రఫీ, ఎడిటింగ్, ఇతర సాంకేతిక విభాగాలలో అత్యుత్తమ ప్రతిభను గుర్తించి అవార్డులు ప్రదానం చేస్తారు.
రేసులో అల్లు అర్జున్!
గతంలో పుష్ప పార్ట్ 1 సినిమాలో తన నటనకుగానూ అల్లు అర్జున్ నేషనల్ అవార్డు దక్కించుకున్నారు. దీంతో ఈ ఘనత అందుకున్న తెలుగు తొలి హీరోగా రికార్డు నెలకొల్పారు. ఆ తర్వాత 2024లో వచ్చి పుష్ప 2 తో బన్ని మరో విజయం ఖాతాలో వేసుకున్నారు. అయితే ఈసారి కూడా ఉత్తమ నటుడు విభాగంలో అల్లు అర్జున్ రేసులో ఉన్నట్లు తెలుస్తోంది. ఒకవేళ బన్ని మరోసారి ఈ పురస్కారానికి ఎంపికైతే మరో రికార్డే అవుతుంది.
మమ్ముట్టి కూడా
మలయాళ స్టార్ హీరో మమ్ముట్టి భ్రమయుగం సినిమాతో నటవిశ్వరూపం ప్రదర్శించారు. ఈ సినిమాలో ఆయన పాత్ర వినూత్నంగా అనిపించింది. బ్లాక్ అండ్ వైట్ షేడ్‌లో భయపెట్టే విధంగా ఉన్న ఆయన లుక్స్‌కు అనేక ప్రశంసలు దక్కాయి. అందుకే భ్రమయుగంలోని మమ్ముట్టి నటన జాతీయ అవార్డు జ్యూరీ మెంబర్లను మెప్పిస్తుందని అభిమానులు ఆశిస్తున్నారు.
వీళ్లు కూడా
హీరో విక్రమ్ తంగలాన్ సినిమా కోసం చాలా కష్టపడ్డారు. ఈ సినిమాలో ఆయన లుక్స్ గుర్తుపట్టలేనంతగా ఉన్నాయి. శారీరకంగా, మానసికంగానూ విక్రమ్ ఆ పాత్రలో ఒదిగిపోయారు. ఆయన నటనే సినిమాకు బలంగా నిలిచింది. దీంతో ఈసారి జాతీయ అవార్డుల రేస్‌లో విక్రమ్ పేరు బలంగానే వినిపిస్తోంది. ఇక 2024 బ్లాక్‌బస్టర్ ‘మంజుమ్మల్ బాయ్స్ సినిమాలో సౌబిన్ షాహిర్ పేరు కూడా వినిపిస్తుంది. ఆయన కూడా రేసులో ఉంటారని అంటున్నారు. మరి ఇందులో ఎవరికి జాతీయ అవార్డు దక్కనుందో తెలియాలంటే ఇంకొన్ని రోజులు ఆగాల్సిందే!
'రావు బహదూర్' మూవీ రివ్యూ- సత్యదేవ్- వెంకటేశ్ మ్యాజిక్ పని చేసిందా?

