ETV Bharat / entertainment

నాని 'ప్యారడైజ్'​పై 'ధురంధర్' నిర్మాత ఫోకస్!- పాన్ఇండియా లెవల్ ప్లాన్ వర్క్​ అవుతుందా?

ఆ సినిమాలకు అక్కడ ఆశించి స్థాయిలో రాని ఫలితం- దీంతో మరోసారి బాలీవుడ్​పై నాని ఫోకస్- ఈసారి బిగ్ ప్లాన్!

Nani Paradise Bollywood Release
Nani Paradise Bollywood Release (Movie Poster)
author img

By ETV Bharat Telugu Team

Published : February 10, 2026 at 12:30 PM IST

3 Min Read
Choose ETV Bharat

Nani Paradise Bollywood Release : నేచురల్ స్టార్ నాని హీరోగా శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం 'ది ప్యారడైజ్'. అత్యంత భారీ బడ్జెట్​తో రూపొందుతున్న ఈ సినిమా వేసవిలో విడుదలయ్యేందుకు సిద్ధమవుతుంది. ఇప్పటికే విడుదలైన నాని లుక్ సినిమాపై భారీగానే అంచనాలు పెంచింది. అయితే ఈ సినిమాను బాలీవుడ్​లో గ్రాండ్​గా విడుదల చేసి తన మార్కెట్​ను విస్తరించాలనే ఆలోచనలో నాని ఉన్నారు. అందుకు పక్కాగా ఓ ప్లాన్​ చేస్తున్నట్లు తెలుస్తోంది.

నాని గతంలో చేసిన 'దసరా', 'హయ్ నాన్న', 'హిట్ 3' సినిమాలు హిందీలో ప్రభావం చూపలేకపోయాయి. ఈ సినిమా ప్రమోషన్ల కోసం భారీగా ఖర్చు చేసినప్పటికీ అనుకుంత స్థాయిలో అక్కడ ఫలితం రాలేదు. అందుకే ఈసారి నాని తన వ్యూహాన్ని కొత్తగా మార్చుకున్నారు. 'ది ప్యారడైజ్'​ హిందీ రిలీజ్ కోసం బాలీవుడ్​ ప్రముఖ ప్రొడక్షన్ కంపెనీతో జతకట్టనున్నారు. ఆ సంస్థే బాలీవుడ్​లో ఈ సినిమా విడుదలను చూసుకోనుంది. అంతేకాకుండా సినిమాను ఆడియెన్స్​లోకి తీసుకెళ్లేందుకు ప్రత్యేకంగా ఓ ప్రొఫెనల్ పీఆర్​ టీమ్​ను నియమించినట్లుగా తెలుస్తోంది.

అదే జరిగితే గ్రాండ్​గా రిలీజ్
'ధురంధర్ 2' నిర్మాత, డిస్ట్రిబ్యూటర్​గా వ్యవహరిస్తున్న జియో స్టూడియోస్​తో, 'ది ప్యారడైజ్'​ సినిమా నిర్మాత సుధాకర్ చెరుకూరి చర్చలు జరుపుతున్నట్లు తెలుస్తోంది. ఈ వారంలోనే ఈ డీల్ ఫైనల్ అయ్యే అవకాశం ఉందని టాక్ వినిపిస్తోంది. అదే జరిగితే 'ది ప్యారడైజ్'​ సినిమా బాలీవుడ్​లో కూడా భారీ స్థాయిలో విడుదల అయ్యే అవకాశం ఉంది. జియో స్టూడియోస్ 'ధురంధర్'​ సినిమా స్థాయిలోనే 'ది ప్యారడైజ్'​కు ప్రమోషన్స్, భారీ రేంజ్​లో రిలీజ్ ప్లాన్ చేయవచ్చని భావిస్తున్నారు.

త్వరలోనే ఫస్ట్ సింగిల్
ఇక తెలుగు మార్కెట్‌లో మాత్రం నాని జోరు కొనసాగుతోంది. ఇటీవల వచ్చిన సినిమాలు మంచి సక్సెస్​ను సాధించాయి. కాకపోతే ఆ విజయం కేవలం తెలుగు వరకే పరిమితమవుతోంది. ది ప్యారడైజ్​ ద్వారా దీనిని మార్చాలని నాని గట్టిగా ప్రయత్నిస్తున్నారు. మరోవైపు, ఈ సినిమాకు సంబంధించిన పనులు శరవేగంగా పూర్తవుతున్నాయి. ప్రస్తుతం హైదరాబాద్​లో 'ఆయా షేర్​' అనే మాస్ సాంగ్ షూట్ జరుగుతోంది. త్వరలోనే ఈ చిత్రానికి సంబంధించిన ఫస్ట్ సింగిల్​ విడుదలయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది. అయితే ఫిబ్రవరి 24న నాని పుట్టినరోజు ఉంది. అదే రోజు ఫస్ట్​ సింగిల్​ను విడుదల చేయడానికి మూవీ టీమ్​ ప్లాన్ చేస్తున్నట్లుగా తెలుస్తోంది.

ఈ సినిమాను 2026 మార్చి 26న గ్రాండ్​గా రిలీజ్​ చేయనున్నట్లు మూవీటీమ్ తొలుత ప్రకటించింది. అయితే ఇంకా షూటింగ్ పనులు జరుగుతూనే ఉన్నాయి. భారీ బడ్జెట్​ తెరకెక్కుతున్న సినిమా కావడంతో ప్రొడక్షన్ పనులు ఆలస్యం అవుతున్నాయి. మరోవైపు, పవర్ స్టార్ పవన్ కల్యాణ్ నటించిన 'ఉస్తాద్ భగత్ సింగ్' సినిమా మార్చి 26వ తేదీని ఫిక్స్ చేసుకుంది. అంటే 'ది ప్యారడైజ్' విడుదలకు ఒక రోజు ముందు అన్నమాట. దీంతో రెండు భారీ సినిమాలు ఒకేసారి వస్తే బాక్సాఫీస్ వద్ద క్లాష్ అవుతుందని, ఈ సినిమాను జూన్​ లేదా జులై నెలకు షిఫ్ట్ చేసినట్లు ప్రచారం సాగుతోంది.

ఏదేమైనా దీనిపై త్వరలోనే క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ఇక సినిమా విషయానికొస్తే, 8 భాషల్లో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇక ఈ సినిమాకు అనిరుధ్ రవిచందర్ సంగీతం అందిస్తున్నారు. ఇందులో నాని సరసన కయాదు లోహార్ హీరోయిన్​గా నటిస్తున్నారు. రాఘవ జూయాల్, సోనాలి కుల్‌కర్ణి ఆయా పాత్రలు పోషిస్తున్నారు. సికింద్రాబాద్ నేపథ్యంగా సాగే ఈ పీరియడ్ యాక్షన్ డ్రామాలో నాని 'జడల్' అనే విభిన్నమైన పాత్రలో కనిపించనున్నారు.

సమ్మర్ రిలీజ్​లపై నో క్లారిటీ- 'ప్యారడైజ్', 'పెద్ది'​తో 'ఉస్తాద్ భగత్​సింగ్​'పై ఎఫెక్ట్!

సమ్మర్​లో 'ధురంధర్'​ సీక్వెల్- 'పెద్ది', 'ప్యారడైజ్'​ సినిమాలకు పోటీ తప్పదా?